close

ఏం గ్రామాలండీ..!

కొన్ని గ్రామాలు చూడ్డానికి చాలా బాగుంటాయి. కొన్ని ఊళ్లు ఉండటానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అదే ఈ మూడు గ్రామాల గురించైతే వినడానికి భలేగా ఉంటుంది. ఇంతకీ ఏంటో తెలుసా వాటి ప్రత్యేకతలు...

ఊరంతా సౌర వంటిళ్లే!

అది మధ్యప్రదేశ్‌లోని బేతూల్‌ జిల్లాలో ఉన్న బంఛా గ్రామం. ఒకప్పుడు ఆ గ్రామంలో వంటకోసం కట్టెల పొయ్యి వాడేవారు. ఆ తరవాత చాలా తక్కువ మంది మాత్రమే ఆ స్థానంలో ఎల్‌పీజీ వాడటం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడా గ్రామానికి వెళ్లి చూస్తే ప్రతి వంటిల్లూ ఓ ఆధునిక కిచెన్‌లా కనిపిస్తుంది. అక్షరం ముక్క రాని ఆ గ్రామస్థులు వంటిళ్ల్లని అలా ఎలా మార్చుకున్నారో తెలుసా... సౌర విద్యుత్‌తో. బంఛా గ్రామస్థులంతా వంటచెరకు కోసం అడవుల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున చెట్లు కొట్టేవారు. పర్యావరణం కోసం కృషి చేస్తున్న ‘భారత్‌ భర్తి శిక్షా సమితి’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ అది గమనించి గోబర్‌ గ్యాస్‌ను వాడుకోమని అవగాహన కల్పించింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడే ఐఐటీ ముంబయి బృందం సోలార్‌ స్టౌల తయారీ ప్రాజెక్టును చేపట్టిందని తెలిసి ఆ స్వచ్ఛంద సంస్థ వారిని సంప్రదించింది. బంఛా గ్రామంలోనూ సోలార్‌ స్టౌలను అమర్చమని కోరింది. అయితే ఐఐటీ ముంబయి చేసిన ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి నచ్చడంతో బంఛా గ్రామంలో ఉచితంగా సోలార్‌ కిచెన్ల ఏర్పాటుకు సిద్ధమైంది. అలా 2017లో మొదలుపెట్టి... ఏడాది తిరిగేసరికి ఆ గ్రామంలోని ప్రతి వంటింటినీ సోలార్‌ కిచెన్‌గా మార్చేశారు ఐఐటీ ముంబయి నిపుణులు. అలా బంఛా గ్రామం మనదేశంలో వంటకు సోలార్‌ విద్యుత్‌ను వాడే ఏకైక గ్రామంగా గుర్తింపు పొందింది. చీకటిలో మగ్గే ఆ గ్రామం సోలార్‌ పుణ్యమాని కరెంటుకీ నోచుకుంది. ‘భారత్‌ భర్తి శిక్షా సమితి’ స్వచ్ఛంద సంస్థ వల్లనే తమ గ్రామంలో పొగనూ, చీకటినీ తరిమేయడం సాధ్యమైందంటారు బంఛా గ్రామస్థులు. 


కట్నం తీసుకోకుండా కమిటీలు!

ఆడపిల్ల పెళ్లంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కట్నకానుకలూ, నగలూ, విందూవినోదాల కోసం బోలెడు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సగటు మధ్యతరగతి జీవులకు అది తలకు మించిన భారమే అయినా తప్పదని అప్పుచేసైనా ఆడంబరంగానే పెళ్లి చేస్తుంటారు చాలామంది. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఎనిమిది గ్రామ పంచాయతీలు మాత్రం కట్నం ఇవ్వకూడదూ, తీసుకోకూడదనే నిబంధన పెట్టుకున్నాయి. దాంతోపాటు ఆడంబరాలూ, విందు భోజనాలూ, మద్యం వంటి వాటికీ ఖర్చు పెట్టకూడదని స్వచ్ఛందంగా తీర్మానించుకున్నాయి. అమిల్‌పట్టి, సింఘపట్టి, సౌంఖ్‌ డెహత్‌, లోరియా పట్టి, నానుపట్టి, బచ్‌గావ్‌ తదితర గ్రామాలు ఇప్పుడు ఈ తీర్మానాలకు లోబడి ఆడపిల్లల పెళ్ళి సమయంలో ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆ గ్రామస్థులు రాజకీయ పార్టీలకు అతీతంగా, అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటున్నారు. గ్రామానికో కమిటీగా ఏర్పడి... ఈ తీర్మానాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దాంతో ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థిక భారం లేకుండా కూతుళ్ల పెళ్లిళ్లు చేస్తున్నారు. అలానే మరికొందరు ఆడపిల్లల్ని చదివించడానికి ముందుకొస్తున్నారు. వాస్తవానికి గ్రామ కమిటీల ఉద్దేశం కూడా అదేనంటున్నారు జిల్లా పంచాయతీ అధికారి భరత్‌ సింగ్‌.


ఉల్లిపాయ తినరు

కోస్తేనే కాదు కొన్నా కంటతడే అన్నట్టు మారింది ఉల్లిపాయ పరిస్థితి. ఒక్కసారిగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో యావత్‌దేశం దాని గురించే చర్చించడం మొదలుపెట్టింది. అలానే టిక్‌టాక్‌లూ, మెసేజులూ, వీడియోల రూపంలోనూ సోషల్‌ మీడియాలో కూడా తెగ చక్కర్లు కొట్టిందీ ఉల్లిపాయ. తల్లిలా మేలు చేసే ఉల్లి గురించి ఇంత లొల్లి జరిగినా బిహార్‌లోని జెహనాబాద్‌ జిల్లా త్రిలోకి బిగహ గ్రామస్థులు మాత్రం ఉల్లిపాయ ఊసే ఎత్తట్లేదు. కేజీ వెయ్యి రూపాయలైనా మాకేం ఫర్వాలేదు అంటున్నారు. అలా ఎందుకంటున్నారో తెలుసా... కొన్ని తరాలుగా ఆ గ్రామంలో ఉల్లిపాయ తినడం నిషేధం. అదొక్కటేకాదు, వెల్లుల్లి, మాంసాహారం, మద్యపానం వంటి వాటికి కూడా దూరంగా ఉంటున్నారు త్రిలోకి గ్రామస్థులు. కారణం ఆ ఊరిలో ఉండే విష్ణుమూర్తి ఆలయం. స్వామికి నియమనిష్టలతో పూజ చేస్తేనే అనుగ్రహం ఉంటుందనేది తరతరాలుగా ఆ గ్రామస్థుల నమ్మకం. అందుకే వందల ఏళ్లుగా ఆ నియమాన్ని పాటిస్తున్నారు. అలానే ఆ ఆచారాలను అతిక్రమించినవారు ప్రమాదాలకు గురవుతారని వాళ్లు నమ్ముతారు. అందుకే గ్రామానికి కోడళ్లుగా వచ్చినవారు కూడా తమ అలవాట్లు మార్చుకుంటారు. ఆ గ్రామం నుంచి వేరే చోటకి కోడలిగా వెళ్లినవారూ, ఇతర ప్రాంతాల్లో కాపురాలు పెట్టినవారూ  సైతం ఈ నియమాలు పాటిస్తుంటారు. భక్తి కోసమైనా మద్యం మానడం మంచి పరిణామమే కదా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.