close

దట్టమైన అడవుల్లో... జలపాతాల జడిలో..!

‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌... ఈ నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాంతాలుగా పేరొందిన దట్టమైన అడవుల్లో పర్యటించాలనీ ఎత్తైన కొండలమీద నుంచి ఉరికే ఆ జలపాతాల జడిలో తడిసి ముద్దవ్వాలనే చిరకాల స్వప్నం నెరవేరింది’ అంటూ ఆ పర్యటన విశేషాలను వివరిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన బందు శ్రీకాంత్‌బాబు.

డవుల్లో పర్యటించాలన్నా జలపాతాల వెంట పరుగులు తీయాలన్నా సొంతకారులో ప్రయాణించడమే మేలు. అందుకే సెలవుల్లో పిల్లలతో కలిసి కారులో బయలుదేరాం. ముందుగా హైదరాబాద్‌ నుంచి భద్రాచలానికి చేరుకుని హోటల్లో బస చేసి ఆ రాత్రికి అక్కడే ఉండి, మర్నాడు ఉదయాన్నే బయలుదేరాం. భద్రాచలం దాటగానే ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, మోతుగూడెం, డొంకరాయి మీదుగా సీలేరుకి ప్రయాణమయ్యాం. ఆ దారిలోనే పొల్లూరు జలపాతం వస్తుంది. దాని దగ్గర ఆగాలనుకున్నాం. కానీ అక్కడ హోటళ్లూ అవీ ఏవీ ఉండవు. అందుకే ముందుగా మోతుగూడెంలోని హోటల్లో భోజనం పార్సిల్స్‌ తీసుకున్నాం.

పొల్లూరులో..!
మోతుగూడేనికి సరిగ్గా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది పొల్లూరు జలపాతం. అందుకే దీన్ని కొందరు మోతుగూడెం జలపాతం అనీ అంటుంటారు. దాన్ని చూస్తూనే మైమరిచిపోయాం. నల్లని రాళ్ల మధ్యలోంచి జాలువారుతోన్న పాల తెలుపు రంగునీళ్లూ వాటి చుట్టూ పరచుకున్న పచ్చని చెట్లూ... ఏ చిత్రకారుడో గీసినట్లున్న ఆ ప్రకృతి చిత్రాన్ని చూస్తూ మేం చిత్తరువులమైపోయాం. అక్కడ పెద్దగా లోతు లేకపోవడంతో రాళ్లమీదుగా నడిచి వెళ్లి ఆ జలపాత జడిలో మేం కూడా తడుస్తూ కాసేపు ఆనందించాం. వర్షాకాలంలో మాత్రం అలా వెళ్లడం అస్సలు మంచిది కాదు. తరవాత భోజనాలు చేసి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూడటంలో నిమగ్నమయ్యాం. ఈ పొల్లూరు జలపాతాన్నే పాతకాలం వాళ్లు తడికెవాగు జలపాతం అనేవారట.

సీలేరు అందాలు!
దారిలో మనతోబాటే ప్రవహించే శబరి నది అందాలను చూసుకుంటూ సాయంత్రానికి సీలేరు చేరుకున్నాం. శీతకాలం కావడంతో రాత్రికి చలి బాగా పెరిగింది. మర్నాడు ఉదయమే శబరి నదికి ఉపనదిగా ఉన్న సీలేరు నదిమీద కట్టిన గుంటవాడ రిజర్వాయర్‌ దగ్గరకు వెళ్లి దానిమీద కాసేపు నడుచుకుంటూ వెళ్లాం. అక్కడ వేడి టీ తాగి, ఇడ్లీ తిన్నాం. సీలేరులో ఉండే మిత్రబృందం కూడా మాతోబాటు బయలుదేరింది. ఆ తరవాత మారమ్మ తల్లి దర్శనం చేసుకుని,  సీలేరు రిజర్వాయర్‌ దాటాం. అది దాటితే ఒడిశాలోకి ప్రవేశించినట్లే. ఆ రోజు బలిమెల డ్యామ్‌ చేరుకుని ఓ బోటు మాట్లాడుకున్నాం. ఒకప్పుడు ఆ పేరు వింటేనే చాలామంది భయపడేవారు. దట్టమైన ఆ  కీకారణ్యంలో ఎటు చూసినా నీరే. వాటిమధ్యలో చిన్న కొండలతో కూడిన ద్వీపాలు... వాటిల్లో ఒకదానికి చేరుకుని అక్కడే వంట చేసుకుని తిన్నాం. ఆ ద్వీపాల్లో స్థానిక గిరిజనులు విరివిగా గంజాయి పెంచడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్లతో కాసేపు మాట్లాడాం. జీవనోపాధి కోసం వాళ్లు దీన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. అయితే ఆ ప్రాంతంలోనే ఖరీదైన ఫోన్లూ స్పోర్ట్స్‌ బైకులూ వాడుతున్న యువత మాకు కనిపించారు. అదంతా గంజాయి సాగు ప్రభావమేనని తెలుసుకుని ఆశ్చర్యపోయాం. సాయంత్రమవుతుండగా డ్యామ్‌ ఒడ్డుకు చేరుకుని అక్కడకు దగ్గర్లోని జాన్‌బాయ్‌ దగ్గర కట్టిన వంతెన దగ్గరకు చేరుకున్నాం. మావోయిస్టుల ప్రభావం వల్ల ముప్ఫై ఏళ్లుగా ఆగిపోయిన ఈ వారధి నిర్మాణం ఇటీవలే పూర్తయింది. స్థానిక అటవీవాసులకు దీనివల్ల ప్రయాణం కాస్త సులభమైంది. వారధికి ఇరువైపులా సాయుధ బలగాలు నిత్యం కాపలా కాస్తుంటారు. ఆ సాయంత్రం వంతెనమీద నుంచే ప్రకృతి అందాలను కాసేపు ఆస్వాదించి మళ్లీ సీలేరుకు చేరుకుని బసచేశాం. మర్నాడు సీలేరు నుంచి మచ్‌కుండ్‌కు బయలుదేరాం. సుమారు 180 కిలోమీటర్ల దూరం. దారిలో చిత్రకొండ, బలిమెల, దోరగూడ, బోయిపరగూడ అనే ఊళ్లు వస్తుంటాయి. అవన్నీ దాటి నాలుగు గంటలకు మచ్‌కుండ్‌ చేరుకున్నాం. మచ్‌కుండ్‌ అనేది నిజానికి ఓ తీర్థ స్థలం. దీన్ని మత్స్య కుండ అని పిలిచేవారు. అక్కడ ముందుగా బుక్‌ చేసుకున్న గదులకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుని డుడుమా జలపాతానికి బయలుదేరాం.

డుడుమా జలపాతం!
ఒడిశాలోని కోరాపుట్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి సరిహద్దులో ఉన్న ఈ జలపాతం 574 ఎత్తు నుంచి జాలువారుతుంటుంది. ఈ జలధారే మచ్‌కుండ్‌ నదిగా మారి గోదావరిలో కలుస్తుంది. దీన్నే హార్స్‌టెయిల్‌ జలపాతం అనీ అంటారు. ఈ జలపాతానికి రెండు ఉప జలపాతాలూ ఉంటాయి. ఒకటి ఒడిశా వైపు ఉంటే మరొకటి ఆంధ్ర వైపు ఉంటుంది. ఎత్తైన రెండు కొండల మధ్యలోకి జాలువారే నీరు నదిగా మారి ప్రవహించే ఆ దృశ్యం అద్భుతంగా అనిపించింది. దీన్ని చూడ్డానికి ఏటా అనేకమంది పర్యటకులు వస్తుంటారట. ఇక్కడ నుంచి సూర్యాస్తమయం ఎంతో అందంగా ఉంటుంది. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు కూడా ఈ కొండమీద నుంచి ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. కానమావోయిస్టుల కారణంగా ఇక్కడ స్టే చేసేందుకు ఎవరూ ధైర్యం చేయరు. ఈ జలపాత సౌందర్యాన్ని ఆసాంతం ఆస్వాదించాలంటే కనీసం 700 మెట్లు దిగి వెళ్లాలి. అది చాలా శ్రమతో కూడుకున్నది. అందుకే  పైనుంచే ఆ జలపాత అందాల్ని చూసి ఆనందించి ఒనకడిల్లి గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడున్న కొండల్లోనే స్థానిక బోండా, గడబ, పరాజ తెగలకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారు. ఒనకుడిల్లిలోని వించ్‌హౌజ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. బ్రిటిష్‌వాళ్లు ఇక్కడ లోయలో పవర్‌ ప్రాజెక్టు నిర్మించాలని ప్లాన్‌ చేశారు. కానీ నిర్మాణం మాత్రం 1950లో ప్రారంభమైంది. లోయలోకి సామగ్రినీ, సిబ్బందినీ తరలించేందుకు సుమారు కిలోమీటరు పొడవున్న రెండు బోగీలతో కూడిన చిన్న ట్రైన్‌ను అప్పట్లో తయారుచేశారు. ఇది ఇప్పటికీ పనిచేయడం చూస్తే ఇంజినీరింగ్‌ వండర్‌ అనిపించింది. ప్రత్యేక అనుమతితోనే పవర్‌ ప్రాజెక్టు వరకూ ఈ రైల్లో ప్రయాణించడం సాధ్యమవుతుంది.

బోండాల సంత!
తరవాతి రోజు ఒనకడిల్లి గ్రామంలోని సంతకి వెళ్లాం. అక్కడ ప్రతి గురువారం సంత జరుగుతుంటుంది. బోండా జాతి గిరిజనులు రావడమే ఆ సంతకి ప్రత్యేకత. పురాతన కాలానికి చెందిన ఈ తెగ ప్రజలు నేటికీ సంప్రదాయ ఆదివాసీ జీవితాన్నే అనుసరిస్తున్నారు. వాళ్లను చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. అది కాస్తా ఈ రకంగా తీరుతుందని ఆ సంతకు బయలుదేరాం. వాళ్ల గురించి వార్తల్లో చదవడమేగానీ నేరుగా ఎప్పుడూ చూడలేదు. మిగిలిన గిరిజనులతో పోలిస్తే నేటికీ వీళ్ల జీవనశైలి విభిన్నంగానే ఉంటుంది. వీళ్లలో స్త్రీలు పూసలతో చేసిన హారాలు వేసుకుని, పై భాగంలో నీలి రంగు వస్త్రాన్ని చుట్టుకున్నట్లుగా ధరించారు. మెడలో భారీ లోహ కడియాలతో వింతగా ఉన్నారు. జుట్టు పెంచుకోకుండా గుండు చేసుకుని దానిమీద చుట్ట చుట్టినట్లుగా పాగా ధరించారు. వీళ్లు రామాయణ కాలానికి చెందినవాళ్లనీ ఓసారి సీతాదేవి స్నానం చేస్తుంటే ఈ తెగ స్త్రీలు చూసి నవ్వడంతో ఆమె వీళ్లని నగ్నంగా ఉండమని శపించిందనీ ఆపై వీళ్లు క్షమించమని అడగగా పై భాగంలో కప్పుకునేందుకు తన చీరనే చింపి ఇచ్చిందనీ అందుకే అప్పటి నుంచి వీళ్లు సగం శరీరం మాత్రమే కప్పుకుంటున్నారనీ చెబుతారు.

చిత్రకూట్‌ ఒడిలో...
మధ్యాహ్నం జయపుర్‌, కోటపాడ్‌ల మీదుగా ప్రయాణించి సాయంత్రానికి జగదల్‌పూర్‌కి చేరుకున్నాం. ముందస్తు ప్లాన్‌ ప్రకారం ఆ రాత్రికి అక్కడే బస చేయాలి. కానీ మేం బుక్‌ చేసుకున్న రూమ్‌ రద్దు కావడంతో రాత్రికి జగదల్‌పూర్‌లోనే  బస చేశాం. ఆ మర్నాడు ఉదయాన్నే బయలుదేరి చిత్రకూట్‌కి చేరుకున్నాం. గుర్రపు నాడా ఆకారంలో ఉన్న దీన్నే భారతీయ నయాగరా అని పిలుస్తుంటారు. దీని అందాలు మా కళ్లను తిప్పుకోనీయలేదు. ఇంద్రావతి నది పాయలుగా చీలి సెలయేర్లుగా ప్రవహించి బస్తర్‌ జిల్లా చిత్రకూట్‌ వద్ద సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి దూకుతుంటుంది. జలపాతానికి దిగువన స్థానికులు మరబోట్లలో నీటిధార దగ్గరకు తీసుకెళతారు. బోటులో వెళ్లి అంత ఎత్తు నుంచి జాలువారే జలపాతాన్ని చూడటం, ఆ తుంపర్లలో తడవడం మాకు మర్చిపోలేని అనుభూతిని అందించింది. పిల్లలు అడగడంతో రెండుసార్లు మేం బోటులో ఆ తుంపర్ల దగ్గరకు వెళ్లాం. అక్కడి నుంచి గంటన్నర సేపు ప్రయాణించి, నేరుగా కాంగో జాతీయ పార్కులోని తీర్థగఢ్‌ జలపాతానికి వెళ్లాం. అక్కడే లంచ్‌ చేసి కాసేపు ఆ జలపాత సౌందర్యాన్ని చూస్తూ గడిపాక తిరుగు ప్రయాణమయ్యాం. తీర్థగఢ్‌ నుంచి భద్రాచలం 250 కిలోమీటర్లు. అంటే కారులో ఐదారుగంటలు పడుతుంది. కానీ అది దట్టమైన కీకారణ్యం... మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సుకుమా, ఎర్రబోర్‌, కుంటల మీదుగా సాగే ఈ ప్రయాణం మాలో ఉత్కంఠను కలిగించింది. దారిలో ఎక్కడికక్కడ సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ బలగాల పహారాలూ చెక్‌పోస్టులూ కనిపించాయి. ఈ 250 కిలోమీటర్లలోనే ఛŸత్తీస్‌గఢ్‌ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా తెలంగాణలోని భద్రాచలం చేరుకోవడం విశేషం. ఇవి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో  కేంద్రం ఈ ప్రాంతాల్లోని రోడ్లను బాగా అభివృద్ధి చేసింది. అందుకే మా ప్రయాణం చాలా సాఫీగా జరిగింది. ఆ మర్నాడు భద్రాద్రిలోని సీతారాముల్ని దర్శనం చేసుకుని హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.