close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సామాన్యుల నేస్తాలు... ఈ స్టార్టప్‌లు!

భవిష్యత్తును పట్టించుకోకుండా కొంత మంది యువకులు డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చుచేస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి పొదుపు గురించి వివరించడానికి కొందరు ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు. మరికొందరు... ఆయుర్వేద వైద్యాన్నీ, ఒంటె పాలనూ సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్టార్టప్‌లను ప్రారంభించి వాటి సేవల్ని విస్తరిస్తున్నారు.


యువకులకు పొదుపు పాఠాలు

చదువు పూర్తవగానే నేటి తరం యువకులు ఉద్యోగబాట పడుతున్నారు. మరికొందరు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఇలా సంపాదిస్తున్న డబ్బును చాలా మంది యువకులు భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించకుండా ఖర్చు చేసేస్తున్నారు. పొదుపు ఎలా చేయాలో తెలియక మరికొందరు యువకులు నష్టపోతున్నారు. ఇలాంటి వారికి... పొదుపు గురించి తెలియజేయడానికి పుట్టుకొచ్చిందే ఎస్‌క్యూఆర్‌ఆర్‌ఎల్‌ స్టార్టప్‌. గురుగ్రామ్‌కు చెందిన సమంత్‌ సిక్కా, సంజీవ్‌శర్మ, ధనుంజయ్‌సింగ్‌లకు వివిధ వ్యాపార, ఆర్థిక సంస్థల్లో ఇరవై ఏళ్లపాటు పనిచేసిన అనుభవముంది. డబ్బును ఇష్టారాజ్యంగా ఖర్చుచేస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో బాగా తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ముగ్గురూ స్టార్టప్‌ను ప్రారంభించి దాని ద్వారా యువకులకు పొదుపు పాఠాలూ, వివిధ సంస్థల్లో పెట్టుబడిపెట్టే విధానాలూ నేర్పిస్తున్నారు. 2017లో ప్రారంభమైన ఈ స్టార్టప్‌ ఇప్పటి వరకు పది లక్షలకుపైగా నిధుల్ని సమీకరించి సుమారు రెండు లక్షల వినియోగదారులకు చేరువైంది. ప్రజలకు పొదుపు గురించి వివరించడానికి ఎన్నో సంస్థలు ఉన్నా... యువకుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ‘ఎస్‌క్యూఆర్‌ఆర్‌ఎల్‌’ను ప్రారంభించారు. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నవారిలో డెబ్భై శాతం మంది ముప్ఫై ఏళ్లలోపు వారే.


ఒంటె పాలు అమ్ముతారు

రాజస్థాన్‌కు చెందిన హితేష్‌ రతి దిల్లీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి మ్యాన్‌మార్‌లోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేసేవాడు. కొన్నాళ్ల తరవాత ఆ ఉద్యోగం నచ్చక భారత్‌కు వచ్చి ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. ఒంటె పాలల్లో ఔషధ గుణాలుంటాయని చిన్నప్పుడు చదువుకున్న విషయం అతడికి గుర్తొచ్చింది. స్నేహితులతో చర్చించి, మొదట అవగాహన కోసం దిల్లీలో ఆహార పదార్థాలను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించాడు. దాన్ని నిర్వహిస్తూనే రాజస్థాన్‌, గుజరాత్‌లో ఒంటెల్ని పెంచేవారిని కలిసి పాలను విక్రయించడానికి వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తరవాత మిత్రుడు శ్రేయ్‌కుమార్‌తో కలిసి ‘ఆద్విక్‌ ఫుడ్స్‌’ స్టార్టప్‌ను ప్రారంభించాడు. అక్కడి నుంచి వ్యాన్లలో తెప్పించే ఆ పాలను నిల్వ ఉంచడానికి శీతలీకరణ కేంద్రాల్ని ఏర్పాటు చేశాడు. ఇలా ఒంటె పాలూ, పాలపొడితోపాటూ వాటితో తయారు చేసిన చాక్లెట్లూ, సబ్బులూ, ఫేస్‌వాష్‌లూ ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాడు. ఈ స్టార్టప్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగు కోట్ల లాభాల్ని ఆర్జించింది. ప్రస్తుతం రోజుకు పది వేల లీటర్ల దాకా ఒంటె పాలను సేకరిస్తున్నామనీ, మరికొన్ని రోజుల్లో సేకరణ శాతాన్ని పెంచి అన్ని ప్రాంతాల్లోనూ వీటిని విక్రయిస్తామనీ అంటున్నాడు హితేష్‌ రతి.


అరచేతిలో ఆయుర్వేద వైద్యం

ఆయుర్వేద వైద్య విధానంతో జబ్బుల్ని నయం చేసుకోవాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే... ఆయుర్వేద వైద్యులూ, మందులూ అందుబాటులో లేకపోవడం ప్రజలను అసంతృప్తికి లోనుచేస్తోంది. ఇలాంటి వారికి ఆయుర్వేద వైద్యుల సలహాలూ, సూచనలూ అందిస్తూ అవసరమైన మందుల్ని సరఫరా చేయడానికి ప్రారంభమైందే ‘నిరోగ్‌స్ట్రీట్‌’ స్టార్టప్‌. దీని వ్యవస్థాపకుల్లో ఒకరైన రామ్‌ ఎన్‌ కుమార్‌ నాలుగేళ్ల క్రితం కామెర్లతో బాధపడ్డాడు. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించలేదు. స్నేహితుడి సలహాతో ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి మందుల్ని వాడాడు. వీటితో త్వరగా కోలుకున్నాడు. అప్పుడే ఆయుర్వేద మందుల ప్రభావాన్ని తెలుసుకున్న రామ్‌... ఈ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నాడు. మిత్రులు అభిషేక్‌ గుప్తా, శ్రేయ్‌ జైన్‌లతో కలిసి ఆయుర్వేద వైద్యుల్నీ, మందుల తయారీ సంస్థల ప్రతినిధుల్నీ సంప్రదించి దిల్లీ కేంద్రంగా 2016లో ‘నిరోగ్‌ స్ట్రీట్‌’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించాడు. మొదట సొంతంగా పెట్టుబడి పెట్టినా... ప్రస్తుతం జపాన్‌కు చెందిన ఓ సంస్థ నిధుల్ని సమకూర్చుతోంది. కేవలం ఆయుర్వేద మందుల్ని మాత్రమే సరఫరా చేసే ఆన్‌లైన్‌ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈ స్టార్టప్‌ మాత్రం సుమారు 200 ఆయుర్వేద ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులతో రోగులకు వైద్య సలహాల్ని ఇప్పిస్తూ అవసరమైన మందుల్ని సరఫరా చేస్తోంది.


పారేసే పూలతో... అగరబత్తీలూ సబ్బులూ!

నిర్మలమైన మనసుతో మందిరానికి వెళతాం... దైవానికి పూజాసామగ్రి సమర్పిస్తాం... భగవంతుని పాదాలను తాకిన పూలను భక్తితో కళ్లకద్దుకుంటాం... మరి ఆ తర్వాత? ఆ పూలన్నీ చెత్తకుప్పలోకి చేరతాయి. అక్కడి నుంచి డంపింగ్‌యార్డుకు మారతాయి. నదులూ చెరువుల్లో దీపారాధనలు చేసే సమయంలో చీకట్లో ఆ వెలుగులు చూస్తే ఎంత అందంగా ఉంటుందో, మరుసటి రోజు ఆ నీళ్లలోకి చేరిన వ్యర్థాలను చూస్తే మనసు అంతే చివుక్కుమంటుంది. పూజకు పర్యవసానం పర్యావరణ కాలుష్యం కాకూడదనే భావన నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ‘హోలీ వేస్ట్‌ రీసైక్లింగ్‌’.

దేశంలో వేలాదిగా ఆలయాలూ ప్రార్థనా మందిరాలూ ఉన్నాయి. వాటన్నింటిలో నిత్యం ఆరాధనలు జరుగుతుంటాయి. దీనికోసం టన్నులకొద్దీ పూలు వినియోగిస్తుంటారు. అవన్నీ ఆ తర్వాత గుట్టలుగుట్టలుగా వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. చాలా మందిరాలు నదులనూ చెరువులనూ ఆనుకొని ఉండటం వల్ల ఆ వ్యర్థాలను నేరుగా వాటిలోకి వదిలేస్తున్నారు. దీంతో జలాలు కలుషితమైపోతున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో నదీ, సముద్ర స్నానాలు, దీపాలు వదిలిపెట్టడం వంటివి చేసినప్పుడు అక్కడి పరిసరాలన్నీ పూజాసామగ్రి వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఇది పెద్దమొత్తంలో వాతావరణ కాలుష్యానికి కారణమవుతోంది.

* * *

ఈ సమస్యను చూసిన కొందరికి ఇలా వాడిపడేసిన పువ్వులను రీసైకిల్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అప్పుడే ‘హోలీ వేస్ట్‌ రీసైక్లింగ్‌’ అనే అంశంతో కొత్త అంకురాలు పుట్టుకొచ్చాయి. వాడిన పూలతో వివిధ రకాలైన వస్తువులు తయారుచేసే వారి వ్యాపారం గత రెండేళ్లుగా ఊపందుకుంటోంది. ఈ సంస్థల యజమానుల ఉద్దేశం తమకాళ్లపై తాము నిలబడటం మాత్రమే కాదు... నలుగురికీ ఉపాధి కల్పించడం, పర్యావరణహితం కోసం పోరాడటం కూడా. హైదరాబాద్‌కు చెందిన మినాల్‌ దాల్మియా, మాయా వివేక్‌ అనే యువతులు ఇలాంటి ఒక స్టార్టప్‌ను నెలకొల్పి అగర్‌బత్తీలూ ధూప్‌స్టిక్‌లూ సబ్బులూ తయారుచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంకిత్‌ అగర్వాల్‌, కరణ్‌ రస్తొగీ అనే యువకులు ‘హెల్ప్‌ అజ్‌ గ్రీన్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించి ఈ వస్తువులు ఉత్పత్తి చేయడమే కాదు, ఉపాధి లేక డ్రైనేజీలు కడిగే పనికి వెళ్లే మహిళలకు గౌరవప్రదమైన జీతం, జీవితం అందిస్తున్నారు. వీరే కాదు... పెళ్లిళ్లూ ఇతర శుభకార్యాల సమయంలో వాడిపడేసిన పూలను ఉపయోగించి కూడా కొందరు సెంట్లూ సబ్బులూ తయారుచేస్తున్నారు.

* * *

రీసైక్లింగ్‌ కోసం ముందుగా ఈ పూల వ్యర్థాలను ఆలయాల నుంచి సేకరిస్తారు. తర్వాత వాటిని తొడిమల నుంచి వేరుచేసి, రకాలవారీగా పోసి ఆరబెడతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న యంత్రాల్లో వేసి పొడి చేస్తారు. అనంతరం తయారుచేయాల్సిన వస్తువును బట్టి ఆ పొడిని ముద్దలా చేసి వాడటం, సబ్బుల తయారీలో ఉపయోగించడం చేస్తున్నారు. తర్వాత ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచుతున్నారు. ఏదైనా ప్రత్యేక సందర్భాల కోసం కావాలంటే ఇలా తయారైన సబ్బులను అందంగా చెక్కి గిఫ్ట్‌ప్యాక్‌ల మాదిరిగానూ అందిస్తున్నారు. కొన్ని ఆలయాల నిర్వాహకులు కూడా సొంతంగా తామే యంత్రాలను ఏర్పాటుచేసుకొని ఈ పూల ద్వారా కంపోస్టు ఎరువు తయారుచేసి చుట్టుపక్కల రైతులకు ఉచితంగా అందిస్తున్నారు. మొత్తంగా ఈ పువ్వుల రీసైక్లింగ్‌తో పేద మహిళలకు ఉపాధి లభించడమే కాదు, పర్యావరణానికీ మేలు చేకూరుతోంది.


 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.