close
యాత్రా కవితలు

ప్రయాణాలు చేయడమూ ఆ యాత్రానుభవాల్ని వ్యాసాలుగా రాయడమూ కొందరికి ఇష్టమైన వ్యాపకం. దేవీప్రసాద్‌ ఆ పనినే కాస్త వైవిధ్యంగా వచనకవితల రూపంలో చేశారు. పలు దేశాలను సందర్శించి ఆ అనుభూతులకు ఆయా నగరాల చరిత్రల్నీ ప్రత్యేకతల్నీ చేర్చి కవితలుగా రాశారు. ఆయన దృష్టిలో జెరూసలేం ‘ముగింపులేని వివాదాల నగరం’, ప్యారిస్‌ ‘ధాత్రిలో ఏ రాత్రీ నిద్రపోని ఏకైక నగరం’. మూడు రాజధానుల ముచ్చటైన దేశంలో (సౌతాఫ్రికా) ఇప్పుడిప్పుడే సమానత్వ సంబరాలు య్యాటలాడుతున్నాయంటూనే సొవెటో వీధుల్లో ఆకలి వెతల్నీ గుర్తుచేస్తారు. మనదేశంలోని సిమ్లాని ‘ఆకాశం, అవని ముద్దాడే మురిపెం’గానూ ‘దేవుడు తనకోసం నిర్మించుకున్న వారణాశి’ని ‘ఆద్యంతాలు లేని అతి ప్రాచీన నగరం’గానూ అభివర్ణిస్తూ ఆయా ప్రాంతాల ప్రత్యేకతల్ని అక్షరీకరించారు కవి.

- శ్రీ

విశ్వవిహారం (యాత్రాకవితలు)
రచన: దేవీప్రసాద్‌ జువ్వాడి
పేజీలు: 120; వెల: రూ. 100/-
ప్రతులకు: నవోదయ పుస్తకకేంద్రాలు


అనుబంధాల కథలు

ప్రేమకు చిరునామా అమ్మ. అందరికీ అన్నీ ఇవ్వడమే తప్ప ఎప్పుడూ ఏదీ అడగని ఆ కన్నతల్లికి ఏదైనా అనూహ్య బహుమానం అందించాలనుకుంటారు బిడ్డలు. ముగ్గురూ మాట్లాడుకుని ఒక్కసారిగా ఆమె దరిచేరి ఏం ఇచ్చారన్నదే ‘అమ్మకు బహుమతి’. ఆ మాతృమూర్తి ఎలా స్పందించిందన్నదే కొసమెరుపు. పుస్తకంలోని 19 కథలూ కుటుంబ బంధాలకు అద్దంపడతాయి. అమ్మభాషను కాదంటే పుట్టగతులు ఉండవంటుంది ‘దాహార్తి’. భూమి తల్లిని కేవలం పెట్టుబడిగా మార్చి చూడొద్దని ‘మనుగడ’ చెబుతుంది. జీవనయాగం, అభిలాష, పైకప్పు,  పారాహుషార్‌ కథానికలూ చదువరులకు సున్నిత,  సునిశిత భావోద్వేగాలను కలిగిస్తాయి.

- శరత్‌

అమ్మకు బహుమతి (కథలు)
రచన: సింహప్రసాద్‌
పేజీలు: 166; వెల: రూ. 80/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ప్రయాణంలో పదనిసలు

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లోని లేడీస్‌ కంపార్టుమెంట్లో ప్రయాణించే ఉద్యోగినుల జీవిత ప్రయాణాల కథ ఇది. రైల్లో వారి ప్రతి మాటా ప్రతి చేష్టా సమాజంలోని స్త్రీల పరిస్థితులకు అద్దంపడతాయి. రోజూ అంతదూరం ప్రయాణించి ఉద్యోగం చేయడం ఇబ్బందిగానే ఉన్నా, పనిచేసేచోటే నివాసం ఉండాలన్న నియమాన్ని పాటించడం లేదని తెలిసినా- కుటుంబాలను కాపాడుకోవడానికి తప్పదంటూ సమర్థించుకుంటారు. తప్పని ఇంటిచాకిరీ, లేని ఆర్థిక స్వేచ్ఛ, భర్తల ఆధిపత్యం... ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. వాటిని సహప్రయాణికులకు చెప్పుకుని సాంత్వన పొందుతూ సాగిపోయే ఆ ప్రయాణం స్త్రీ ఆప్యాయత, అసహాయత, అసూయ, అసహనం, అమాయకతల సమాహారం. చక్కటి కథనంతో పాఠకుల్నీ రైల్లోకి తీసుకెళ్తారు రచయిత్రి.

- పద్మ

లేడీస్‌ స్పెషల్‌ (నవల)
రచన: డా।।పరిమళా సోమేశ్వర్‌
పేజీలు: 103; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 040 24046291


విభిన్న ఇతివృత్తాలు

రష్యన్‌ విప్లవనేత లెనిన్‌ మాతృమూర్తి మరీయా. తుది దశలో తన కుటుంబంతో పాటు ఉద్యమ దశలన్నింటినీ వెల్లడించడమే ఈ ఆత్మకథ సారాంశం. భర్తను కోల్పోయినా, పెద్ద కొడుకు రైతు విప్లవంలో ఉరిశిక్ష పాలైనా, రెండోవాడు శ్రామిక పోరాటంలో ప్రవాసం వెళ్లినా మిగిలిన ముగ్గురూ పోరుదారి పట్టి జైళ్లలో మగ్గినా చెక్కుచెదరదు. ఆ తల్లి మనసూ సామాజిక భావజాలమూ కలగలిసిన తీరును హృద్యంగా ఆవిష్కరిస్తుందీ ‘ఆత్మకథ’. ‘ప్రవాసం’ కథ లెనిన్‌ ప్రవాస జీవిత మూలాలనూ ప్రయాణాల అనుభవాలనూ వివరిస్తుంది. మిగిలిన కథలన్నీ విభిన్న ఇతివృత్తాలతో ఆకట్టుకుంటాయి. అవసరం, మనిషిలో మనిషి, కనకమ్మ గారి కష్టం, రిమాండ్‌ ఖైదీ - వేటికవే ప్రత్యేకం.

- సుధామాధురి

ఒక విప్లవమాత ఆత్మకథ
మరికొన్ని ఇతర కథలు
రచన: ఎన్‌వీఎస్‌ నాగభూషణ్‌
పేజీలు: 211; వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.