close

బ్రష్‌ చేసేద్దాం... స్మార్ట్‌గా..!

దంతసిరి బాగుంటే ఆరోగ్యం బాగున్నట్లే. లేదంటే చిగుళ్లవ్యాధులతో మధుమేహం, హృద్రోగాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందుకే చాలామంది ఒకప్పటిలా ఏదోక బ్రష్షుతో తోముకుంటే పోలా అనుకోవడం లేదు. దాంతో టూత్‌బ్రష్షు రోజురోజుకీ సరికొత్త ఫీచర్లతో మరింత స్మార్ట్‌గా తయారవుతోంది.

నిద్ర లేవగానే ఎవరైనా ముందు చేసేది దంతధావనమే. అదయ్యాకే మిగిలిన పనులన్నీ. అంతేనా... మాసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయం చేసిన ఓ అధ్యయనంలో అధికశాతం మంది మంచి టూత్‌బ్రష్షును వాడటం వల్లే తాము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారట. మనిషి పళ్లు తోమడం మొదలుపెట్టింది ఎప్పుడనేది కచ్చితంగా తెలీకున్నా ఐదు వేల సంవత్సరాల నుంచీ బ్రష్షులాంటి సాధనం ఉందనేది అర్థమవుతోంది. అయితే అది ఈనాటి బ్రష్షుల్లా కాకుండా ఓ పుల్ల, పక్షి ఈక, జంతు ఎముక... ఇలా విభిన్న రూపాల్లో ఉండేదన్నమాట. నేడు మనం ఉపయోగిస్తోన్న టూత్‌బ్రష్‌ను తొలిసారిగా 1780లో ఇంగ్లాండ్‌కు చెందిన క్లెర్కెన్‌వాల్డ్‌ కనుగొన్నాడు- అదీ జైల్లో ఉన్న సమయంలో. చిన్న ఎముకకు రంధ్రాలు చేసి అందులో వెంట్రుకలను కుచ్చుల్లా అమర్చి పళ్లు రుద్దుకున్నాడట. జైలు నుంచి బయటకు వచ్చాక తను కనుగొన్న సాధనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడట. 19వ శతాబ్దం మధ్య వరకూ కూడా చెక్క లేదా ఎముకలకు రంధ్రాలు చేసి వాటికి జంతువుల వెంట్రుకలను అమర్చి మాత్రమే రుద్దుకునేవారట. 1938లో ఆధునిక బ్రష్షు పుట్టుకొచ్చింది. మొదట్లో సాదాసీదాగా ఉండేవి కాస్తా మృదువైన కుచ్చులతోనూ భిన్న ఆకారాల్లోనూ రావడం మొదలైంది. చిన్న పిల్లలు పట్టుకునేందుకు వీలుగానూ, పెద్ద పిల్లల్ని ఆకట్టుకునేలానూ బొమ్మల్నీ సింగారించుకుంటున్నాయి. నోట్లో పెట్టుకుని బటన్‌ ప్రెస్‌ చేస్తే అన్నివైపులకీ వెళ్లి పళ్లను రుద్దే ఎలక్ట్రిక్‌ బ్రష్షులూ వచ్చాయి. వీటిల్లో కొన్ని పాటలు పాడుతుంటే మరికొన్ని సరిగా బ్రష్షు చేశారో లేదో చెబుతున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లు అసలు చేత్తో పట్టుకునే పనిలేనివీ వస్తున్నాయి. అందుకే మరి... ఆ రకాలేంటో ఓసారి చూద్దామా..!


పది సెకన్లలోనే...

కొందరు దంతాల్ని చాలాసేపు తోముతుంటారు. అయినా శుభ్రమవుతాయని చెప్పలేం. అందుకే పది సెకన్లలోనే బ్రష్షు చేసుకునేలా రూపొందించినదే అమా బ్రష్‌. సిలికాన్‌తో తయారైన ఈ బ్రష్షు బ్రిజల్స్‌ మృదువుగా ఉండటంతోబాటు యాంటీబ్యాక్టీరియల్‌గానూ పనిచేస్తాయి. దీన్ని దంతాలమీద పెట్టుకుని దానితోపాటు ఇచ్చిన మోటరు స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు, బ్రష్షు లోపలున్న పేస్టు బ్రిజల్స్‌ మీదకి వచ్చి శుభ్రం చేస్తుంది. బ్రిజల్స్‌ కంపనం ఆగిపోగానే బ్రష్షుని తీసి కడిగి మళ్లీ మోటారుమీద పెడితే సరి. ఇందులో ఒకే మోటారుకి రెండుమూడు బ్రష్‌లు పెట్టుకునే సదుపాయం కూడా ఉంది. మూడు నుంచి ఆరునెలలకోసారి బ్రష్షుని మార్చుకుంటే చాలట. చిల్జ్‌ మౌత్‌ బ్రష్‌ కూడా ఇలాంటిదే కానీ దీనికి 30 సెకన్లు కావాలట.


సుకుమారంగా...

ప్లాస్టిక్‌ బ్రిజల్స్‌ అంతో ఇంతో పళ్లమీదున్న ఎనామిల్‌కు హాని కలిగిస్తాయన్న కారణంతో ఇసా... వంటి కంపెనీలు సిలికాన్‌ బ్రష్షులకు రూపకల్పన చేశాయి. వీటితో కాస్త గట్టిగా రుద్దినా ఎనామిల్‌ పోదు సరికదా, పసిపిల్లలూ వృద్ధులూ చిగుళ్లవ్యాధులతో బాధపడేవాళ్లకీ ఇబ్బంది లేకుండా ఉంటాయి. అలాగే పసిపిల్లలకోసం వేలుకే పెట్టి రుద్దే బ్రష్షులతోబాటు అసలు కుచ్చులే లేని స్పాంజ్‌ బ్రష్షుల్నీ తీసుకొస్తున్నాయి మరికొన్ని కంపెనీలు.


ప్రయాణంలో హాయిగా..!

తరచూ ప్రయాణాలు చేసేవాళ్లకోసం వి- ఆకారంలో మడిచి పెట్టుకునేవీ, పెన్నులా మూత పెట్టుకునేవీ... ఇలా రకరకాల బ్రష్షులు మార్కెట్లో ఉన్నాయి. వీటితోబాటు పుదీనా, స్ట్రాబెర్రీ, తులసి... వంటి ఫ్లేవర్ల టూత్‌పేస్టుతో మినీ డిస్పోజబుల్‌ బ్రష్షులూ వస్తున్నాయి. ఈ రకంలో బ్రష్షుకే పేస్టు అతుక్కుని ఉంటుంది. అది నోట్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే కరుగుతుంది. కాబట్టి విడిగా పేస్టు తీసుకెళ్లాల్సిన సమస్య ఉండదు. స్టీవార్ట్‌ ఓరల్‌ కేర్‌ టూత్‌బ్రష్షులో అయితే పేస్టు నింపిన చిన్నచిన్న క్యాప్సూల్స్‌ను వేసుకోవచ్చు. అలాగే బ్రష్షు లోపలి గొట్టంలోకి పేస్టుని నింపుకుని కిందిభాగంలో తిప్పితే పేస్టు వచ్చేవీ వస్తున్నాయి.


ఎలక్ట్రిక్‌ బ్రష్షుల జోరు!

సాధారణ బ్రష్‌లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ బ్రష్షులు దంత సంరక్షణతోబాటు వాటిని తెల్లగా మెరిపిస్తాయనీ చిగుళ్లవ్యాధుల్నీ అడ్డుకుంటాయని చెబుతున్నారు నిపుణులు. దాంతో కొల్గేట్‌, ఓరల్‌-బి, ఫిలిప్స్‌... వంటి అనేక కంపెనీలు పోటాపోటీగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వీటిని రూపొందిస్తున్నాయి. బీప్‌ సౌండ్‌ ద్వారా బ్రిజల్స్‌ ఉన్న తలభాగాన్ని మార్చమని హెచ్చరించేవీ, సరిగ్గా చేశామా లేదా అన్నదాన్ని స్మైలీల ద్వారా చూపించేవీ... ఇలా చాలానే వస్తున్నాయి. కొన్నింటికి యూఎస్‌బీ చార్జింగ్‌ ఉంటే, మరికొన్నింటికి ఆ బ్రష్షుకు సంబంధించిన ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిగ్గా శుభ్రం చేసుకున్నామా లేకపోతే ఎక్కడ చేయడం లేదు, ఎంత ఒత్తిడి పెట్టాలి, ఇంకెంతసేపు చేయాలి... వంటివన్నీ బొమ్మతో సహా ఫోనులో చూపిస్తుంది.  బ్రష్షు చేశాక బాక్సులో పెట్టగానే స్టెరిలైజ్‌ అయ్యేవి కొన్నయితే, తీసి హోల్డరులో పెట్టగానే అతినీలలోహిత కాంతి లేదా సెన్సర్ల ద్వారా క్రిములు లేకుండా శుభ్రమయ్యేవి మరికొన్ని. కాబట్టి వీటిని నిశ్చింతగా వాడుకోవచ్చన్నమాట.


పాటలు వింటూ..!

పిల్లలకీ కొందరు పెద్దవాళ్లకీ లేవగానే బ్రష్షు చేయడమంటే మహాబద్ధకం.  అలాంటివాళ్లకోసం చేసినవే పాటల బ్రష్షులు. లోపల అమర్చిన మైక్రోచిప్‌ ద్వారా పాటల్ని వింటూ హాయిగా బ్రష్‌ చేసుకుంటుంటే నిద్రమత్తు కాస్తా వదిలిపోతుంది. వీటిల్లోనే పిల్లలకోసం డిస్నీ ‘ద లయన్‌ కింగ్‌’లో ప్రాచుర్యం చెందిన హకునా మటాటా... వంటి పాటల్ని వినిపించేవీ ఉన్నాయి. బ్రష్షు చేసే వేగం పెరిగేకొద్దీ పాట సౌండ్‌ కూడా పెరుగుతుందట.


ఇది సూపర్‌!

కొందరు బద్ధకంతోనో నిర్లక్ష్యంతోనో బ్రష్షు సరిగ్గా చేయకపోవడంతో ఎక్కువగా పళ్లు పుచ్చిపోతుంటాయి. అదే డాక్టర్‌ బారమన్‌ సూపర్‌ బ్రష్షు ఉంటే దంతాలపై భాగంతోబాటు పక్కభాగం కూడా ఒకేసారి శుభ్రమైపోవడంతో దంతక్షయం రాకుండా ఉంటుందట.


కీళ్లనొప్పులుంటే...

కొన్ని బ్రష్‌ల కుచ్చులు మంచిగా ఉన్నా చేత్తో ఎక్కువసేపు పట్టుకోలేం. ముఖ్యంగా కీళ్లనొప్పులతో బాధపడే వృద్ధులకి వేళ్లు పట్టు ఇవ్వక బ్రష్షుని పట్టుకోలేరు. అలాంటివాళ్లకోసం తయారుచేసిన బ్రష్షే ఎర్స్‌కైన్‌ ఫ్యాట్‌బాయ్‌. పైగా రెండుమూడు నెలలు కాగానే బ్రష్‌ పారేయాల్సిన అవసరం లేకుండా హ్యాండిల్‌ను ఉంచి హెడ్స్‌ను మార్చుకోవచ్చు. దీంతోబాటు ఇచ్చే కిట్‌లోని డెంచర్‌ బ్రష్‌, టంగ్‌ స్క్రాపర్‌ వంటి వాటినీ హ్యాండిల్‌కు పెట్టుకుని వాడుకోవచ్చు.


‘బి’... మంచి బ్రష్షు..!

ఎంత మంచి ఎలక్ట్రిక్‌ బ్రష్షుకయినా బ్యాటరీనో ఛార్జింగో లేకుంటే నడవదు. కానీ బీ ఎలక్ట్రిక్‌ బ్రష్షుకి వాటితో పనిలేదు. కేవలం దాని కిందిభాగంలో ఉన్న ఎర్గనామిక్‌ నాబ్‌ను బొమ్మకు కీ ఇచ్చినట్లుగా రెండుమూడుసార్లు గుండ్రంగా తిప్పితే సరి... ఏకంగా 80 వేల సార్లు పైకీ కిందకీ కదిలేందుకు సరిపడా శక్తి బ్రష్షుకి అందుతుంది. పైగా రీసైక్లింగ్‌ పదార్థాలతో తయారుచేసిన ఈ బ్రష్‌ను పారేశాక తేలిగ్గా నేలలోనూ కలిసిపోతుంది.


పర్యావరణ ప్రియమైనవి!

బ్రష్షు ఏదయినా మూడునాలుగు నెలలకు మించి వాడలేం. దాంతో ప్లాస్టిక్కు బ్రష్షులతో చెత్త రోజురోజుకీ పెరిగిపోతుంది. దాంతో అనేక కంపెనీలు చెక్క బ్రష్షులని- అదీ హోల్డర్లు పారేయకుండా తల భాగం మార్చుకునేలా డిజైన్‌ చేస్తున్నారు. కొన్నింటికి బ్రిజల్స్‌లో చార్కోల్‌ని మేళవించడంతో అవి పళ్లను మరింత తెల్లగా మెరిపిస్తున్నాయట. చెక్క బ్రష్షుల తయారీలో వెదురునే ఎక్కువ వాడుతున్నారు. వెదురు వేగంగా పెరగడంతోబాటు ఆ మొక్కలకి సూక్ష్మజీవుల్ని నాశనం చేసే గుణం సహజంగానే ఉంటుందట. దాంతో అవి పర్యావరణంతోబాటు దంతసిరినీ పరిరక్షిస్తాయన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.