close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రకటనలు దూసుకుపోతున్నాయ్‌..!

టీవీలో వార్తలో సినిమాలో సీరియళ్ళో చూస్తున్నప్పుడు- సడెన్‌గా సీన్‌ కట్‌ అయి, ఏదో ప్రకటన వస్తుంటుంది. యథాలాపంగా దాన్ని చూసినా ఆ ప్రభావం వీక్షకులమీద తప్పక ఉంటుంది. వాళ్లలో చాలామంది ఒక్కసారైనా దాన్ని కొని చూడాలనుకుంటారు. అందుకే కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలకోసం దినపత్రికలూ టీవీలూ రేడియోలూ డిజిటల్‌ బోర్డులూ హోర్డింగుల్ని ప్రకటనలతో హోరెత్తిస్తుంటాయి. ఇవన్నీ సరిపోనట్లు ఇప్పుడు కార్లూ ప్రకటనలతో రయ్‌ రయ్‌న దూసుకుపోతున్నాయ్‌.

‘కారు కొంటున్నారా? అయితే మీరు ఈఎమ్‌ఐలు కట్టాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మీ కారు మీద కొంత స్థలాన్ని మాకిస్తే చాలు’ అని ఎవరైనా అడిగితే ఆశ్చర్యపోకండి. అవునుమరి, ఇప్పుడు కార్లూ ప్రకటనలతో దూసుకెళ్లిపోతున్నాయి. కారు కొని ట్యాక్సీగానో లేదా క్యాబ్‌ కంపెనీలకో ఇచ్చేవాళ్లు- అంటే, వాణిజ్య అవసరాలకోసం కారుని కొని తిప్పేవాళ్లు ప్రకటనల ద్వారా కూడా అదనపు ఆదాయాన్నీ పొందవచ్చన్నమాట. ఇందుకోసం కారు సొంతదారుల్నీ కంపెనీల్నీ అనుసంధానిస్తూ క్యాష్‌యువర్‌డ్రైవ్‌, బ్రాండ్‌ఆన్‌వీల్జ్‌, ర్యాప్‌టుఎర్న్‌... వంటి కార్‌ బ్రాండింగ్‌ సంస్థలు అనేకం దేశంలో పుట్టుకొచ్చాయి. అన్ని మెట్రో నగరాల్లోనూ ఇవి పనిచేస్తూ కారు ఓనర్లకు అంతో ఇంతో ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.  ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే కనిపించిన ఈ ట్రెండ్‌, క్రమేణా మనదగ్గరా పెరుగుతోంది. మొదట్లో ఈ రకమైన ప్రకటనలు బస్సులూ ట్రక్కులూ ఆటోల మీద మాత్రమే కనిపించేవి. ఈమధ్య కారు ఓనర్లు సైతం ఈ ప్రకటనల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే- కారు అనేది చాలామందికి ఓ కల. అలా కొన్న కారుని కేవలం తమకోసమే వాడుకుంటే లోను కట్టడం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అందుకే అవసరమైనప్పుడు మాత్రం తమకోసం వాడుకుని మిగిలిన సమయాల్లో క్యాబ్‌ సర్వీస్‌కోసం ఇస్తుంటారు. అలాంటివాళ్లు కారుపైనున్న కొంత స్థలాన్ని ప్రకటనలకి ఇవ్వడం ద్వారానూ డబ్బు సంపాదించవచ్చు. అయితే దీనికోసం వాణిజ్య పరమైన లైసెన్స్‌ తీసుకోవాలి. ఎందుకంటే పర్సనల్‌ లైసెన్స్‌తో కారుని ప్రకటనలకి ఇవ్వడం చట్టరీత్యా నేరం. కాబట్టి రవాణాసంస్థ అనుమతి తప్పనిసరి.

కారే ఎందుకు?
దేశంలో చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అన్ని పట్టణాలూ నగరాల్లో ట్యాక్సీలూ క్యాబ్‌ సర్వీసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దాంతో కార్లూ ప్రకటనలకు వేదికలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పీక్‌ అవర్స్‌లో ట్రాఫిక్‌ జామ్‌లు సర్వసాధారణం. ఆ సమయంలో చాలామంది చూపు పక్కనో లేదా ముందో ఉన్న కారుమీద ఆగిపోతుంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రకటన సంస్థలు కార్లనీ వాడేసుకుంటున్నాయి. నిజానికి మనదేశంలో కారు బ్రాండింగ్‌ మొదలయ్యింది కూడా ట్రాఫిక్‌జామ్‌లోనేనట. ఓసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్న రఘు ఖన్నాని ట్రక్‌ వెనకాల ఉన్న ఫన్నీ స్లోగన్‌ బాగా ఆకర్షించడంతో వచ్చిన ఆలోచన ఫలితమే క్యాష్‌యువర్‌డ్రైవ్‌. అప్పటి నుంచీ ఆ సంస్థ, ప్రకటనలతో కార్లను కొత్తగా డిజైన్‌ చేసేస్తోంది.

అదీగాక రోడ్లన్నీ హోర్డింగులూ బిల్‌బోర్డులూ పోస్టర్లూ బ్యానర్లతో కిక్కిరిసిపోయాయి, ఇక కొత్త ప్రకటనలకు స్థలం ఎక్కడ ఉందీ అని వెతికితే అది కచ్చితంగా రోడ్డూ దానిమీద వెళ్లే కార్లే అని చెప్పాలి. ఉదాహరణకు ఓ క్యాబ్‌ లేదా ప్రైవేటు ట్యాక్సీ రోజుకి కనీసం రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదీ నగరంలోని అన్ని ప్రాంతాలనీ చుట్టి వస్తుంది. పైగా అందులో ఎక్కి కూర్చునేవాళ్లూ గంటగంటకీ మారిపోతుంటారు. అంటే- ఎంత లేదన్నా ఒక్కరోజులో వేల మంది చూపు ఒక్క క్షణమైనా దానిమీద పడుతుందన్నమాట. ముఖ్యంగా ఓ కూడలిలోనో లేదా గోడమీదో కనిపించే హోర్డింగు లేదా పోస్టరు కన్నా కదిలే వాహనంమీద కనిపించే ప్రకటనే ఎక్కువమందిని ఆకర్షిస్తుందనేది యాడ్‌ సంస్థల అంచనా. ఆ కారు రోజూ ఎక్కడెక్కడికి వెళుతుంది, ఎంత దూరం తిరుగుతుంది అనేదానిమీద కూడా ప్రకటనల ధర ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇటీవల చాలా కంపెనీలు తమ ఉత్పత్తులు లేదా బ్రాండ్‌ను జనంలోకి తీసుకెళ్లడానికి ఈ కారు ప్రకటనల పట్ల మక్కువ చూపుతున్నాయి. కెఎఫ్‌సీ, స్విగ్గీ, ఎంటీఆర్‌... వంటి ప్రముఖ బ్రాండ్‌లతోబాటు బాలీవుడ్‌ సైతం ఈ కారు బ్రాండింగ్‌ పట్ల ఆసక్తి చూపడం విశేషం. ఓ సినిమా విడుదలకి ముందు లేదా ఉత్పత్తిని మార్కెట్లోకి వదిలేముందు రకమైన ప్రకటనల్ని ఒకేసారి అనేక వాహనాలమీద నెలరోజులపాటు ఇవ్వడం వల్ల నగరంలో ఎక్కడ చూసినా అదే కనిపించి, చాలామందికి నోటెడ్‌ అయిపోతుంది. పైగా ‘క్యాబ్‌లన్నీ ఒకేచోట పార్కు చేసినప్పుడు అందరి చూపూ దానిమీద నిలిచిపోవడం ఖాయం. ఓ బిల్‌బోర్డుమీద ప్రకటన రాయడం వల్ల ఆ స్పాట్‌కి వెళ్లినవాళ్లు మాత్రమే చూడగలరు. కానీ వాహనంమీద రాసిన ప్రకటన దానంతట అదే జనంలోకి చొచ్చుకునిపోతుంది’ అని చెబుతున్నారు అడ్వర్టయిజింగ్‌ కంపెనీల వాళ్ళు.

ఎలా అతికిస్తారు?
ప్రకటనలకోసం వినైల్‌ ర్యాప్‌ను కారుమీద అతికించేసి దానిమీద ఆయా కంపెనీల ప్రకటనల్ని డిజైన్‌ చేస్తున్నారు. కొన్ని ప్రకటనలయితే కారు డిజైన్‌లో భాగమా అనిపించేంత అందంగానూ ఉంటున్నాయి. టీవీల్లో వచ్చే ప్రకటనలు తీయడానికే కాదు, ఓ కారుమీద యాడ్‌ రాసేందుకూ ఎంతో సృజన అవసరం అనేలా కార్లమీద బ్రాండ్‌ డిజైన్‌నూ తీర్చిదిద్దుతున్నారు. కొన్ని కంపెనీలు కారు లోపలి భాగాన్నీ వదిలిపెట్టడం లేదు. దీంతోబాటు మెష్‌ బ్రాండింగ్‌ అంటే- కారు అద్దాల మీదా ప్రకటనలు రాయడం పెరిగింది. దీనివల్ల కారులో కూర్చున్నవాళ్లకి ఎండ రాదు సరికదా, ఇందులో వాడే వినైల్‌ ఫిల్మ్‌ కారణంగా అద్దంమీద రాసిన ప్రకటన బయటివాళ్లకు కనిపిస్తుంది. కానీ లోపల కూర్చున్నవాళ్లకి ఫిల్మ్‌లోపల ఉన్న రంధ్రాల కారణంగా బయటి వ్యూ మామూలుగానే కనిపిస్తుంది. దాంతో కొందరు కారు మొత్తంగా కాకుండా అద్దాల్ని మాత్రమే బ్రాండింగ్‌కి ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు. కారుని బ్రాండింగ్‌కి ఇవ్వడంవల్ల పాత కారు కూడా కొత్త లుక్కుతో కనిపిస్తుందనేది కొందరి అభిప్రాయం. పైగా ప్రకటన ఎటూ వినైల్‌ కాగితమ్మీదే ఉంటుంది కాబట్టి లోపల కారుకి ఉన్న రంగూ చెక్కుచెదరదు. ప్రకటన వద్దనుకున్నప్పుడు పెయింటింగ్‌ ఏమాత్రం పాడవకుండా వినైల్‌ షీట్‌ను సులభంగా తీసేయనూవచ్చు. అంతేకాదు, మరింతమంది వీక్షక్షుల్ని ఆకర్షించేలా కొన్ని క్యాబ్‌ లేదా ట్యాక్సీలు చిన్న సైజు బిల్‌బోర్డుల్నీ నెత్తికెక్కించుకుంటున్నాయి. సో... భవిష్యత్తులో క్యాబ్‌ తరహా వాహనాలన్నీ ప్రకటనలతో దూసుకుపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.