close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్ట్రేలియాకి ఏమైంది..!

మనిషి బలవంతుడే కానీ, ప్రకృతి ఇంకా బలమైనది. మనిషి తన స్వార్థం తాను చూసుకున్న ప్రతిసారీ ప్రకృతి తనదైన రీతిలో జవాబిస్తూనే ఉంటుంది. ఏళ్లుగా అభివృద్ధి పేరుతో భూమిని అతలాకుతలం చేస్తున్నా... మైనింగ్‌ మాటున కొండల్ని సైతం తవ్విపోస్తున్నా... విచ్చలవిడి రసాయనాలతో గాలినీ నీటినీ కలుషితం చేస్తున్నా... ఓర్పు వహించిన ప్రకృతి సహనం నశించి కళ్ళెర్రచేస్తోంది. మనిషి తీరు మార్చుకోకపోతే గడ్డిపోచ కూడా మిగలకుండా భూమండలాన్ని బూడిద చేస్తానని హెచ్చరిస్తోంది. ఆస్ట్రేలియా కార్చిచ్చు అలాంటి హెచ్చరికే..!

పొద్దున్నే అలారం కట్టేసి లేచి తలుపు తీసిన సారాకి బయట ఆకాశం నల్లగా చీకట్లు కమ్ముకొస్తున్నట్లు కన్పించింది. ఒక్క క్షణం ఆమెకి అది ఉదయమో సాయంత్రమో అర్థం కాలేదు. చూసినకొద్దీ చీకట్లు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఎందుకిలా... అని ఆశ్చర్యంగా, భయంగా చూస్తుండగానే చుట్టుపక్కల వారంతా ఆమెలాగే విస్తుపోతూ వీధిలోకి వచ్చారు. ఇంతలో సైరన్‌ మోగింది. అంటే ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని ఆ తీరప్రాంత గ్రామవాసులకు అర్థమైంది. కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందనీ అందరూ ఉన్నపళాన బయల్దేరి సముద్రపు ఒడ్డుకు వెళ్లిపోవాలనీ అధికారులు ప్రకటించారు. దాంతో గబగబా పిల్లాపాపల్ని చంకనేసుకుని, పెంపుడు జంతువుల్నీ వెంటబెట్టుకుని బీచికి పరుగులు తీశారు. తొమ్మిదింటికల్లా ఊరు ఖాళీ అయింది. నల్లటి ఆకాశం మధ్యాహ్నానికల్లా నారింజ రంగులోకి మారింది. అంటే మంటలు ఇంకా దగ్గరికి వచ్చాయన్నమాట. సముద్ర తీరప్రాంతమైన ఆ గ్రామానికి పర్యటకుల తాకిడి ఎక్కువ. గ్రామస్థులతో పాటు వారు కూడా అధికారులు ఇచ్చిన మాస్కులు ధరించి సముద్రపు ఒడ్డుకు చేరారు. పరిస్థితి ఇంకా విషమిస్తే పడవల్లో సముద్రం లోపలికి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు అధికారులు. ఇది డిసెంబరు 31న ఆస్ట్రేలియాలోని మల్లకూట అనే గ్రామంలో పరిస్థితి. ఆ తర్వాతి వారం ఈ పరిస్థితి చాలా ఊళ్లకు ఎదురైంది.

కార్చిచ్చు అంటే అక్కడెక్కడో అడవుల్లో కదా అనే అందరూ అనుకున్నారు. అది ఊళ్లలోకి వస్తుందని ఊహామాత్రంగా కూడా ఎవరికీ తోచలేదు. దాని స్వభావమూ అంతే. మనదాకా వస్తుందని వచ్చేదాకా తెలియదు. వచ్చాక తప్పించుకునే మార్గం ఉండదు. దాంతో కట్టుబట్టలతో ఇల్లువదిలి పునరావాస శిబిరాల దారి పట్టారు. తిరిగి ఇంటికి వస్తామో రామో, వచ్చేసరికి ఇల్లు ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. ఒకచోటా రెండుచోట్లా కాదు, ఆస్ట్రేలియాలో రెండు రాష్ట్రాల్లో అడవుల చుట్టూ ఉన్న చాలా ఊళ్ల పరిస్థితి ఇది. 60కి.మీ. దూరం నుంచే మంటలు ఆకాశంలో కన్పిస్తున్నాయంటే అవి ఎంత పెద్ద మంటలై ఉండాలీ..!

కార్చిచ్చు ఊళ్లలోకి వచ్చిందా?
వేసవిలో కార్చిచ్చులు ఎక్కడైనా సహజమే. అయితే ఆస్ట్రేలియాలో కార్చిచ్చును బుష్‌ఫైర్‌ అంటారు. మామూలుగా కార్చిచ్చు చెట్ల పై భాగాన మండుకుంటూ వ్యాపిస్తుంది. ఇక్కడ అలా కాదు. చాలాకాలంగా అక్కడ సరైన వానలు లేకపోవడంతో ఎండిపోయిన ఆకులన్నీ రాలి కుప్పలు కుప్పలుగా చెట్లకింద పోగై ఉన్నాయి. వాటికి అంటుకున్న మంట ఒక పట్టాన ఆరదు. కింద మండుతూనే పైకీ చుట్టుపక్కలకీ శరవేగంగా వ్యాపిస్తుంది. పెద్ద ఎత్తున పొగమేఘాలను సృష్టిస్తూ మైళ్లకు మైళ్లు అడవుల్ని కబళిస్తూ నెలల తరబడి మండుతుంది. ఒకచోటా రెండు చోట్లా కాకుండా దాదాపు రెండు వందల చోట్ల మొదలైన ఈ అగ్నిప్రమాదాలు వేగంగా విస్తరిస్తూ అన్నీ కలిసి ఓ పెద్ద అగ్నిగోళంగా మారడంతో అదుపుచేయలేని స్థితికి చేరాయి. మామూలు కార్చిచ్చును ఆర్పినట్లుగా దీన్ని ఆర్పడం సాధ్యం కాదు. వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సగటు మనిషి గంటకు ఆరుమైళ్ల వేగంతో పరుగెత్తితే కార్చిచ్చు ఆరున్నరమైళ్ల వేగంతో వ్యాపిస్తుందట. అదే ఈ బుష్‌ఫైర్‌ అయితే గంటకు 14 మైళ్ళ వేగంతో వ్యాపిస్తుందట.

మరి ప్రభుత్వం ఏంచేస్తోంది?
ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మంటలను చల్లార్చడానికి శక్తిమేరకు ప్రయత్నిస్తోంది. అగ్నిమాపక శాఖతో పాటు పోలీసులూ సైన్యమూ కలిసి పలురకాలుగా మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అమెరికా, కెనడా, న్యూజిలాండ్‌ తదితర దేశాల నుంచి సైనికులు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కింది నుంచి మంటలు వ్యాపించకుండా ఉండటానికి గోతులు తవ్వారు. పైనుంచి విమానాలూ హెలికాప్టర్ల ద్వారా నీటినీ, మంటల్ని ఆర్పే రసాయనాల్నీ చల్లుతున్నారు. ప్రమాదం ఉందనుకున్న ఊళ్లను ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు.

వర్షాలు కురుస్తున్నాయన్నారు..?
మంటలు మండుతున్నప్పుడు వర్షం కురిస్తే అమ్మయ్య... మంటలు ఆరిపోతాయని ఆనందిస్తాం. అక్కడా అలాగే ఆనందించారు. కాకపోతే ఆ సంతోషం చాలాచోట్ల ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే- మంటల వల్ల వచ్చిన ఆ వాన కొత్త మంటలకు కారణమైంది. మంటలవేడికి ఏర్పడిన పైరోక్యుములోనింబస్‌ మేఘాలు పైకి వెళ్లి చల్లబడి వానజల్లులు కురిపించాయి. అలా ఆ మబ్బులు వానగా మారే క్రమంలో చుట్టుపక్కల ఉన్న గాలినంతా లాగేసుకుంటాయి. దాంతో పరిసర ప్రాంతాల నుంచి గాలి మరింత వేగంగా, బలంగా వీస్తుంది. ఫలితంగా మేఘాలూ గాలుల దిశ మారి మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపించాయి. మరో పక్క సహజంగానే మనకి వేసవి కాలంలో ఉరుములూ మెరుపులతో జల్లులు కురిసినట్లు ఈ కార్చిచ్చుల వల్ల కూడా మెరుపులు ఎక్కువగా రావడం, అవీ మంటలకు కారణమవడం జరిగింది. మొత్తంగా చల్లగాలులు వీచి వాతావరణం చల్లబడితే తప్ప ఇలా అడపాదడపా వచ్చే వానజల్లుల వల్ల కార్చిచ్చు ఆరిపోతుందని ఆశపడడానికి లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. వారికి కూడా ఈ పరిస్థితులు కొత్తగానే కన్పిస్తున్నాయి. అందుకే తాము ముందుగా ఏమీ చెప్పలేకపోతున్నామనీ అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నామనీ అంటున్నారు.

శాస్త్రవేత్తల హెచ్చరికల్ని పట్టించుకోలేదట..?
ఆస్ట్రేలియాలో కొంతకాలంగా కరవు వాతావరణం నెలకొంది. చాలా పట్టణాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. దానికి తోడు ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోయి వాతావరణం చాలా వేడిగా, పొడిగా మారడంతో అగ్నిప్రమాదాలూ ప్రత్యేకించి కార్చిచ్చుల సమస్య ఎక్కువ కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిజానికి డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు మూడునెలలూ ఆస్ట్రేలియాలో వేసవి ఉంటుంది. అయితే ఆగస్టు నుంచే ఎక్కడా చుక్క వాన కురిసిన దాఖలాల్లేవు. పైగా మొన్న డిసెంబరులోనే వరసగా రెండు సార్లు ఆస్ట్రేలియా చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఎక్కువ సగటు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. డిసెంబరు 17న 40.9 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా ఆ మర్నాడే 41.9 డిగ్రీలు నమోదైంది. గతంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 40.3 మాత్రమే. వేసవి ఆరంభంలోనే ఇలా రికార్డు బద్దలవడంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. డిసెంబరు చివరికల్లా ఎప్పుడూ చల్లగా ఉండే టాస్మానియాతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోయాయి. దాంతో సెప్టెంబరులో అక్కడక్కడా మొదలైన కార్చిచ్చులు నవంబరు డిసెంబరునాటికి చాలా ప్రాంతాలకు విస్తరించాయి. జనవరి మొదటి వారానికి పరిస్థితి చేయిదాటి పోతుందేమోననిపించే స్థాయికి చేరుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా ప్రయత్నిస్తే మంటల్ని కొంత అదుపులోకి తేగలమేమో కానీ పూర్తిగా ఆర్పేయడం మాత్రం సాధ్యం కాకపోవచ్చనే స్థానికులు భావిస్తున్నారు. ఇంకా రెండు నెలల వేసవి కాలం ఉండనే ఉంది మరి. నష్టం చాలా ఎక్కువా? అవును... లక్షా ఏడువేలకు పైగా చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అడవులూ వన్యప్రాణుల అభయారణ్యాలూ వాటి మధ్య ఉన్న పంటపొలాలూ కాలిపోయాయి. అంటే, ఆ ప్రాంతం 72 దిల్లీ మహానగరాలతో సమానం. అమెజాన్‌ అడవుల్లో కాలిపోయిన దానికన్నా 15 రెట్లు ఎక్కువ. అరుదైన వృక్షసంపదకూ జీవరాశులకూ నిలయమైన కంగారూ దీవిలో మూడింట ఒకవంతు పూర్తిగా బూడిద కుప్ప అయింది. వందకోట్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోయి ఉంటాయని అంచనా. ఆస్ట్రేలియా జాతీయ జంతువైన కంగారూలూ, పర్యటకుల్ని ఆకట్టుకునే కోలాలూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. మంటల వేడికి తట్టుకోలేక పరుగులు తీస్తున్న జంతువుల ఫొటోలే సోషల్‌మీడియాలో కన్పించి మొత్తం ప్రపంచం దృష్టిని ఆస్ట్రేలియావైపు మళ్లించాయి. చెట్లూ జంతువులే కాదు, రెండు వేలకు పైగా ఇళ్లు కాలిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పాతిక మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూసౌత్‌వేల్స్‌, విక్టోరియా రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోయాయి.

పొగ ఎక్కడిదాకా వెళ్లిందో..?
ఆ మంటల తాలూకు పొగ ఇప్పటికే మెల్‌బోర్న్‌, సిడ్నీ లాంటి నగరాల్లోని ప్రజలపై ప్రభావం చూపుతోంది. ఇది దేశాన్ని దాటి న్యూజిలాండ్‌, దక్షిణ అమెరికా దాకా వ్యాపించింది. అక్కడి వాయు కాలుష్యం స్థాయి ఒకేసారి 37 సిగరెట్లు కాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందట. ఇదంతా ఇప్పుడు కన్పిస్తున్న నష్టం. కానీ ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్నదే అందరినీ భయపెడుతోంది.

అంటే..?
ఇప్పుడు కన్పిస్తున్న నష్టాన్ని లెక్కలేసి చెప్పగలరు కానీ దీని తాలూకు పర్యవసానాలు భవిష్యత్తుపై చూపే నష్టాన్ని ఊహించడమే కష్టం. చనిపోయిన జంతువులు చనిపోగా ఉన్నవాటికీ తిండి దొరక్క చనిపోయే పరిస్థితి వస్తుంది. పర్యావరణమూ జీవవైవిధ్యమూ పూర్తిగా దెబ్బతింటాయి. పంటలు పండడానికి దోహదం చేసే క్రిమికీటకాలు నశించడంతో కొన్నేళ్లపాటు ఆ ప్రభావం వ్యవసాయం మీద పడుతుంది. ఉత్పత్తి, పారిశ్రామిక రంగాల మీదా ప్రభావం పడుతుంది. నిప్పుని ఆర్పడానికే వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇక ఈ నష్టాలన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థమీద పెను ప్రభావం చూపుతాయి.

అసలివి ఎందుకొస్తాయి?
కార్చిచ్చులు సాధారణమైన సమస్యే. అడవులు ఉన్న ప్రతిచోటా వేసవిలో మంటలు చెలరేగడం వాటంతటవే చల్లారడం సహజమే. కానీ అవి అదుపు తప్పి పోవడానికి మాత్రం మనిషే కారణం. తన స్వార్థంతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ వాతావరణ మార్పులకు కారణమవుతున్న మనిషే ఇక్కడ ప్రధాన దోషి.

కార్చిచ్చులకీ అవే కారణమా?
కార్చిచ్చులు ప్రారంభం అవడానికి వాతావరణ మార్పులు కారణం కాదు కానీ అవి ఆపడానికి వీలుకానంతగా వ్యాపించడానికి మాత్రం అవే కారణం. అడవుల్లో సహజంగా ఏర్పడే చిన్నాచితకా కార్చిచ్చులు చాలా సందర్భాల్లో వాటంతటవే ఆరిపోతాయి. అలాంటిది ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నించాల్సి రావడమూ నెలల తరబడి విస్తరించడమూ జరుగుతోందంటే అందుకు వాతావరణమార్పులే ప్రధాన కారణం. పెట్రో ఉత్పత్తుల్ని ఎక్కువగా వాడడం వల్ల పెరిగిన ఉష్ణోగ్రతలూ, నీరు లేకపోవడం వల్ల ఎండిపోయిన చెట్ల కింద మేట వేసుకుపోయిన ఆకులు ఎక్కువగా ఉండడమూ(మంటలు పెరగడానికి ఇవి ఇంధనం అవుతున్నాయి)... వెరసి అడవి మంటలకు ఆజ్యం పోసినట్లవుతోంది. పైగా ఆస్ట్రేలియాలో ఎడాపెడా సాగుతున్న బొగ్గుగనుల తవ్వకమూ మరో కారణమని పర్యావరణ నిపుణుల అభిప్రాయం.

బొగ్గు గనులా..?
ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యం ఇదే మొదటిది కాదు, చాలాకాలంగా వేధిస్తున్న కరవు వల్ల వ్యవసాయరంగం బాగా దెబ్బతింది. చాలా కుటుంబాలు సాగును వదిలేశాయి. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలు. మొదటిది- ప్రపంచంలో బొగ్గు, సహజవాయువుల ఎగుమతుల్లో ఈ దేశానిదే అగ్రస్థానం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవే కీలకమని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. అందుకని కార్చిచ్చుకీ వాతావరణమార్పులకీ సంబంధం లేదని చెబుతూ సమస్యను దారి మళ్లిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పారిస్‌ ఒప్పందం ప్రకారం కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని అంగీకరించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. పైగా ఉన్న వాతావరణ కమిషన్‌ను కూడా ఆరేళ్లక్రితమే రద్దు చేశారు. గత యాభయ్యేళ్లలో ప్రతి వేసవిలోనూ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండే రోజుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. భవిష్యత్తులో వేసవి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ పెరుగుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండోది- కేవలం రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఆ దేశం తలసరి గ్రీన్‌ హౌస్‌ వాయువుల విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. మాంసం కోసం పశువుల పెంపకం ఈ దేశంలో చాలా ఎక్కువ. గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 16 శాతం వాటా వాటిదే. మూడోది- అడవుల నరికివేత.

కారణాలు స్పష్టంగా తెలుస్తున్నా చర్యలు తీసుకోకపోవడానికి కారణం- శిలాజ ఇంధన వనరుల వ్యాపారానికీ రాజకీయాలకు ఉన్న అనుబంధం, విధానాల్లో మార్పు ఏ పరిణామాలకు దారితీస్తుందోనన్న భయం. దాంతో ఎప్పుడూ చర్చల్లోనే ఉన్నట్లుండే వాతావరణ మార్పుల సమస్య... పరిష్కార విధానాలను కనిపెట్టే దిశగా మాత్రం వెళ్లడం లేదు. తాజాగా ఈ కార్చిచ్చు మరోసారి ఆ చర్చను రగిలిస్తోంది.

ప్రపంచానికి ఇది చెప్పే పాఠం ఏమిటి?
ఈ పరిస్థితి ఒక్క ఆస్ట్రేలియాది మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిట్లోనూ కాస్త అటూఇటూగా ఇవే సమస్యలు... భూతాపాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే, తగిన చర్యలు తీసుకోకపోతే ఈ మంటలు ఎక్కడైనా మండొచ్చు!

*  *  *

ఆలనాపాలనా చూస్తూ అమితంగా ప్రేమించే అమ్మయినా సరే, పిల్లల అల్లరి శృతిమించితే బెత్తం పుచ్చుకుంటుంది. ఈ మట్టిలో పుట్టిన మనకు భూమి కూడా అమ్మలాంటిదే! కన్ను తెరిచింది మొదలు మూసేవరకూ మనిషి ప్రయాణమంతా ప్రకృతితోనే... పీల్చే గాలీ తినే తిండీ ఉండే ఇల్లూ బతికే బతుకూ... ప్రతిదీ ప్రకృతి మనకిచ్చిన వరమే.
ఆ బాధ్యత గుర్తెరిగినంత కాలమే దానికీ మనకీ బంధం. లేకపోతే యుద్ధమే!


కూతనే మర్చిపోయింది!

రిస్థితుల ప్రభావం మనుషుల మీదే కాదు, పశుపక్ష్యాదుల మీదా పడుతుందనడానికి ఉదాహరణ ఈ సంఘటన. ఏ దేశంలో ఉన్నా పక్షులు ఒకలాగే కూస్తాయి. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా పక్షులు తమ సహజమైన కూతల్ని మర్చిపోతున్నట్లున్నాయి. నెలల తరబడి ఫైర్‌ ఇంజిన్ల సైరన్లు వినీ వినీ ఓ పక్షి అచ్చంగా అలాగే కూయడాన్ని వీడియో తీసి ట్విటర్‌లో షేర్‌ చేసింది ఓ యువతి.


వెల్లువెత్తిన సాయం

ఆస్ట్రేలియా కార్చిచ్చుని ఆపడానికి ప్రభుత్వ అధికారులకు తోడుగా వేలాది మంది పౌరులు ఫైర్‌ఫైటర్స్‌గా మారారు. దాదాపు డెబ్భై వేల మంది స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. మరో పక్క విరాళాలూ వెల్లువెత్తుతున్నాయి. ఆండ్రూ ఫారెస్ట్‌ అనే వ్యాపారవేత్త ఒక్కడే రూ. 500 కోట్ల విరాళం ఇచ్చాడు. అక్కడి సినీ రాజకీయ ప్రముఖులు కూడా పెద్దమనసుతో సహాయ కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారు. కొందరు భోజనం వండి పునరావాస కేంద్రాలకు సరఫరా చేస్తుంటే మరికొందరు మంటల్లో గాయపడిన మూగజీవాలను ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. బిండి ఇర్విన్‌ అనే యువతి తన కుటుంబసభ్యులతో కలిసి 90వేల వన్యప్రాణులను కాపాడింది. పర్యావరణ ప్రేమికులైన తల్లిదండ్రులు నెలకొల్పిన ఆస్పత్రిలో వాటికి ఉచిత వైద్యం చేస్తూ పెద్దల వారసత్వాన్ని కొనసాగిస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.