close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.5కే ఆకలి తీరుతోంది!

ఐదు రూపాయలకి టీ కూడా దొరకడం కష్టమైన ఈరోజుల్లో ఆ మొత్తానికే కడుపునిండా అన్నం, చల్లటి మంచినీళ్లు ఇస్తోంది హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ). అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఈ విధంగా రోజుకు 35000 మంది ఆకలి తీరుస్తోంది. ఐదేళ్ల క్రితం ఒక్క కేంద్రంతో మొదలై నేడు 150 వరకూ విస్తరించి నిత్యం వేలాది పేదలకు వేడి వేడి అన్నం వడ్డిస్తోన్న అన్నపూర్ణ క్యాంటీన్లు ఎలా పనిచేస్తున్నాయంటే...
ఆకలి తీర్చడానికే వెలసిన అన్నపూర్ణ కేంద్రాలు రుచీ, శుచీతో కూడిన పోషకాహారాన్ని కేవలం ఐదురూపాయలకే అందిస్తున్నాయి. వేడి వేడి అన్నం, అదీ తక్కువ రేటుకే దొరకడంతో సామాన్యులంతా మధ్యాహ్నం పన్నెండు కాకముందే ఆ కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు.

2014లో హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ మొదట ప్రయోగాత్మకంగా నాంపల్లి వద్ద అన్నపూర్ణ కేంద్రాన్ని ప్రారంభించింది. తొలిరోజే విపరీతమైన స్పందన వచ్చింది. పేదలూ, భిక్షాటన చేసేవారితోపాటు నిరుద్యోగులూ, విద్యార్థులూ, ఆటోడ్రైవర్లూ, చిరుద్యోగులూ, కార్మికులవంటి ఎందరో క్రమంగా ఈ కేంద్రాల వద్ద భోజనానికి పోటెత్తడంతో మిగతా ప్రాంతాలకూ ఈ సేవలు విస్తరించాలని భావించింది జీహెచ్‌ఎంసీ. అలా ఒక్కో కేంద్రాన్నీ విస్తరిస్తూ... ఐదేళ్లలో 23 ప్రాంతాల్లో 150 క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. వీటిద్వారా దాదాపు రోజుకు 35000 మంది ఆకలి తీరుస్తోంది బల్దియా. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకూ నడిచే ఈ కేంద్రాల్లో స్థానికంగా ఉండేవారితోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికీ భోజనం అందుబాటులో ఉంచాలని భావించింది జీహెచ్‌ఎంసీ. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వాసుపత్రులూ, బస్టాండ్లూ, రైల్వే స్టేషన్ల పరిసరాల్లోనూ అన్నపూర్ణ భోజనకేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

విద్యార్థుల పాలిట అన్నపూర్ణ

ఒక ప్లేటుకి 450గ్రాముల అన్నం, పప్పూ లేదా సాంబారూ, ఏదో ఒక కూరా, ఊరగాయతోపాటు చల్లని మంచినీళ్ల ప్యాకెట్‌ ఇస్తారు. గురువారం మాత్రం స్వీటు కూడా ఉంటుంది. ఒక్కో కేంద్రం వద్ద సుమారు 300 నుంచి 450 మంది వరకూ ఆకలి తీర్చుకుంటారు. ఒక్క మాదాపూర్‌లోని అన్నపూర్ణ కేంద్రం వద్ద మాత్రం 700 మందికిపైనే భోంచేస్తారు. పలు ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న పేద విద్యార్థులు సెంట్రల్‌ లైబ్రరీ వద్ద ఉన్న కేంద్రంలో పెద్ద ఎత్తున ఆకలి తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో ఆహారం మాత్రమే అందిస్తోంది. కానీ కూర్చుని తినడానికి షెడ్లూ, బల్లల ఏర్పాటు మాత్రం లేదు. అందుకే ఇప్పుడు ఆ వసతులు కల్పించడానికి సిద్ధమైంది బల్దియా. అందుకుగానూ ఒక్కోకేంద్రానికి పదకొండు లక్షలు కేటాయించి మెరుగైన సేవలు కల్పించే పనిలో పడింది.

అన్నం అక్షయ పాత్ర నుంచి
జీహెచ్‌ఎంసీ ఇలా వేలమందికి ఆకలి తీర్చడంలో హరే కృష్ణ ఉద్యమం(హెచ్‌కేఎం) కూడా పాలుపంచుకుంటోంది. అక్షయ పాత్ర ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలోనే భోజనాలు తయారు చేసి అన్నపూర్ణ కేంద్రాలకు చేరవేస్తోంది. అక్షయ పాత్ర ఒక్క భోజనం తయారు చేయడానికి అయ్యే ఖర్చు రూ.24.25పై. సామాన్యులు రూ.5 ఇస్తే, మిగతా రూ.19.25పై జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుందన్నమాట. నార్సింగిలో ఉన్న అక్షయ పాత్ర కిచెన్‌లోనే దాదాపు నలభై మంది ఈ పదార్థాలన్నీ తయారు చేస్తారు. వంట అర్ధరాత్రి ఒకటికి మొదలవుతుంది. ముందుగా కూరగాయలపైన ఉండే బ్యాక్టీరియా, క్రిములూ చనిపోవడానికి వాటిని క్లోరిన్‌ నీళ్లలో అరగంట నానబెట్టి కడుగుతారు. అలానే వంట వండే బాయిలర్లూ, కుక్కర్లూ, గరిటెలూ, మూతలూ, అన్నపూర్ణ క్యాంటీన్లకు చేరవేసే క్యారేజీలూ... అన్నిటినీ వేణ్నీళ్లతోనే శుభ్రం చేస్తారు.

ఈ పనులన్నీ అయ్యాక మూడు గంటలకి వంట మొదలై పొద్దున ఏడున్నరకి పూర్తవుతుంది. కిచెన్‌ సిబ్బంది మరో రెండుమూడు గంటలు శ్రమించి ఆహారాన్ని క్యారేజీల్లోకి సర్ది... వాహనాల్లోకి ఎక్కిస్తారు. ఉదయం పదిగంటలకల్లా బయల్దేరే ఒక్కో వాహనం మూడు కేంద్రాల్లో క్యారియర్లు అందిస్తుంది. అవే మళ్లీ భోజనాలు పూర్తయ్యాక క్యారియర్లను అక్షయ పాత్రకు చేర్చుతాయి. ఈ వాహనాలకు అయ్యే ఖర్చునీ జీహెచ్‌ఎంసీనే భరిస్తోంది. అందుకే ఆకలి తీర్చుకుంటున్న ఎంతో మంది జీహెచ్‌ఎంసీని ‘అన్నపూర్ణా సుఖీవభ’ అని దీవిస్తున్నారు.

- శ్రీనివాసులు ఉప్పుటూరి, ఈనాడు, హైదరాబాద్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.