close

మార్పు అనివార్యం

ప్రముఖ రచయిత్రి మాదిరెడ్డి సులోచన 1967లో రాసిన ఈ సందేశాత్మక నవలను నేటి పాఠకుల కోసం మళ్లీ ప్రచురించారు. నవతరం దృక్కోణానికి అనుగుణంగా ‘సమాజమూ పరివర్తన చెందాల్సిందే’ అనే సందేశాన్ని చాటే ఈ నవలకి నేపథ్యం తెలంగాణలోని ఓ పల్లె. సంఘ సంస్కరణ ప్రచారం, తెలంగాణ విమోచనోద్యమం వంటి పరిణామాలు తెచ్చిన మార్పులతో  దుర్విచక్షణలను దునుమాడాలనే భావనలు  యువతలో మొగ్గతొడిగాయి. కులం ఒకటే అయినా అంతస్తుల అంతరం వల్ల పెద్దలు పెళ్లికి అంగీకరించకపోతే ఓ యువజంట ఏం చేసిందీ, దానివల్ల ఊళ్లో ఏ మార్పులు వచ్చాయీ అన్నదే కథ. ఇదే పేరుతో సినిమాగా తెరకెక్కించారు.

- నీలి వేణుగోపాల్‌

తరం మారింది (నవల)
రచన: మాదిరెడ్డి సులోచన
పేజీలు: 141; వెల: రూ.60/-
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమీ


రైతు కథ

ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో చైనా రైతు కథ ఇది. ఆనాటి సామాజిక జీవితానికి అద్దంపడుతుంది. కష్టజీవి అయిన వాంగ్‌కి భూమి అంటే విపరీతమైన ప్రేమ. ఓలాన్‌ అనే బానిసని పెళ్లి చేసుకుని ఒద్దికగా కాపురం చేసుకుంటూ సంపాదించిన డబ్బుతో తన భార్య ఎక్కడైతే బానిసగా ఉందో ఆ భూస్వామి పొలాన్నే కొంటాడు. ఇంతలో కరవు ముంచుకొస్తుంది. పొలం తప్ప అన్నీ అమ్ముకుని పొట్టచేతపట్టుకుని పట్టణానికి వెళ్లిన వాంగ్‌ ఎలా సంపన్నుడయ్యాడో, సంపదతో పాటు వాంగ్‌ కుటుంబంలో వచ్చిన మార్పులేమిటో, పిల్లల చదువులూ పెళ్లిళ్లూ ఎలా సాగాయో చెబుతుందీ కథ. అనుసృజన హాయిగా చదివిస్తుంది.

- శ్రీ

సుక్షేత్రం, మూలం: ద గుడ్‌ ఎర్త్‌
రచన: పెరల్‌.ఎస్‌.బక్‌
అనుసృజన: పి.వి.రామారావు
పేజీలు: 188; వెల: రూ. 175/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


సైకిల్‌ కోసం...

సైకిల్‌మీద ఊరంతా తిరుగుతూ పూలమొక్కలు అమ్మడం ఆ కష్టజీవికి ఇష్టమైన పని. ఇంటికి రాగానే దాన్ని శుభ్రంగా తుడిచి గోడవారగా పెడతాడు. అదే సైకిల్‌ను తండ్రి కన్నా ఎక్కువగా ఇష్టపడే కొడుకు తొక్కడం నేర్చుకుని పోటీకి కూడా సిద్ధమై ఎన్నెన్ని సాహసాలు చేశాడన్నది ఇతివృత్తం. తానా సంస్థ 2019 బాలసాహిత్య పోటీలో బహుమతి అందుకున్న ఈ నవలలో చిన్నారుల చిరుకోరికలూ వాటిని నెరవేర్చుకునే క్రమంలో కనే కలలూ ఎదురయ్యే సవాళ్లూ ఎలా ఉంటాయో ఆసక్తికరంగా వివరించారు. పోటీలో గెలవాలంటే సైకిల్‌ తొక్కాలి, అందుకని ఇంటింటికీ తిరిగి పేపరు వేసిన ఆ కుర్రాడు పోటీలో గెలిచిందీ లేనిదీ తెలియాలంటే పుస్తకం చదవాల్సిందే.

- అన్నపూర్ణ

చక్రం (నవల)
రచన: కన్నెగంటి అనసూయ
పేజీలు: 77; వెల: రూ. 40/-
ప్రతులకు: ఫోన్‌- 9490746614


కులం అడ్డుగోడలు

మనదేశ సామాజిక వ్యవస్థకూ కులానికీ అవినాభావ సంబంధం ఉంది. జీవితాన్ని ప్రతిఫలించే తరతరాల సాహిత్యం ఆ కులాన్ని ఎలా దర్శించిందో గమనించడం ఆసక్తికరం. 1927- 2019 మధ్యకాలంలో రాసిన ఈ సంకలనంలోని 42 కథలూ కులం సమస్యపై తెలుగు కథకుల దృష్టికోణాన్నీ, స్పందననూ తెలియజేస్తాయి. శ్రీనివాసులు ‘నేరేడుపండ్ల కంటు’, భాగ్యరెడ్డి వర్మ ‘వెట్టి మాదిగ’, వేలూరి శివరామశాస్త్రి ‘మాల దాసరి’ కథల నుంచి ఈ తరం కథల వరకూ సాహిత్యసృజనలో కులం ప్రభావం ఏ రీతిలో చిత్రితమయిందో ఈ పుస్తకం చెబుతుంది. అణచివేతనూ, దౌష్ట్యాన్నీ చిత్రించిన కథలు కొన్నయితే, దురాచారాలు రూపుమాపాలనే ఆదర్శాన్నీ సమన్వయాన్నీ ప్రబోధించేవి మరికొన్ని. కులం అన్న పదానికున్న సంకుచితత్వాన్ని పరిహరించి, విస్తృతార్థంలో తీసుకుని సంకలనాన్ని రూపొందించామని సంపాదకులు
ప్రకటించారు. సాధారణ పాఠకులకూ సామాజిక అంశాల విశ్లేషకులకూ ఉపయోగపడే పుస్తకమిది.

- సీహెచ్‌.వేణు

కులం కథ
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్‌
పేజీలు: 368; వెల: రూ.250/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.