close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 ఆ పాట తర్వాతే తొలి సారి ఫ్లైట్‌ ఎక్కాను..

మంగ్లీ... నేటితరం పాటల పవర్‌హౌస్‌! అద్దాల బంజారా దుస్తుల, అందాల తెలంగాణ యాసల యాంకర్‌గా బుల్లితెరపైకొచ్చిన మంగ్లీ తన పాటలతో నేడు వెండితెర పైనా దుమ్మురేపుతోంది. కోటివ్యూలు కొల్లగొట్టిన తెలుగు పాటలతో యువతకి హుషారెత్తిస్తోంది. తెర ఏదైనా సరే పాటల సెలయేరయ్యే మంగ్లీ... తెరవెనక మాత్రం మాటల పొదుపరి. తను ఒద్దికగా దాచుకుంటున్న ఆ మాటల గల్లాపెట్టెను తెరిస్తే... ఈ అమ్మాయి ప్రయాణం బంజారా తండాల్లోని దయనీయ జీవనానికి ప్రతీక అని తెలుస్తుంది. ఆ కష్టాల నడుమ ఎగసిన స్ఫూర్తి పతాకగా కళ్లముందు నిలుస్తుంది!
‘ఏ కులమూ నీదంటే గోకులమూ నవ్వింది’ అని వేటూరి పాట ఉంది కదా! మా బంజారావాళ్లని ‘మీది ఏ ఊరూ అని అడిగితే’ కూడా అలాగే నవ్వి ఊరుకుంటాం. ఎందుకంటే... అఫ్గానిస్థాన్‌ నుంచి అనంతపురందాకా మా లంబాడీలు చాలాచోట్ల విస్తరించి ఉంటారు. ఏ ఒక్కచోటా ఎక్కువకాలం ఉండకుండా ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్లే వలస జీవితం మా కుటుంబాలది. అలా నాకు ఊహవచ్చేనాటికి మేం బసినేపల్లి తండాలో ఉన్నాం. ఆడపిల్ల పుట్టగానే అయితే అమ్ముకోవడమో కాకుంటే కడతేర్చడమో మా దగ్గర ఎక్కువ... అందులోనూ ఇరవైముప్పయ్యేళ్ల కిందట పరిస్థితి మరీ ఘోరంగా ఉండేదని మా అమ్మ చెబుతుంటుంది. మరి నన్నూ మా అమ్మ భారంగానే అనుకుందా... మా కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొందా... వంటి సందేహాలకు సమాధానం చెప్పేముందు ఇప్పటిదాకా సాగిన నా ప్రయాణాన్ని మీకు వివరిస్తాను.

నా అసలు పేరు సత్యవతీ బాయి నా తర్వాత ఇంట్లో ఇద్దరు చెల్లెళ్లూ, ఓ తమ్ముడూ ఉన్నారు. మూడో తరగతి చదివేటప్పటికే ఇంట్లో వంటపనులు చేసే బాధ్యత నాదైంది. వేకువనే అమ్మానాన్నా పొలం పనులకని వెళ్లిపోతే... చెల్లెళ్ళనూ తమ్ముడినీ నేనే చూసుకోవాలి. ఉదయాన్నే పొయ్యిరాజేసి వంట చేసి తమ్ముడికీ చెల్లెళ్లకీ పెట్టి అమ్మానాన్నలకి పొలం దగ్గరకి బువ్వ తీసుకెళ్లడం ప్రతిరోజూ నేను చేయాల్సిన పని. ఆ తర్వాత ఇంటికొచ్చి తయారై బడికెళ్లేదాన్ని. సెలవులప్పుడైతే మా నాన్న బాలూనాయక్‌ ఎక్కడికెళితే అక్కడే ఉండేదాన్ని. పొలం పనులకెళ్లినా సరే ఆయనతోపాటూ వెళ్లి నేనూ పనులు చేసేదాన్ని. అలా వ్యవసాయ పనులతోపాటూ పాటలూ నేర్చుకున్నాను. పదో తరగతి తర్వాత సేద్యం పనులు మానేసినా... పాటల్ని మాత్రం వదులుకోలేకపోయాను. అసలు మా లంబాడీ కుటుంబాల్లో నిద్రలేచినప్పటి నుంచీ రాత్రి మళ్లీ పడుకునేదాకా ప్రతి పనికీ పాటలుంటాయి. జొన్నరొట్టెలు కాల్చడానికి కూడా మేం ప్రత్యేకంగా పాటలు పాడతాం అంటే చూసుకోండి! నేను వాటన్నింటినీ శ్రుతిశుద్ధంగా పాడటం చూసి నన్ను సంగీతంవైపు మళ్లించారు రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు(ఆర్డీటీ) అనే ఎన్జీఓ సభ్యులు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది గ్రామాలూ, లక్షలాది కుటంబాల్లో వెలుగులు నింపిన సంస్థ అది. అప్పట్లో తండాల్లోని మూఢనమ్మకాలని పారదోలేలా ప్రబోధ గీతాలు రూపొందించి నా చేత పాడించేవారు అక్కడి వలంటీర్లు. చిన్నప్పుడైతే ఫర్వాలేదుకానీ... కాస్త పెద్దయ్యాక కూడా నేనలా వేదికలెక్కి పాడటంపైన మా తండాలో రాద్ధాంతం మొదలైంది. మా లంబాడీ తెగలో అమ్మాయిలపైన కట్టుబాట్లెక్కువ. ఈడొచ్చాక ఊరు దాటడానికే కాదు... నోరు విప్పి మాట్లాడటానికీ ఎన్నో ఆంక్షలు. మాటలకే అన్ని కట్టుబాట్లుంటే వేదికలెక్కి పాడటానికి ఉండవా! మా దగ్గరి బంధువుల్లోని మగపిల్లలైతే నేను పాటలు పాడుతున్నానని చాలా చిన్నచూపు చూసేవారు. హేళనగా మాట్లాడేవారు. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు అనుకుంటా... పంజాబ్‌లో జాతీయ యువ ఉత్సవాలకని వెళ్లాల్సి వచ్చింది. అప్పుడూ పెద్ద రాద్ధాంతమే అయింది. తండాపెద్దలు ససేమిరా అన్నారు. నాన్న ఓ వైపూ, ఆర్డీటీ సభ్యులు మరోవైపూ వాళ్లకి నచ్చజెప్పి నన్ను రైలెక్కించారు. ఆ జాతీయ పోటీల్లో నాకే ప్రథమ బహుమతి వచ్చింది! అప్పటి నుంచీ ఆర్డీటీ సభ్యులు నన్ను పూర్తిస్థాయిలో సంగీతంపైనే దృష్టిపెట్టమంటూ ప్రోత్సహించారు. వాళ్ల సూచన, ఆర్థిక సాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్వీ విశ్వవిద్యాలయం మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ డిప్లొమా కోర్సులో చేరాను.

అదొక్కటే నా లక్ష్యం!
అది దేవుడిచ్చిన వరమో ఏమోగానీ సంగీతం విషయంలో ఏది విన్నా అప్పటికప్పుడు యథాతథంగా పాడగలన్నేను. సంగీతం క్లాసుల్లో మా మేడమ్‌ ఏదైనా రాగాన్ని వివరిస్తూ స్వరాలు పలికిన మరుక్షణం... ఏ సాధనా లేకుండానే చక్కగా పాడి వినిపించేదాన్ని. దాంతో ఆరునెలలకే అక్కడి గురువులందరికీ ప్రియశిష్యురాలినైపోయాను. కాకపోతే, మొదటి ఏడాది దాటుతున్నప్పుడు మా కుటుంబ కష్టాలు నన్ను కలచివేయడం ప్రారంభించాయి. నా చదువుకి కావాల్సిన ఫీజులు ఆర్డీటీ భరిస్తున్నా... మిగతా ఖర్చులన్నీ మా కుటుంబానికి భారంగా మారేవి. ఉన్న కాస్త పొలంలో మాకొచ్చే ఆదాయం తిండికే సరిపోయేది. పైగా, మా చదువుల కోసం మా నాన్న బోల్డన్ని అప్పులూ చేశాడు. ఆ అప్పులపైన పెరిగే వడ్డీ ఎలా కట్టాలన్న భయంతోపాటు, కనీసావసరాలకూ వాళ్లు ఇబ్బందులు పడుతుంటే నేను కడుపులో చల్లకదలకుండా చదువుకోవడం ఏమిటనే అపరాధభావం నన్ను వెంటాడుతుండేది. మూడో ఏడాదికి రాగానే- మా గురువులకి సంగీతం మానేస్తానని చెప్పాను. ‘ఈ ఒక్క సంవత్సరం ఆగితే... యూనివర్సిటీ ఫస్ట్‌గా పాసవుతావు నువ్వు!’ అంటూ ఎంతో నచ్చజెప్పారు వాళ్లు. వాళ్లు చెప్పినప్పుడు బాగానే అనిపించేది కానీ మళ్ళీ అదే ఆలోచన. అమ్మవాళ్ళే గుర్తుకొచ్చేవారు. ఇక, లాభంలేదని ఒకరోజు కాలేజీ వదిలేసి మా తండాకి వెళ్లిపోయి ఉద్యోగం తప్ప ఇంకేదీ చేసేదిలేదని భీష్మించుకున్నాను. పాపం... ఏమీ చెప్పలేని పరిస్థితి నాన్నది. తన వంశంలోనే తొలిసారి పై చదువులకి వెళ్లిన అమ్మాయి సగంలోనే మానేసి వస్తోందనే బాధ ఓ వైపు... కుటుంబంలోని కష్టాలు చూసి బాధ్యతని నెత్తికెత్తుకుంటానంటోందనే ఆనందం మరోవైపు ఆయనకి! మొత్తానికి నా మాటే నెగ్గింది.

టీవీల్లోకి...
తిరుపతిలో చదివేటప్పుడు పరిచయమైన సీనియర్ల సాయంతో హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ ప్రయివేటు స్కూల్లో మ్యూజిక్‌ టీచర్‌గా చేరాను. ఆ బడి హాస్టల్‌లోనే తలదాచుకున్నాను. ఆ జీతం కూడా సరిపోక హోమ్‌ ట్యూషన్‌లూ చెప్పేదాన్ని. అన్నింటికీ కలిపి పదివేల రూపాయలు చేతికొచ్చేది. దాంతోపాటూ టీచర్‌ ట్రెయినింగు కూడా పూర్తిచేశాను. అప్పుడే ఓరోజు జానపద గాయకుడు భిక్షునాయక్‌ పిలిచారు. ఆయనెప్పుడో మా తండా వైపు వెళ్లినప్పుడు నేను చక్కగా పాడతానని ఎవరో చెప్పారట. నా పాటలు విన్న ఆయన తన బృందంలో ఒకరిగా ఉండమన్నారు. అలా సుదీర్ఘ విరామం తర్వాత జానపదాల కోసం గొంతు సవరించాను. హైదరాబాద్‌లో వాటికొస్తున్న స్పందన నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఓసారి వి6 ఛానెల్‌లో జానపద కార్యక్రమం జరుగుతుంటే భిక్షునాయక్‌ నన్ను పంపించారు. ఆ కార్యక్రమం తర్వాత టీవీ ఛానెల్‌ వాళ్లు ‘యాంకర్‌గా చేస్తారా!’ అని అడిగారు. నేను ఎంతో అవసరమైతేకానీ మాట్లాడను... అలాంటిది ‘యాంకరింగా!’ అని తటపటాయిస్తుండగా ‘అన్నీ మేమే నేర్పుతాం... వర్రీకాకండీ!’ అన్నారు. సరే చూద్దామని ఒప్పుకున్నాను.

బెస్ట్‌ యాంకర్‌గా...
సత్యవతి అనే పేరుకన్నా క్యాచీగా ఉండేది ఏదైనా కావాలన్నప్పుడు నేను మంగ్లీ అనే పేరు ఎంచుకున్నాను. మా తాతమ్మ పేరు అది. ఆ పేరుతోనే ‘మాటకారి మంగ్లీ’ అనే కార్యక్రమం మొదలైంది. ఎప్పుడూ ఎక్కువ మాట్లాడని నాలో అంత హుషారుంటుందని నేనూ ఊహించలేదు. చుట్టూ ఉన్నవాళ్లూ, ముఖ్యంగా ఆ ఛానెల్‌ ప్రోగ్రామ్‌ హెడ్‌ దామోదర్‌రెడ్డి ప్రోత్సాహం చక్కగా పనిచేసింది. ఆ తర్వాత చేసిన ‘తీన్మార్‌’, ‘తీన్మార్‌ న్యూస్‌’ తెలంగాణలోని గడపగడపకీ నన్ను తీసుకెళ్లాయి. అప్పట్లోనే ఉత్తమ ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంకర్‌గా ‘నేషనల్‌ టీవీ అవార్డు’ గెలుచుకున్నాను. ఇంత చేస్తున్నా... చిన్నప్పటి నుంచీ నేను సాధన చేస్తున్న సంగీతానికి దూరమవుతున్నానన్న బాధ నాలో మొదలైంది. అందుకే టీవీ నుంచి బయటకొచ్చి ‘మైక్‌’ టీవీ యూట్యూబ్‌ ఛానల్‌లో చేరాను. అందులో తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పాడిన ‘రేలా... రేలా’ పాట నన్ను ఒక్కసారిగా ‘సెలబ్రిటీ సింగర్‌’ని చేసింది. ఆ పాట తర్వాతే తొలి సారి ఫ్లైట్‌ ఎక్కాను... అదీ ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌... ఎక్కడికి అనుకుంటున్నారూ... అమెరికాకి! ఆ పాటని ఏడాదిలో రెండుకోట్ల మంది చూశారు! ‘బతుకమ్మ’ పాటకైతే ఐదుకోట్ల వ్యూస్‌ వచ్చాయి. నేను పాడిన సంక్రాంతి, ఉగాది పాటలు తెలంగాణలోనే కాదు... తెలుగు రాష్ట్రాలంతటా నాకు అభిమానుల్ని తెచ్చాయి.

నేను టీవీ ఛానెళ్లలో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ తొలిసారి సినిమాలో పాడటానికి పిలిపించారు. నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ టైటిల్‌ పాట కోసం దర్శకుడు మారుతిగారు కొత్త వాయిస్‌ కావాలంటున్నారని శ్యామన్న చెబితే వెళ్లాను. నా వాయిస్‌ వినగానే ఆయన ఓకే చెప్పడం... అదీ మొదటి పాటే గోపీ సుందర్‌లాంటి గొప్ప సంగీతదర్శకుడి దగ్గర కావడం... ఇప్పటికీ నమ్మలేనట్లుగా అనిపిస్తుంది. ఆ పాట హిట్టుకావడంతో నీదీ నాదీ ఒకటే కథ, వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మీ, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ... ఇలా మరికొన్ని పాటలు పాడే అవకాశాలొచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అలవైకుంఠపురంలోని ‘రాములో రాములా’ ఒకెత్తు. నా పాటలు ఎప్పుడు విన్నారో తెలియదుకానీ తమన్‌గారు సడెన్‌గా స్టూడియోకి పిలిచి ఆ పాట పాడమన్నారు. వాయిస్‌ కాస్త కొత్తగా ఉందనిపించగానే త్రివిక్రమ్‌గారూ, బన్నీగారూ ఓకే చెప్పేశారు. అలా- నా కెరీర్‌లో రెండో పెద్ద హిట్టు వచ్చింది. అన్నట్టు ఆ మధ్య ‘గోర్‌ జీవన్‌’ అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్‌గా నటించాను. బంజారా ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది. ఇందులో పాటలు పాడటమే కాదు... ఫైట్లూ చేశాను.

అప్పుడు చెప్పింది అమ్మ!
సరిగ్గా ఏడాది ముందు జరిగిన విషయం ఇది. మహిళాదినోత్సవం సందర్భంగా నాకు ‘ఈనాడు-వసుంధర’ అవార్డు ప్రకటించారు. ఆ ప్రకటన చూసి అమ్మ కళ్లనీళ్ళు పెట్టుకుంది. ఏమిటమ్మా అని అడిగితే ‘నాకు పెళ్లైన చాలారోజుల దాకా పిల్లల్లేరమ్మా! పన్నెండేళ్ల తర్వాత నువ్వు నా కడుపులో పడ్డావు. లేకలేక కడుపు పండింది, అబ్బాయే పుడతాడని అందరం ఆశతో ఎదురుచూశాం. కానీ పుట్టిందేమో ఆడపిల్ల. ఇంకేముంది... బంధువులందరూ సూటిపోటి మాటలనడం మొదలుపెట్టారు. పైగా, అప్పట్లో మన తండాల్లో అందరూ ఆడపిల్లల్ని చంపేయడమో, అమ్మేయడమో చేసేవారు. దాంతో ఎప్పుడూ- నీ బతుకు ఏమవుతుందో అని భయంగా ఉండేది. దేవుడు నాకెందుకిలా ఆడపిల్లని ఇచ్చాడని ఎంతో ఏడ్చాను. అది గుర్తొచ్చింది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది... తమ్ముడినీ, చెల్లెళ్లనీ చక్కగా చదివిస్తున్నావు, ఇంటికి పెద్దకొడుకులా ఆదుకుంటున్నావు’ అంటూ వాటేసుకుంది. అమ్మ అలా అంటే నేనేం చేయగలను... ఆనందంతో రెండు కన్నీటి చుక్కలు రాల్చడం తప్ప!


చిరు కళ్లలో కన్నీటి తెర!

మధ్య ‘మెగాస్టార్‌’ చిరంజీవి జన్మదిన ఉత్సవాల సందర్భంగా మణిశర్మ సంగీతంలో ప్రత్యేకంగా రూపొందించిన పాట పాడే అవకాశం వచ్చింది నాకు. ఆ రోజు వేదికపైన హైపిచ్‌లో నేను పాడటం విని పవన్‌ కల్యాణ్‌గారు లేచి నిల్చుని మరీ దండం పెట్టడం కెరీర్‌లో మరచిపోలేని విషయం. దానికే మురిసిపోతూ ఉంటే... అకస్మాత్తుగా ఓ రోజు చిరంజీవి గారినుంచే పిలుపొచ్చింది. చిన్నప్పుడు మా తండాల్లోని టీవీల్లో కళ్లు ఇంతింత చేసుకుని అబ్బురపాటుతో చూసిన చిరంజీవిగారితో మాట్లాడతానన్న ఊహ నన్ను నిలవనీయలేదు. తడబడుతూ వెళ్లిన నాతో ‘మా బన్నీ సినిమాలో పాట కూడా నువ్వే పాడావమ్మా... బావుంది!’ అన్నారు కూల్‌గా. నా ఎగ్జైట్‌మెంట్‌ కాస్త తగ్గాక ‘కొణిదెల ఇంటి..’ పాట అందుకున్నాను. చిరంజీవి జీవితం మొత్తాన్నీ బొమ్మకట్టి చూపే ఆ పాటని పాడి ఆపాక... భావోద్వేగంతో ఆయన కళ్లల్లో నీటితెరని చూడటం ఇంకో జన్మకైనా మరచిపోలేను!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.