close

చదువుల్లో సందేహమా.. వాట్సాప్‌ చేయండి!

సర్‌, సివిల్స్‌ రాద్దామనుకుంటున్నా, ఎలా సిద్ధమవ్వాలి?
‘ఎన్డీఏ’లో చేరాలనుకుంటున్నా, నాకు ఆ జాబ్‌ సరిపోతుందా?
మా అబ్బాయి బాగా చదవట్లేదు... వాడిలో మార్పు తెచ్చేదెలా?
ఆయన ఫోన్‌కి ఇలాంటి మెసేజ్‌లు రోజూ వందల్లో వస్తాయి. వాటన్నింటికీ కొద్ది గంటల్లోనే ఎంతో ఓపిగ్గా సమాధానమిస్తారు ‘కౌన్సెలింగ్‌ గురు’ డాక్టర్‌ శశికుమార్‌.

కేరళలోని కన్నూర్‌ ప్రాంతానికి చెందిన శశికుమార్‌ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇరవై ఏళ్లపాటు ‘స్పేస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా’లో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన... సమాజంలో మార్పుతెచ్చే ఉద్దేశంతో 2009లో వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఎన్నో డిగ్రీలు(ఎమ్మెస్సీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, ఎం.ఎస్‌) చేసిన ఆయన... విద్యతోనే మార్పు సాధ్యమని ‘కౌన్సెలింగ్‌ గురు’, ‘కెరియర్‌ మెంటార్‌’గా కొత్త అవతారమెత్తారు. స్కూళ్లూ, కాలేజీలకు మోటివేషనల్‌ స్పీకర్‌గా వెళ్తుంటారాయన. అక్కడ ఊకదంపుడు ప్రసంగం ఉండదు. విద్యార్థుల సమస్యల్ని అడిగి వాటికి పరిష్కారం చూపుతుంటారు. సదస్సు తర్వాత కూడా సందేహాలుంటే సంప్రదించమని వాట్సాప్‌ నంబరు ఇస్తారు. తనను సందేహాలు అడిగిన వాళ్లకి కొన్ని గంటల్లోనే బదులిస్తారు. ఒక్కోరోజు ఆ మెసేజ్‌ల సంఖ్య వెయ్యికిపైనే ఉంటుంది. ఈయన మాటలకు స్ఫూర్తి పొందిన వారెవరైనా శిష్యులుగా మారతామంటే సరేనంటారు.

సమీక్షించి... సలహా!
‘సివిల్స్‌ రాయాలనుకుంటున్నవాళ్లకి... ఏదైనా అంతర్జాతీయ అంశంమీద పత్రికల్లో నిపుణుల విశ్లేషణని చదివి, వారి మాటల్లో రాసి పంపమంటాను. దాన్నిబట్టి వారి శ్రద్ధ, సామర్థ్యం అర్థమవుతాయి. రక్షణ రంగంలో పనిచేయాలనుకుంటున్నవారిలో క్రమశిక్షణని గమనిస్తాను. విదేశాల్లో చదువుకు వెళ్తానన్నవాళ్లకు ప్రయాణించే అలవాటు ఎంతవరకూ ఉందో తెలుసుకుంటాను. ఆ తర్వాతే సలహాలిస్తాను. బదులుగా రూపాయి కూడా తీసుకోను’ అని చెబుతారు శశి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుమీద శ్రద్ధఉండటంలేదని ఫిర్యాదు చేస్తారు. ముందు వాళ్లలో స్ఫూర్తి నింపితే శ్రద్ధ, లక్ష్యం కచ్చితంగా వస్తాయంటారు ఆయన. ‘పిల్లల్ని సమాజాన్ని చూడనివ్వాలి. అప్పుడే తమకు ఏం కావాలో తెలుస్తుంది’ అని చెప్పే ఆయన విద్యార్థులకు ‘హాలిడే శిక్షా ప్రోగ్రామ్‌’ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా డాక్టర్‌, ఇంజినీర్‌, సైంటిస్టు, ప్రభుత్వ అధికారి తదితరుల జీవితం ఎలా ఉంటుందో, తమ తమ రంగాల్లో వారు చేస్తున్న కృషి ఎలాంటిదో నేరుగా ఆయా నిపుణులచేతే చెప్పిస్తారు. అందువల్ల కొందరికైనా తామూ ఆ స్థాయికి వెళ్లాలన్న లక్ష్యం ఏర్పడుతుందంటారు. చరిత్ర పాఠం క్లాస్‌రూమ్‌లో కంటే కూడా కోటలో చెబితే 100 శాతం అర్థమవుతుందని చెప్పే ఆయన తన విద్యార్థుల్ని గోల్కొండ కోటకు తీసుకువెళ్లి పాఠం చెబుతారు.

పరీక్ష కాలం
‘వార్షిక పరీక్ష అంటే జీవితానికి కాదు, కేవలం పైతరగతులకు వెళ్లడానికి అర్హత సాధించే పరీక్ష. పరీక్షలో పుస్తకంలో ఉన్న ప్రశ్నలన్నీ అడగరు. అక్కడకొన్నీ ఇక్కడకొన్నీ అడుగుతారు. ఇవన్నీ గమనించి ప్రణాళిక వేసుకోవాలి. వీలైనన్ని నమూనా పరీక్షల్ని రాయించాలి. దిద్దిన కాపీల్ని విద్యార్థుల మధ్య పంచాలి. మిగిలినవాళ్లకి తమకంటే ఎక్కువ లేదా తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయో అర్థమై, ఇంకా మెరుగ్గా జవాబులు రాయడమెలాగో తెలుస్తుంది’ అని చెబుతారు శశికుమార్‌. ఇంగ్లిష్‌, తెలుగు, కన్నడ,  మలయాళం... మాట్లాడగలిగే శశి ఉపాధ్యాయులకీ, అధికారులకీ స్ఫూర్తిపాఠాలు చెబుతారు. తన పేరు ్బదీ౯. గి శి ళ్చీ(్తi ర్య్ఝ్చీ౯్శతో యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి విలువైన సమాచారాన్ని పంచుతుంటారు.


పైలట్‌ ప్రాజెక్టు హిట్‌

వీఆర్‌ఎస్‌ తీసుకున్న తర్వాత కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలోని ఓ ప్రాంతంలో వివిధ స్కూళ్ల నుంచి చదువులో వెనకబడిన 90 మంది విద్యార్థుల్ని తీసుకుని మెరుగు పర్చాలన్న తన కలల ప్రాజెక్టు గురించి శశి ఓ మిత్రుడికి చెబితే ఆయన ఆర్థిక చేయూతనిచ్చారు.  అందరినీ ఒకే ప్రభుత్వ బడిలో చేర్పించారు. 2010లో ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. రెగ్యులర్‌గా స్కూల్‌కి పంపిస్తూ, సెలవుల్లో మాత్రం క్లాసులు చెప్పడమూ, చెప్పించడమూ చేసేవారు శశి. కోర్సు ప్రారంభంలో వారందరినీ మూడు రోజులు గోవా పర్యటనకు తీసుకువెళ్లారు. అక్కడ పర్యటకుల నుంచి ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలన్నది వారికి నిర్దేశించిన లక్ష్యం. ఆ పర్యటనలో పిల్లలకు 50కిపైగా దేశాలూ, వాటి కరెన్సీ, రాజధానులూ, అధికార భాషలూ తెలిశాయి. ఆంగ్లాన్ని పుస్తకాలద్వారా కాకుండా డాక్యుమెంటరీలూ, సినిమాలూ చూపించి నేర్పించారు. ఇంటి బడ్జెట్‌ద్వారా లెక్కలూ, ఆర్థిక విషయాలూ నేర్పించారు. ఏడాది తిరిగేసరికి అందరూ ఫస్ట్‌క్లాస్‌ విద్యార్థులుగా మారారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.