close

రెడీ టు కుక్‌ బిర్యానీ తెస్తాం!

శ్రీనివాస ఫార్మ్స్‌... దేశ పౌల్ట్రీ రంగంలో ప్రత్యేక స్థానం ఉన్న సంస్థ. అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఈ సంస్థని గత రెండు దశాబ్దాలుగా ముందుండి నడిపిస్తున్నారు సురేష్‌ రాయుడు చిట్టూరి. విలువల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే కాలానుగుణంగా మార్పులు తీసుకొచ్చి సంస్థను ఆధునిక బాట పట్టించారు సురేష్‌. ‘ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌’ ఛైర్మన్‌గానూ ఎంపికై, ఆసియానుంచి ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. వెయ్యికోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థకు ఎండీ అయిన సురేష్‌ వ్యాపారవేత్తగా తన ప్రస్థానాన్ని మనకు వివరిస్తున్నారిలా...

నాన్న జగపతిరావు 1965లో ‘శ్రీనివాస హ్యాచరీస్‌’ని ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కూళ్ల నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చిన్న ఫామ్‌తో మొదలుపెట్టారు. ఇంటి దగ్గర్లోనే ఫామ్‌ ఉండేది. గుడ్లుపెట్టే కోడి పిల్లల్ని(లేయర్స్‌) రైతులకు ఇచ్చి వారి దగ్గర గుడ్లను కొని మార్కెట్‌లో అమ్మడమే మా వ్యాపారం. క్రమంగా వ్యాపారం అభివృద్ధి చెందింది. టీవీ, స్కూటర్‌, కారు, ఏసీ... ఇవన్నీ ఒక్కొక్కటే ఇంటికి రావడం నాకు బాగా గుర్తు. ఇంటర్మీడియెట్‌ వరకూ హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. బెంగళూరులోని ఆర్‌వీ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశాను. అప్పుడే అమెరికా వెళ్లే ఆలోచన కూడా వచ్చింది. అయితే, ఇంజినీరింగ్‌ పూర్తయ్యే సమయానికి మా వ్యాపారం మీద నాకూ ఆసక్తి కలిగింది. దాంతో కంపెనీలో చేరి నాన్నకు సాయంగా ఉండేవాణ్ని. బీవీరావు గారితో కలిసి నాన్న 1971లో ‘వెంకటేశ్వర హ్యాచరీస్‌’ని ప్రారంభించారు. పుణెలో ప్రధాన కేంద్రం ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘వెంకటేశ్వర’కు ఫార్మ్స్‌ ఉండేవి. హైదరాబాద్‌లో ఉంటూ నాన్న ఆ ఫార్మ్స్‌ విస్తరణను చూసుకునేవారు. నేను కంపెనీలో చేరిన ఆరు నెలలకు బీవీరావుకి నా పనితనం, ఆలోచనా విధానం నచ్చి ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆయనకు సహాయకుడిగా ఉండేవాణ్ని. భారీగా ఆలోచించడాన్ని ఆయన దగ్గరే నేర్చుకున్నాను. రాజకీయ, వ్యాపార ప్రముఖులతో కలిసి పనిచేయడం నేర్పారు. వారితో సంప్రదింపుల్లోనూ ఉండేవాణ్ని. కంపెనీలో కంప్యూటరీకరణ పనులన్నీ నాకే అప్పగించారు. వాళ్లింట్లోనే దాదాపు రెండున్నరేళ్లు ఉన్నాను. 1996లో ఆయన అకాల మరణంతో హైదరాబాద్‌ తిరిగి వచ్చేశాను.

అమెరికాలో ఎంబీఏ
మొదట్నుంచీ ఇంజినీరింగ్‌తో చదువు ఆపొద్దనీ ఎంబీఏ చేయమనీ చెబుతుండేవారు నాన్న. పుణె నుంచి వచ్చాక అమెరికా వెళ్లి ఎంబీఏ చేశాను. ఎంబీఏ నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంజినీరింగ్‌ వరకూ ‘ఒకటీ ఒకటీ రెండు’ అని తెలుసుకున్నాను. అక్కడికెళ్లాక ‘ఒకటీ ఒకటీ పదకొండు’ ఎలా అవుతుందో అర్థమైంది. ఎంబీఏలో సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించారు. అందుకే ఆ రెండేళ్లూ పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయి కోర్సు పూర్తిచేశాను. ఎంబీఏ తర్వాత అమెరికాలో కొన్నాళ్లుఉద్యోగం చేద్దామనుకున్నాను. కానీ నాన్నకి అప్పటికే 65 ఏళ్లొచ్చాయి. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని 1998లో తిరిగొచ్చి కంపెనీలో డైరెక్టర్‌గా చేరాను. మా వ్యాపారంలో కీలకపాత్ర రైతులదే. అందుకే తొలి రెండేళ్లూ తరచూ ఫార్మ్స్‌కి వెళ్లి వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించడం మొదలుపెట్టాను. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేకొద్దీ ముందుగా డిమాండ్‌ పెరిగేది ఆహార ఉత్పత్తులకే. విదేశాల్లో మాదిరిగా మన దగ్గర పోర్క్‌, బీఫ్‌ కాకుండా మటన్‌, చికెన్‌, గుడ్లు... ఇవి మాత్రమే ఎక్కువగా తింటారు కాబట్టి మేం ఉన్న పౌల్ట్రీ రంగం ఎదగడానికి మంచి వేదికని మొదట్నుంచీ నమ్మకం ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా ప్రాంతంలో మాత్రమే మాకు సొంత ఫార్మ్స్‌ ఉండేవి. లేయర్స్‌కి అవసరమైన కోడిపిల్లలను వెంకటేశ్వరహ్యాచరీస్‌ వాళ్లు మాకు సరఫరా చేస్తూ మేం కోస్తాలోనే పనిచేయాలన్న నిబంధన పెట్టి, తెలంగాణ, రాయలసీమల్లో వేరేవాళ్లకు ఇచ్చేవారు. తర్వాత బ్రాయిలర్స్‌నీ ఆ సంస్థ తెచ్చింది. అప్పుడు మాత్రం ప్రాంతాలకతీతంగా ఎవరైనా పనిచేయొచ్చని చెప్పారు. కానీ మేం అడిగినన్ని కోడిపిల్లల్ని సకాలంలో ఇచ్చేవారు కాదు. ఆ సంస్థతో సంబంధాలు తెంచుకుందామని చెప్పినా నాన్న సాహసించేవారు కాదు. ఆ టైమ్‌లో నాకు విసుగొచ్చి రెస్టరెంట్ల వ్యాపారంలోకి వెళ్లాను. కానీ అది అనుకున్నట్టు సాగలేదు. తర్వాత స్థిరాస్తి వ్యాపారంలోకీ వెళ్లి ఉప్పల్‌, మాదాపూర్‌లలో రెండు ప్రాజెక్టులు చేపట్టాను. లాభాలు వచ్చాయి కానీ అక్కడ మళ్లీ ఒక వ్యవస్థను నిర్మించడానికి పడే కష్టంలో పావు వంతు కష్టంతో మేం ఉన్న రంగంలో ఇంకా ఎక్కువ చేయొచ్చనిపించి అక్కణ్నుంచి బయటకు వచ్చేశాం. అలాగని పౌల్ట్రీ రంగంలో రాణించడం కొత్తవాళ్లకి ఏమంత సులభం కాదు. మేం ఎన్నో ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్నాం. ఒక తరం అనుభవం మా సంస్థ సొంతం. అదెంతో అమూల్యం.

కొత్త విభాగాల్లోకి...
2003లో మా సంస్థ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక పౌల్ట్రీమీద తిరిగి దృష్టిపెట్టాను. కోడిపిల్లల అమ్మకం వరకే పరిమితం అయితే అందులో మా వాటా రూపాయిలో మూడు పైసలు మాత్రమే. ఆ రంగంలో కోళ్లకు వేసే ఆహారానికి(ఫీడ్‌) ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు తగ్గించుకోవడానికి మొదట్లో రైతుల్నే ఫీడ్‌ తయారుచేసుకోమని చెప్పాం. కానీ వాళ్లకది భారంగా మారింది. దాంతో మేమే అటువైపు అడుగులు వేశాం. ఫీడ్‌ వ్యాపారమే మాకు ఇప్పుడు అత్యధిక ఆదాయాన్ని తెస్తోంది. దీనికోసం, సోయా, మొక్కజొన్న ప్రాసెసింగ్‌ చేస్తాం. తర్వాత బ్రాయిలర్‌ కోడిపిల్లల్ని రైతులకు అమ్మడం, పెద్దవి తిరిగి కొనడం చేశాం. మూడేళ్ల కిందట హైదరాబాద్‌లో చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభించాం. ప్రస్తుతం అక్కడ గంటకు వెయ్యి కోళ్లని ప్రాసెస్‌చేసి హోటళ్లకి అందిస్తున్నాం. ‘ఫ్రెష్‌హెన్‌’ పేరుతో చికెనూ, గుడ్లూ అమ్మే రిటైల్‌ వ్యాపారంలోకీ అడుగుపెట్టాం. 2017లో ‘వెంకటేశ్వర’తో ఒప్పందాల్ని రద్దుచేసుకుని అమెరికాకు చెందిన హై-లైన్‌ సంస్థతో కలిసి పనిచేస్తున్నాం. హైబ్రిడ్‌ లేయర్స్‌ కోడిపిల్లల్ని వీరు అందిస్తున్నారు. ఇండియాలో ఈ సంస్థ కోడిపిల్లల్ని మేం పంపిణీ చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఈ వ్యాపారాన్ని 16 రాష్ట్రాలకు విస్తరించాం. 1998లో నేను కంపెనీలో డైరెక్టర్‌గా చేరిన రోజుతో పోల్చితే కంపెనీ విలువ 30 రెట్లు పెరిగింది.

ఈ ఎదుగుదల ఇక్కడితో ఆగిపోదు. ఒమన్‌, ఆఫ్రికాలకీ విస్తరించాలని చూస్తున్నాం. విస్తరణ కోసం ఇటీవల ప్రపంచబ్యాంకు అనుబంధ సంస్థ అయిన ‘ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ నుంచి 20 శాతం వాటాకిగానూ రూ.130 కోట్లు పెట్టుబడిగా స్వీకరించాం. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో మా కంపెనీ వాటా 12 శాతం (ఏడాదికి 3.5కోట్ల లేయర్స్‌, దాదాపు అంతే సంఖ్యలో బ్రాయిలర్‌ కోడిపిల్లల్ని అందిస్తున్నాం. వచ్చే నాలుగేళ్లలో మూడు రెట్లు పెరగాలని లక్ష్యం పెట్టుకున్నాం. ప్రకాశం జిల్లాలో వంద ఎకరాల్లో మెగా ఫుడ్‌ పార్క్‌ నిర్మిస్తున్నాం. అక్కడ చికెన్‌, ఎగ్‌ ప్రాసెసింగ్‌తోపాటు రెడీ టు కుక్‌, రెడీ టు ఈట్‌ బిర్యానీ, పరోటా, సమోసా లాంటివీ తేబోతున్నాం. కొత్త సంవత్సరంలో ఈ ఫుడ్‌ పార్క్‌ ప్రారంభమవుతుంది.

రైతుల్నీ యజమానుల్ని చేస్తాం
ఎంత ఎత్తుకు ఎదిగినా గుడ్డే తినగలం తప్ప బంగారు గుడ్డు తినలేం. ఒక స్థాయికి చేరాక మనం పనిచేయడానికి డబ్బుకంటే కూడా ఇంకేదైనా అంశం మనల్ని నడిపించాలి. ఓ సమావేశంలో దలైలామా గారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ‘మీవల్ల నలుగురు అభివృద్ధి చెందితేనే పనిలో సంతృప్తి కలుగుతుంది’ అన్నారు. అందులో వాస్తవం ఉందనిపించింది. ఇప్పటితో పోల్చితే 2040 నాటికి మన ఆర్థిక వ్యవస్థ ఆరేడు రెట్లు పెరుగుతుందన్నది ఆర్థికవేత్తల అంచనా. ఆ పెరుగుదలలో చిన్న రైతుల్ని భాగం చేయాలనేది మా లక్ష్యం. దీనికోసం మారుమూల గ్రామాల్లో కోళ్ల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా చేయాలని చూస్తున్నాం. చిన్న రైతులకు కోడిపిల్లలు ఇచ్చి వాటిని పెంచేలా చూస్తాం. మార్కెటింగ్‌ మేమే చూసుకుంటాం. ఈ ప్రాజెక్టులో ప్రాథమికంగా ప్రభుత్వ సహకారాన్ని అడుగుతున్నాం. ప్రారంభంలో వాళ్లు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన గుడ్లూ, చికెన్‌ కొంటే మెల్లగా ఇతర మార్కెట్‌లకూ విస్తరించే అవకాశాల్ని చూస్తాం. ఇలా చేస్తే మా కంపెనీ సీఎస్‌ఆర్‌ కింద రెండుశాతం లాభాల్ని కేటాయించడం కాదు, 98 శాతం కేటాయించినట్లు అవుతుంది.
గేట్స్‌ ఫౌండేషన్‌, ఐక్యరాజ్య సమితి కూడా ఇలాంటి అనుసరణీయమైన మోడల్‌ గురించి మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. యూపీ, బిహార్‌లతో పాటు మన దగ్గరా వెనకబడిన జిల్లాల్లో ఈ ప్రాజెక్టుని త్వరలోనే ప్రయోగాత్మకంగా చేపడతాం.
కుటుంబ వ్యాపారంలో రెండోతరానికి సానుకూల, ప్రతికూల అంశాలు రెండూ ఉంటాయి. ఒక పునాది ఏర్పాటై ఉండటం సానుకూల అంశం. అయితే, రెండో తరం చేతుల్లో కంపెనీ ఏమవుతుందోనన్న ఆందోళన వ్యవస్థాపకుల్లో ఉంటుంది. వారికి తగిన భరోసా ఇవ్వగలగాలి. అదంత సులభం కాదు. ఎందుకంటే తరం మారేసరికి ఆలోచనా విధానం, వ్యాపార దృక్పథం మారుతాయి. నిజాయతీ, నిదానం నాన్న వ్యాపార విధానాలు. కొత్తగా, పెద్దగా ఆలోచించడం, ప్రయత్నించడం నా పంథా. కోళ్ల వ్యర్థాలతో విద్యుదుత్పత్తి గురించి ప్రణాళికలు వేస్తున్నాం. నాన్నగారైతే  అటువైపు వెళ్లుండేవారు కాదేమో, కానీ పర్యావరణం గురించి ఆలోచించే నేటితరం వ్యక్తినైన నన్ను ఆ రంగం ఆకర్షిస్తుంది. ఇప్పటికీ ఛైర్మన్‌ హోదాలో నాన్న అప్పుడప్పుడూ లెక్కలు చూస్తుంటారు. మా అబ్బాయి అమెరికాలో బీఏ(ఎకనమిక్స్‌, బిజినెస్‌) చేశాడు. తనూ ఈ ఏడాదే కంపెనీలో చేరాడు. వాడికి ఒకటే చెప్పాను...‘నువ్వు ఇక్కడ కొన్నేళ్లపాటు ఉద్యోగిలా పనిచేయాలి. యజమానిలా కాదు’ అని. నేనూ మొదట్లో అలానే పనిచేశాను మరి!


నైన్‌ టూ ఫైవ్‌ పనిచేయను...

ప్రస్తుతం నేను నైన్‌ టూ ఫైవ్‌ జాబ్‌ చేయడంలేదు. ఆఫీసు ప్రాంగణంలో నాకు వేరే క్యాబిన్‌ ఉంది. అక్కడే కూర్చొని పుస్తకాలు చదువుకుంటాను. క్లయింట్స్‌ ఎవరైనా వస్తే కలుస్తాను. నేను చేసేదల్లా కొత్త ఐడియాల్ని మా సిబ్బంది ముందు ఉంచడం, లేదంటే చేస్తున్న పనిని కొత్తగా చేయడం గురించి ఆలోచనల్ని పంచుకోవడమూ. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మేనేజర్లకి ఇస్తాను.
ఏకాభిప్రాయానికి రాలేకపోతే నన్ను సమావేశానికి పిలవమని చెబుతాను.

* మొదట్నుంచీ వ్యాపార సమాఖ్యల్లో భాగంగా ఉంటున్నాను. దీనివల్ల నాకు తెలిసిన విషయాల్ని నలుగురికీ చెప్పడమే కాకుండా, కొత్త విషయాలు నలుగురి దగ్గరా తెలుసుకునే అవకాశమూ వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నూతన ఆంధ్రప్రదేశ్‌లో సీఐఐ అధ్యక్షుడిగా పనిచేశాను. ప్రస్తుతం ‘ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌’కు ఛైర్మన్‌గా ఉన్నాను.
* పుస్తక పఠనం అంటే ఆసక్తి. చరిత్ర, ఆంత్రపాలజీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాల్ని చదువుతాను. ఏడాదికి 50 పుస్తకాలైనా చదువుతాను. వ్యాపారులకు బిజినెస్‌ స్కూల్స్‌ అందించే స్వల్ప వ్యవధి కోర్సుల్ని చేస్తుంటాను.
* ట్రావెల్‌, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ ఇష్టం. ‘డాక్టర్‌ రెడ్డీస్‌’ కో ఛైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ నాకు మంచి స్నేహితుడు, మార్గదర్శి. ఆయనకీ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ హాబీ. ఇద్దరం తరచూ పర్యటనలకు వెళ్తుంటాం. వచ్చే సంవత్సరం ఆఫ్రికాలోని మశాయ్‌ వెళ్లడానికి ప్లాన్‌ చేశాం. ఇప్పటివరకూ 70కిపైగా దేశాల్ని సందర్శించాను. ట్రావెల్‌ చేయడంవల్ల చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు. నేను భోజన ప్రియుణ్ని. కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు అక్కడి వంటకాల్ని కచ్చితంగా రుచి చూస్తాను.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.