close
ఒక్క మొక్కలో ఎన్ని రంగుల పూలో..!

మొక్క ఒక్కటే... కానీ దానికి సప్తవర్ణాల్లో పూలు పూస్తుంటే చూడ్డానికి అందంగానే కాదు. ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఉద్యానవన నిపుణులు ఒకే మొక్కకి విభిన్న రంగుల్లో పూలు పూయించేస్తున్నారు..!

పెరట్లో రంగురంగుల్లో విరిసిన పూలని తెచ్చి వేజ్‌లో అందంగా అలంకరిస్తాం. కలగలిసినట్లున్న ఆ రంగుల్ని ఒకేచోట చూస్తే కళ్లకి ఆహ్లాదంగానూ మనసుకి ఆనందంగానూ అనిపిస్తుంది. అదే బాల్కనీలోనో పెరట్లోనో నాటిన మొక్కలు కూడా అలాగే కొమ్మకొమ్మకో రంగులో విరిస్తే... ఎంత అద్భుతంగా ఉంటుంది! అందుకే ఇన్నాళ్లూ నాణ్యమైన పువ్వులూ రుచికరమైన పండ్లూ కూరగాయలకోసం వాడిన గ్రాఫ్టింగ్‌ పద్ధతుల్ని హరివిల్లు రంగుల్లో విరిసే పూలమొక్కల సృష్టికీ వాడుతున్నారు. ఉదాహరణకు దేశవాళీ నాటు గులాబీ వేళ్లు దృఢంగా ఉండి తెగుళ్లనీ ఎండనీ తట్టుకోగలుగుతుంది. కానీ చలిదేశాల్లో పూసే గులాబీలు చెట్టంతా పూస్తాయి. పువ్వులూ అందంగానూ పెద్దగానూ ఉంటాయి. కానీ వాటి వేరు వ్యవస్థ అంత బలంగా ఉండదు. పైగా అవి ఎక్కువ ఎండని తట్టుకోలేవు. అందుకే గ్రాఫ్టింగ్‌ టెక్నిక్‌ ద్వారా వాటిని తెచ్చి నాటు గులాబీలతో అంటుకట్టి పెంచుతారు. దాంతో మొక్క బలంగా పెరిగి చక్కగా విరబూస్తుంది. అదే మొక్కంతా ఒకటే కాండం ఉండి దానికి పైభాగంలో ఎవరో తెచ్చిపెట్టినట్లుగా గుత్తిలా కొమ్మలు వచ్చి పూలు పూసే స్టాండర్డ్‌ లేదా పాటియో రోజ్‌ మొక్కల్లో అయితే పొడవాటి కాండం కోసం మూడు నాలుగేళ్లపాటు మొక్కని పెంచి ఆ తరవాత దానికి పై భాగంలో పూలు వచ్చేలా వేరే మొక్కతో గ్రాఫ్టింగ్‌ చేస్తారు. ఇప్పుడు వీటిల్లోనే మూడునాలుగు రంగుల్లో పూలు పూసేందుకు ఒక దానికి బదులు మూడు నాలుగు మొక్కలతో గ్రాఫ్టింగ్‌ చేస్తున్నారు. ఒకటే కాండం ఉండి, పై భాగంలో మాత్రమే గుబురుగా అల్లుకునేలా గ్రాఫ్టింగ్‌ చేసిన ఈ రకం మొక్కలు ఏక రంగుకి బదులు మూడునాలుగు రంగుల్లో గులాబీలు పూస్తూ చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ తరహా గ్రాఫ్టింగ్‌కు చాలా ఓపిక, సమయం కావాలి. అప్పుడే అవి చక్కగా పెరిగి విరబూస్తాయి. ఈ స్టాండర్డ్‌ రోజ్‌ తరహాలోనే పెంచిన ఒంటిరెక్క మందారం, ముద్దమందారాల్ని కూడా మూడునాలుగు రంగుల్లో విరిసేలా చేస్తున్నారు. పైగా వీటిల్లో పసుపూ ఎరుపూ తెలుపూ... ఇలా ఒకదాంతో ఒకటి సంబంధం లేని ప్రకాశవంతమైన రంగులు పూసేలా చేయడంతో ఆ మొక్కని చూస్తే అచ్చం పూలబొకేను చూసినట్లే అనిపిస్తుంది. ఇక, బోగన్‌విలియాలో అయితే మూడూనాలుగూ కూడా కాదు, ఏకంగా ఏడెనిమిది రంగుల మొక్కలతో గ్రాఫ్టింగ్‌ చేస్తున్నారు.  సో, ఇలాంటి మొక్కల్ని పెరట్లోని మొక్కల మధ్య అక్కడక్కడా పెంచితే ఆకాశంలోని హరివిల్లు మన ముంగిట్లోనే విరిసినట్లుండదూ... ఓ ప్రయత్నం చేద్దామా మరి..!

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.