close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

70 ఏళ్ళ గణతంత్రం!

‘భారతీయ పౌరులమైన మేము...’ అంటూ మొదలయ్యే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశం సర్వసత్తాక రాజ్యంగా అవతరించి నేటితో 70 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఏటా జరిగే ఈ గణతంత్ర ఉత్సవాల విశేషాలు కొన్ని...
* జెండా వందనానికి సంబంధించి స్వాతంత్య్ర దినోత్సవానికీ గణతంత్రానికీ తేడా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండాని మడిచి స్తంభం కింది భాగంలోనే కట్టి ఉంచుతారు. ప్రధానమంత్రి ఆ పతాకాన్ని పైకి లాగి ఎగరేస్తారు. అదే గణతంత్ర దినోత్సవానికైతే జెండాని స్తంభం పైభాగంలోనే ఉంచుతారు. దీన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు.

గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే విద్యార్థులూ కళాకారులూ సైనిక అధికారులకి సంబంధించిన రిహార్సల్స్‌ ముందు ఏడాది జులై నుంచి మొదలవుతాయి. ప్రతి ఒక్కరూ ఆరువందల గంటలపాటు రిహార్సల్‌ చేయాలన్నది లెక్క.

* తొలి గణతంత్ర దినోత్సవానికి కేవలం రెండు రోజులు ముందు (24 జనవరి, 1950) ‘జనగణమన..’ని భారత జాతీయ గీతంగా ప్రకటించారు.
దిల్లీలో సరిగ్గా ‘జనగణమన... ’ పాడేటప్పుడే గౌరవ సూచకంగా ఫిరంగులతో మూడు రౌండ్లు కాల్పులు జరుపుతారు. దీన్ని ‘21-గన్‌ సెల్యూట్‌’ అంటారు. ఆ ఫిరంగులనేమో ‘25 పౌండర్స్‌’ అని పిలుస్తారు. నిజానికి అవి ఏడే ఉంటాయి!

అంబేద్కర్‌ అధ్యక్షతన రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత దాన్నో అందమైన లిఖిత ప్రతిగా తీర్చిదిద్దాలనుకున్నారు మన తొలి ప్రధాని నెహ్రూ.
ఆ పనిని ప్రేమ్‌ బిహారి నారాయణ రైజాదా అనే లేఖన కళాకారుడి (కాలిగ్రాఫిస్ట్‌)కి అప్పగించారు. ఆయన ఆరునెలల సమయం తీసుకుని చక్కటి ‘ఇటాలిక్‌’ శైలిలో దాన్ని రాసిచ్చారు.
దానిపైనే నాటి మన పార్లమెంటు సభ్యులు 310 మంది సంతకాలు చేశారు. ఆ తర్వాత దాన్ని హీలియం గ్యాస్‌ నిండిన బాక్స్‌లో భద్రపరిచి పార్లమెంటు గ్రంథాలయంలో దాచారు. ఇప్పటిదాకా ఆ లిఖిత ప్రతిని ఎవరూ నకలూ తీసుకోలేదు... ప్రింటూ చేయలేదు!

ఈ ఉత్సవాల్లో పాల్గొనే వివిధ రాష్ట్రాల, శాఖల ప్రచార శకటాలు గంటకి ఐదు కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలని నిబంధన!

సాధారణంగా గణతంత్ర ఉత్సవాలు ఉదయం 9 నుంచి 12 మధ్య జరుగుతాయి! కానీ 1950లో తొలి గణతంత్ర ఉత్సవాలు 12 గంటల దాకా ప్రారంభం కాలేదు. ఆ రోజు ఉదయం 10.18కే భారత్‌ గణతంత్ర రాజ్యంగా అవతరించి, 10.24కి బాబూ రాజేంద్రప్రసాద్‌ భారత రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేశారు. అందుకే ఆ ఆలస్యం.

1950, జనవరి 26... మనకి గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు. మన భారతీయ వైమానిక దళం లాంఛనంగా ప్రారంభమైన రోజు కూడా. అందుకే ఆ రోజు విమాన విన్యాసాలతో ఆకాశంపైన మువ్వన్నెల ముగ్గుల్ని దిద్దుతుంది. వైమానిక దళం.

* దిల్లీలో గణతంత్ర దినోత్సవం సందడిని ప్రత్యక్షంగా చూడాలంటే టికెట్టు కొనుక్కుని వెళ్లాలి. 20 నుంచి 500 రూపాయల వరకూ ధర ఉంటుంది.

* చివరి రోజు జరిగే బీటింగ్‌ రిట్రీట్‌లో ‘అబైడ్‌ విత్‌ మి’ అనే క్రైస్తవ గీతం కూడా ఉంటుంది. మహాత్మా గాంధీకి ఇష్టమని దాన్ని చేర్చారు.

* నిజానికిది మూడురోజుల పండగ. 26న జెండా వందనంతో మొదలై 29న త్రివిధ దళాల ‘బీటింగ్‌ రిట్రీట్‌’తో ముగుస్తుంది.

* 1950 నుంచి 1954 దాకా దిల్లీ గణతంత్ర ఉత్సవాలకి ఒక శాశ్వత వేదికంటూ లేదు. 1955 నుంచి రాజ్‌పథ్‌ని శాశ్వత వేదికగా మార్చారు.

గణతంత్ర దినోత్సవానికి పిలిచే విదేశీ ముఖ్య అతిథి ఎవరన్న విషయాన్ని ఆరునెలల ముందే భారీ కసరత్తు చేసి నిర్ణయిస్తారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన వారిలో ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో, చైనా అధ్యక్షుడూ, ప్రజా విప్లవ నేత మావో జెడాంగ్‌, శ్రీలంక తొలి మహిళా ప్రధాని సిరిమావో బండారునాయకే, దక్షిణాఫ్రికా అహింసా యోధుడు నెల్సన్‌ మండేలా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వంటి ప్రపంచ ప్రసిద్ధ నేతలున్నారు. ఈ ఏడాది అతిథి బ్రెజిల్‌ అధినేత జెయిర్‌ బొల్సనోరో.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.