close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘టాటా’ అంటే నాకు జీవితం!

వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా వయసు 28 కాదు, 82. ఈ వయసులోనూ ఆయన భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ఈ మధ్యనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. ఓవైపు టాటా గ్రూప్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే  మరోవైపు వ్యక్తిగతంగా అంకుర సంస్థల్లోనూ పెట్టుబడి పెడుతున్నారు. యువత గురించీ ప్రస్తుత బాధ్యతల గురించి ఆయన ఏం చెబుతున్నారంటే...

నో చెప్పలేను!

సరైన దారిలో వెళ్లడం, సరైన నిర్ణయం తీసుకోవడం కష్టమైన పని. కానీ అన్నింటికంటే అవే అత్యుత్తమమైన విధానాలు. ఎవరికైనా చేతనైతే మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు. పెద్ద సంస్థలకు తమ పోటీ సంస్థల్ని దివాలా తీయించాలన్న ఆలోచన ఉండదు. కొందరు కొన్ని కంపెనీల్ని సొంతంచేసుకుని వాటిని పూర్తిగా మూసేస్తారు. అలాంటి వార్తలు నన్ను బాధపెడతాయి. ఇతర కంపెనీలూ, ఇతర వ్యక్తుల ఎదుగుదలను ఆనందించగలగడమే అసలైన సంతోషం. ఎవరైనా నన్ను కలవడానికి వస్తామంటే నో చెప్పలేను. వాళ్లు బాధపడతారేమోనని నేనే టైమ్‌ సర్దుబాటు చేసుకుంటాను.


ఈతరంతో నేర్చుకుంటున్నా!

అంకుర సంస్థల్ని పెట్టేవాళ్లు ఎవరూ వెళ్లని కొత్తదారుల్లో వెళ్లడానికి చూడాలి. సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి. 30 వరకూ అంకుర సంస్థల్లో(ఓలా ఎలక్ట్రిక్‌, పేటీఎమ్‌, స్నాప్‌డీల్‌, టార్క్‌ మోటార్స్‌, అర్బన్‌ లేడర్‌, క్లైమ్‌సెల్‌) పెట్టుబడులు పెట్టాను. ఈతరంతో పనిచేస్తుంటే నేర్చుకునే అవకాశమూ వస్తోంది. నాకు భవిష్యత్తు ప్రాజెక్టులు నచ్చుతాయి. ఆరోగ్యం, వైద్య సేవల విభాగంలో మరిన్ని పెట్టుబడులు పెడతా. యువతతో- ముఖ్యంగా యువ వ్యాపారులతో ఎన్నో అనుభవాల్నీ, ఆలోచనల్నీ పంచుకోవాలనిపిస్తుంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచాను.


అదే కోరుకుంటున్నా

ఇండియాని సమాన అవకాశాలున్న దేశంగా చూడాలన్నది నా ఆశ. పేద, ధనిక భేదం లేకుండా ఎవరైనా తమ లక్ష్యాల్ని చేరుకునేలా అవకాశాలు కల్పించగలగాలి. చదువు, ఉద్యోగం కోసం పదేళ్లు అమెరికాలో ఉన్నాను. నా జీవితంలో అత్యుత్తమ సమయం అంటే అదే. అప్పుడా దేశం నాకు సమాన అవకాశాలున్నదిగా కనిపించింది. భారత్‌లో అలాంటి వాతావరణం చూడాలనుకుంటున్నా. దానికోసం టాటా ట్రస్ట్‌ల ద్వారా నా వంతు కృషిచేస్తున్నాను. 


కోరిక తీరలేదు...

రిటైర్మెంట్‌ తర్వాత ఖాళీ దొరుకుతుంది... పెయింటింగ్‌, పియానో నేర్చుకోవచ్చనుకున్నా. పెయింటింగ్‌ ఎప్పుడూ నేర్చుకోలేదు కానీ పియానో అప్పట్లో కొన్నాళ్లు నేర్చుకున్నాను. మళ్లీ నేర్చుకోవాలని కూర్చొని వాయించే ఎలక్ట్రానిక్‌ పియానో కూడా కొన్నాను. రిటైరయ్యాక పెయింటింగ్‌ మొదలుపెట్టలేదు కానీ, పియానోకి గురువుని కూడా పెట్టుకున్నాను. కొద్దిరోజులు నేర్చుకోవడాన్ని ఆస్వాదించాను కూడా. కాకపోతే దానికి చాలా శ్రమ పడాలి. టైమ్‌తోపాటు ఎంతో ఓర్పూ, సహనం అవసరం. ఈ వయసులో నేనంత ఓపిగ్గా కూర్చోలేను... అదే నాకు కాస్త దిగులు.


పెట్స్‌తోనే కాలక్షేపం!

నాకు పెట్స్‌, ముఖ్యంగా కుక్కలు అంటే ఇష్టం. నా మొదటి పెంపుడు కుక్క ఇప్పటికీ గుర్తే! జుహూ బీచ్‌లో నేను బంతి విసరడం అది తేవడం... అలా ఎన్నో సాయంత్రాలు గడిపేవాణ్ని. టాటా ప్రధాన కార్యాలయం(బోంబే హౌస్‌)లో వీధి కుక్కలు సేదదీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. డాగ్‌ఫుడ్‌ అందించే అంకుర సంస్థలో పెట్టుబడి కూడా పెట్టాను. వీధికుక్కల మెడలో రేడియం బెల్టులు పెట్టే మరో ప్రాజెక్టుకీ సాయపడ్డాను. ప్రస్తుతం ఇంట్లో టిటో, మేగ్జిమస్‌ ఉన్నాయి. వాటికి స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఉంది. ఇంట్లో ఉంటే వాటితోనే కాలక్షేపం. 


వయసు నిబంధన తెచ్చా

జేఆర్డీ వయసు తొంభై దాటాక నేను ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాను. అప్పుడు బోర్డులో చాలామంది వృద్ధులు ఉండేవారు. వాళ్లు కష్టంగా మీటింగుకు వచ్చి నిద్రపోతుండేవారు. అప్పుడే బోర్డు సభ్యులకూ, ఛైర్మన్‌కీ వయో పరిమితి ఉండాలని నియమం తెచ్చాను. ‘కంపెనీ ఛైర్మన్‌ను ఎవరూ పొమ్మనలేరు. వయసు మాత్రమే ఆ విషయాన్ని గుర్తుచేయాలి’ అంటారు ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త జీన్‌ రిబౌడ్‌. అందుకే 75 ఏళ్లకు రిటైరవ్వాలనుకున్నాను. కానీ కంపెనీ పరిస్థితి బాగాలేనపుడు తిరిగి రావడానికి సందేహించలేదు. ‘టాటా’ అంటే నాకు ఒక ఉద్యోగమో ఒక సంస్థో కాదు, అది నా జీవితం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.