close
నీటిని గెలిచారు!

జలమే జీవం... నీళ్లు లేనిదే ప్రాణం లేదు... పంటల్లేవు... పరిశ్రమల్లేవు. కానీ ఆ నీరు అన్నిచోట్లా ఉండదు. ఎడారులు, కొండలు,  వానచుక్క ఎరగని పొడి నేలలు... ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి.
ఆ ప్రాంతాల్లోనూ మనుషులున్నారు. వాళ్లకు తాగడానికీ,  తిండి గింజలు పండించుకోడానికీ నీరు కావాలి. ప్రకృతి ఇస్తే తప్ప మరోరకంగా పొందలేని ఈ నీటి కోసం ప్రపంచదేశాలు పెద్ద సాహసాలే చేస్తున్నాయి.
లక్షల కోట్లు ఖర్చుపెట్టీ, సృజన శక్తికి పదునుపెట్టీ... వారంతా రకరకాలుగా నీటిని గెలుచుకుంటున్న వైనం... ఆసక్తికరం. మార్చి 22 ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణకు వివిధ దేశాలు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపే ఈ ప్రత్యేక కథనం.


మనిషి నిర్మించిన నది: లిబియా

నకి ఒకటి రెండేళ్లు సరైన వానలు పడకపోతే కరవొచ్చేసిందని గగ్గోలు పెట్టేస్తాం. ఎడారి దేశమైన లిబియాలో సంవత్సరాల తరబడి అసలు వానచుక్క ఎరగని ప్రాంతాలున్నాయి. వానంటే ఎలా ఉంటుందో తెలియని యువతీ యువకులూ ఉంటారట. అలాంటిచోట పక్కనున్న సముద్రంలోని ఉప్పు నీటిని శుద్ధి చేసి మంచినీరుగా మార్చి తాగునీటిని సరఫరా చేసేది ప్రభుత్వం. ఆ నీటితోనే సాధ్యమైన చిన్న పంటలు కొన్ని పండించుకునేది. లిబియాకి చమురు క్షేత్రాలున్నాయి. అలా ఓసారి చమురు కోసం శిలాజాల కింద వెతుకుతుండగా చమురు బదులు ఏకంగా నీళ్లు దొరికాయి. ఎన్నేళ్లైనా తరగని స్వచ్ఛమైన జలసంపద అక్కడ ఉందని తెలియగానే లిబియా పాలకులు తమ పంట పండిందనుకున్నారు. కానీ అది ఉంది దేశానికి దక్షిణాన. అసలు నీరు లేక అల్లాడుతున్నదేమో ఉత్తర భాగం. ఏం చేయాలీ? కాలువలు తవ్వుదామంటే ఆ ఎడారి ఎండలకు సగం దారిలోనే నీరు ఆవిరైపోతుంది. అందుకని ఏం చేశారంటే- పెద్ద పెద్ద పైపులుపట్టేలా అచ్చంగా ఓ నదినే తవ్వేశారు. ఏకంగా 1600 కి.మీ. పొడవునా నాలుగు మీటర్ల వ్యాసం కల పెద్ద పెద్ద పైపులతో మనుషులు నిర్మించిన నది అది. ఆ పైపుల్లోకి నీటిని పంప్‌ చేయడానికి వీలుగా మధ్యలో అక్కడక్కడా 1300 బావులు తవ్వారు. అవి కూడా ఒక్కోటీ అర కిలోమీటరు పైన లోతుంటాయి. ఇంత పెద్ద అండర్‌గ్రౌండ్‌ పైపుల నెట్‌వర్క్‌(2820కి.మీ.) ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇప్పుడు లిబియాలో ట్రిపోలి లాంటి నగరాలతో సహా 70 శాతం జనాభా ఆ పైపుల ద్వారా వచ్చిన నీటినే తాగు తున్నారు, పంటలు పండించుకుంటున్నారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో లిబియా నిర్మించిన ఈ ప్రాజెక్టుని అతి పెద్ద ‘మ్యాన్‌మేడ్‌ రివర్‌’గా అభివర్ణించింది ప్రపంచం.


స్మార్ట్‌ వాటర్‌ సిటీ:  దక్షిణ కొరియా

వాన నీటిని ఒడిసి పట్టడానికి ఇళ్లల్లో ట్యాంకులు కట్టుకోవడం మనకు తెలుసు. ఇప్పుడు మన నగరాల్లో అపార్ట్‌మెంట్‌ భవనాలూ, ఇళ్ల పైకప్పుల మీద పడే నీటిని ట్యాంకుల్లోకి సేకరించి వాడుకోడానికి పనికొచ్చేలా భవనం కట్టేటప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇళ్లూ చిన్న చిన్న కాలనీలూ నీటి విషయంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నాయి. కొరియాలో ఏకంగా ఒక నగరమే ఆ ఘనత సాధించింది. పక్కా ప్రణాళికతో నిర్మాణాలు చేపడితే నీటి వనరుల్ని ఎంత బాగా వాడుకోవచ్చో చాటి చెప్పింది. దక్షిణ కొరియా దాదాపు పద్నాలుగేళ్ల క్రితం ఓ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టును మొదలుపెట్టింది. అత్యంత ఆధునిక సాంకేతికతతో కట్టిన ‘సొంగ్డొ’ అనే ఈ నగరం ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ సిటీ. తీరాన ఉన్న చిన్న చిన్న దీవులను కలుపుతూ తయారుచేసిన ఓ కృత్రిమ దీవి మీద కట్టిన ఈ సిటీలో అన్నీ అరవై డెబ్భై అంతస్తుల భవనాలే ఉంటాయి. భవనాల పైకప్పుల మీదా, కింద చుట్టూ ఉన్న ప్రాంతం అంతా మొక్కలతో పచ్చదనాన్ని పెంచారు. ఆ నగరంలో కురిసిన వాన నీరు మొత్తం ఎక్కడికక్కడ పైపుల ద్వారా నేరుగా భూగర్భంలోని ట్యాంకుల్లోకి వెళ్లిపోతుంది. ఆ నీటిని శుద్ధిచేసి భవనాల్లోని బాత్‌రూముల్లో వాడకానికి సరఫరాచేస్తారు. ఇంకా మిగిలిపోయిన నీటిని సాగుకూ పరిశ్రమలకూ వినియోగిస్తున్నారు. కేవలం తాగడానికి మాత్రమే భూగర్భ జలాన్ని వాడుకుంటారు. దీనివల్ల భూగర్భ జలాల మీద ఒత్తిడి లేదు కాబట్టి వాటి మట్టం తగ్గడం లేదు. ఈ ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి నీటి ఖర్చు 30 శాతం తగ్గింది.


ఉప్పునీటి నుంచి తాగునీరు:  సౌదీ అరేబియా

రెండు పక్కలా సముద్రం, మధ్యలో ఎడారీ ఉన్న సౌదీ అరేబియాకి చమురు ఒకప్పుడు పుష్కలంగా దొరికేది, నీరు మాత్రం ఉండేది కాదు. ఇప్పుడా చమురూ తగ్గిపోయింది. చమురు లేకపోయినా బతకొచ్చు కానీ నీరు లేకపోతే బతకడం ఎలా... అక్కడ నదులూ జలాశయాలూ అనేవి అసలు లేవు. కాస్తో కూస్తో ఉన్న భూగర్భ జలాలే ఆధారం. అవి కూడా మరో పది పదిహేనేళ్లలో అయిపోతాయని నిపుణులు ప్రకటించారు. దాంతో సముద్రాన్నే నమ్ముకుంది ఆ దేశం. ఉప్పు నీటినే శుద్ధి చేసి తాగునీరుగా ఉపయోగిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా ఉప్పునీటిని తాగునీటిగా మారుస్తున్న దేశమూ, ప్రపంచంలోని అతి పెద్ద డీశాలినేషన్‌ ప్లాంట్లు ఉన్న దేశమూ ఇప్పుడు సౌదీ అరేబియానే. పొరుగున ఉన్న యూఏఈ మేఘమథనం మీద డబ్బు ఖర్చు పెడుతోంటే సౌదీ మాత్రం డీశాలినైజేషన్‌ ప్లాంట్లను అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించడమే కాక పూర్తిగా సౌరశక్తితో వాటిని నడిపిస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా మరో అడుగు ముందుకేసింది. సౌదీ అరేబియా నెలకొల్పిన సముద్రంలో తేలియాడే డీశాలినైజేషన్‌ ప్లాంటు ప్రపంచంలోనే పెద్దది. సాధారణంగా నీటి కొరత ఎదుర్కొంటున్న దేశాలు చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే డీశాలినేషన్‌ ప్రక్రియను ఎంచుకుంటాయి. టెక్నాలజీ, ఖర్చూ చాలా ఎక్కువ కాబట్టి, మిగతా ప్రయత్నాలన్నీ చేశాకే చివరగా దీనికి వస్తారు. మరో గత్యంతరం లేని సౌదీ పెద్ద ఎత్తున ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్లను నెలకొల్పింది. దేశంలో వాడే తాగు నీటిలో సగం పూర్తిగా అలా తయారైందే. అలాగని రుచిలో మంచి నీటికి ఏమాత్రం తీసిపోదు ఈ నీరు.


ప్రపంచానికి పాఠాలు:  ఇజ్రాయెల్‌

దేశంలో అరవై శాతం భూభాగం ఎడారి, మిగిలిందీ మెట్ట ప్రాంతమే. సగటు వర్షపాతం చాలా తక్కువ. జీవనదుల్లేవు. పొరుగు దేశాల పరిస్థితీ అంతే. అలాంటి దేశం ఇప్పుడు మంచినీటిని ఎగుమతి చేస్తోంది, ప్రపంచానికి నీటి సంరక్షణలో, నిర్వహణలో పాఠాలు చెబుతోంది. దాని వెనక ప్రభుత్వమూ ప్రజలూ కలిసి చేసిన కొన్ని దశాబ్దాల కృషి ఉంది. ఒకసారి ఏకంగా ఏడేళ్లపాటు ఇజ్రాయెల్‌ని కరవు పీడించి వదిలిపెట్టింది. దాంతో నీటి వాడకం పైన గట్టిగా ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఈతకొలనులు ఉన్నవారిపై జరిమానాలూ, ఇంటికి సరఫరాచేసే నీటికి భారీ బిల్లులూ విధించి ప్రజలకు నీటిపొదుపును తప్పనిసరి అలవాటుగా మార్చేసింది. అక్కడ దొరికే నీటి పరికరాలన్నీ పరిమితంగా నీటిని వాడేలాంటివే. ఎక్కడైనా సంపాదన పెరిగేకొద్దీ నీటి వాడకం పెరుగుతుంది కానీ నలభయ్యేళ్లలో తలసరి నీటి వినియోగంలో ఏమాత్రం మార్పు లేకుండా జీడీపీలో 300 శాతం అభివృద్ధి సాధించిన ఘనత ఇజ్రాయెల్‌ది. నీటి లభ్యతను పెంచుకోడానికి- వాడిన నీటిని శుద్ధిచేసీ, ఉప్పునీటిని మంచి నీటిగా మార్చీ వాడడం మొదలుపెట్టింది. ఏ దేశమైనా వాడిన నీటిలో 20 శాతాన్ని శుద్ధి చేస్తే గొప్ప, ఇక్కడ మాత్రం 90 శాతం నీటిని రీసైకిల్‌ చేసి వాడుతున్నారు. సగం వ్యవసాయం ఈ నీటితోనే చేస్తారు. దేశవ్యాప్తంగా పలు ఉప్పు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటుచేసింది ఇజ్రాయెల్‌. డీశాలినైజేషన్‌ ప్రక్రియని అత్యున్నత సాంకేతికతతో, రివర్స్‌ ఆస్మోసిస్‌ విధానంతో ఎంతో తేలికైన పనిగా మార్చుకుంది. అక్కడ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలెన్నో ఈ ప్లాంట్లను నిర్వహిస్తున్నాయి. అలా తయారైన మంచినీటి ఎగుమతితోనే ఏటా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ఆ దేశం. మరోపక్క 75 శాతం బిందుసేద్యంతోనూ 25 శాతం తుంపర్ల సేద్యంతోనూ వ్యవసాయం చేస్తూ అత్యధిక దిగుబడి పొందుతోంది. నీటికి సంబంధించిన సాంకేతికతను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయడానికి అక్కడ 250 పరిశోధనా సంస్థలు ఉన్నాయంటే... నీటి సంరక్షణకు ఆ దేశం ఇస్తున్న విలువను అర్థం చేసుకోవచ్చు.


1500 కి.మీ. నీటి బదిలీ: చైనా

రెండేళ్ల క్రితం బీజింగ్‌ నగరమూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తీవ్ర కరవును ఎదుర్కొన్నాయి. కానీ తాగునీటికి మాత్రం ఒక్కరోజు కూడా సమస్య రాలేదు. ఎక్కడో సెంట్రల్‌ చైనా కొండల్లో ఉన్న ఒక రిజర్వాయరు నుంచి కాలువ ద్వారా దాదాపు 1500 కి.మీ ప్రయాణించి వచ్చే నీటితో బీజింగ్‌ దాహం తీర్చుకుంది. దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్నిచోట్ల కాలువగా మరికొన్ని చోట్ల పైప్‌లైన్‌గా ప్రవహిస్తూ ఎల్లో రివర్‌ కింద నుంచి ప్రయాణించి వచ్చే ఈ నీరు బయల్దేరిన చోటినుంచి బీజింగ్‌ చేరేసరికి 15 రోజులు పడుతుంది. ఇలా ఒకటి కాదు- తూర్పు, పశ్చిమ, మధ్య... మూడు మార్గాల్లో మూడు పెద్ద కాలవలు దక్షిణం నుంచి ఉత్తరానికి వేర్వేరు నదుల నుంచి నీటిని చేరవేస్తున్నాయి. సౌత్‌- నార్త్‌ వాటర్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రాజెక్టుగా పేరొందిన ఈ పథకానికి చైనా ఖర్చుచేసినంత డబ్బు ప్రపంచ చరిత్రలో మరే నీటి పథకానికీ ఖర్చు కాలేదట. దాదాపు అరవై లక్షల కోట్ల రూపాయలు అయిందంటారు నిపుణులు. చైనా ఎందుకింత సాహసం చేసిందీ అంటే... ఆ దేశంలోని ఉత్తరాది మైదాన ప్రాంతం పంటలకీ పరిశ్రమలకీ అనువుగా ఉంటుంది కానీ అక్కడ నీరు లేదు. దక్షిణాన నీళ్లున్నాయి కానీ అభివృద్ధికి అనువుగా లేదు. అందుకని నీటినే అక్కడికి తీసుకెళ్లడానికి చైనా ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు డెభ్బై ఏళ్ల నాటి ఈ ఆలోచనను దశలవారీగా ఆచరణలో పెట్టి చాలావరకూ పూర్తిచేసింది. దీని వల్ల అక్కడి నగరాలకు తాగునీటి కొరత తీరింది. వ్యవసాయ దిగుబడి ఎన్నో రెట్లు పెరిగింది. కాలువలు ప్రవహించినంత మేరా చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా పెరగడం ఈ ప్రాజెక్టు వల్ల లభించిన బోనస్‌ ప్రయోజనం.


ఇసుక ఆనకట్టలే దిక్కు:  కెన్యా

ఆఫ్రికా దేశపు పల్లెల్లో ప్రజల నీటి వెతలు ఇన్నీ అన్నీ కావు. చెక్‌డ్యాములు కట్టి వాననీటిని ఒడిసిపట్టడానికి అక్కడ కురిసే వాన అంతంతమాత్రమే. పొరపాటున వాన పడినా ఆ కాసిన్ని నీళ్లనూ ఏ చెరువులోనో నిలవుంచినా నాలుగు రోజుల్లోనే అవి ఆవిరైపోతాయి. సాంకేతికత సాయంతో పెద్ద నిర్మాణాలు చేసుకునే ఆర్థిక స్తోమత దేశానికి లేదు. మరేం చేయాలీ, అక్కడి ప్రజల దాహమెలా తీర్చాలీ అని ఆలోచించింది ఒక స్వచ్ఛంద సంస్థ. పురాతన రోమన్లు అనుసరించిన ఓ పద్ధతి కెన్యా భౌగోళిక పరిస్థితులకు సరిపోతుందనిపించింది. ఎప్పుడో వానాకాలంలో కొన్నాళ్లు ప్రవహించే చిన్న నదులు మాత్రమే అక్కడ అందుబాటులో ఉన్న నీటి వనరు. అవి ప్రవహించేటప్పటి నీటినే ఏడాదంతా ఉపయోగపడేలా దాచుకోవాలి. అందుకని రోమన్లు కట్టినట్టు ఇసుకతో ఆనకట్టలను కట్టించింది. అవి చూసి పల్లెలన్నీ ఉత్సాహంగా ఇసుక ఆనకట్టలను కట్టుకున్నాయి. నదీ ప్రవాహాన్ని ఇసుక కట్టతో అడ్డగించి ఒక పాయను పక్కకు తీసుకుంటారు. ఇసుకమేట అడ్డం ఉండటం వల్ల ఆ నీరు నెమ్మదిగా అక్కడే ఇంకిపోతుంది. ఇసుక పొరల కింద ఉన్న నీరు ఆవిరై పోకుండా చాలాకాలం నిలవుంటుంది. ఇసుక వల్ల సహజంగానే వడపోత జరిగి నీరు శుభ్రంగా ఉంటుంది. సమీపంలో బోరింగు వేసి అందులోనుంచి వచ్చే శుభ్రమైన నీటిని తాగుతున్నారు ప్రజలు. కెన్యాలోని కొన్ని వందల పల్లెలకు ఇప్పుడీ ఇసుక ఆనకట్టలే నీటి వనరులు. ఆఫ్రికా శాండ్‌డ్యామ్‌ ఫౌండేషన్‌ తక్కువ ఖర్చుతో నీటి సమస్యని తీర్చే ఈ ఆనకట్టల్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ పరిచయం చేసింది.


అగ్నిపర్వతాల కింద...:  గ్రీస్‌

సృజనకు ఆకాశమే హద్దంటారు. గ్రీస్‌ లోని ఇంజినీర్లు తమ సృజనకు పదునుపెట్టి పాతాళంవైపు దృష్టి సారించారు. ఒకప్పటి అగ్నిపర్వత ప్రాంతాల కిందున్న వేడి నీటిని ఒడిసిపట్టి అటు కరెంటునీ ఇటు మంచినీటినీ కూడా సాధించారు. ప్రపంచానికి మరో కొత్త ప్రత్యామ్నాయాన్ని పరిచయం చేశారు. మిలోస్‌ అనేది గ్రీస్‌కి చెందిన ఒక చిన్న ద్వీపం. పర్యాటకానికి బాగా పేరొందింది. చుట్టూ సముద్రమే కావడంతో సహజంగానే అక్కడ మంచి నీటి సమస్య ఉంది. దాంతో నీటిని కూడా ప్రధాన భూభాగం మీదినుంచి ఓడల్లో మోసుకెళ్లాల్సివచ్చేది. అయితే అదంతా ఒకప్పుడు అగ్నిపర్వతాలు పేలగా ఏర్పడిన ప్రాంతం. ఆ కారణంగా భూమి పొరల కింద రాళ్ల మధ్య సెగలు కక్కే వేడి నీటి కొలనులు ఉన్నాయి. ఆ వేడి నీటిని పైపుల ద్వారా భూగర్భంలోనే ఉన్న బావుల్లోకి తోడారు. ఆ నీటి నుంచి వెలువడే వేడి ఆవిరితో టర్బైన్లు తిరిగి విద్యుచ్ఛక్తి తయారవుతుంది. ఆ విద్యుచ్ఛక్తితో సముద్రపు నీటినీ, అక్కడి ప్రజలు వాడిన నీటినీఅధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. అప్పుడు వెలువడే నీటి ఆవిరిని చల్లబరిస్తే మళ్లీ స్వచ్ఛమైన నీరు తయారవుతుంది. దాన్ని ఆ ద్వీపవాసులకు తాగునీరుగా, సాగునీరుగా సరఫరా చేస్తున్నారు. అలా జియోథెర్మల్‌ డీశాలినేషన్‌ అనే కొత్త ప్రక్రియని ప్రపంచానికి పరిచయం చేశారు గ్రీస్‌ నిపుణులు. దాదాపు నాలుగు దశాబ్దాల వారి పరిశోధన ఇప్పటికి ఫలించి భూమి పైన చుక్క నీరు లేకుండానే పర్యావరణానికి ఎలాంటి హానీ చేయనివిధంగా కరెంటు తయారుచేసుకోగల వెసులుబాటు ఏర్పడింది.


గాలీ మంచూ... కాదేదీ అనర్హం: పెరు

పెరు రాజధాని లిమా ప్రపంచంలోని అత్యంత పొడి ప్రదేశాల్లో రెండోస్థానంలో ఉంటుంది. ఓ పక్క సముద్ర తీరమూ మరో పక్క ఎడారీ ఇంకా కొండ ప్రాంతాలూ ఎక్కువే. చాలా చోట్ల చిన్న చిన్న లోతైన బావులు తప్ప మరో నీటి వనరు లేదు. ఆ బావుల్లో నీరు కూడా సురక్షితమైనది కాదు. ఏమిటీ పరిష్కారం అని ఆలోచించిన లిమా యూనివర్శిటీలోని ఇంజినీర్లు ఒక కొత్త ఆవిష్కరణ చేశారు. వర్షాలు పడవు కానీ అక్కడి వాతావరణంలో తేమ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తేమని నీరుగా మార్చుకోవాలనుకున్నారు. మనం ప్రకటనల హోర్డింగులు పెట్టినట్లు గాలిలో ఎత్తుగా బిల్‌బోర్డ్స్‌ కట్టారు. వాటి మధ్య గాలిని ఫిల్టర్‌ చేసే పరికరాలూ కండెన్సరూ తదితరాలను అమర్చారు. రివర్స్‌ ఆస్మోసిస్‌ పద్ధతిలో పనిచేస్తాయి ఈ పరికరాలన్నీ. లోపలికి వెళ్లిన గాలిలో నుంచి నీటిని విడదీస్తాయి. తయారైన ఒక్కోబొట్టూ శుభ్రంగా ఫిల్టరై కింద ఉన్న ట్యాంకులోకి చేరుతుంది. ఒకప్పుడు కేవలం ప్రకటనలకోసం పెట్టిన బిల్‌బోర్డులు ఇప్పుడిలా స్వచ్ఛమైన మంచినీటిని సంపాదించిపెడుతున్నాయి. నగరం శివార్లలో నివసిస్తూ డబ్బు పెట్టి నీళ్లు కొనుక్కోలేని పేదలకు ఇప్పుడివే ఆధారం. ఇక కొండ ప్రాంతాల్లో ఉండేవారు లోహపు తెరలతో పొగమంచును నీటిగా మార్చే ‘ఫాగ్‌ క్యాచర్‌’ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. పొగమంచు ఏదైనా లోహాన్ని తాకగానే నీటి చుక్కలుగా ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. సన్నని తీగలతో అల్లిన మెష్‌లను వరసగా కొండవాలుల్లో ఏర్పాటుచేస్తారు. వాటినుంచి నీరు కిందికి కారుతుంది. ఈ నీటిని ఇంటి అవసరాలకూ సాగుకూ వాడుతున్నారు. బ్రెజిల్‌, నేపాల్‌ తదితర దేశాల్లోనూ వాడుతున్న ఈ విధానాన్ని మనదేశంలోనూ పొగమంచు ఎక్కువగా పట్టే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపయోగించుకుంటే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. చూశారుగా... ఏటా క్రమం తప్పకుండా వచ్చే రుతుపవనాలూ ఏడాది పొడుగునా ప్రవహించే జీవనదులూ కాస్త లోతుగా బోరు వేస్తే ఉప్పొంగి వచ్చే నీళ్లూ...వారికి లేవు. ప్రకృతి ఏమాత్రం సహకరించని పరిస్థితులనూ సవాలుగా తీసుకున్నారు... అపర భగీరథుల్లా నీటిని సాధించుకున్నారు. వీరి గెలుపు కథల నుంచి నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత..!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.