close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వేళ... క్యూబా అండ!

ఒక చిన్న ద్వీపం. వైశాల్యంలో దాదాపు తెలంగాణ రాష్ట్రమంత ఉంటే, జనాభా మాత్రం ఇంచుమించుగా దిల్లీ నగరంలో ఉన్నంత! అలాంటి దేశం ఇప్పుడు ప్రపంచదేశాలకు ‘నేనున్నా’ అంటోంది. కరోనా చికిత్సల కోసం అడిగినవాళ్లకీ అడగనివాళ్లకీ కూడా వందలాది డాక్టర్లను సాయం పంపుతోంది. సేవకు సరిహద్దుల్లేవంటూ అంతర్జాతీయ సమాజాన్ని అబ్బురపరుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలకే సాధ్యం కాని పనిని ఓ చిన్న దేశం ‘క్యూబా’ చేసి చూపిస్తున్న వైనం ఆసక్తికరం.

పందొమ్మిదేళ్ల సెఫాకి మెడిసిన్‌ చదవాలని కోరిక. తండ్రికేమో చదివించే స్తోమత లేదు. బ్యాంకు నుంచి లోను  తీసుకుని చదువుకోవచ్చు కానీ చదువయ్యే సరికి తడిసిమోపెడయ్యే రుణభారం తలచుకుని ఆమె ఆ ధైర్యం చేయలేదు. కాలిఫోర్నియా యూనివర్శిటీలో డిగ్రీలో చేరి ప్రాజెక్టు వర్కు కోసం ఘనా వెళ్లిన ఆమెకి అక్కడ క్యూబా వైద్యులు కొందరు పరిచయం అయ్యారు. ఎలాంటి కనీస సౌకర్యాలూ లేనిచోట వారు పనిచేసే విధానం ఆ అమ్మాయికి చాలా నచ్చింది. తిరిగి వచ్చేశాక ఓరోజు ఏమీతోచక నెట్‌లో క్యూబాలో మెడికల్‌ కాలేజీల వివరాలు వెతికింది. భయపడుతూనే ఓ కాలేజీకి ఫోన్‌ చేసింది. ఆన్‌లైన్లో దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే ఎంత ఫీజు కట్టాలీ అని అడిగింది. ‘ఉచితం’ అన్నారు వాళ్లు. పొరపాటుగా విన్నానేమో అనుకుని మళ్లీ అడిగింది. అవతలి వ్యక్తి నవ్వుతూ దరఖాస్తు ఫారమే కాదు ఇక్కడ అన్నీ ఉచితమే. ట్యూషన్‌ ఫీజూ హాస్టల్‌ ఫీజూ కట్టక్కర్లేదు... అని చెప్పేసరికి సెఫా ఎగిరిగంతేసినంత పనిచేసింది. వెంటనే బ్యాగు సర్దుకుని క్యూబా ఫ్లైటెక్కేసింది. అమెరికా నుంచి అలా క్యూబా వెళ్లి మెడిసిన్‌ చదివిన కొన్ని వందల మంది విద్యార్థుల్లో సెఫా ఒకరు.

వైద్య విద్య ఉచితమా?
మనకు నమ్మశక్యం కాదు కానీ అది నిజం. వైద్య విద్య మన దేశంలోనే కాదు, అమెరికాలోనూ చాలా ఖరీదైనదే. క్యూబాలో మాత్రం వేరు. అక్కడి లాటిన్‌ అమెరికన్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రత్యేకించి బయటి దేశాల పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించేందుకు పెట్టిందే. అలాగని అక్కడ చదువుకున్నవాళ్లు కొన్నేళ్లు అక్కడే పనిచేయాలన్న రూలేం లేదు. ఆరేళ్ల చదువు అవగానే తిరిగి తమ దేశానికి వెళ్లి ప్రాక్టీసు చేసుకోవచ్చు. అయితే అక్కడ చదువుకునేవారిలో కొంతమంది మాత్రమే ఫీజు ఉండదని వెళ్తారు. ఎక్కువ మంది అక్కడి వైద్య విద్యావిధానం నచ్చి వెళ్తారు. క్యూబా వైద్య విద్యా, చికిత్సా విధానాలే ఆ దేశాన్ని చాలా విషయాల్లో ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

ఏమిటా ప్రత్యేకత?
క్యూబాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.  అమెరికా జీడీపీలో పదో వంతు కూడా ఉండదు ఆ దేశ జీడీపీ. ఖరీదైన మందులూ ఆధునిక వైద్య పరికరాలూ అక్కడ ఉండవు. అయినా ఆయుఃప్రమాణం మాత్రం అమెరికా కన్నా ఒక పిసరు ఎక్కువే. అమెరికాలో సగటు ఆయుః ప్రమాణం 78.54 అయితే క్యూబాలో 78.66. మానవాభివృద్ధి సూచీలో మనదేశం 122వ స్థానంలో ఉంటే క్యూబా 72వ స్థానంలో ఉంది. వెయ్యి  మంది ప్రజలకు కనీసం ఒక డాక్టరన్నా ఉండాలంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మనదేశంలో పదివేల మందికి ఒక డాక్టరుంటే క్యూబాలో వెయ్యి మందికే ఎనిమిది మంది డాక్టర్లున్నారు.

అంత తేడా... ఎలా సాధ్యం?
అందుకు ముందుగా క్యూబా చరిత్ర కొంచెం తెలుసుకోవాలి. స్వాతంత్య్రం కోసం యుద్ధాలు చేసి నాలుగు వందల ఏళ్ల సామ్రాజ్యవాద పాలన నుంచి బయటపడి 1902లో రిపబ్లిక్‌ ఆఫ్‌ క్యూబా ఏర్పడింది.  ఆ తర్వాత కూడా రాజకీయంగా ఎన్నో  ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న ఆ ద్వీపం 1950వ దశకంలో జరిగిన క్యూబా విప్లవం అనంతరం ఫిడెల్‌ క్యాస్ట్రో పాలనలోకి వచ్చింది. మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ సిద్ధాంతాలను అనుసరించే సోషలిస్టు దేశం ప్రపంచంలో ఇప్పుడు క్యూబా ఒక్కటే. మొదటినుంచీ లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో అన్నిరంగాల్లోనూ క్యూబా పైచేయిగానే ఉండేది. ఆరోజుల్లోనే అక్కడి డాక్టర్ల సంఖ్య జనాభా ప్రాతిపదికన చూస్తే బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకన్నా ఎక్కువే. అయితే వారంతా నగరాల్లోనే ఉండేవారు. క్యూబా విప్లవం తర్వాత చాలామంది వైద్యులు అమెరికా వలస వెళ్లిపోయారు. మరోపక్క వరస ఉద్యమాల వల్ల దేశం ఆర్థికంగా చితికిపోయింది. అదే సమయంలో రాజకీయంగా అమెరికాతో విభేదాలు వాణిజ్యపరమైన ఆంక్షలకు దారితీశాయి. చాలా  వస్తువులకు దిగుమతులపై ఆధారపడిన ఆ చిన్ని ద్వీపం ఆ ఆటుపోట్లన్నిటినీ తట్టుకుని తన కాళ్ల మీద తాను నిలబడడానికి చేసిన ప్రయత్నాల్లో భాగమే... వైద్య రంగంలో నేటి ప్రత్యేక స్థానం.

చాలా కష్టపడి ఉండాలి..?
అవును, చాలా కష్టపడి ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ఉద్యమకారుడిగా చాలామందికి తెలిసిన చే గెవారా వృత్తిరీత్యా వైద్యుడు. క్యాస్ట్రోకి సన్నిహితుడు. అతడి సలహాలతోనే ముందుగా అక్కడి ప్రభుత్వం ప్రజారోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించిందంటారు. వైద్యసేవలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలకూ సమానంగా అందేలా చూడటమే కాక ఉచితంగా వైద్యసేవల్ని పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా మార్చింది. మామూలు చెకప్‌ నుంచీ సంక్లిష్టమైన సర్జరీ వరకూ అన్నీ ఉచితమే. వైద్య విధానం కూడా 1960ల నుంచీ క్రమంగా మారుతూ వచ్చి, 80ల కల్లా  ప్రాథమిక ఆరోగ్యమూ వ్యాధినివారణా అన్నవి కీలకంగా చేసుకుంది. అందుకే ఇక్కడ వైద్యుడు- రోగి మధ్య బంధం మిగతాచోట్ల కన్నా భిన్నంగా ఉంటుంది.

అంటే ఎలా..?
అక్కడ రోగులు ఆస్పత్రికి వచ్చేదాకా డాక్టర్లు వేచి చూడరు. వాళ్లే రోగుల ఇంటికి వెళ్తారు. వైద్య వ్యవస్థ కింది నుంచి పైకి ఆరు అంచెల్లో ఉంటుంది. అన్నిటికన్నా కింది వరసలో ప్రతి రెండు వందల కుటుంబాలకీ ఒక డాక్టరు, నర్సు, సోషల్‌వర్కర్‌తో కూడిన మిని పాలీక్లినిక్‌లుంటాయి. క్లినిక్‌ ఉన్న భవనంలోనే వైద్యులు కూడా నివసించాలి. అంటే ఇరవై నాలుగ్గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. తమ పరిధిలోని రెండు వందల కుటుంబాలకి సంబంధించిన సంపూర్ణ సమాచారం వారి దగ్గర ఉంటుంది. వృద్ధులూ గర్భిణులూ బాలింతలూ ఉంటే వారి ఇళ్లకు వైద్యులే వెళ్లి చికిత్స చేస్తారు. కాలాన్ని బట్టి వచ్చే వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం, ప్రజలు జాగ్రత్తపడేలా చూడటం వారి బాధ్యతే. ఊళ్లో ఎక్కడైనా మురుగు నీరు నిలవుంటోందా, ఎవరైనా మద్యం, పొగతాగడం లాంటి అలవాట్లకు బానిసలవుతున్నారా... తదితరాలన్నీ గమనించుకుంటూ ఉండాలి. అలాంటి కొన్ని మినీ పాలీ క్లినిక్‌లు ఒక సెక్టార్‌ పాలీక్లినిక్‌ కిందికి వస్తాయి. 30 వేల జనాభాకి ఓ హెల్త్‌ సెంటర్‌ ఉంటుంది. దానిపైన మున్సిపల్‌ ఆస్పత్రులూ ఆ తర్వాత ప్రొవిన్షియల్‌ ఆస్పత్రులూ వాటిపైన నేషనల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఉంటాయి. తీవ్రమైన వ్యాధులకు మాత్రమే పైస్థాయి ఆస్పత్రులకు పంపిస్తారు. వ్యాధి నివారణకు ప్రాధాన్యం ఇస్తున్నందునే అక్కడి ప్రజల సగటు ఆయుర్దాయం ఎక్కువ. కాన్పు సమయంలో తల్లీబిడ్డల మరణాలూ గుండెజబ్బులతో ఆస్పత్రిలో చేరడమూ చాలా తక్కువ.

బోధన కూడా అలాగే ఉంటుందా?
అక్కడ వైద్య కళాశాలలు కూడా ఆరోగ్య మంత్రిత్వశాఖ కింద పనిచేస్తాయి. చదువుతో పాటే వైద్యమూ నేర్పిస్తారు. మొదటి రెండేళ్లూ జనరల్‌ మెడిసిన్‌ నేర్పిస్తూనే పాలీక్లినిక్‌లలో ప్రాక్టికల్‌ క్లాసులూ చెబుతారు. దీనివల్ల ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులూ అనారోగ్యానికి దారితీసే పరిస్థితులపైన విద్యార్థులకు అవగాహన వస్తుంది. తర్వాత మూడేళ్లూ తరగతి గది పాఠాలూ ల్యాబ్‌లో ప్రయోగాలతో పాటు వైద్యకళాశాల ఆస్పత్రిలో క్లినికల్‌ ప్రాక్టీసూ చేయాలి. నచ్చిన స్పెషలైజేషన్‌తో మరో ఏడాది ప్రాక్టీసు చేశాక డాక్టరు పట్టా ఇస్తారు. ఆ తర్వాత మూడేళ్లు తప్పనిసరిగా సంఘసేవ చేయాలి. విదేశీ మిషన్లూ అందులో భాగమే. ఆస్పత్రి గదులూ పరిసరాల డిజైన్‌ గురించి కూడా విద్యార్థులు నేర్చుకుంటారు. వార్డులో వెలుగు సహజంగా ఉందా, గాలి బాగా వీస్తోందా, పేషెంట్ల కళ్లకు హాయి గొలిపే రంగులు ఉన్నాయా... ఇవన్నీ చూస్తారు. పేషెంట్‌ కోలుకోవటానికి ఏసీ కన్నా సహజంగా వీచే తాజా గాలి మంచిదనీ, ఆస్పత్రి ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లకు తావుండదనీ నమ్ముతారు క్యూబా వైద్యులు. సంక్షోభ సమయాల్లో వైద్యం చేయడం ఎలాగో కూడా వారికి విద్యార్థి దశలోనే తెలిసిపోతుంది.

అదెలా..?
ఒకసారి మూడో సంవత్సరం విద్యార్థిని నైట్‌ షిఫ్టులో ఉండగా ఓ రోగికి బీపీ ఎక్కువై స్పృహతప్పుతున్న పరిస్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అంతలో కరెంటు పోయింది. అదృష్టవశాత్తూ ఆ విద్యార్థిని దగ్గర పెన్‌ టార్చ్‌ ఉంది. దాన్ని ఆన్‌చేసి నోటితో పట్టుకుని గ్లూకోజ్‌ పెట్టి పేషెంట్‌ తేరుకునేలా చేసింది. ‘గెరిల్లా తరహా క్యూబన్‌ వైద్యంలో అది నా మొదటి అనుభవం’ అంటుంది నవ్వుతూ ఆ అమ్మాయి. అక్కడ వైద్య విద్యార్థులందరికీ ఇలాంటి అనుభవాలు చాలానే ఉంటాయి. అమెరికా ఆంక్షల వల్ల మందులూ వైద్య పరికరాలకు చైనాలాంటి సుదూర దేశాల మీద ఆధారపడాల్సి రావడంతో సమయానికి అవేవీ అందుబాటులో లేకపోయినా చికిత్స జరిగిపోయేలా చూడడం అక్కడి విద్యార్థులకు అలవాటై పోతుంది. అందుకే వాళ్లు ఏ దేశంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైద్యం చేయగలుగుతున్నారు. ల్యాబ్‌ రిపోర్టుల ఆధారంగా కాకుండా పేషెంటుతో ఎక్కువ సమయం గడిపి వివరాలు తెలుసుకోవడం ద్వారా వ్యాధినిర్ధారణ చేస్తారు. క్యూబాలో ప్రైవేట్‌ క్లినిక్‌లే కాదు ల్యాబ్స్‌ కూడా ఉండవు.  పైగా ఇతర దేశాలతో పోలిస్తే ప్రభుత్వం పెట్టే తలసరి వైద్య ఖర్చు చాలా తక్కువ.

విదేశాలకు పంపడం ఎందుకు?
క్యూబా ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 1963నుంచి నేటివరకూ 164 దేశాల్లో అక్కడి వైద్యులు సేవలందించారు. ఫిడెల్‌ క్యాస్ట్రో వారిని ‘ఆర్మీ ఆఫ్‌ వైట్‌ కోట్స్‌’ అనేవారు. అలా పనిచేయడం వైద్యులకు గర్వకారణమైతే దేశానికి ఆదాయమార్గం. క్యాస్ట్రో   అధికారంలోకి రాగానే చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ప్రత్యేకించి సైన్సు, వైద్య రంగాల్లో శిక్షణకి మొదటి ప్రాధాన్యమిచ్చారు. దాంతో వేలాది డాక్టర్లూ నర్సులూ శాస్త్రవేత్తలూ తయారయ్యారు. బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ప్రగతి సాధించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది వైద్యులు తమ దేశంలో ఉండటంతో వారి సేవల్ని విదేశాలకూ అందించేందుకు ఈ తెల్లకోట్ల సైన్యాన్ని తయారుచేశారు క్యాస్ట్రో. సంపన్న దేశాల దగ్గర తమ సేవలకు రుసుములు వసూలుచేసే క్యూబా  పేద దేశాలకు ఉచితంగా సేవలందిస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాపించినప్పుడు మొట్టమొదట 460 మంది వైద్యుల్ని పంపి ఆదుకుంది క్యూబానే. 2010లో వరస భూకంపాలతో అతలాకుతలమైన హైతీలో కలరా ప్రబలిన వార్త తెలియగానే అక్కడికి చేరుకున్నది క్యూబా వైద్యులే. 1200 మంది డాక్టర్లు అక్కడికెళ్లి సేవలందించారు. క్యూబా సాయం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో బ్రెజిల్‌ ప్రత్యక్షంగా చూసింది. ఒక ప్రత్యేక ప్రాజెక్టు కింద 2013 నుంచి అక్కడి గ్రామీణ పేద ప్రజానీకానికీ ఆదివాసీలకూ సేవలందిస్తున్నారు పది వేలమంది క్యూబా డాక్టర్లు. గతేడాది కొత్తగా వచ్చిన బ్రెజిల్‌ ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టు నచ్చకపోవడంతో క్యూబా తన డాక్టర్లను వెనక్కి పిలుచుకుంది. కొన్నాళ్లకే దాని ఫలితం కనిపించింది. తొమ్మిది నెలల్లోనే అక్కడ 530 శిశుమరణాలు సంభవించాయి. దానికి తోడు ఇప్పుడు కరోనా విజృంభించడంతో మళ్లీ క్యూబా వైపు చూడక తప్పలేదు బ్రెజిల్‌కి. వెనెజులా, నికరగువా, గ్రెనడా, సూరినాం లాంటి చిన్న చిన్న పేద దేశాలకే కాదు పెద్ద పేరున్న దేశాలకూ క్యూబా వైద్యులు వెళ్లారు. ప్రస్తుతం 30 వేల మంది స్పెషలిస్టులు 70 దేశాల్లో సేవలందిస్తున్నారని అంచనా. వాటిల్లో 22 దేశాలకు ఉచిత సేవలే.

చెర్నోబిల్‌ అణుప్రమాదం తర్వాత రేడియేషన్‌ మూలంగా వచ్చిన అనారోగ్యాలకూ మానసిక సమస్యలకూ రష్యా, ఉక్రెయిన్‌, బెలారస్‌లనుంచి దాదాపు 20 వేల మంది పిల్లలు క్యూబాలో చికిత్స పొందారు.

ఎబోలా సమయంలో ఆఫ్రికా దేశాల్లో సేవలందించినందుకుగాను 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అవార్డును అందుకుంది క్యూబా వైద్యబృందం. ఇతర దేశాలకు పంపినట్లే కత్రినా తుపాను వచ్చినప్పుడు (2005) అమెరికాకు కూడా వైద్యుల్ని పంపుతానంది క్యూబా. అందుకు అమెరికా అధ్యక్షుడు అంగీకరించలేదు. అప్పుడే క్యూబా సైన్యంలో చేరి సేవలందించిన అమెరికన్‌ యువకుడు హెన్రీ రీవ్‌ పేరిట ఓ ప్రత్యేక వైద్యదళాన్ని ఏర్పాటుచేశారు ఫిడెల్‌ క్యాస్ట్రో. ఆ దళానికి విపత్తు వేళల్లో సేవలందించడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ దళ సభ్యులు 144 మంది ప్రస్తుతం జమైకాలో కరోనాని కట్టడి చేస్తున్నారు. కేవలం సేవలతో సరిపెట్టక తమ వైద్యవిధానాన్ని పేద దేశాలకు ఉచితంగా నేర్పాలని ప్రత్యేకంగా కళాశాలను ఏర్పాటు  చేశారు క్యాస్ట్రో. ప్రపంచంలోనే అతి పెద్ద వైద్య కళాశాల అదే.

ఎక్కడ..?
హవానాలోని పాత నౌకా స్థావరాన్ని  మెడికల్‌ కాలేజీగా మార్చి లాటిన్‌ అమెరికన్‌ మెడికల్‌ స్కూల్‌ని 1999లో ప్రారంభించారు. పాత బ్యారక్స్‌ని చిన్న చిన్న తరగతి గదులుగా మార్చడంతో అచ్చం మన ప్రభుత్వ పాఠశాలలాగా ఉంటుంది. అదే నల్లబల్ల... అవే డెస్కులు. ఎలాంటి ఆధునిక సౌకర్యాలూ అక్కడ ఉండవు. అయినా వివిధ దేశాల నుంచి వచ్చిన పదివేల మంది  విద్యార్థులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది ఆ కళాశాల. క్యూబాలో చదువుకున్న 30వేల మంది డాక్టర్లు ఇప్పుడు అమెరికాలాంటి పలుదేశాల్లో ప్రాథమిక వైద్య రంగంలో డాక్టర్ల కొరత తీరుస్తున్నారు.

*       *       *

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాల వైద్య వ్యవస్థల్లోని డొల్లతనమూ బయటపడింది. దాంతో చాలా దేశాలు క్యూబా సాయాన్ని మహదానందంగా స్వీకరించాయి. ప్రజల ప్రాణాలను కాపాడుకున్నాయి.
అందుకే... వైద్యసేవల్లో అంతర్జాతీయ సహకారానికి సంబంధించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రపంచం ముందు ఉంది. ఒక్క కరోనా విషయంలోనే కాదు, ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొని నిలవాలంటే ఆ సహకారం తప్పదనడానికి క్యూబా సాయమే సాక్ష్యం..!


మన దేశంలో క్యూబా వైద్యం

వైద్య ఆరోగ్య రంగంలో పరస్పర సహకారానికి రెండేళ్ల క్రితమే క్యూబాతో మనదేశం ఒప్పందం చేసుకుంది. ఆ వైద్య విధానాన్ని ఇక్కడా అనుసరించేలా వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకూ, మందుల తయారీ, సరఫరా తదితర విషయాల్లో పరస్పరం సహకరించుకునేలా ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత పైలట్‌ ప్రాజెక్టు కింద ఆ విధానాన్ని అమలుచేయడానికి కేరళలోని తిరువనంతపురం శివారులోని ఓ గ్రామాన్ని ఎంచుకున్నారు. క్యూబాలో చేసినట్లే ఇక్కడా డాక్టర్లు రోగుల ఇళ్లకు వెళ్తారు. ప్రతి వ్యక్తికీ  సంబంధించిన వైద్య రికార్డులతో కంప్యూటర్‌ డేటాబేస్‌ రూపొందించారు. దీర్ఘ   వ్యాధులు ఉన్నవాళ్లని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యలన్నీ చక్కటి ఫలితాన్నిస్తున్నాయి. ఊరి ప్రజల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడటమే కాక, వైద్యంకోసం వాళ్లు పెట్టే ఖర్చు బాగా తగ్గినట్లు గమనించారు. ఈ పద్ధతిని ఇప్పుడు మిగిలిన గ్రామాల్లోనూ అనుసరించడానికి కేరళలో  ప్రయత్నాలు జరుగుతున్నాయి.


కరోనా ‘కేర్‌’లో క్యూబా ముద్ర

క్యూబా ఆర్థిక వ్యవస్థకి పర్యటకరంగం ప్రధాన వనరు కావటంతో ఏప్రిల్‌ ఫస్టు వరకూ పర్యటకుల్ని రానిచ్చింది. ముగ్గురు ఇటలీ యాత్రికుల ద్వారా అక్కడ మొదటి కరోనా కేసులు నమోదయ్యాయి. క్యూబా నుంచి వలసవెళ్లి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడిన చాలామంది తరచూ స్వదేశానికి రాకపోకలు సాగిస్తుంటారు. దాంతో ఎంత కట్టుదిట్టంగా పరీక్షలు చేసినా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం ఆ చిన్నదేశానికి తలకు మించిన భారమే అయింది. అయినా అక్కడి వ్యవస్థ ఏమాత్రం కంగారుపడలేదు. తగినన్ని ఆస్పత్రుల్ని సిద్ధంచేసి చికిత్స అందిస్తోంది. మరో పక్క స్కూలు యూనిఫారాలు కుట్టే సంస్థల చేత పెద్ద ఎత్తున మాస్కులూ వైద్యులకు ప్రత్యేక దుస్తులూ కుట్టించింది. క్యూబాలో కరోనా వల్ల మృతి చెందినవారిలో పర్యటకులే అధికం. అలాంటి పరిస్థితుల్లోనూ ఆ దేశం సాయం కోరినవారిని కాదు పొమ్మనలేదు. దాదాపు పదకొండు వందలమందితో కరీబియన్‌ సముద్రంలో చిక్కుకుపోయిన బ్రిటిష్‌ ఓడలో కొందరికి వైరస్‌ సోకడంతో అమెరికాతో సహా ఎవరూ దాన్ని తమ ఒడ్డుకు రానీయలేదు. క్యూబా ఏమాత్రం సందేహించకుండా ఆ నౌకను ఆహ్వానించింది. ప్రయాణికులు అందరికీ పరీక్షలు చేసి బాగున్నవారిని వెంటనే విమానం ఎక్కించి స్వదేశానికి పంపింది. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించింది. క్యూబా చూపిన ఈ ఔదార్యానికి  అంతర్జాతీయ సమాజమంతా ప్రశంసలతో ముంచెత్తింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.