close
కాగితపు రెక్కలు

-శ్రీనివాసరెడ్డి

ఉదయాన్నే డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని శ్రీమతి చేతితో చేసిన ఫిల్టర్‌ కాఫీ తాగుతూ పేపరు తిరగేయటంతో నా దినచర్య ప్రారంభమవుతుంది.

ఆ రోజు ఆదివారం కావటంతో కాస్తంత నింపాదిగా పేపరు తిరగేస్తూ ‘‘ఈసారన్నా దసరా పండక్కి మా ఊరు వెళ్దాం. అమ్మానాన్నలు రమ్మని పదే పదే ఫోన్‌ చేస్తున్నారు’’ దసరా సెలవులు వస్తుండటంతో మా ఆవిడ ముందు ప్రతిపాదన పెట్టాను.

‘‘ఆ పల్లెటూరికా?’’ అని నాలుక కరుచుకుని ‘‘నాదేముంది పిల్లల్ని అడగండి... వాళ్ళు ఎక్కడికెళ్దాం అంటే అక్కడికొస్తాను’’ వంటింట్లో నుంచే ప్రతిపాదనను పిల్లల కోర్టులోకి తోసింది శ్రీమతి.

‘‘వాళ్ళనడిగేదేమిటి, చిన్నపిల్లలు... మనం ఎక్కడికెళితే అక్కడికి వస్తారు’’ మళ్ళీ బంతిని నా కోర్టులోకి లాగటానికి ప్రయత్నించాను.

‘‘వాళ్ళు చిన్నపిల్లలేమిటీ - ఒకళ్ళు ఇంటర్‌, మరొకరు టెన్త్‌ చదువుతుంటే’’ టిఫిన్‌ టేబుల్‌ మీద పెడుతూ నేను మర్చిపోయానేమోనని గుర్తుచేసింది.

నిజమే, పిల్లలు పెద్దవుతున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవటంలో ఏ తప్పూ లేదు. కానీ, వాళ్ళని అడిగితే జవాబు ఏమి వస్తుందో నాకు తెలియంది కాదు. అందుకనే శ్రీమతితో ఇంతసేపు మాట్లాడింది. కానీ, తను మాత్రం పిల్లల మాటే తన మాట అని తెలివిగా తన అయిష్టాన్ని బయటపెట్టకుండా తప్పించుకుంది.

ఈలోపే పిల్లలిద్దరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చారు టిఫిన్‌ చెయ్యటానికి.

‘‘గుడ్‌ మార్నింగ్‌ డాడీ’’ పలకరించారిద్దరూ.

‘‘ఏరా, దసరా సెలవులు వస్తున్నాయి కదా... ఏమిటి మీ ప్లాన్స్‌’’ వాళ్ళ  ఆలోచన ఎలా ఉందో తెలుసుకుందామని ఓ రాయి వేశాను.

చిన్నోడు ఏమీ మాట్లాడలేదు కానీ, పెద్దోడు మాత్రం ‘‘ఏమో నాన్నా, సెలవులు ఉండవేమో... నీట్‌ క్లాసులుంటాయేమో’’ అనుమానంగా చెప్పాడు.

‘‘నాన్నగారు- నాయనమ్మ వాళ్ళ ఊరెళ్దాం అంటున్నారు సెలవులకు’’ అసలు విషయం చెప్పింది శ్రీమతి వాళ్ళతో.

‘‘ఆ పల్లెటూరికా, మేం రాం’’ అన్నారిద్దరూ ముక్తకంఠంతో.

నేననుకున్నదే జరిగింది. నేనే జవాబు ఆశించానో అదే వచ్చింది వాళ్ళ నోటినుంచి.

‘‘పోనీ అమ్మమ్మవాళ్ళ ఊరు వెళ్దామా?’’ తనకు కావలసిన జవాబు కోసం మళ్ళీ అడిగింది వాళ్ళని శ్రీమతి.

‘‘వెళ్దాం వెళ్దాం’’ అన్నారిద్దరూ మళ్ళీ ఒకే స్వరంతో.

‘‘ఇప్పుడే కదరా నీకు నీట్‌ క్లాసులున్నాయన్నావు. అమ్మమ్మ ఊరు అనగానే క్లాసులు పోయాయా?’’ కాస్తంత కోపంగా నిలదీశా.

‘‘అమ్మమ్మ వాళ్ళ ఊరంటే సిటీ - అక్కడ ఆన్‌లైన్‌లో కూడా క్లాసులు వినొచ్చు’’ తెలివిగా జవాబిచ్చాడు పెద్దోడు.

‘‘ఈ ఒక్కసారికి నాయనమ్మ వాళ్ళ ఊరెళ్దాం. నాయనమ్మ, తాతయ్య మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు’’ వాళ్ళను కన్విన్స్‌ చెయ్యాలని చూశాను.

‘‘ఎందుకండీ, వాళ్ళకిష్టం లేనప్పుడు వాళ్ళను బలవంతం చేస్తారు- ఏముంది ఆ పల్లెటూళ్ళో... కరెంటు కూడా సరిగ్గా ఉండదు. పైపెచ్చు మీ నాన్నగారు అన్నీ రూల్స్‌ పెడతారు’’ నా నోరు మూయించే ప్రయత్నం చేసింది.

‘‘అవును, అమ్మ చెప్పింది నిజం. అమ్మమ్మ వాళ్ళ ఊరెళితే, తాతగారే దగ్గరుండి సినిమాలకూ షికార్లకూ తిప్పుతారు’’ వాళ్ళ అయిష్టాన్ని బయటపెట్టారు.

‘‘చూశారా... పిల్లలకి కూడా ఇష్టం లేదు. ఏ రోజన్నా మీ నాన్నగారు చిన్నపిల్లలని వాళ్ళ అచ్చటా ముచ్చటా చూశారా? కనీసం పిల్లలకు పండక్కి బట్టలు కూడా కొనరు. వాళ్ళమీద వీళ్ళకెందుకుంటుంది ప్రేమ’’ పిల్లల అయిష్టానికి కారణం
కనిపెట్టింది మా ఆవిడ.

శ్రీమతి మాటల్లో కూడా కొంత నిజం లేకపోలేదు. నాన్నగారు హెడ్‌మాస్టరుగా చేసి రిటైర్‌ అయిన తరవాత, మా దగ్గరకు రమ్మన్నా రాకుండా ఆ పల్లెటూళ్ళోనే సెటిలైపోయారు. పెళ్ళైన కొత్తల్లో మేమే ఏడాదికి ఒకటి రెండుసార్లు వెళ్ళి
చూసొస్తూ ఉండేవాళ్ళం.

కానీ, పిల్లలు పెరిగేకొద్దీ అక్కడికివెళ్ళటమే తగ్గించేశాం. ఎప్పుడన్నా సెలవులు వస్తే, పిల్లలు వాళ్ళ అమ్మమ్మా వాళ్ళ ఊరు వెళ్ళటానికే ఇష్టపడుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. వాళ్ళుండేది సిటీలో. సిటీలో సినిమాలకూ షికార్లకూ
కొదవలేదు. పైపెచ్చు మామగారు పిల్లలు ఎంతడిగితే అంత, ఏదడిగితే అది కొనిస్తారు. అందుకనే వాళ్ళ ఊరు వెళ్ళటానికే పిల్లలు ఇష్టపడతారు.

నాన్నగారు మొదటి నుంచీ మమ్మల్ని ఆడంబరాలకు దూరంగా పెంచారు. ఎప్పుడూ విలువల గురించే చెప్పేవారు. ఆయనకొచ్చే కొద్ది జీతంతోనే అప్పులు చెయ్యకుండా నన్ను చదివించారు. అదే విషయం పిల్లలకూ చెప్పేవాళ్ళు. వాళ్ళ చేతికి ఏ రోజూ డబ్బిచ్చేవాళ్ళు కాదు. పైపెచ్చు ఆ పల్లెటూళ్ళో సినిమాలూ షికార్లూ ఉండవు. అందుకనే పిల్లలు నాన్నగారి దగ్గరికంటే చాలు... ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటూ ఉంటారు.

‘‘అయినా, మీ నాన్నగారికి వస్తున్న పెన్షన్‌ మొత్తం ఏం చేస్తున్నారండీ... పిల్లికి బిచ్చం కూడా పెట్టరు’’ నా ఆలోచనలకు అడ్డు తగులుతూ అడిగింది శ్రీమతి.

ఒక్కోసారి శ్రీమతి మాటలు కూడా నిజమేననిపిస్తాయి. ఉన్నది ఇద్దరే, ఆ పల్లెటూళ్ళో ఖర్చులు కూడా పెద్దగా ఏమీ ఉండవు. బంధువులు కూడా పెద్దగా వచ్చేది లేదు పోనీ పెట్టుపోతల్లో డబ్బంతా ఖర్చవుతుందనుకోటానికి. ఎప్పటికప్పుడు అడుగుదాం
అనుకుంటాను, కానీ అడిగే ధైర్యంలేక మానుకుంటాను. ఎందుకంటే నాన్నగారంటే అందరికీ అదో రకం భయం. ఆయన వ్యక్తిత్వం వల్ల కావచ్చేమో, ఆయన ముందు మాట్లాడాలంటేనే అందరికీ అదో రకం వణుకు.

‘‘మా నాన్నగారు చూడండీ... పైసా దాచుకోరు. ఒక్క కూతుర్నని చిన్నతనం నుంచీ ఏది కావాలంటే అది అడగకముందే కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లలకి కూడా ఏది కావాలంటే అది కొనిపెడతారు. మొన్న ఉగాదికి ఇద్దరికీ సెల్‌ఫోన్స్‌ కొనిచ్చారు.
దసరాకి పెద్దోడికి మోటార్‌ సైకిల్‌ కొంటున్నారట, అమ్మ చెప్పింది’’ గర్వంగా తననీ తన పిల్లల్నీ తన తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారో పిల్లల ముందు గొప్పగా చెప్పింది.

‘‘మోటర్‌ సైకిలా... నాకు పల్సర్‌ కావాలి, తాతయ్యకు చెప్పు’’ పెద్దోడి ముఖంలో ఆనందానికి హద్దుల్లేవు.

‘‘అయినా, వాడి వయస్సెంత? ఇప్పుడు వాడికి మోటర్‌ సైకిల్‌ అవసరమా?’’ సున్నితంగా మందలించా.

‘‘మీరు కొనరు, ఇంకొకర్ని కొననివ్వరు. మీకు మీ నాన్న బుద్ధులే వచ్చాయి’’ నా అసమర్థతను ఎత్తి చూపుతోంది శ్రీమతి.

బ్యాంకులో క్లర్కుగా చేసే నాకు, సిటీలో పేరున్న స్కూల్స్‌లో పిల్లలిద్దర్నీ చదివించటమే గొప్ప- ఏ అప్పులూ చేయకుండా. ఇక పిల్లలకు బళ్ళూ భార్యకు నగలూ అంటే అప్పోసప్పో చేయాలి. చాలాసార్లు బ్యాంకులో లోను పెట్టమని శ్రీమతి సతాయించింది. కానీ, అప్పు చేయటం నా పాలసీకే విరుద్ధం. అందుకని సున్నితంగా ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా తిరస్కరించేవాణ్ణి. అదీ ఆవిడ కోపానికి కారణం.

*

పండగకి మామగారింటికి వెళ్ళేనాటికే పెద్దోడికి బండి కొనేసినట్టున్నారు. వసారాలో ఠీవీగా నిలబెట్టి ఉంది.

పిల్లలిద్దరి ఆనందానికి అవధుల్లేవు. అక్కడ ఉన్న నాలుగు రోజులూ పిల్లలిద్దరూ మోటర్‌సైకిల్‌ మీద ఊళ్ళోని వీధులన్నీ చుట్టేశారు. వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే మా ఆవిడ చెప్పిన మాటల్లో కొంతైనా నిజం ఉందనిపిస్తోంది.

ఎప్పుడూ విలువలూ వ్యక్తిత్వమూ క్రమశిక్షణా అంటూ కూర్చుంటే జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామేమో అనిపిస్తోంది. కనీసం పండక్కీ పబ్బానికన్నా వాటిని పక్కనపెట్టి ఆనందించకపోతే మనిషి జీవితానికి అర్థమేముంటుంది. ఈ విషయంలో నాన్నగారు తప్పుగా
ఆలోచిస్తున్నారనిపించింది ఆ క్షణం.

సెలవులు నాలుగు రోజులూ నాలుగు క్షణాల్లా గడచిపోయాయి. తిరుగు ప్రయాణంలో పెద్దోడి మోటర్‌ సైకిల్‌ని ఎలా తీసుకెళ్ళాలనేది పెద్ద సమస్యై కూచుంది.

ట్రాన్స్‌పోర్ట్‌లో వేద్దామంటే, వాళ్ళు బండి పార్టులు మార్చేస్తారని మావగారి స్నేహితుడు ఒకాయన ఓ ఉచిత సలహా పడేసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

పోనీ ట్రైన్‌లో మాతోపాటు తీసుకెళ్దామంటే దానికో పెద్ద ప్రొసీజర్‌ చెప్పారు. పోనీ ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్దాం అంటే పెద్దోడు ఊరుకునేలా లేడు.చివరకు, శ్రీమతినీ పిల్లలిద్దర్నీ ట్రైన్‌లో పంపించి నేనే బండి వేసుకుని మా ఊరు వెళ్ళటానికి నిర్ణయించాను.

కానీ, చివరి నిమిషంలో మామగారు ‘‘నువ్వెందుకయ్యా, నా మనవడే వేసుకొస్తాడు బండి. ఎంతసేపు... గట్టిగా మూడు గంటలు’’ అంటూ వాణ్ణి రెచ్చగొట్టాడు.

‘‘అవును డాడీ, నువ్వు వద్దు, నేను వేసుకొస్తాను’’ తాతగారి మద్దతుతో పెద్దోడు అడ్డం తిరిగాడు.

‘‘నేనూ అన్నయ్యతో వస్తాను’’ చిన్నోడు కూడా పెద్దోడితో కలిసిపోయాడు.

‘‘అదిగాదండీ, అంత ట్రాఫిక్‌లో చిన్న పిల్లలూ... అసలు సగం మీరే చెడగొడుతున్నారు వీళ్ళని- అతి గారాబం చేసి’’ మామగారి నిర్ణయం తప్పన్నట్లు అసహనం వ్యక్తం చేశాను.

‘‘బండి మీద వస్తేనే పిల్లలు చెడిపోతారా ఏమిటి?’’ మా ఆవిడ వాళ్ళ నాన్నకు మద్దతుగా నిలబడింది.

ఇక చేసేదేమీలేక, పిల్లలిద్దరూ బండి మీదా నేనూ మా ఆవిడా ట్రైన్‌లో తిరుగు ప్రయాణమయ్యాం.

*

ఆటో దిగి ఇంటి తలుపు తాళం తీస్తుండగా సెల్‌ఫోన్‌ మోగింది.

‘బహుశా మామగారయ్యుంటారు. ఇంటికి క్షేమంగా చేరామా లేదా అని అడగటానికి చేసుంటార’నుకుంటూ జేబులో నుంచి సెల్‌ఫోన్‌ తీసి చూస్తే, 108 నంబరు నుంచి కాల్‌ వస్తోంది.

కంగారుగా ఫోన్‌ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నా వణికే చేతులతో.

‘పిల్లలిద్దరికీ సిటీ శివారులో యాక్సిడెంట్‌ అయి, దెబ్బలు తగిలితే దగ్గర్లోని హాస్పిటల్లో చేర్చారట. వాళ్ళ జేబులో నా బ్యాంకు కార్డు కనపడితే ఫోన్‌ చేస్తున్నాం’ అని 108 సిబ్బంది గడగడా చెప్పారు.తీస్తున్న తాళం మళ్ళీ వేసి ‘‘పద పద’’ అంటూ మా ఆవిణ్ణి రోడ్డు మీదకు
తీసుకొచ్చా.

మేం వచ్చిన ఆటో ఇంకా అక్కడే ఉంది. ఆటో వాడేదో లెక్కలు చూసుకుంటున్నాడు.మా ఆవిణ్ణి ఆటోలోకి తోసి, నేను ఒక్క ఉదుటున ఆటోలోకి దూకి, పదమన్నాను అడ్రస్‌ చెప్తూ.

అంతా క్షణాల్లో జరిగిపోవటంతో, మా ఆవిడకేమీ అర్థంకాక, ‘‘ఎక్కడికండీ, ఏం జరిగింది’’ అంటూ కంగారుగా నా చొక్కా పట్టుకుని గుంజుతోంది. జరిగింది చిన్నగా చెప్పాను.

అంతే ఆవిడ నోట్లో నుంచి మాటలు ఆగిపోయి, కళ్ళనుంచి కన్నీరు ధారాపాతంగా కారటం మొదలైంది.

పావుగంటలో ఆటో హాస్పిటల్‌ ముందు ఆగింది. మేం ఆటో దిగుతుండగానే మా కంగారు చూసి గుర్తుపట్టినట్టున్నాడు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ ‘‘సార్‌ ఎమర్జన్సీ వార్డుకెళ్ళండి’’.

ఎమర్జన్సీ వార్డా... అసలే కంగారుగా ఉన్న మాకు అతని మాటలతో పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమయ్యుంటుంది పిల్లలిద్దరికీ? పరుగు లాంటి నడకతో ఎమర్జన్సీ వార్డు చేరుకున్నాం.

వార్డు లోపలికెళ్ళేలోపే, డాక్టరు బయటకొచ్చి ‘‘మీరు...’’ ఆరా తీశాడు మా గురించి.

పిల్లల గురించి చెప్పేసరికి ‘‘ఓ మీరేనా... రండి’’ అంటూ పక్కనే ఉన్న తన రూమ్‌కి తీసుకెళ్ళాడు.

రూములోకి అడుగుపెడుతూ ‘‘ఎలా ఉంది డాక్టర్‌... పిల్లలకు...’’ ఏడుస్తూ అడిగింది శ్రీమతి.

‘‘మిమ్మల్ని అసలు ఏమనాలో అర్థంకావట్లేదండీ’’ కోపాన్ని ప్రదర్శించాడు డాక్టరు.ఆయన కోపంలో ఏదో కీడు శంకించాను.‘‘డాక్టర్‌, ఏం జరిగింది?’’ క్షమించమన్నట్టు బతిమిలాడాను.

‘‘ఏం జరగాలండీ... జరగరానిదే జరిగింది. ఎవరన్నా హెల్మెట్‌ లేకుండా, అంత దూరం పిల్లల్ని బండి మీద పంపిస్తారా?’’ మా తప్పును ఎత్తిచూపాడు. అసలేం జరిగిందో తెలియక టెన్షన్‌తో తల పగిలిపోతోంది.

‘‘డాక్టర్‌... పిల్లలకు...’’ అంటుండగానే-‘‘పెద్దవాడికి మైనర్‌ ఇంజ్యూరీస్‌ తగిలాయి, నో ప్రాబ్లమ్‌... ఒకటి రెండు రోజుల్లో కోలుకుంటాడు. కానీ, చిన్నవాడు... ...’’ క్షణం ఆగి మా ముఖాల్లోకి చూశాడు.

ఇద్దరం ఒక్కసారిగా ‘డాక్టర్‌...’ అంటూ పెద్దగా ఏడవటం మొదలెట్టాం- వాడికేమయ్యిందో అని.

మా బాధ అర్థం చేసుకున్నవాడిలా ‘‘ఏడవకండి, ప్రాణానికేమీ ప్రమాదం లేదు. కానీ, తలకు గట్టి రాయి తగలటం వల్ల ప్రస్తుతం అన్‌కాన్షియస్‌లో ఉన్నాడు. మేజర్‌ ఆపరేషన్‌ అవసరమయ్యేట్లు ఉంది’’
వివరంగా చెప్పాడు.

ఆ మాటలతో ఒక్క క్షణం, మాపట్ల దేవుడున్నాడనిపించింది. ఆ క్షణాన డాక్టరుగారే దేవుళ్ళా కనపడ్డాడు.‘‘మీరు ఓకే అంటే, బాంబే నుంచి సర్జన్‌ని పిలిపిస్తాను, కాస్త ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది’’ అసలు విషయం చెప్పాడు డాక్టరు.

‘‘డబ్బు గురించి ఆలోచించకండి డాక్టర్‌... పిల్లాడి ప్రాణం ముఖ్యం, ఎంతైనా ఫరవాలేదు’’ అన్నాను.

ఆ మాటలకు నావంక కృతజ్ఞతగా చూసింది మా ఆవిడ. ‘‘పది పదిహేను లక్షలవుతుంది, ఓకేనా’’ మరోసారి నిర్ధారించుకోటానికన్నట్లు అడిగాడు డాక్టర్‌.

‘‘ఫర్లేదు డాక్టర్‌, కడతాం’’ ఈసారి మా ఆవిడ డాక్టరుకు భరోసా ఇచ్చింది.

‘‘సరే, అయితే రేపే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తాను, మీరు డబ్బు చూసుకోండి’’ డాక్టర్‌ వేరే పేషెంట్‌ని చూడటానికి వెళ్ళిపోయాడు.

*

డాక్టర్‌కి మాటయితే ఇచ్చాను కానీ పదిహేను లక్షలు ఎక్కణ్ణుంచి తేవాలి. సేవింగ్స్‌ మొత్తం కలిపితే ఓ అయిదు లక్షలొస్తాయి, బ్యాంకు లోను మరో అయిదు లక్షలు తీసుకోవచ్చు, ఇంకా అయిదు లక్షలు ఎలా..? ఆలోచిస్తుండగానే-

‘‘నాన్నా, పిల్లలకి యాక్సిడెంట్‌ జరిగింది. మేజర్‌ ఆపరేషన్‌ చెయ్యాలి, పది లక్షలవుతుందట...’’ శ్రీమతి వాళ్ళ నాన్నకి ఏడుస్తూ చెప్పుకుపోతోంది.

మామగారు గుర్తుకురాగానే నాకూ కాస్త రిలీఫ్‌ అనిపించింది. పిల్లల మీద అమితమైన ప్రేమ ఆయనకు. తప్పకుండా సాయం చేస్తారు.

‘‘నాన్నా, పోనీ కనీసం అయిదు లక్షలు...’’ బతిమిలాడుతోంది శ్రీమతి.

రెండు నిమిషాల తర్వాత ఫోన్‌ పెట్టేసి నా పక్కకు చేరి ‘‘నాన్న దగ్గర యాభైవేలు మించి లేవట. ఉన్నదంతా మనకీ మన పిల్లలకే ఖర్చు చేశానంటున్నారు’’ ఏడుస్తూ చెప్పింది. ఇంతలో డాక్టర్‌ నా దగ్గరకొచ్చి ‘‘మీ వాడికి ఆపరేషన్‌ చేస్తున్నాం’’ అన్నాడు.

‘‘డాక్టర్‌, అదీ... డబ్బు...’’ అంటూ నసిగాను.

‘‘మీ బిల్లంతా కట్టేశారు’’ చెప్పాడు డాక్టర్‌. ‘‘కట్టేశారా...  ఎవరు డాక్టర్‌!’’ అడిగాను అనుమానంగా.

‘‘అదిగో, ఆ పెద్దాయన’’ బిల్‌ కౌంటర్‌ దగ్గర డబ్బు కడుతున్న నాన్నగారి వంక చూపించాడు డాక్టరు.

‘నాన్నగారు..? ఆయనకెలా తెలిసింది..?’ అనుకునేలోపే, ఆయనే మా దగ్గరకొచ్చి ‘‘పండగలకీ పబ్బాలకీ ఎటూ రావట్లేదు, ఆపదల్లో కూడా అమ్మా నాన్నా ఉన్నారని గుర్తుకురాలేదా?’’ కోప్పడ్డారు నామీద.

‘‘అంటే... మీరు కంగారుపడతారని... అయినా, మీకెలా...’’ ఎవరు చెప్పుంటారని ఆలోచిస్తూ గొణిగాను.

‘‘నేనే చెప్పానండీ. మీ నాన్నగారు, మా గురువుగారు. నేను ఆయన దగ్గర పాఠాలే కాదు... విలువలూ వ్యక్తిత్వమూ నేర్చుకున్నాను. మీరు మాకు రాసిచ్చిన ఆపరేషన్‌ అండర్‌టేకింగ్‌లో, సన్నాఫ్‌ అని మీరు రాసిన గురువుగారి పేరు చూసి వెంటనే కబురుపెట్టాను’’ అసలు విషయం చెప్పాడు డాక్టర్‌.

‘‘అవున్రా, నా తాలూకు అని తెలియగానే బిల్లు కూడా బాగా తగ్గించాడు. కేవలం ఆపరేషన్‌ ఖర్చులే తీసుకుంటున్నాడు’’ కృతజ్ఞతగా తన శిష్యుడి వంక చూశాడు నాన్నగారు.

ఆ క్షణాన నాన్నగారిలో నాకు దేవుడు కనపడ్డాడు. నాన్నగారి గురించి తప్పుగా ఆలోచించినందుకు ఒక్క క్షణం నాకే సిగ్గేసింది.

మా ఆవిడ కూడా ఆయన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపపడుతూ తల దించుకుంది.

‘‘కంగారుపడాల్సిందేమీ లేదమ్మా, డబ్బు మొత్తం కట్టేశాను’’ మా ఆవిడ కన్నీటిని చూసి ఓదారుస్తూ అన్నారు నాన్నగారు.

ఆ మాటలకు మా ఆవిడ అమాంతం నాన్నగారి చేతులు పట్టుకుని ఇంకా బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది.

‘‘అయ్యయ్యో, ఏమిటమ్మా ఇది... డాక్టరుగారు చెప్పారుగా కంగారేంలేదని. నువ్వన్నా ఓదార్చరా’’ నావంక చూస్తూ అన్నారు.

ఆయనకేం తెలుసు ‘ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపంతో శ్రీమతి తన బాధనంతా, ఏడుపు రూపంలో వెళ్ళగక్కుతోందని.’

‘‘సంపాదించేది ఎవరికోసమమ్మా, పిల్లల కోసమే కదా. కాకపోతే, వాళ్ళ భవిష్యత్తు కోసమని దాచాను. కానీ, ఇలా ఖర్చు చెయ్యాల్సి వస్తోంది’’ నాన్నగారు తన పెన్షన్‌ మొత్తాన్ని ఏం చేస్తున్నారో చెప్పకనే చెప్పారు.

ఆయన మాటలకు నేనూ మా ఆవిడా ఆయనపట్ల చేసిన తప్పు పైకి చెప్పలేక తలలు దించుకున్నాం.

‘‘పిల్లలకి రెక్కలొచ్చి ఎగురుతున్నప్పుడు, ఎగరనివ్వాలి. కానీ, అదే పిల్లలు రెక్కలు దెబ్బతిని కింద పడుతున్నప్పుడు... తల్లిదండ్రులం... మన రెక్కల్ని వాళ్ళ రెక్కలుగా చేసి అండగా నిలబడాలి’’ తల్లిదండ్రుల అవసరాన్ని గుర్తుచేస్తున్నారు నాన్నగారు.

‘‘కానీ, పిల్లలకు రాని రెక్కలనూ లేని రెక్కలనూ వాళ్ళకున్నట్లు భ్రమ కల్పించి ఎగరనిస్తే, కిందపడి ఇలాగే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. వాళ్ళకు వాస్తవాలు చెబితే, కాగితపు రెక్కల జోలికి వెళ్ళరు. తల్లిదండ్రులుగా మనం బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు.’’

నాన్నగారి ప్రతి మాటా అక్షరసత్యం. పిల్లలపట్ల తానెంత తప్పు చేస్తోందో అర్థమయింది శ్రీమతికి- నాన్నగారి మాటలు విన్నాక.క్షమించమని అడగటానికి కూడా నోరు రాక, పక్కనే ఉన్న బెంచీపై కూలిపోయింది.తన పరిస్థితి అర్థమై ఓదార్చటానికి పక్కన కూర్చున్నాను- కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ.

‘‘గురువుగారూ, నన్ను ఆశీర్వదించండి’’ అంటూ నాన్నగారి కాళ్ళకు నమస్కారం చేస్తున్న డాక్టరుగారు, నా కళ్ళకు మసక మసకగా కనపడుతున్నాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.