close

అందుకు హార్మోనే కారణం!

కొందరిలో శృంగార భావనలు తక్కువగా ఉంటాయి. అయితే దీనికి మెదడులో సహజంగా స్రవించే కిస్‌పెప్టిన్‌ అనే హార్మోనే కారణమని చెబుతున్నారు. ఎందుకంటే మంచి పరిమళాన్ని పీల్చినప్పుడూ కంటికి అందంగా అనిపించినప్పుడూ ఈ హార్మోన్‌ మెదడులో సహజంగానే స్రవించి, నరాల్ని ప్రేరేపించి కోరికని రేకెత్తిస్తుందని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మగవాళ్లలో సంతానోత్పత్తికి సంబంధించి ఇది ఎంతో కీలకమైనదనీ వివరిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధరించేందుకు లైంగికేచ్ఛ తక్కువగా ఉండే ముప్ఫై మందిని ఎంపికచేసి, వాళ్లకి ఈ హార్మోన్‌ను ఇంజెక్టు చేసి, ఆడవాళ్ల పెర్‌ఫ్యూమ్‌నీ, అందమైన ముఖాలనీ చూపించి- వాళ్ల మెదడులోని క్రియాశీలతని ఎమ్మారై స్కాన్‌ల ద్వారా రిశీలించారట. ఈ హార్మోన్‌ కారణంగా మెదడులోని శృంగారభావనలకి సంబంధించిన భాగం చురుకుగా మారినట్లు గమనించారు. సంతానోత్పత్తి, లైంగికపరమైన సమస్యలతో బాధపడేవాళ్లకి చికిత్స చేయడానికి ఈ పరిశోధన ఎంతో దోహదపడుతుందని పేర్కొంటున్నారు సదరు పరిశోధకులు.


అవకాడోతో మధుమేహం దూరం!

ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ గుయెల్ఫ్‌కి చెందిన నిపుణుల బృందం పేర్కొంటోంది. కొవ్వుల్ని కరిగించే ఆక్సీకరణ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో ఇన్సులిన్‌ నిరోధం ఏర్పడి మధుమేహానికి దారితీస్తుంటుంది. దీన్ని అడ్డుకోగలిగే శక్తి అవకాడోలోని అవొకాటిన్‌-బి అనే పదార్థానికి ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం వీళ్లు ఊబకాయంతో ఉన్న ఎలుకలకి అవొకాటిన్‌-బిని ఐదు వారాలపాటు ఇంజెక్ట్‌ చేయగా వాటిల్లోని కొవ్వు ఆమ్లాల పనితీరు మెరుగై కొవ్వులు కరిగినట్లు గుర్తించారు. దాంతో ఇన్సులిన్‌ స్రావం పెరిగి, రక్తంలో గ్లూకోజు నిల్వలు కూడా తగ్గాయట. అంతేకాదు, దీన్ని ఆహారంలో భాగంగా తీసుకునేవాళ్లలో కాలేయం, మూత్రపిండాలు, కండరాల పనితీరు బాగున్నట్లు గమనించారు. పెన్‌ స్టేట్‌ చేసిన మరో పరిశోధనలో- రోజుకో అవకాడో తినేవాళ్లలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గిందట. ఎందుకంటే ఇందులోని ల్యూటెన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ చెడు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది. అలాగే కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుందనీ మొత్తంగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదనీ చెబుతున్నారు పరిశోధకులు.


వ్యాయామానికి సంగీతం తోడైతే..!

జిమ్‌లో కసరత్తులు, ట్రెడ్‌మిల్‌ లేదా ఆరుబయట నడక, పరుగు... వంటి వ్యాయామాలు చేసేటప్పుడు- మంద్రమైన సంగీతం కన్నా ఫాస్ట్‌బీట్స్‌ వినడం వల్ల గుండెవేగం పెరిగి అలసట తక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఇటలీకి చెందిన వెరోనా విశ్వవిద్యాలయ నిపుణులు. ఎందుకంటే సంగీతం అనేది ప్రపంచ భాష. దానికి భాషతో సంబంధం లేదు. లయతో కూడిన ఆ శబ్దం జీవక్రియనీ ప్రభావితం చేస్తుంది అంటున్నారు. ఇందుకోసం వీళ్లు క్రమం తప్పక వ్యాయామాలు చేసేవాళ్లని ఎంపిక చేసి నాలుగు దశల్లో వాళ్లని పరిశీలించారట. ఒకసారి నిమిషానికి 90, రెండోసారి 130, మూడోసారి 170 బీట్స్‌ చొప్పున వినిపించగా నాలుగోసారి అస్సలు సంగీతం వినిపించలేదట. ఆయా దశల్లో వాళ్లని పరిశీలించగా- అత్యధిక ఫాస్ట్‌బీట్స్‌ విన్నప్పుడు గుండె వేగం బాగా పెరగడంతోబాటు అలసట కూడా తక్కువగా కనిపించిందట. సంగీతం స్థాయి తగ్గేకొద్దీ గుండె వేగం కూడా తగ్గి, అలసట ఎక్కువ ఉన్నట్లు గమనించారు. అస్సలు సంగీతం వినని సందర్భంలో మరింత త్వరగా అలసిపోయినట్లు గుర్తించారు. అంటే సంగీతం నాడీ వ్యవస్థనీ రక్తప్రసరణనీ నియంత్రిస్తుందనీ తద్వారా అలసటనీ దూరం చేస్తుందని చెబుతున్నారు.


పసివాళ్లతో మాట్లాడండి!

అమ్మ, తాత, అత్త... అని నొక్కి పలుకుతూ పిల్లలతో కొందరు అమ్మానాన్నలూ బామ్మలూ చాలాసేపు మాట్లాడుతుంటారు. వాటికి వాళ్లు కూడా ఊ కొడుతూ పెద్దవాళ్లని అనుకరిస్తూ ఆ పదాల్ని అలానే పలికేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే వాళ్లతో తల్లిదండ్రులు ఇలా మాట్లాడటం అనేది పిల్లలు భాషని త్వరగా నేర్చుకునేందుకూ తరవాతి కాలంలో వాళ్లలో భాషా పరిజ్ఞానం పెరిగేందుకూ తోడ్పడుతుందనీ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లెర్నింగ్‌ అండ్‌ బ్రెయిన్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం పిల్లలతో ఎక్కువ సమయం కబుర్లు చెప్పేవాళ్లనీ తక్కువగా మాట్లాడే తల్లిదండ్రుల్నీ ఎంపికచేసి కొన్నేళ్లపాటు వాళ్లని నిశితంగా గమనించారట. అందులో ఎక్కువ సమయం అమ్మానాన్నలు కబుర్లు చెప్పిన పిల్లలకు త్వరగా మాటలు రావడమే కాదు, స్పష్టంగా మాట్లాడటం కనిపించిందట. కాబట్టి పసిపిల్లలకు ఏం అర్థమవుతుందిలే అనుకోకుండా తల్లితండ్రులు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడితే మంచిదని చెప్పుకొస్తున్నారు నిపుణులు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.