close

‘భీష్మ’ టీమంతా బ్యాచిలర్స్‌మే!

టెన్త్‌క్లాస్‌లో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చిన ఆ పిల్లాడు... తల్లిదండ్రులకీ, ఊరికీ మంచిపేరు తెస్తాడనుకున్నారంతా. పదిహేనేళ్ల తర్వాత అందరూ ఊహించినట్లుగానే అతడు తల్లిదండ్రులకీ, ఊరికీ గుర్తింపు తెచ్చాడు. అయితే వాళ్లు అనుకున్నట్టు పెద్ద ఉద్యోగం ద్వారా కాదు... సినిమా దర్శకుడిగా! ఆ పిల్లాడే ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి హిట్‌ సినిమాల్ని అందించిన దర్శకుడు వెంకటేష్‌ కుడుముల. ఇష్టమైన సినిమా రంగంలో స్థిరపడటం కోసం తాను చేసిన ప్రయాణం గురించి వెంకీ మనతో చెబుతున్నాడిలా...

మాసొంతూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట. నాన్న రంగారావు రైతు, అమ్మ పార్వతి గృహిణి. నాకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లి. అశ్వారావుపేటలోని గౌతమి స్కూల్‌లో చదువుకున్నాను.

చిన్నప్పట్నుంచీ క్లాస్‌లో టాపర్‌ని. దాంతో ఇంట్లో నా ఆటలు సాగేవి. అంటే క్రికెట్‌ ఆడుకోనిచ్చేవారు, సినిమాలకు పంపేవారు. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ని. నాటకాలు వేయడం, ఏకపాత్రాభినయం, పాటలు పాడటం... అన్నింట్లోనూ ఉండేవాణ్ని. బాగా చదివేవాణ్ని కాబట్టి టీచర్ల నుంచీ ప్రోత్సాహం ఉండేది. ‘పుణ్యభూమి నా దేశం’, ‘మేమే ఇండియన్స్‌’... పాటల్ని స్కూల్‌ వేడుకల్లో ఎన్నిసార్లు పాడానో లెక్కేలేదు. చిరంజీవిగారి అభిమానిని. నేనూ తెరమీద కనిపించాలనుకునేవాణ్ని. అదీ స్కూల్‌ రోజుల్లోనే. నాన్నతో పదేపదే చెప్పేవాణ్ని. ఓసారి టీవీ సీరియల్‌కి బాలనటులు కావాలని ప్రకటన వస్తే నన్ను తీసుకుని నాన్న హైదరాబాద్‌ వచ్చేలా చేశాను. కానీ ఆ అవకాశం రాలేదు. టెన్త్‌లో మా స్కూల్‌ ఇంగ్లిష్‌ మీడియం విభాగానికి ఫస్ట్‌ వచ్చాను. దాంతో నాపేరు పేపర్లో వచ్చింది. ‘వెంకటేష్‌ బాగా చదువుతాడు’... అన్న ముద్ర పడిపోయింది. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ తీసుకున్నాను.

విజయవాడలో ఓ కార్పొరేట్‌ కాలేజీలో హాస్టల్‌లో ఉండి చదివాను. చదువుమీద శ్రద్ధ ఉండేది. అదే సమయంలో సినిమామీద ఇష్టమూ పెరిగింది. లెక్చరర్లూ, వార్డెన్లూ, సెక్యూరిటీ వాళ్లని మంచి చేసుకుని  సినిమాలు చూసొచ్చేవాణ్ని. అందరి లెక్క ప్రకారం నేను ఇంటర్‌ బాగా చదివి ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని డాక్టర్‌ అవ్వాలి. కానీ నా లెక్క వేరే ఉండేది. ఇంటర్మీడియెట్‌ తర్వాత ఎలాగైనా హైదరాబాద్‌లోనే చదవాలి. అప్పుడే సినిమాల్లోకి వెళ్లొచ్చు... అనుకునేవాణ్ని.

కాలేజీ అక్కడ రూమ్‌ ఇక్కడ...
ఇంటర్‌ తర్వాత హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌.జి.రంగా(ప్రొఫెసర్‌ జయశంకర్‌) అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ‘కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌’లో చేరాను. అది నాలుగేళ్ల డిగ్రీ. హాస్టల్‌ కూడా ఉంది. కానీ నేను ఫిల్మ్‌నగర్‌ దగ్గర్లోని వెంకటగిరిలో రూమ్‌ తీసుకున్నాను. రెంటికీ మధ్య 30 కి.మీ. దూరం ఉంటుంది. ఇంట్లోవాళ్లు ‘ఎందుకు రూమ్‌’ అంటే... ‘హాస్టల్‌లో ర్యాగింగ్‌ ఉంటుంది’ అని అబద్ధం చెప్పాను. నా రూమ్మేట్స్‌ కూడా సినిమా ప్రయత్నాల్లో ఉండేవారు. వాటి గురించే చర్చించేవారు. ‘హమ్మయ్య... సినిమా జోన్‌లోకి వచ్చేశాను. ఎలాగైనా నటించే అవకాశం సంపాదించాలి’ అనుకునేవాణ్ని. అలా డిగ్రీ ఫస్టియర్‌ నుంచీ నా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. మా ఫ్రెండ్‌ ఇమ్రాన్‌, నేను ప్రతి ఆదివారం బండిమీద సినీ హీరోల ఇళ్లన్నీ చూసొచ్చే ప్రోగ్రామ్‌ పెట్టుకునేవాళ్లం. అప్పట్లో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఆర్కుట్‌’ ఉండేది. దాన్లో సినిమా డైరెక్టర్లకి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పెట్టేవాణ్ని. సినిమాలు చూసీచూసీ నాకూ డైలాగులు రాయడం వచ్చేసింది. కొన్ని పంచ్‌ డైలాగులు రాసి పెడుతుండేవాణ్ని. అవి చూసి కొందరు నా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్‌ చేసేవాళ్లు. అలాగే సినిమావాళ్ల నంబర్లు ఉండే డైరీని సంపాదించాను. డైరెక్టర్ల ఫోన్‌ నంబర్లకి మెసేజ్‌లు పెట్టేవాణ్ని. కొందరు స్పందించేవాళ్లు. బాగా బిజీగా ఉండే డైరెక్టర్లని కాకుండా ఒక స్థాయి గుర్తింపు ఉన్నవాళ్లని ఎక్కువగా సంప్రదించేవాణ్ని. వాళ్ల పుట్టినరోజులకి కేకులూ, బొకేలూ పట్టుకుని వెళ్లేవాణ్ని.

‘అ ఆ’ టర్నింగ్‌ పాయింట్‌
యూనివర్సిటీలో జరిగిన ఓ వేడుకలో ఏకపాత్రాభినయం చేశాను. అది చూసిన మా ప్రొఫెసర్‌ రాధాకృష్ణమూర్తిగారు కమెడియన్‌ రఘు కారుమంచికి పరిచయం చేశారు. తర్వాత కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి పరిచయమయ్యారు. వాళ్ల షూటింగ్‌లకు వెళ్లేవాణ్ని. ఆర్కుట్‌ ద్వారా పరిచయమైన రచయిత్రి బలభద్రపాత్రుని రమణిగారు డైరెక్టర్‌ తేజగారికి పరిచయం చేశారు. అప్పటికి ఆయన ‘నీకు నాకు డ్యాష్‌ డ్యాష్‌’ సినిమాకి ఆడిషన్స్‌ చేస్తున్నారు. నన్ను ఒక పాత్రకి ఎంపికచేశారు. ఆయనకి నా యాక్టింగ్‌ బాగా నచ్చి... నన్ను డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ ఉండమన్నారు. అదే సంవత్సరం నా డిగ్రీ పూర్తయింది. డిస్టింక్షన్‌ మార్కులతో పాసయ్యాను. ఇంట్లో సినిమా విషయం చెప్పాను. నాన్న కాస్త కంగారు పడ్డారు. అమ్మా, అక్కలూ మాత్రం నాకు మద్దతు తెలపడంతో నాన్న కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. బంధువులూ, ఊళ్లోవాళ్లూ ‘నువ్వు బాగా చదువుతావు కదా సినిమాల్లోకి ఎందుకు’ అన్నారు. ‘చదువురానివాళ్లే సినిమాల్లోకి వెళ్తారా ఏంటి’ అని నాకు నేను బదులిచ్చుకున్నాను. తేజగారు చాలా స్ట్రిక్ట్‌. ఆయన్నుంచి బాగా నేర్చుకునే అవకాశం వచ్చింది. ఆ ప్రాసెస్‌లో నా ఇష్టం నటనమీద నుంచి దర్శకత్వంవైపు మళ్లింది. తర్వాత డైరెక్టర్‌ యోగి గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ‘ఒక రాజు ఒక రాణి’, ‘చింతకాయల రవి’ సినిమాలు తీశారాయన.  రామ్‌చరణ్‌ ‘తుఫాన్‌’ తెలుగు వెర్షన్‌ని పర్యవేక్షించారు. ఆ ప్రాజెక్టుతోపాటు ‘జాదూగాడు’ సినిమాకి ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాను. ‘నీకు నాకు...’, ‘జాదూగాడు’... రెండూ హిట్‌ కాలేదు. హిట్‌ సినిమాకి పనిచేయలేదన్న అసంతృప్తి నాలో మొదలైంది. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిగారి అబ్బాయిలు నాకు మంచి ఫ్రెండ్స్‌. వాళ్ల బాబాయి మహేందర్‌రెడ్డిగారి సాయంతో ‘హాసిని అండ్‌ హారిక క్రియేషన్స్‌’ చినబాబు(రాధాకృష్ణ) గారిని కలిసి త్రివిక్రమ్‌ గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం ఇవ్వమని అడిగాను. ‘నేను నిన్ను ఆయనకి పరిచయం మాత్రం చేయగలను. తుది నిర్ణయం మాత్రం ఆయనదే’ అని చెబితే, సరేనన్నాను. త్రివిక్రమ్‌గారు 20 నిమిషాలు మాట్లాడాక ‘అ ఆ’ సినిమాకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం ఇచ్చారు. నా జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌ అంటే అదే. ఒక భారీ సినిమాకి ఎలా ప్లాన్‌ చేయాలి, ఏ విధంగా పనిచేయాలి అనేది అనుభవమైంది. అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఉన్నాలేకున్నా త్రివిక్రమ్‌గారే అన్ని పనులూ చూసుకుంటారు. అంత కమిట్‌మెంట్‌ ఉంటుంది ఆయనలో. అలాంటిచోట చిన్నపనికి అవకాశం వచ్చినా బాగా నేర్చుకోవచ్చు. ఆ సినిమా నాకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ని ఇచ్చింది. సినిమా రిలీజ్‌ అయినపుడు ఫస్ట్‌రోజు ఫస్ట్‌షోకి వెళ్లాను. ప్రేక్షకులు ఎలాంటి సీన్లకి ఎలా స్పందిస్తున్నారో గమనించాను. అందువల్ల ఏ సీన్లు పండుతాయి, ఏవి పండవన్న విషయం అర్థమైంది. నా సినిమాలకీ ఇలానే చేస్తాను.

దర్శకుడిగా అవకాశం
‘జాదూగాడు’ సమయంలోనే నాగశౌర్య ఫ్రెండ్‌ అయ్యాడు. ‘అ ఆ’ తర్వాత సినిమా చేద్దాం కథ ఉంటే చెప్పమన్నాడు. అప్పటికి త్రివిక్రమ్‌ సర్‌ పవన్‌ కల్యాణ్‌గారితో ‘అజ్ఞాతవాసి’ చేయబోతున్నారు. దానికీ పనిచేసే అవకాశం ఇచ్చారు. పవన్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో పనిచేసే ఛాన్స్‌ వదులుకోవడం ఇష్టంలేదు. కానీ డైరెక్టర్‌ కావాలన్న నా లక్ష్యం నెరవేరబోతోందిగా అనిపించి చివరకు డైరెక్షన్‌ వైపే అడుగులు వేశాను. ‘ఛలో’ కథ రాసి శౌర్యకి వినిపిస్తే నచ్చి సొంత బ్యానర్‌ పెట్టి సినిమా నిర్మించాడు. ‘జాదూగాడు’కి పనిచేసిన సంగీత దర్శకుడు స్వర సాగర్‌ మహతి, ఆ సినిమా కెమెరామేన్‌ సాయి శ్రీరామ్‌లని ఈ సినిమాకీ తీసుకున్నాను. ‘ఫ్లాప్‌ టీమ్‌నే మళ్లీ పెట్టుకున్నాడు’ అన్నారు కొందరు. జాదూగాడు ఫ్లాప్‌ కావొచ్చు కానీ సినిమాకి పనిచేసిన వాళ్లంతా ప్రతిభావంతులూ, నా వయసువాళ్లు. మా ఆలోచనలు బాగా కలుస్తాయని వాళ్లని పెట్టాను. హీరోయిన్‌గా కొత్త అమ్మాయి ఉండాలనుకున్నాం. ‘కిరిక్‌ పార్టీ’ చూశాను. రష్మిక అయితే బావుంటుందని ఆమెని సంప్రదించి ఓకే చేశాం. శౌర్యాని అప్పటివరకూ లవర్‌బాయ్‌గానే చూపించారు. నేను దానికి ఒక కమర్షియల్‌ ఎలిమెంట్‌ని జోడించాను. సాగర్‌ అందించిన పాటలు, ముఖ్యంగా ‘చూసీ చూడంగానే నచ్చేశావే’ సినిమాకి బాగా ప్లస్‌ అయింది. 2018లో వచ్చిన ఆ సినిమా భారీ హిట్‌. ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి వచ్చారు. ఆయన్ని కలవడం అదే ఫస్ట్‌టైమ్‌. తర్వాత మరో వేడుకలో ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా ఆయన్నుంచి అవార్డునీ అందుకున్నాను. నా జీవితానికి అది చాలు అనుకున్నాను. అదే సినిమాకి అమ్మానాన్నల చేతులమీదుగా మరో వేదిక మీద అవార్డుని అందుకున్న క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను.

అందరం బ్యాచిలర్స్‌మే
‘ఛలో’ టీజర్‌, ట్రైలర్‌, పాటల్ని యూట్యూబ్‌లో విడుదలచేసినపుడు ఆ లింక్‌లను హీరో నితిన్‌గారికి కూడా పంపేవాణ్ని. ఆయన చూసి నచ్చితే మెచ్చుకునేవారు. ‘ఛలో’ తర్వాత ఒకసారి వెళ్లి కలిశాను.
‘కథ ఉంటే చెప్పు సినిమా చేద్దాం’ అన్నారు. నితిన్‌ని కెరీర్‌ ప్రారంభం నుంచీ గమనిస్తున్నాను. అతడి ‘జయం’కంటే ‘దిల్‌’ సినిమా బాగా నచ్చుతుంది. అంత మంచి హీరోకి వరసగా 12 ఫ్లాప్‌లు వచ్చినపుడు ఏమైంది ఇతడికి అనుకున్నాను. నాకు అవకాశం వచ్చినపుడు అతడి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు కథని రాశాను. కమర్షియల్‌ యాంగిల్‌తోపాటు నా శైలి వినోదాన్ని జోడించాను. అగ్రికల్చర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినవాణ్ని కావడంతో ఆర్గానిక్‌ ఫామింగ్‌ గురించి చెప్పాలనుకున్నాను. ఈ సినిమా ప్రారంభమైన టైమ్‌కి నితిన్‌తోపాటు సాగర్‌, పాటల రచయిత శ్రీమణి, నేను... అందరం బ్యాచిలర్స్‌మే. అందుకే ఆ కోణంలో కథ ఉంటే బావుంటుంది అనుకున్నాను. ‘భీష్మ’ టైటిల్‌ పెట్టాను. ‘సింగిల్‌ ఫరెవర్‌’ ట్యాగ్‌లైన్‌ కూడా. సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ‘సింగిల్‌ ఆంథెమ్‌’... విడుదలైనప్పట్నుంచీ ఇప్పటికీ తెలుగులో ఎక్కువగా వింటున్న పాట అదే. నిర్మాతలు చినబాబు, వంశీ సీనియర్‌ టెక్నీషియన్లని పెడదామన్నా పట్టుబట్టి మరీ నా మొదటి సినిమాకి పనిచేసినవాళ్లనే ఇందులోనూ కొనసాగించాను. ఎవరూ నా నమ్మకాన్ని వమ్ముచేయలేదు.

తీర్థయాత్రలు చేయాలి!
ఛలో, భీష్మ సినిమాలు హిట్‌ అయ్యాక నాకు వెయ్యికి పైగా మెసేజ్‌లు వచ్చాయి. వాటిని పంపిన వాళ్లలో చాలామంది నాకు తెలీదు. కానీ ఎక్కువగా మావూరి వాళ్ల నుంచి వచ్చినవే. ‘డైరెక్టర్‌ మావూరి వాడు’ అంటూ అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ నాకు ‘బోనస్‌’... ‘అసలు’ ఏంటంటే, నేను సినిమాల్లోకి రావడం. సినిమాల్లో అవకాశాలు రావడం కష్టమే. మిగతా వృత్తుల్లో ఉండేవారిలానే ఇక్కడా కష్టపడాలి. నిజంగా సినిమా మీద ప్రేమ ఉన్నవాళ్లు దీన్ని కష్టం అనుకోరు... ప్రయాణం, నేర్చుకోవడం అనుకుంటారు. నేనలానే ఫీలయ్యాను. చదువుకుంటూనే సినిమాల్లోనూ ప్రయత్నించాను. సినిమా ఒక గొప్ప మాధ్యమం. దీనిద్వారా వినోదాన్ని పంచుతూనే, చిన్న మెసేజ్ ‌ఇవ్వాలనుకుంటాను. ముఖ్యంగా యువతకు నచ్చే సినిమాలు తీయాలనుకుంటాను. ప్రస్తుతం చాలామందికి కథల్ని వినిపిస్తున్నాను. ఏదో ఒకటి త్వరలోనే ఫైనల్‌ అవుతుంది. అంతకంటే ముందు తీర్థయాత్రలు చేయాలి. అమ్మ నా సినిమాలకోసం చాలామంది దేవుళ్లకి మొక్కింది. ఆ మొక్కులు తీర్చుకోవాలి. నాక్కూడా దేవాలయాలకు వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ‘భీష్మ’ అనుభవాలు ఇంకా నా మైండ్‌ నుంచి పోవడంలేదు. కలలోనూ అవే వస్తున్నాయి. త్వరగా వీటినుంచి బయటపడాలి! తీర్థయాత్రలు అందుకు మంచి మార్గం అనుకుంటున్నా! త్వరలో హైదరాబాద్‌లో ఒక సొంతింటివాడిగా మారి, తర్వాత ఇంటివాడిగా మారడం గురించి ఆలోచిస్తా!

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.