close

చేయీ చేయీ కలిపి... పిల్లల పండగ చేసి...

‘అనగనగా ఆరుగురు యువకులు. వాళ్లు తాము ఒకప్పుడు చదువుకున్న సర్కారు బడిలో ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి ఏదైనా చేయాలనుకున్నారు. తలాకొంత డబ్బులు వేసుకుని అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల కోసం...’ - వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో మనం నిత్యం ఇలాంటి పాజిటివ్‌ కథనాలెన్నో చూస్తుంటాం. అలాంటి సానుకూల దృక్పథాన్నీ, సామాజిక సేవాభావాన్నీ తమ బృందానికే పరిమితం చేయకుండా... అందర్నీ కలుపుకుని వెళితే ఎంత గొప్ప సంబరమవుతుందో ‘కాకినాడ పిల్లల పండగ’ నిరూపిస్తుంది!

పిల్లల పండగ అనగానే మనకి
‘కొత్తగూడెం బాలోత్సవ్‌’ గుర్తుకొస్తుంది. ఎన్నో ఏళ్లపాటు వాటిని నిర్వహించిన క్లబ్‌ ఆ ఉత్సవాలకి దూరమైనా... ఆ స్ఫూర్తిని అందుకుని అంతేస్థాయిలో కాకినాడ వేదికగా పిల్లల పండుగని నిర్వహిస్తోంది క్రియా సంస్థ. ఇదేదో భారీ నిధులతోనో, పెద్ద కంపెనీలూ, విద్యాసంస్థలూ, ప్రభుత్వాల దన్నుతోనో ఏర్పాటైన సంస్థ కాదు. బాలలంటే ఇష్టమున్న చిరుద్యోగులూ, వృత్తిపనివాళ్లూ, టీచరూ,్ల ఐటీ ఉద్యోగులూ... ఇలా దాదాపు రెండువందలమంది నడుపుతున్నారు దీన్ని. అందరూ తలాకొంత వేసుకునీ, తమకి తెలిసినవాళ్ల ద్వారా విరాళాలు సేకరించీ గత ఐదేళ్లుగా ‘కాకినాడ పిల్లల ఉత్సవాన్ని’ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంబరంలో పదివేలమంది పిల్లలు పాల్గొంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులనూ, టీచర్లనూ కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ సంఖ్య 15 వేలు దాటుతుంది. వచ్చినవాళ్లందరికీ ఉచితంగా భోజనసదుపాయం, సుదూర జిల్లాల్లోనివారికి బస, వసతి కల్పిస్తున్నారు. సామాన్యులందరూ చేయీచేయీ కలిపి సాధిస్తున్న ఈ చిన్నారుల సందడి పద్దెనిమిదేళ్లకిందట ఓ చిన్న గ్రామంలోని ప్రభుత్వ బడి నుంచే మొదలు కావడం విశేషం.

బిందువులా మొదలైంది...
కాకినాడ దగ్గర తిమ్మాపురం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వాళ్లు... అందరూ కాస్తోకూస్తో జీవితంలో స్థిరపడ్డవాళ్లు. 2002లో వాళ్లకు ఓ ఆలోచనొచ్చింది. ‘మనం చదువుకునే రోజుల్లో ఆటలూ, పోటీలకి కాస్తయినా సమయం ఉండేది. ఇప్పటి పిల్లలకి అలాంటి పోటీలు పెట్టేవాళ్లు లేరు. అది మనమే చేద్దాం. మనం చదివిన జడ్పీ బడితోనే మొదలుపెడదాం!’ అనుకున్నారు. 2002 ఆగస్టు 14న ఆ బడిలోని విద్యార్థులకి జీకే పోటీలు పెట్టి... ప్రైజులు అందించారు. ‘ఆ రోజు పిల్లల్లో కనిపించిన ఆ ఆనందం చూశాక భలేగా అనిపించింది. ఆ తర్వాత ఐదు బడులలో నిర్వహించడం మొదలుపెట్టాం. మేం నిర్వహించే తీరూ, పోటీలకొచ్చే పిల్లలపట్ల తీసుకునే జాగ్రత్తలూ, క్రమశిక్షణా అందర్నీ మెప్పించాయి. హైదరాబాద్‌కి చెందిన బేసిక్‌ రిసెర్చ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(బ్రెడ్‌) సొసైటీ గోదావరి జిల్లాల్లోని 80 బడుల్లో ఇలాంటి పోటీలు నిర్వహించే బాధ్యత మాకు అప్పగించింది. వాటిని నడుపుతున్నప్పుడే 2010లో కొత్తగూడెం బాలోత్సవ్‌ చూశాం. అదో అద్భుతం అనిపించింది. కాకినాడలోనూ అలాంటిది నిర్వహించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాం. మా ఆలోచనల్ని స్నేహితులతో పంచుకోవడం మొదలుపెట్టాం. అప్పటిదాకా మేం చేస్తున్న పోటీల గురించి విన్న స్నేహితులూ, వాళ్ల మిత్రులూ, వాళ్ల పరిచయస్థులూ... అలా ఎందరో చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు. ఓ సానుకూల ప్రయత్నానికి ఇంత మంచి స్పందన ఉంటుందా అనిపించింది! అలా అందరం విరాళాలు సేకరించి 2015లో మొదటి రాష్ట్రస్థాయి ‘కాకినాడ పిల్లల పండగ’ నిర్వహించాం. టీచర్ల నుంచి ఎంతోమంచి స్పందనొచ్చింది. ఏటికేడూ ఆ స్పందన రెట్టింపవుతూనే ఉంది. గత మూడేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడువందల బడుల నుంచి పదివేలమంది పిల్లలు హాజరయ్యారు. ఒకప్పుడు మేం పదిహేనువందల రూపాయలతో మొదలుపెట్టిన పోటీలు... ఇప్పుడు పదిహేను లక్షల రూపాయల బడ్జెట్‌ని దాటిపోయాయి. ఆరుగురున్న వలంటీర్ల సంఖ్య రెండువందలకి చేరింది’ అని చెబుతారు నాటి ఆరుగురు యువకుల్లో ఒకరైన ఎస్సెస్సార్‌ జగన్నాథరావు. అన్నట్టు ఈ రెండువందల మంది కార్యకర్తల్లో 80 శాతం ముప్పై ఏళ్లకి అటూఇటూగా ఉన్నవాళ్లే!

కొత్తకొత్త పోటీలు...
కాకినాడ పిల్లల పండుగలో పాటలూ, నాటకాలూ, విచిత్ర వేషధారణ, సైన్స్‌ ప్రదర్శన వంటి సంప్రదాయ పోటీలతోపాటూ నేటికాలానికి తగ్గట్టు పోస్టర్‌ ప్రెజెంటేషన్‌, ఇంటర్నెట్‌ సెర్చింగ్‌, స్పెల్లింగ్‌ బీ వంటివీ నిర్వహిస్తున్నారు. ఈ సంబరం పిల్లలకి మాత్రమే కాబట్టి చిన్నారులే ఇక్కడ వీఐపీలు. అందుకే ఈ కార్యక్రమంలో ప్రారంభ, ముగింపు ఉత్సవాలూ భారీ ప్రసంగాలూ వంటివేవీ ఉండవు. ఆ ముచ్చట చూడటానికి లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు వంటివాళ్లు ఏటా వస్తున్నారు! ఈ ఏడాది ఈ పోటీలు కాకినాడ జేఎన్‌టూయూ వేదికగా రెండు రోజులు (ఫిబ్రవరి 29, మార్చి 1) జరగబోతున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.