close

వేగాన్‌ లెదర్‌ తెస్తున్నారోచ్‌!

ఆహారానికి సంబంధించి చాలామంది ‘వేగాన్‌’ బాట పడుతుండటం వినే ఉంటారు. ఇది కేవలం తిండి విషయాలకే కాకుండా... దుస్తులూ, యాక్సెసరీలకీ పాకింది. ముఖ్యంగా మనం వాడే చెప్పులూ, బ్యాగులూ, పర్సుల తయారీకి వాడే లెదర్‌ కూడా అహింసాయుతంగానూ, పర్యావరణహితంగానూ ఉండాలని కోరుకుంటోంది నేటి వేగాన్‌ ప్రపంచం! ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ... మనదేశానికి చెందిన ఈ మూడు స్టార్టప్‌లు విభిన్న వస్తువులతో ‘వేగాన్‌ లెదర్‌’ని తయారుచేసి ప్రపంచవ్యాప్త గుర్తింపుని సాధిస్తున్నాయి!


వాడిన పూలు కూడా...

గంగానదిలో టన్నులకొద్దీ పడేసే పూలతో అగర్‌బత్తీని తయారుచేసే ‘ఫూల్‌’ అనే సంస్థ ఆ మధ్య వార్తల్లోకెక్కింది. పర్యావరణహితమైన తమ వినూత్న ఆవిష్కరణలతో ఈ సంస్థ ఎన్నో అవార్డులూ సాధించింది. ఆ సంస్థ, అలాంటి వృథాపూలతోనే ఇప్పుడు ‘ఫ్లెదర్‌’ అనే వేగాన్‌ లెదర్‌ని తయారుచేస్తోంది. వాడిన పూలతో అగర్‌బత్తీలు తయారుచేసే క్రమంలో అనుకోకుండానే ఈ లెదర్‌ ఆవిష్కృతమైందంటున్నాడు ‘ఫూల్‌’ వ్యవస్థాపకుడు అంకిత్‌ అగర్వాల్‌. ‘అగర్‌ బత్తీ తయారీ కోసం మేం గుట్టలుగా సేకరించి పెట్టిన పూల మధ్య ఓ అట్టముక్కలాంటి పదార్థం తయారు కావడం గమనించాం. ఓ రకమైన బ్యాక్టీరియా ద్వారా అది ఏర్పడుతోందని తెలుసుకున్నాం. దానిపైన మరింత పరిశోధన చేసి ఆ పూలనీ, బ్యాక్టీరియాని కలిపి ఈ ప్రత్యేక వేగాన్‌ లెదర్‌ని తయారుచేస్తున్నాం...’ అని చెబుతున్నాడు అంకిత్‌.


మల్బరీ ఆకులే...

సుగంధ్‌ అగర్వాల్‌... అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయురాలు. 2008లోనే జంతు హింసకు ఆస్కారంలేని లెదర్‌ తయారీ కోసం ‘గుణాస్‌ ది బ్రాండ్‌’ అనే సంస్థని ప్రారంభించింది.‘పాలీ యుథరిన్‌’ అనే ప్లాస్టిక్‌ రసాయనం సాయంతో వేగాన్‌ లెదర్‌ ఉత్పత్తుల్ని మొదలుపెట్టింది. పదేళ్లపాటు దాన్ని విజయవంతంగా నడిపింది. అప్పుడే ఆమెకో ఆలోచన వచ్చింది ‘మనం వేగాన్‌ లెదర్‌ని ఉత్పత్తి చేస్తున్నాం సరే... మరి ఇందుకోసం వాడుతున్న ప్లాస్టిక్‌ రసాయనం మాటేమిటీ? దానివల్ల కాలుష్యం పెరుగుతోంది కదా!’ అనే ఆలోచన సుగంధ్‌ని తొలిచేయడం ప్రారంభించిందట. అప్పుడే దక్షిణ కొరియాలో ఎన్నో తరాలుగా చేస్తున్న మల్బరీ వస్తువులపైన ఆమె దృష్టిపడింది. మనం పట్టుపురుగులకి ఆహారంగా మాత్రమే వాడే మల్బరీ ఆకుని అక్కడి ప్రజలు గుజ్జుగా మార్చి రకరకాల వస్తువులు తయారుచేయడం గమనించింది సుగంధ్‌. అదే పద్ధతిలో లెదర్‌నీ తయారుచేయడం ప్రారంభించింది. తన వేగాన్‌ లెదర్‌కి ‘మల్బ్‌ టెక్స్‌’ అని పేరుపెట్టింది. ఆ లెదర్‌తో ప్రత్యేక బ్యాగుల శ్రేణిని మార్కెట్లోకి తెచ్చింది. ఈ మధ్యే వీటి విక్రయాలని భారతదేశంలోనూ ప్రారంభించింది.


కొబ్బరి నీళ్లతో...

తెలుగు రాష్ట్రాలకి కోనసీమ ఎలాగో... భారతదేశానికి కేరళ అలాగ. చూపు సారించినంత దూరం పచ్చగా కొబ్బరి చెట్లు పరచుకుని ఉంటాయక్కడ. వాటితో అక్కడ నూనె తయారుచేస్తుంటారు. ఆ క్రమంలో టెంకాయలోని గట్టి కొబ్బరిని తీసి నీటిని డ్రైనేజీలోకి వదిలేస్తారు. ఆ కొబ్బరి నీరు పులిసిపోయి అక్కడ తీవ్రమైన పర్యావరణ సమస్యల్ని సృష్టిస్తోంది. ఆ సమస్యకి పరిష్కారంగా కంపెనీలు పారబోస్తున్న కొబ్బరి నీళ్లతో ‘వేగాన్‌ లెదర్‌’ని తయారుచేస్తున్నారు సీఎస్‌ సుస్మిత్‌, జుజునా గొంబోసోవా. సుస్మిత్‌ది కేరళ, జుజునాది స్లోవేకియా. రెండేళ్లకిందట ఇద్దరూ ‘మలాయ్‌ బయోమెటీరియల్స్‌’ అనే స్టార్టప్‌ని ప్రారంభించారు. తాము సేకరించిన కొబ్బరి నీటిలో అసెటోబ్యాక్టర్‌ అనే బ్యాక్టీరియాని వదులుతారు. అది ఆ నీటిని ఆహారంగా మార్చుకుని సెల్యులోజ్‌ అనే మెత్తటి పదార్థాన్ని తయారుచేస్తుంది! దానికి అరటి బోదె, జనప నారలని చేర్చి ఇలా ‘వేగాన్‌ లెదర్‌’ని తయారుచేస్తున్నారు. చూసినా, తాకినా అచ్చం లెదర్‌లాగే ఉండే దీన్ని ఎథికల్‌ లివింగ్‌(లండన్‌), ప్లే బ్యాగ్‌(జెకోస్లావేకియా) వంటి విదేశీ ఫ్యాషన్‌ యాక్సెసరీలకి పంపిస్తున్నారు. మనదేశానికి చెందిన ఆన్‌లైన్‌ విక్రయాల సంస్థ రితీకి కూడా దీన్ని అందిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.