close

యాదగిరీశుడికి బ్రహ్మోత్సవాలు

సగం మనిషి, సగం మృగం ఆకారం దాల్చి... దశావతారాల్లో నాలుగో అవతారంగా ప్రహ్లాదుడికి దర్శనమిచ్చిన నరసింహస్వామి వెలిసిన పుణ్యక్షేత్రమే యాదాద్రి. ప్రతిఏటా ఆ యాదగిరీశుడికి అంగరంగవైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి పదకొండురోజుల పాటు జరగనున్న ఆ వేడుకల సందర్భంగా యాదాద్రి క్షేత్రం గురించీ, బ్రహ్మోత్సవాల ప్రత్యేకత గురించీ తెలుసుకుందాం...

నిత్యం లక్ష్మీనరసింహస్వామి స్మరణతో... ఏ చోట చూసినా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతూ... తెలంగాణ తిరుపతిగా పేరొందిన క్షేత్రమే యాదాద్రి. కోరిన వరాలిచ్చే కొంగుబంగారంగా పూజలందుకునే స్వామిని దర్శించుకుని, మొక్కులు చెల్లించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఏడాది పొడవునా తరలి వస్తుంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని తెలంగాణ తిరుపతిగా పిలుస్తారు. ఈ సువిశాల క్షేత్రంలో స్వామి లక్ష్మీ అమ్మవారితో కొలువై దర్శనమిస్తాడు. ఇక్కడి పుష్కరిణిలో నరసింహుడిని స్మరిస్తూ స్నానమాచరించి, ఆంజనేయస్వామిని దర్శించుకున్నాకే అతి పురాతన రూపమైన లక్ష్మీనరసింహస్వామిని చూసేందుకు భక్తులు గర్భగుడికి చేరుకుంటారు. యాదాద్రిలోని పుష్కరిణిలో స్నానం చేస్తే సమస్యలు పోతాయని భక్తుల నమ్మకం. నిత్యపూజలతో, స్వామి స్మరణతో కోలాహలంగా కనిపించే ఈ క్షేత్రానికి జరిపే బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

యాదరుషి కోరికతో...
యాదగిరి గుట్టమీద వెలసిన స్వామికి సంబంధించిన పురాణాల్లో ఎన్నో ఐతిహ్యాలున్నాయి. రామాయణ మహాభారతాల్లోనూ ఆ ప్రస్తావనలు కనిపిస్తాయి. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్యశృంగుడు. అతడి కుమారుడే యాదరుషి. చిన్నతనం నుంచీ విష్ణుభక్తుడైన యాదరుషి నృసింహావతారంపైన ఇష్టం పెంచుకుంటాడు. ఆ మక్కువతో ప్రహ్లాదుడిలా స్వామి అనుగ్రహం పొందేందుకు... అడవిబాట పడతాడు. దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతివారికి చిక్కడంతో, వాళ్లు యాదుడిని క్షుద్రదేవతలకు బలిచ్చేందుకు సిద్ధమవుతారు. అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై యాదరుషికి సరైన మార్గాన్ని సూచిస్తాడు. అతడి దీర్ఘకాల తపస్సు ఫలించి నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడు. అయితే ఆ ఉగ్రరూపాన్ని చూడలేకపోవడంతో అతడి కోరిక మేరకు స్వామి లక్ష్మీసమేతంగా దర్శనమిస్తాడు. తనివితీరా స్వామి రూపాన్ని దర్శించుకున్న యాదరుషి చివరకు వివిధ రూపాల్లో తనని అనుగ్రహించమని కోరడంతో జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రనరసింహ, శ్రీలక్ష్మీ నరసింహస్వామిగా సాక్షాత్కరించి స్వయంభువుగా వెలిశాడు. జ్వాలా నరసింహుడూ యోగానంద నరసింహుడూ లక్ష్మీనరసింహుడూ కొండగుహలో కొలువుదీరగా, గండభేరుండ స్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడితో కలిసి ఆలయానికి తూర్పున పూజలు అందుకుంటున్నాడు. ఉగ్ర నరసింహుడిని అభౌతిక రూపమంటారు. స్వామి తేజోవలయంగా కొండ చుట్టూ ఆవరించి ఉన్నాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయాన్ని పంచనారసింహ క్షేత్రంగా పిలుస్తారు. యాదరుషి పేరుమీదనే ఈ కొండ యాదగిరి గుట్టగా, యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పుష్కరిణి చాలా విశేషమైందని అంటారు. బ్రాహ్మీముహూర్తంలో మహర్షులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి వేదమంత్రాలు జపిస్తూ లక్ష్మీనరసింహుడి దర్శనానికి బయలుదేరుతారని పురాణాలు చెబుతున్నాయి.

బ్రహ్మోత్సవాలు.. పదకొండు రోజులు...
వేల ఏళ్ల చరిత్ర ఉన్న యాదరిగిగుట్ట నరసింహస్వామికి స్వాతంత్య్రానికి ముందే మూడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. వాటిని భక్తోత్సవాలని అనేవారు. తరువాత అవి అయిదురోజుల పాటు జరిగేవి. ఇప్పుడు ప్రతిఏటా పదకొండు రోజులపాటు అంగరంగవైభవంగా ఈ వేడుకలు జరగడం విశేషం. 1975 నుంచి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం కూడా పాలుపంచుకుని, స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో జరిగే ఈ ఉత్సవాల్లో ఏ రోజు ప్రత్యేకత ఆ రోజుదే. విష్వక్సేనుడి పూజతో మొదలయ్యే ఈ ఉత్సవాలు అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగుస్తాయి. ఎలాంటి ఆటంకాలూ రాకుండా ఉత్సవాలను నిర్వహించే బాధ్యతలను అప్పగిస్తూ సేనాధిపతి అయిన విష్వక్సేనుడిని మొదటిరోజున పూజిస్తారు. రెండోరోజు ధ్వజారోహణం, ఆ రాత్రి భేరీ పూజను చేస్తారు. మూడోరోజు వేదపారాయణ, నాలుగోరోజు హంసవాహన సేవ, అయిదో రోజున కల్పవృక్షసేవ, ఆరోరోజున గోవర్ధన గిరి అవతారం, ఏడోనాడు స్వామి కల్యాణానికి ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఎనిమిదో రోజు కన్నులపండువగా స్వామి కల్యాణం జరుగుతుంది. తొమ్మిదోనాడు రథోత్సవం, పదోరోజు చక్రస్నానం, చివరి రోజున అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆలయం పునర్నిర్మాణం జరుగుతోన్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఇక్కడి బాలాలయంలో నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవచ్చంటే...
హైదరాబాద్‌కు అరవై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకునేందుకు రైళ్లూ, బస్సులూ అందుబాటులో ఉన్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.