close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూర్యదేవా... శిరసా నమామి!

‘‘సప్తాశ్వ రథమారూఢం... ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం... తం సూర్యం ప్రణమామ్యహమ్‌!!’’ అంటూ ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని రథసప్తమి (ఫిబ్రవరి 1) నాడు మనసారా పూజిస్తాం. కేవలం సూర్యారాధనే కాదు... మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున జరుపుకునే ఈ పర్వదినం నాడు చేసే స్నానం, పూజ వెనుకా ఉన్న కారణాలు, రహస్యాలు చాలానే ఉన్నాయంటున్నాయి శాస్త్రాలు.

సూర్యుడు... సమస్త జగతికీ మూలాధారం. కాలానికి అధిపతి. ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగుతోపాటూ దర్శనమిచ్చే సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు రథసప్తమి... అంటే సూర్యుడి పుట్టిన రోజు. ఆదిత్యుడి రథాన్ని గమనిస్తే... దానికి ఒక చక్రం, ఏడు అశ్వాలు ఉంటాయి. ఆ చక్రం కాలచక్రమైతే... సూర్యుడి కిరణాలే ఆ అశ్వరూపాలు.  సప్త అనే అశ్వం ఆ రథాన్ని లాగుతుంటుంది. ఆదిత్యుడి నుంచి ఉత్పన్నమయ్యే కిరణాల్లో ఏడో కిరణం సప్త అనే నామంతో ఉంటే... మిగిలిన ఆరు కిరణాలు ఆరు రుతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయంటోంది వేదం. రవి మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చే సప్తమి సమయంలో సూర్యకిరణాలు నేలపై పుష్కలంగా పడతాయంటారు. ఆ శక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లు, పారే నీటిపైన ఎక్కువగా ఉంటుంది. అందుకే రథసప్తమి నాడు చేసే పూజ, స్నానం ఎంతో విశిష్టమని చెబుతారు. ఈ రోజున ఏడు జిల్లేడు లేదా రేగు ఆకుల్నీ రేగుపండ్లనీ తలమీద పెట్టుకుని స్నానం చేయాలంటారు. సూర్యుడికి జిల్లేడు ఆకులు ఎంతో ప్రీతికరమైనవి. ఈ స్నానం ఏడు జన్మల పాప కర్మలను నశింపచేస్తుందని పురాణాలు చెబితే, దీనివెనుక ఆరోగ్య రహస్యమూ ఉందంటున్నాయి శాస్త్రాలు. సూర్యకిరణాలు పడిన జిల్లేడు లేదా రేగుఆకులనూ రేగుపండ్లనూ తలపైన పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఆ తరువాత వచ్చే వేడిని- అంటే వేసవిని తట్టుకునే శక్తి శరీరానికి వస్తుందంటారు.

ఆరోగ్య ప్రదాతగా...
సూర్యుడికి నేరుగా నమస్కరించడం ఒక పద్ధతైతే రకరకాల నామాలతో అర్చించడం మరో పద్ధతి. ఆదిత్యుడిని పూజించే నామాలు రామాయణ, మహాభారత సమయాల్లో ఉద్భవించాయి. పురాణాలను గమనిస్తే... రాముడు రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయి, నిస్తేజానికి లోనైనప్పుడు అగస్త్యుడు వచ్చి ఆదిత్యహృదయాన్ని ప్రభోదించాడట. ఆ తరవాతే రాముడు అపారమైన శక్తితో రావణుడిని సంహరించాడని వాల్మీకీ రామాయణం చెబుతోంది. ధర్మరాజు కూడా దౌమ్యుడి ద్వారా సూర్య అష్టోత్తర సహస్రనామాల్ని తెలుసుకుని జపించాడని భారతంలో ఉంది. కృష్ణుడి కుమారుడు సాంబుడు తనకు వచ్చిన కుష్టువ్యాధిని సూర్యారాధన చేసే తగ్గించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అవి చదివినా, చదవకపోయినా... ఈ రోజున సూర్యారాధన చేయడంలో ఆరోగ్యరహస్యమూ దాగుంది. రథసప్తమి రోజు పొద్దున్నే స్నానం చేశాక... ఆరుబయట ఆవుపిడకల మంట మీద పరమాన్నం వండి... సూర్యుడికి నివేదించాలంటారు. ఆరుబయటే పరమాన్నం చేయడం, భాస్కరుడికి నివేదించే క్రమంలో ఆ పదార్థంపై లేలేత సూర్యకిరణాలు పడతాయి. అలా నివేదించిన పదార్థాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కేవలం రథసప్తమి నాడే కాదు... మిగిలిన ఏడాదంతా రోజూ కాసేపు ఆ కిరణాల ఎదురుగా కాసేపు గడిపినా చాలు.. శరీరానికి అవసరమైన డి విటమిన్‌ అంది అనారోగ్యాలు దూరమవుతాయని సైన్స్‌ చెబుతోంది. ఇంకా కుదిరితే... సూర్యుడి ఎదురుగా సూర్యనమస్కారాలూ చేయొచ్చు. వాటితో శారీరక, మానసిక ఆరోగ్యం సొంతమవుతుంది. ఇవేవీ సాధ్యం కానప్పుడు... సూర్యుడి ఎదురుగా నిల్చుని ఓ నమస్కారం చేసినా చాలంటారు. రథసప్తమికి మరో ప్రత్యేకతా ఉంది. ఇది నోములు ప్రారంభించేందుకు అనువైన రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పదహారు ఫలాలు, కైలాసగౌరీ.. ఇలా ఏ నోము అయినా... ఈ రోజున మొదలుపెట్టి, ఏడాదిలోపు ఎప్పుడైనా పూర్తిచేసి, ఉద్యాపన చెప్పుకోవచ్చు. ఒకవేళ రథసప్తమి నాడు నోము మొదలుపెట్టడం సాధ్యం కాకపోతే శివరాత్రి నాడు చేయొచ్చంటారు.

చైతన్యప్రదాతగా...
సూర్యారాధనను పక్కనపెడితే.. ఆదిత్యుడు ఈ జగతికి అమూల్యమైన సందేశం ఇస్తాడు. సూర్యోదయం, సూర్యాస్తమయం క్రమశిక్షణకు నిదర్శనం. సమస్యలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకూడదనీ దుఃఖం వెంటే కష్టం ఉంటుందనీ చీకటి వెంటే వెలుగూ వస్తుందనీ అంతవరకూ ఎదురుచూడాలనీ తన గమనం ద్వారా తెలియజేస్తున్నాడు. పాపపుణ్యాలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలంటూ తననే ఉదాహరణగా చూపించే సూర్యుడు గురువుగానూ గుర్తింపు పొందాడు. హనుమంతుడికి గరిమా, లఘిమా సిద్ధుల్ని నేర్పించింది ఆదిత్యుడే. ఈ సిద్ధులతోనే హనుమంతుడు కావాలనుకున్నప్పుడు అత్యంత పెద్దగా లేదా చిన్న ఆకారంలోకి మారిపోయే శక్తిని సొంతం చేసుకున్నాడు. కర్ణుడూ సూర్యుడి పుత్రుడిగా తండ్రి నుంచి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడని భారతం చెబుతోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.