close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుకీ పజిల్స్‌ ఆడుకోవచ్చు... తినేయొచ్చు!

 

కాస్త ఖాళీ సమయం దొరికితే పజిల్స్‌తో కుస్తీ పట్టడం కొందరికి సరదా. అలాగే, ఏ ఆదివారమో వచ్చిందంటే కేకులూ కుకీల్లాంటి వాటిని తయారు చేయడం ఇంకొందరికి ముచ్చట.  అయితే ఈ రెండు పనుల్నీ ఒకేసారి చేయాలంటే మాత్రం కుకీ పజిళ్ల గురించి తెలుసుకోవల్సిందే. వీటితో కాలక్షేపమవడమే కాదు కడుపు కూడా నిండుతుంది.

 

రకరకాల ఆకృతుల్లో ఉండే చిన్నచిన్న అట్ట ముక్కలను ఒకదానితో ఒకటి అతికిస్తూ ఒక దృశ్యాన్నో, బొమ్మనో తయారుచేసే జిగ్సా పజిళ్లు అందరికీ సుపరిచితమే. ఒక ముక్కతో సరిపడే మరో ముక్కను వెతికి వాటన్నింటినీ పక్కపక్కన పేర్చాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. అన్ని ముక్కల్నీ ఒక్క చోటకి చేర్చాక వచ్చే చిత్రాన్ని చూస్తే అదో ఆనందం. అంతా, అయ్యాక వాటన్నింటినీ తీసి డబ్బాలో వేసి పక్కకు పెట్టేస్తాం. షుగర్‌ కుకీలతోనూ మనం అచ్చం ఇలాగే పజిల్‌ను పూర్తి చేయొచ్చు. కాకపోతే ఇందులో ముక్కలుగా వాడే కుకీలను మాత్రం చటుక్కున నోట్లో వేసుకోవచ్చు.

రకరకాలు...
మామూలుగా కుకీలూ, బిస్కెట్లను ఇంట్లో ఓవెన్లో చేస్తుంటాం. ఆ తర్వాత వాటి మీద పంచదార పొర వచ్చేలా షుగర్‌ కుకీలను తయారు చేస్తారు. అయితే ఈ తరహా పజిల్‌ కుకీలను చేసేందుకు, కుకీలకు వాడే మిశ్రమాన్ని వెడల్పాటి షీట్‌లా చేసి పజిల్‌ కట్టర్‌ సాయంతో ముక్కలుగా చేయాలి. పజిల్‌ కట్టర్‌ అందుబాటులో లేకపోతే చతురస్రం, వృత్తం, హృదయాకారం ఇలా ఏ ఆకృతిలో పజిల్‌ కావాలనుకుంటున్నామో అదే ఆకారంలో కుకీలు చేసే పిండిని ఒత్తుకుని మన దగ్గర చిన్న కట్టర్‌లూ, చాకు సాయంతో అందులో ముక్కల్ని కత్తిరించాలి. తర్వాత అదే ఆకృతుల్లో మనం కావాలనుకున్న రంగుల ఫాండెంట్‌నూ కత్తిరించుకోవాలి. ముందు కుకీలను ఓవెన్‌లో బేక్‌ చేశాక ఆ ఫాండెంట్‌ను వాటి మీద అతికించి రంగు రంగుల స్ప్రింకిళ్ల సాయంతో అలంకరించాలి. షుగర్‌కోట్‌ మీద కార్న్‌ సిరప్‌తో రంగులతో అందంగా పెయింట్‌ వేసినట్టు కుకీలను డెకరేట్‌ చేసేవాళ్లూ ఉంటారు. తీగలూ పూలూ, ఆడపిల్లల బొమ్మలూ, అందమైన ఇళ్లూ... ఇలా మన అభిరుచిని బట్టి నచ్చినట్టు వీటిని ముస్తాబు చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన రకరకాల రెసిపీలు వివిధ కుకింగ్‌ వెబ్‌సైట్లలో దొరుకుతున్నాయి. వీటిని చూసి ఇంట్లో ప్రయత్నించామంటే పెద్దలు భలే ఉన్నాయే అని మెచ్చుకుంటే, పిల్లలు మాత్రం ఎగిరి గంతేస్తారు!

 

 


లవకుశులు పుట్టింది అక్కడే..!

 

‘వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా...’ అంటూ లవకుశులు శ్రావ్యంగా ఆలపించిన వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యం తెలీని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ వాల్మీకి ఆశ్రమం భారత-నేపాల్‌ సరిహద్దుల్లో ఉంది ...’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు నెల్లూరుకు చెందిన వి. సుధాకరరావు.

రామాయణంలోని సీతారాములకు సంబంధించిన అడుగుజాడలు భారత దేశవ్యాప్తంగానే కాదు, చుట్టుపక్కల దేశాల్లోనూ కనిపిస్తుంటాయి. సీతామాత జన్మప్రదేశమైన జనకపుర నేపాల్‌లోనే ఉంది. రాజ్యంలోని రజకుడి మాటలు విని నిండు గర్భిణి అయిన సీతమ్మ తల్లిని అరణ్యంలో వదిలిన ప్రదేశమూ, ఆమెను చేరదీసి ఆశ్రయమిచ్చిన వాల్మీకి మహర్షి ఆశ్రమమూ కూడా ఆ దేశంలోనే ఉన్నాయని చెబుతారు. అందుకు గుర్తుగా అక్కడ అనేక ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ విషయం విని భారత-నేపాల్‌ సరిహద్దుల్లోని వాల్మీకి ఆశ్రమాన్ని చూడాలనుకున్నాం. అందుకే ముక్తినాథ్‌ యాత్ర ముగించుకుని, ఖాట్మండు నుంచి భైరవ పట్టణంలోని విమానాశ్రయంలో దిగాం. ఆ రోజు అక్కడే బస చేసి, మర్నాడు సోన్‌భద్ర, తమసా, నారాయణి నదులు సంగమించిన త్రివేణీ సంగమాన్ని చూసి, అక్కడికి సమీపంలోనే నారాయణి నది దగ్గరున్న గజేంద్ర మోక్ష దివ్యధామాన్ని చూశాం. దీన్ని మొసలి నోట చిక్కిన గజేంద్రుడి మొర ఆలకించి విష్ణుమూర్తి ప్రత్యక్షమైన ప్రదేశంగా చెబుతారు. అక్కడున్న విష్ణుమూర్తి ఆలయంలో గరుడ వాహనంపై వెలసిన ఆ వైకుంఠవాసుడిని కనులారా దర్శించుకున్నాం. ఆ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువే. ఆ నదికి ఎదురుగానే ఉంది చిత్‌వన్‌ జాతీయ పార్కుగా పిలిచే మహారణ్యం. అడవిలోకి వెళ్లడానికి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ మాత్రమే అనుమతి ఉంటుంది.

యాగాశ్వాన్ని కట్టిన చెట్టు!
వంతెన మీదుగా నారాయణి నదిని దాటి రెండు ఫర్లాంగుల దూరం ప్రయాణిస్తే కనిపించింది వాల్మీకి ఆశ్రమం. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి నివసించిన, జానకీదేవి నడయాడిన పవిత్ర ప్రదేశం ఇదేనా అన్న అనుభూతితో ఆ ప్రాంతమంతా తిరిగి చూశాం. అప్పట్లో ఈ ఆశ్రమం సుమారు 112కి.మీ. విస్తీర్ణంలో ఉండేదట.
ఆశ్రమంలో సీతమ్మవారు నివసించిన ప్రదేశాన్ని తరవాతి కాలంలో ఆలయంగా మార్చారు. అక్కడే పూజారి నివసించేందుకో మందిరం ఉంది. ఆశ్రమ విశేషాల గురించి పూజారి చక్కగా వివరించారు. అక్కడ రాళ్లతో నిర్మించిన హోమగుండంలోనే వాల్మీకి మహర్షి నిత్యం హోమం చేసేవారట. అందులోకి నెయ్యి పోసేందుకూ ప్రత్యేక మార్గం ఉంది. లోకకళ్యాణంకోసం దాదాపు 88 వేలమంది రుషులు అక్కడ హోమం చేశారట. సీతమ్మ తల్లి వనమూలికల్ని నూరిన బండా, పొత్రాలనూ చూపించారు. ఆ తల్లి నీళ్లు తోడుకున్న నుయ్యి ఆనవాళ్లూ ఉన్నాయక్కడ. లవకుశులకు జన్మనిచ్చిన స్థలమూ వాళ్ల విద్యాభ్యాసమూ విలువిద్యలు నేర్చుకున్న ప్రదేశమూ అన్నింటి గురించీ చెబుతూ చూపించారు పూజారి. లవకుశులు యాగాశ్వాన్ని బంధించి, కట్టిన చెట్టును కూడా చూశాం.

అమర లత!
ఆ పరిసరాల్లోనే ఉన్న ఓ బలమైన తీగ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాన్ని అమరలత అంటారనీ అది త్రేతాయుగం నాటిదనీ చెప్పారు. దీనికే లవకుశులు ఊయల కట్టుకుని ఊగేవారట. ఆ మహా అరణ్యంలో ఈ తీగ సుమారు 135 కి.మీ. మేర వ్యాపించి ఉందట. ఇది అత్యంత బలమైనదనీ మదగజాల చేత లాగించినా తెగలేదనీ అంటారు. దీని గురించి విదేశీ శాస్త్రజ్ఞులు సైతం అధ్యయనం చేస్తున్నారు. దీని పై భాగం క్షీణిస్తే, కింద నుంచి మళ్లీ పుడుతుంటుంది. అవన్నీ విని, నాటి రామాయణ కాలంనాటి విశేషాలను కళ్లతో చూశామన్న తృప్తితో వెనుతిరిగాం.


కన్నౌజ్‌... భారతదేశపు అత్తరు రాజధాని!

 

ఆ ఊరి పొలిమేరలకు వెళితేనే మత్తుగొలిపే అత్తరు పరిమళాలు ముక్కుపుటాలను తాకుతాయి. అక్కడి గాలి గంధపు సువాసనలతో మనసును తేలిక పరుస్తుంది. ఇక, ఆ పట్టణంలోకి అడుగుపెడితే వందల సుగంధాలు నన్ను వాసన చూడమంటే నన్ను చూడమంటూ వరసకడతాయి. అదే భారతదేశపు అత్తరు రాజధానిగా పిలిచే కన్నౌజ్‌ పట్టణం. రెండు వందల రూపాయలు మొదలు 50 లక్షల రూపాయల దాకా ఖరీదు చేసే రకరకాల ఆర్గానిక్‌ అత్తరులు తయారవుతాయక్కడ.

 

కాలేజీకి వెళ్లే అమ్మాయి దగ్గర నుంచీ తెల్ల పంచె కట్టుకునే తాతయ్యల దాకా స్నానం చేయగానే పెర్‌ఫ్యూమ్‌ రాసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆ సుగంధం మన మనసును చాలాసేపు ఆహ్లాదంగా ఉంచుతుంది. అయితే ఇలాంటి అత్తరు తయారీకే ప్రత్యేకంగా ఒక ఊరు ఉందని మీకు తెలుసా... అది కూడా భారతదేశంలోనే! దాని గురించి తెలుసుకోవాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. ఇక్కడి కన్నౌజ్‌ పట్టణంలో వీధివీధికీ ఒక అత్తరు తయారీ కేంద్రం కనిపిస్తుంది. అక్కడ 200కు పైగా పెర్‌ఫ్యూమ్‌ డిస్టిలరీలు ఉన్నాయి మరి. ఈ ఊరు దాదాపు ఏడో శతాబ్దం నుంచీ అత్తరు తయారీలో పేరు పొందింది. మొఘల్‌ చక్రవర్తులు ఇక్కడి అత్తరంటే ఎంతో ఇష్టపడేవారట. అంతేకాదు, దేశ విదేశాల్లోనూ ఇక్కడ తయారు చేసే అత్తరుకు ఎందరో అభిమానులున్నారు. మరి, ఈ ఊరి అత్తరులో ప్రత్యేకత ఏంటంటే...

అచ్చంగా ఆర్గానిక్‌...
కన్నౌజ్‌ వెళితే సుమారు 30 తరాల నుంచీ పెర్‌ఫ్యూమ్‌ తయారీలో ఉన్న కుటుంబాలు కనిపిస్తాయి. ఇక్కడ ఎటువంటి రసాయనాలూ లేకుండా అచ్చంగా సేంద్రియ అత్తరును తయారు చేస్తారు. దాని తయారీ విధానమూ ఈ ఊరికి మాత్రమే ప్రత్యేకం. ఈ అత్తరును చేసేందుకు ముందుగా... గులాబీ, జాజి, చామంతి, బంతి... ఇలా రకరకాల పూలను పెద్ద మొత్తంలో సేకరిస్తారు. ఆ పూలను దెగ్‌లుగా పిలిచే ఒక పెద్ద రాగి పాత్రలో వేసి కొంచెం చల్లటి నీళ్లను కలుపుతారు. ఈ పాత్ర కింద కట్టెలు లేదా పిడకలతో మంట పెడతారు. ఇక పాత్రలో నుంచి వచ్చే ఆవిరి ఒక వెదురు గొట్టం ద్వారా దప్‌కా అని పిలిచే మరో చిన్న పాత్రలోకి వెళుతుంది. ఆ పాత్ర నీళ్లలో ఉంటుంది. ఏడెనిమిది గంటల పాటు ఆ మిశ్రమాన్ని మరిగించాక, ఆ ఆవిరి చిన్న పాత్రలోకి వచ్చి శీతలీకరణం చెంది అక్కడ నూనెగా మారుతుంది. దీనికి మనకు కావలసిన అత్తరు రకాన్ని బట్టి ఎసెన్షియల్‌ ఆయిల్‌, లేదా శాండల్‌ఉడ్‌ ఆయిల్‌ను వివిధ మోతాదుల్లో కలుపుతారు. ఈ పద్ధతిలో మనం వాడే ఒక చిన్న సీసా అత్తరు తయారీకి 15 నుంచి 25 రోజుల సమయం పడుతుంది. ఇలా తయారు చేసిన అత్తరు పరిమళం రోజంతా ఒంటికి అంటుకుని ఉంటుందట. కన్నౌజ్‌లో తయారయ్యే వాటిలో తొలకరి మట్టి వాసనతో ఉండే అత్తరు ప్రత్యేకమైనది. దీని కోసం పూలకు బదులు అక్కడి మట్టి పెళ్లలను పాత్రల్లో వేసి ఆ వాసనను ఎంతో చాకచక్యంగా అత్తరు గుబాళింపుగా మారుస్తారు. ఇక్కడ మరింత ప్రత్యేకమైనది గులాబీలతో తయారయ్యే రూహ్‌ అల్‌ గులాబ్‌. దాదాపు ఎనిమిది వేల కిలోల గులాబీల నుంచి ఈరకం ఒక కిలో అత్తరు తయారవుతుంది. అందుకే, దీని విలువ పదమూడు లక్షల రూపాయల పైచిలుకే పలుకుతుంది. ఇక, ఇక్కడి ప్రత్యేకమైన మరో రకం... ఊద్‌ అత్తర్‌. అగర్‌వుడ్‌తో చేసే ఈ అత్తరు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అత్తర్లలో ఒకటి. కిలో యాభై లక్షల రూపాయల దాకా పలికే దీన్ని అరబ్‌ దేశాలకు చెందిన ధనిక కుటుంబాల వాళ్లు ఇక్కడి నుంచి ఎంతో ఇష్టంగా తెప్పించుకుంటారు. అందుకే ఈ పట్టణానికి భారతదేశపు అత్తరు రాజధానిగా భౌగోళిక గుర్తింపూ వచ్చింది. అంతేకాదు, ఇక్కడ అత్తరు మ్యూజియాన్నీ నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి అత్తరు అరబ్‌ దేశాలతో పాటు, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, ఫ్రాన్స్‌ తదితర 57 దేశాలకు ఎగుమతి అవుతోంది. సాధారణ ప్రజలు వాడేందుకు వీలుగా రెండు మూడు వందల రూపాయల ఖరీదుతోనూ ఈ అత్తరులను తయారు చేస్తున్నారు. మనమూ ఇక్కడి పరిమళాలను ఆస్వాదించాలనుకుంటే www.kannaujattar.com వెబ్‌సైట్‌లోకి వెళ్తే సరి!

 


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.