close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అభాగ్యులకు ఇది అప్నాఘర్‌!

అట్టలు కట్టిన జుట్టూ, మడ్డి పట్టి కంపుగొట్టే చొక్కా, ఒళ్లంతా పుళ్లూ, చుట్టూ ముసిరే ఈగలూ... ఇలాంటి మనిషి ఏ చెత్తకుండీ పక్కనో చౌరాస్తా మూలనో పడి వుంటే ఎంతో చీదరగానూ ఒకింత జాలిగానూ చూసి మొహం తిప్పుకుని వెళ్లిపోతాం. కానీ భరద్వాజ- మాధురి దంపతులు అలా కాదు, వాళ్లను చేయి పట్టుకుని తమ ఇంటికి తీసుకెళ్తారు. ‘ఇది మా ఇల్లు కాదు- మన ఇల్లు- అప్నాఘర్‌ అని చెబుతారు. ఎవరా దంపతులు, ఎక్కడుందా అప్నాఘర్‌ అంటే...

అమ్మానాన్నా అన్నాచెల్లీ అమ్మమ్మా నాన్నమ్మా తాతయ్యలూ మామయ్యలూ... మనిషికి ఎన్నెన్నో అనుబంధాలు. అయినాసరే ఒక్కోసారి పరిస్థితుల చేతిలో ఓడిపోతాడు. ఒంటరై రోడ్డున పడతాడు.పలకరించే తోడులేక వేళకింత తిండి లేక ఏ బస్టాండులోనో చెత్తకుండీ పక్కనో నిస్సహాయంగా పడివుంటాడు. ముసిరే ఈగలూ... వెగటు వాసనా... చీదరించుకుని అవతలికి వెళ్లిపోతారు చాలామంది. కానీ అలా మొహం తిప్పుకుపోవడం ఆ దంపతుల వల్ల కాదు... అతడిని చేరదీస్తారు, సేవ చేస్తారు. వైద్యంతో, ప్రేమతో మామూలు మనిషిని చేస్తారు. అయినవారు సంతోషించి తీసుకెళ్తే పంపిస్తారు. లేకపోతే కడదాకా తమతోనే ఉంచుకుంటారు. అలా ఒకరూ ఇద్దరూ కాదు, కొన్ని వేల మందికి అన్నీ తామైన ఆ జంట- భరద్వాజ, మాధురి. వారి కలల లోగిలి ‘అప్నాఘర్‌’. దానికి పునాది పడింది ఒక్క సంఘటనతో...
ఉత్తరప్రదేశ్‌లోని సెహ్రోలి అనే గ్రామంలో ఓ రైతు కుటుంబంలో పుట్టాడు బ్రిజ్‌ మోహన్‌ భరద్వాజ. అతడికి పన్నెండేళ్ల వయసప్పుడు జరిగిందో సంఘటన... వాళ్ల ఊరిలో చిరంజీవ బాబా అనే ఓ వృద్ధుడు ఉండేవాడు. ఊళ్లోవాళ్ల పశువుల్ని మేపుకొచ్చేవాడు. ఒంటరివాడు కావడంతో ఊరి వాళ్లే అతడి తిండీతిప్పలూ పట్టించుకునేవారు. పిల్లలు కూడా బాబా అంటూ అతడితో ఆడుకునేవారు. వయసైపోయిన అతడికి ఓరోజు అడవిలో పడిపోగా బాగా దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత తన గుడిసెలో ఒంటరిగా పడి ఉన్న బాబాకి ఎవరూ పట్టించుకుని వైద్యం చేయించకపోయేసరికి గాయాలు సెప్టిక్‌ అయి పురుగులు పడ్డాయి. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ సంఘటన చిన్నారి భరద్వాజ మనసుని కలచివేసింది. బాబా ఎందుకు చనిపోయాడూ- అని తరచూ అమ్మానాన్నల్ని అడిగేవాడు. ఆరోగ్యం బాగోనప్పుడు దగ్గరుండి చూసుకోవడానికి తనవాళ్లంటూ ఎవరూ లేకపోవటంతో అతడు చనిపోయాడని అమ్మ చెప్పిన మాట భరద్వాజకి అలాగే గుర్తుండిపోయింది. ఊళ్లోవాళ్లందరూ మంచివాళ్లే. అందరూ అతడిని పలకరిస్తూనే ఉండేవారు. తిండీ బట్టా ఇచ్చేవారు. కానీ ఎవరి సంసారబాధ్యతలు వారివి కావడంతో అతడిని కనిపెట్టుకుని సేవలు చేయలేకపోయారు. అంటే- ప్రతి మనిషికీ తనవారంటూ ఎవరో ఒకరుండాలి. అలా లేకపోతే బాబా లాగా అనాథలా చచ్చిపోతారు అన్న ఆలోచన ఆ లేతమనసులో నాటుకుపోయింది. అతనితో పాటే అదీ పెరిగి పెద్దదయింది.

కలసి కన్న కల!
అలీగఢ్‌ పట్టణంలోని కాలేజీలో చేరిన భరద్వాజ రోజూ బస్సులో వెళ్లివచ్చేవాడు. మరో పల్లె నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న మాధురి కూడా అదే బస్సు ఎక్కేది. ఈ టీనేజర్లిద్దరికీ బస్సులో స్నేహం కుదిరింది. భవిష్యత్తు గురించి ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. మెడిసిన్‌ చదివి పేదలకు సేవ చెయ్యాలని కలలు కనేవారు. భరద్వాజకి హోమియోపతి కాలేజీలో సీటు వచ్చింది. ఆ తర్వాత మాధురి కూడా అందులోనే చేరింది. మాధురి చదువయ్యేసరికి భరద్వాజ వైద్యుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకుని పట్టణంలో కాపురం పెట్టారు. సొంత పిల్లలుంటే వారి బాధ్యతలు తమ ఆశయసాధనకు అడ్డు వస్తాయేమోనని భావించి పిల్లలు వద్దని నిర్ణయించుకుని, లక్ష్యసాధన దిశగా అడుగు ముందుకేశారు. ఎక్కడ అనాథలు కన్పించినా తమతో ఇంటికి తీసుకొచ్చేవారు. మురికిదుస్తుల్లో, చింపిరిజుట్టుతో, అనారోగ్యంగా ఉన్నవాళ్లను ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చి కడుపు నిండా తిండిపెట్టేవారు. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి పరీక్షించి తగిన వైద్యమూ చేసేవారు. అలా ఒక్కొక్కరుగా మనుషులు పెరుగుతుంటే ఇల్లు సరిపోయేది కాదు. చోటు కలిసొస్తుందని ఇంట్లో ఉన్న మంచమూ కుర్చీలూ అన్నీ తీసేసి చాపలతోనే సర్దుకునేవారు. కొన్నాళ్లకు అదీ సరిపోలేదు. దాంతో కాస్త పెద్ద ఇల్లు తీసుకుని ‘అప్నాఘర్‌’ సంస్థను రిజిస్టర్‌ చేశారు. అప్పటికి మాధురికి ఇరవై ఏడేళ్లు. భరద్వాజకి ముప్పై ఒకటి. హాయిగా కాపురం చేసుకోకుండా లేనిపోని బాధ్యతలను తలకెత్తుకుంటున్నారన్న కోపంతో కుటుంబసభ్యులు వారికి ఏమాత్రం సహకరించలేదు. డాక్టరీ చదివారు, చక్కగా ప్రాక్టీసు చేసుకుని సంపాదించుకోక ఎందుకొచ్చిన సేవ అని పెద్దలూ, ఆశయాలు కలల్లోనూ సినిమాల్లోనూ బాగుంటాయి జీవితంలో కాదు అని స్నేహితులూ నిరుత్సాహపరిచారు. అయినవాళ్లే కాదు పొమ్మంటే ఇక బయటివాళ్లను ఏమని అడుగుతారు... సంస్థని రిజిస్టర్‌ చేయాలంటే నిర్వాహకులుగా కనీసం తొమ్మిదిమంది కావాలి. అందుకు కావలసినవాళ్లెవరూ ముందుకురాకపోయేసరికి తమకు పరిచయమున్న కాంపౌండర్లూ నర్సుల పేర్లను రాసి మొత్తానికి సంస్థకి ఒక రూపం తెచ్చారు.

నగలు అమ్మేసి...
ఇంట్లో ఇద్దరు ముగ్గురు అదనంగా ఉంటేనే ఖర్చులకు చూసుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఇరవై మందికి తిండీ బట్టా మందులూ అంటే ఖర్చు తడిసి మోపెడయ్యేది. ఇద్దరి జీతాలూ సరిపోయేవి కావు. అయినా సరే, మరో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే ముందు ఇల్లు ఇరుకవుతుందనో, డబ్బు సరిపోదనో వాళ్లెప్పుడూ ఆలోచించలేదు. అసహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూడగానే తన చిన్నప్పటి బాబా గుర్తొచ్చేవాడు భరద్వాజకి. ఆ వ్యక్తి కూడా బాబాలాగా దిక్కులేని చావు చావకూడదు అని మాత్రమే అనుకునేవాడు. వారికి సేవ చేయమని తమని పంపించిన దేవుడు డబ్బు అందే మార్గమూ చూపిస్తాడన్న నమ్మకం ఆ దంపతుల్ని ముందుకు నడిపించేది. మొదట చేబదుళ్లు చేశారు. తర్వాత మాధురి నగలన్నీ అమ్మేశారు. ఆ డబ్బూ అయిపోయాక ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరినైనా నోరు తెరిచి అడగడం వారికి ఇష్టం లేదు. దాంతో ఎవరో చెబితే అస్సాం నుంచి టీ పొడి తెప్పించి ‘అప్నాఘర్‌కీ అప్నా టీ’ పేరుతో అమ్మడం మొదలెట్టారు. ఆ టీ అందరికీ బాగా నచ్చింది. ఆదాయమూ బాగానే వచ్చేది. వ్యాపారంతో పాటు పరిచయాలూ పెరిగాయి. టీపొడి కొనడానికి వచ్చినవాళ్లు అప్నాఘర్‌లో అనాథలకు అందుతున్న సేవల్నీ చూసేవారు. ఆ సంగతి ఆనోటా ఈనోటా అందరికీ తెలిసింది. దాంతో చాలామంది ఫోన్లు చేసి ఫలానాచోట ఓ వృద్ధుడు ఉన్నాడనో, ఫలానాచోట ఓ వికలాంగుడు అచేతనంగా పడివున్నాడనో చెప్పేవారు. భరద్వాజ గబగబా అక్కడికి వెళ్లి తీసుకొచ్చేవాడు. అంతా బాగానే సాగుతున్నా ఆ దంపతులకు ఏదో అసంతృప్తి... డబ్బు కోసమని వ్యాపారంలో ఇరుక్కుని ఆపన్నులకు పూర్తి సమయం కేటాయించలేకపోతున్నాం కదా అన్న ఆవేదన. దాంతో అంత లాభసాటిగా సాగుతున్న వ్యాపారాన్నీ ఆపేశారు. అయితే అప్పటికే వీళ్లు చేస్తున్న సేవ పదిమందికీ తెలిసి కొద్దికొద్దిగా విరాళాలు రావడం మొదలెట్టాయి.

దేవుడిలా చూస్తారు...
శుష్కించిన శరీరాలూ చీము పట్టి రసికారుతున్న గాయాలూ ఏవీ వారిని భయపెట్టలేదు. పాతిక మంది అయ్యేదాకా పనంతా భార్యాభర్తలిద్దరే చేసేవారు. గాయాలను కడిగి మందులు రాయడం, స్నానాలు చేయించి అన్నం తినిపించడం... అంతా ఓపిగ్గా చేసేవారు. ఆ తర్వాత చేరేవారి సంఖ్య వేగంగా పెరగడంతో సహాయకుల్ని పెట్టుకున్నారు. అసహాయ స్థితిలో ఉన్నవారెవరైనా సరే- కులమూ మతమూ ప్రాంతమూ భాషా ఆడా మగా తేడా లేకుండా అప్నాఘర్‌ తలుపు తట్టవచ్చు. శారీరక, మానసిక అనారోగ్యాలతోనో వైకల్యాలతోనో వృద్ధాప్యంతోనో అనాథలుగా మిగిలినవారిని చూసినవారెవరైనా అప్నాఘర్‌కి సమాచారం అందించవచ్చు. పారా మెడికల్‌ సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్‌ అంబులెన్సులో వెళ్లి వారిని ఆశ్రమానికి తీసుకొస్తుంది. అలా తీసుకురావడమూ అంత తేలిగ్గా అయ్యే పని కాదు. రకరకాల కారణాల వల్ల అయినవాళ్ల ఆదరణకు దూరమై, చీదరగా చూసేవాళ్లనూ ఛీత్కరించుకునేవాళ్లనూ చూసి చూసి మనుషుల మీదనే నమ్మకం కోల్పోయిన ఆ అభాగ్యులు తమ దగ్గరికి వచ్చిన అప్నాఘర్‌ కార్యకర్తల్ని చూసి భయపడతారట. వారికి అందకుండా దూరంగా వెళ్లిపోవాలని పరిగెత్తుతారట. నెమ్మదిగా వారికి నచ్చజెప్పి అంబులెన్సులో ఎక్కించుకుంటారు. కొందరైతే శరీరం కృశించి అసలు కదల్లేని స్థితిలో ఉంటారు. వారిని స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి తీసుకురావాల్సిందే. అప్నాఘర్‌కి తీసుకురాగానే ముందుగా జడలు కట్టిన జుట్టును కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించి వేరే దుస్తులు వేస్తారు. ఆ తర్వాత అన్నంపెట్టి విశ్రాంతి తీసుకోనిస్తారు. కాస్త తేరుకున్నాక ఆస్పత్రికి తీసుకెళ్లి అన్ని రకాల పరీక్షలూ చేయిస్తారు. మామూలు పోషకాహార లోపంతో మొదలుపెట్టి క్షయ, క్యాన్సర్‌, హెచ్‌ఐవీ పాజిటివ్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారూ మానసిక, శారీరక వికలాంగులూ... ఇలా వారి పరిస్థితిని బట్టి ఆయా విభాగాలకు కేటాయించిన ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స చేయిస్తారు. అప్నాఘర్‌లో చేరిన వాళ్లంతా అక్కడి సిబ్బందికి దేవుడితో సమానం. అందుకే పేర్లతో నిమిత్తం లేకుండా అందరినీ ‘ప్రభుజీ’(దేవుడు) అని సంబోధిస్తారు. అంత గౌరవంగానూ ప్రేమగానూ చూసుకుంటారు.

కోలుకున్నాక...
అప్నాఘర్‌కి వందమంది వస్తే అందులో ఓ అరవై మంది దాకా పూర్తిగా కోలుకుని సంతోషంగా తమ వాళ్ల దగ్గరికి వెళ్లిపోతారు. మిగిలిన నలభై మందీ ఆశ్రమంలోనే ఉండిపోతారు. ఆశ్రమానికి వచ్చిన వారందరి వివరాలనూ వారిని ఎక్కడినుంచీ ఏ పరిస్థితిలో తీసుకువచ్చిందీ నిర్వాహకులు స్థానిక పోలీసు స్టేషన్లో నమోదు చేయిస్తారు. వాళ్లు కోలుకుని తమ పేరూ ఊరూ తదితర వివరాలూ చెబితే కుటుంబసభ్యులతో కలపడానికి ప్రయత్నిస్తారు. ఎన్నో ఏళ్ల క్రితం తప్పిపోయినవారు ఎందరో అప్నాఘర్‌ ద్వారా కుటుంబాన్ని చేరుకున్నారు. అలా కలుసుకున్నవారి ఆనందం చూసినప్పుడు ఎంతో తృప్తిగా ఉంటుంది- అంటారు డాక్టర్‌ భరద్వాజ. కొంతమందికి ఆ అదృష్టం ఉండదు. వారు చెప్పిన వివరాల ఆధారంగా ఆశ్రమ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఉత్తరం రాస్తారు. వాళ్ల నుంచి స్పందన వస్తే సరే, రాకపోతే మరోసారి రాస్తారు. అలా మూడుసార్లు ప్రయత్నించి ఇక వదిలేస్తారు. ఉత్తరం అందగానే కొందరు వెంటనే వచ్చి తీసుకెళ్తారు. కొంతమంది అసలు స్పందించకుండా వదిలేస్తే కొందరు మాత్రం తాము పోషించలేమనీ మీ దగ్గరే ఉంచుకోమనీ చెప్పేస్తారట. కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉన్నా ఆశ్రమ సిబ్బంది కానీ నిర్వాహకులు కానీ ఏమీ అనుకోరు. ఎవరి పరిస్థితులూ బలహీనతలూ వారివి, వారి ప్రవర్తన పట్ల తీర్పు చెప్పే అధికారం మరొకరికి లేదని నమ్ముతారు. ఆశ్రమంలో ఉండిపోయిన వారిని చివరిదాకా అదే ప్రేమతో చూసుకుంటారు. దాంతో ఎందరో వృద్ధులైన ప్రభుజీలు సగౌరవంగా ప్రశాంతంగా అక్కడే తుదిశ్వాస విడిచారు. కొన్నిసందర్భాల్లో సంబంధీకులు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొని వెళ్లిపోతుంటారు.

వద్దనుకుంటే... వందమంది!
వివిధ కారణాలతో రోడ్డున పడిన ఆడవారి బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో అప్నాఘర్‌ చేరిన వారి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. దీర్ఘకాల అస్వస్థతతోనో మనోవైకల్యంతోనో బాధపడుతున్నవారూ అత్యాచారానికి గురై గర్భం ధరించి, తమ పరిస్థితి తమకే తెలియని స్థితిలో ఉన్నవారూ యాసిడ్‌ దాడి బాధితులూ... ఎంతోమంది అప్నాఘర్‌ చేరుకుంటారు. వారికి చికిత్స ఇప్పించి, కాన్పులు చేసి వారి బిడ్డల్నీ జాగ్రత్తగా సాకుతారు ఇక్కడ. అసలు పద్దెనిమిదేళ్లలోపు వారిని అప్నాఘర్‌లో తీసుకోకూడదని నియమం పెట్టుకున్నారు భరద్వాజ దంపతులు. పిల్లలు ఉంటే వారి చదువు సంధ్యలూ దత్తత వ్యవహారాలూ అన్నీ చూసుకోవాల్సి వస్తుంది, సేవ నుంచి దృష్టి మళ్లుతుందని భావించి ఆ నియమం పెట్టుకున్నారు. కానీ గర్భంతో ఉండి నిస్సహాయ స్థితిలో ఆశ్రమానికి చేరిన మహిళల వల్ల వందమందికి పైగా పిల్లలు అప్నాఘర్‌లో పుట్టి పెరుగుతున్నారు. వాళ్లందరి కోసం ఒక ప్రాథమిక పాఠశాలను ఆశ్రమంలోనే ఏర్పాటుచేశారు. పై చదువులకు వచ్చాక హైస్కూల్లో చేర్పిస్తున్నారు. ఈ మధ్యే ఆశ్రమంలో ముగ్గురు యువతులకు తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేశారు.

సేవే పరమార్థం
భరద్వాజ దంపతులు అప్నాఘర్‌ని ప్రారంభించింది భరత్‌పూర్‌లోనే అయినా ఇప్పుడు ఏడు ఉత్తరాది రాష్ట్రాల్లో 32 అప్నాఘర్‌లు ఏర్పాటయ్యాయి. మరోటి నేపాల్‌లో పనిచేస్తోంది. ఆసక్తి కలవారు ఎవరైనా భవనం ఉచితంగా ఇవ్వగలిగితే రెండు నెలల్లో పూర్తి సౌకర్యాలతో అప్నాఘర్‌ శాఖని ప్రారంభిస్తారు నిర్వాహకులు. తమ పనులు తాము చేసుకోలేని వృద్ధులైనా, అనారోగ్యంతో బాధపడేవారైనా ఇంట్లో ఒక్కరుంటేనే సేవలు చేయడానికి నానా అవస్థా పడతాం మనం. అలాంటిది ఈ అప్నాఘర్‌లలో వందల్లో అలాంటివారు ఉంటారు. భరత్‌పూర్‌లోని ప్రధానాశ్రమంలో అయితే ఏకంగా మూడు వేల మందికి పైనే ఉన్నారు. ఇంతమందికి సేవలు చేయడానికి ఎంతమంది సిబ్బంది కావాలీ... వారికి ఎంత సేవాభావం ఉండాలీ..! అప్నాఘర్‌లలో పనిచేసే సిబ్బందితో పాటు సేవ చేయడానికి ఇష్టపడి వచ్చే స్వచ్ఛంద కార్యకర్తలూ ఉంటారు. ఏడాదిలో ఏ ఒక్కరోజూ రోజులో ఏ ఒక్క గంటా కూడా అక్కడ సేవలకు అంతరాయం కలగదు. పొద్దున్నే ఏడున్నరకి టిఫిన్‌తో మొదలుపెట్టి రాత్రి తొమ్మిదింటికి తలా ఒక గ్లాసూ పాలు ఇచ్చి పడుకోబెట్టేవరకూ దినచర్య అంతా కచ్చితంగా గోడమీద గడియారంతో సమాంతరంగా సాగిపోతుంటుంది. ఎంతమంది సిబ్బంది ఉన్నా భరద్వాజ దంపతులు ఆశ్రమం అంతా తిరుగుతూ అందరి అవసరాలనూ చూసుకుంటూ ఉంటారు. ప్రభుజీలూ వారికి సేవ చేసే సేవకులే తప్ప అక్కడ మరో పదవీ అధికారమూ అంటూ ఏమీ ఉండవు. ‘ఎవరికో సేవ చేస్తున్నామని మేము అనుకోవడం లేదు. ఆ సేవ చేసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా సంకల్పబలానికి ఎందరి సహకారమో తోడైంది కాబట్టే అప్నాఘర్‌ శాఖోపశాఖలుగా విస్తరించింది. ఈ తృప్తి చాలు మాకు. చివరి శ్వాస వరకూ ఈ పని చేస్తూనే ఉంటాం... అంటారు ఈ ఆదర్శదంపతులు... మానవసేవే మాధవ సేవ అన్న మాటని చేతల్లో చూపుతున్న సేవామూర్తులు!


దేవుడికో లేఖ!

అప్నాఘర్‌ వ్యవస్థాపకులు కానీ, కార్యకర్తలు కానీ ఎప్పుడూ ఎవరి దగ్గరికీ వెళ్లి విరాళాలు ఇమ్మని అడగరు. డబ్బు లేనప్పుడు బ్యాంకులో రుణాలు తీసుకున్నారు కానీ ఎవరి ముందూ చేయి చాచలేదు. అప్నాఘర్‌ ఆశ్రమాల్లో ప్రవేశ ద్వారం పక్కనే ఓ నోటీసు బోర్డు ఉంటుంది. దాని మీద ఆశ్రమానికి ఏం కావాలో దేవుడి పేరున లేఖ రాసి ఉంటుంది. ఫలానా పనికి ఇంత డబ్బు కావాలి, ఫలానా సేవలకు మనుషులు కావాలి... ఇలా ఉంటుంది ఆ లేఖలో. అది చూసిన సందర్శకుల నోటి మాట ద్వారానే ఆశ్రమానికీ ఆశ్రమ అవసరాలకీ ప్రచారం జరిగిపోతోంది. అచ్చంగా దాతల విరాళాలతోనే ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు సమకూరుతున్నాయి.


ఆరువేల మంది!

డాక్టర్‌ భరద్వాజ దంపతులు సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అప్నాఘర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇది ఎంత వేగంగా విస్తరించిందంటే ఇప్పుడు మొత్తం 33 ఆశ్రమాలున్నాయి. ఒక్క భరత్‌పూర్‌లోనే మూడువేల మూడువందల మంది దాకా ఉండగా అన్ని ఆశ్రమాల్లో కలిసి ఆరువేలకు పైగా ఆశ్రయం పొందుతున్నారు. అందరూ వృద్ధులూ ఆరోగ్యం బాగోనివారూ కాబట్టి అందరికీ మంచాలు కావాలి. అందుకని విశాలమైన భవనాలు అవసరం. అంత పెద్ద భవనాల నిర్వహణ, అంబులెన్సులు, సిబ్బంది జీతభత్యాలు, ఆశ్రమవాసులకు తిండీ బట్టా వసతీ వైద్యమూ మందులూ... ఇలా అన్నిటికీ కలిసి నెలవారీ ఖర్చు ఒక్కో ఆశ్రమానికీ లక్షల్లో ఉంటుంది. 600 మంది సిబ్బందీ వెయ్యి మంది వలంటీర్లూ పనిచేస్తున్నారు. భరత్‌పూర్‌లో ఆశ్రమానికి అనుబంధంగా ఆధునిక వైద్య వసతులతో ఆస్పత్రీ ఇరవైనాలుగ్గంటలూ సేవలందించే వైద్యులూ ఉన్నారు. మిగిలిన అప్నాఘర్‌ శాఖలకూ దగ్గరలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.