close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రంగుల వరసలు  రుచి చూద్దామా...!

ఓ పక్క ఎండ పెరిగే కొద్దీ... మన పొట్ట చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటుంది. అందుకే, వేసవి వచ్చిందంటే చల్లచల్లని పండ్లరసాలూ, పెరుగూ, సబ్జా గింజలూ... ఇలా మనసు ఎటులాగితే వాటిని తినేస్తూ ఉంటాం. అయితే వీటిని గాజు గ్లాసుల్లో అందమైన లేయర్లుగా వచ్చేలా అలంకరించడం ఈ వేసవి ట్రెండు. దీంతో ఈ రుచులు నోటినే కాదు కళ్లనూ ఊరించేస్తున్నాయిప్పుడు.

అలంకారం స్థాయి మనిషినీ, ఇంటినీ దాటి ఆహారాన్ని ఎప్పుడో అందుకుంది. కంటికి ఇంపయితేనే నోటికి ఇంపవుతుంది అన్న మాటను అక్షరాలా పుణికి పుచ్చుకున్నాయి రెస్టరెంట్లూ, ఐస్‌క్రీం పార్లర్లూ, బేకరీల్లాంటివి. అందుకే ఫ్యాషన్‌లో   వచ్చినట్టే ఎప్పటికప్పుడు ఫుడ్‌ట్రెండ్లూ పుట్టుకొస్తున్నాయి. లేయర్డ్‌ జ్యూసులూ, ఐస్‌క్రీంలూ, స్మూతీలూ, కోల్డ్‌ టీలూ... ఇలా మనం  ఇష్టంగా ఆరగించేవన్నీ ఇలా రంగురంగుల వరసల్లో కనువిందు చేస్తున్నాయి. కోవా, సబ్జా గింజలూ, డ్రైఫ్రూట్లూ, పాలతో తయారయ్యే ఫాలుదా కూడా ఈ రకంగా  ముస్తాబవుతోంది.

నోరూరించేలా...
మామూలుగా అయితే మనం ఒక జ్యూస్‌ ఆర్డరిచ్చామంటే ఒకటే జ్యూస్‌ తాగుతాం. కానీ ఇలాంటి వాటిలోనైతే మూడు, నాలుగు రకాల జ్యూసుల్ని ఒకేసారి రుచిచూడొచ్చు. అలాగే ఐస్‌క్రీంలోనూ నాలుగైదు ఫ్లేవర్లను చప్పరించేయొచ్చు. మనలో కొంత మందికి పెరుగన్నంలోనో, పెరుగుతోనో మామిడి పండునూ లేదా అరటి పండునూ కలగలిపి తినడం అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ల కోసం పెరుగూ, మామిడి, అరటిలాంటి ఫ్లేవర్ల కలబోతగానూ వీటిని తయారు చేయొచ్చు. లేయర్డ్‌ ఐస్‌క్రీంను చేసేందుకు ఒక్కో ఫ్లేవర్‌నూ గ్లాసులో పోసి ఫ్రీజ్‌ చేసి మళ్లీ మరో ఫ్లేవర్‌ను జోడిస్తారు. అదే జ్యూసుల్లాంటివయితే... వాటిని చిక్కగా తయారు చేయడం, లేదా ఫ్రీజ్‌ చేయడం ద్వారా ఒకదాని మీద ఒకటి కనిపించేలా చేస్తారు. కొన్ని రకాలను తయారు చేసేందుకు వాటిని గ్లాసుల్లో పోసే విధానమూ ప్రత్యేకంగా ఉండాలి. ఈ తరహా వాటిని ఎలా తయారు చేసుకోవాలి అన్నదానికి సంబంధించి కొన్ని   వీడియోలూ యూట్యూబ్‌లో ఉన్నాయి. వాటిని చూసి మనమూ ప్రయత్నించొచ్చు. ఇక, ఇలాంటి  వరసలు తయారు చేసేప్పుడు పండ్ల ముక్కలూ, డ్రైఫ్రూట్లూ, సబ్జాగింజల్లాంటి వాటిని జత చేసుకోవచ్చు. మనకు నచ్చినవి కనువిందుగా చేసుకు తింటూనే ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు. జ్యూసులూ, ఐస్‌క్రీంలే కాదు సాయంత్రాలు రిలాక్సయ్యేలా లేయర్డ్‌ టీలూ, కాఫీలూ కూడా తయారు చేస్తున్నారు. మొత్తానికి రంగుల మేళవింపుగా కనిపించే ఈ లేయర్డ్‌ రుచుల్ని ఎండవేళ చల్లచల్లగా అతిథులకు అందించారంటే వారు మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరచి పోరంటే అతిశయోక్తి కాదు!


ఇదో స్టైల్‌
రెండు చీరలు కలిపి కట్టేస్తున్నారు!

దగ్గరి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది మనస్విని. దానికోసం కట్టుకోవడానికి రెండు చీరలు నచ్చాయి. ఇది కట్టుకోవాలా, అది కట్టుకోవాలా... అని చాలా సేపు ఆలోచించింది. ఇంతలో తన ఫ్రెండ్‌ వినీల వచ్చింది. ఎంచక్కా రెండూ ఒకేసారి కట్టుకో... ఇప్పుడదే ఫ్యాషన్‌ కదా అంది వినీల. దాంతో తనకు నచ్చిన రెండు చీరలూ ఒకేసారి కట్టుకొని పార్టీలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిపోయింది మనస్విని. నిజమే ఇప్పుడు రెండు చీరలు కలిపి కట్టుకోవడమే కొత్త ట్రెండ్‌. ఒకదానితో మరొకటి మ్యాచయ్యేలా, లేదా మంచి కాంట్రాస్ట్‌ ఉండేలా రెంటినీ ఎంచుకుని ఒకదాన్ని లెహంగాలా వచ్చేలా నడుం చుట్టూ సగందాకా కుచ్చులతో పెట్టేసి, రెండో దాన్ని మరో సగానికి ఇంకో చీరతో కుచ్చులు పోసి దాన్నే పమిటలా వేసుకుంటున్నారు. ఇది ఎలా కట్టుకోవాలీ అన్నది యూట్యూబ్‌లో చూసి ఎవరైనా సులభంగా నేర్చుకోవచ్చు. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి!


అంచు పైకొచ్చింది!

ఇప్పటిదాకా మనకు స్కర్టులూ, లంగాలకు అంచులంటే పాదాల దగ్గర ఉండేవే తెలుసు. ఎంత కుచ్చు కావాలనుకున్నా మనం అంచు మాత్రం కిందివైపే వేసుకునేవాళ్లం. అయితే అందుకు భిన్నంగా ఒక పక్కగా నడుం దాకా అంచు ఉండేలా స్కర్టులు వస్తున్నాయిప్పుడు. కిందివైపు మామూలుగానే అంచు ఉండే ఇవి కుచ్చు పోసినట్టు పైదాకా కూడా అంచు కనిపించేలా రూపొందుతున్నాయి. వీటిని ఇష్టాన్ని బట్టి ఎడమవైపూ లేదా కుడివైపూ ఉండేలా కుట్టించుకుంటున్నారు. నడిచినప్పుడు ఈ కుచ్చులు కదులుతూ పద్మంలా స్కర్టు విచ్చుకుంటుందని పద్మస్కర్ట్‌ అని కొందరు పిలుస్తున్నారు. సర్టుని కొత్తగా ధరించాలనుకుంటే ఈ రకానికి ఓటేయాల్సిందే!


ట్యాక్సీ బొమ్మలూ ట్రెండయిపోయాయి!

చీరా జాకెట్టూ అంటే... ట్రెడిషనల్‌ లుక్కే అనిపిస్తుంది. అందులోనూ మోడ్రన్‌ లుక్‌ని తీసుకువచ్చేలా జాకెట్ల మీద వెరైటీ ఎంబ్రాయిడరీలు చేస్తున్నారు కొందరు ఫ్యాషనిస్టులు. అందుకోసం మనం తరచుగా వేసుకునే ఆకులూ, పూలూ, నగల్లాంటి డిజైన్లు కాకుండా ఆటోలూ, ట్యాక్సీలూ, స్కూటర్లూ, సైకిళ్లలాంటి వాటిని వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, కుట్టు మిషన్లూ, క్యాలెండర్లూ, పూల జడ డిజైన్లలాంటి వాటినీ వీటి మీద ఆవిష్కరిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన పరమలాంటి సంస్థలతో పాటు మరికొన్ని ఫ్యాషన్‌ బొటిక్‌లూ ఇలాంటి వినూత్న డిజైన్లను తెస్తున్నాయి. ఇకనుంచి జాకెట్లూ ఫంకీ లుక్‌తో మురిపించనున్నాయన్నమాట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.