close
ట్రాలీలో ఇల్లు..!

ల్లు కట్టాలంటే ఇటుకలూ సిమెంటూ.. ఇలా ఎన్నో కావాల్సి వస్తాయి. అలాంటివేవీ అవసరం లేకుండా... ట్రాలీ ఆటోలోనే ఇల్లు కట్టేశాడు తమిళనాడు, నామక్కల్‌కు చెందిన ఇరవైమూడేళ్ల అరుణ్‌ప్రభు. ఏదయినా భిన్నంగా చేసి గుర్తింపు తెచ్చుకోవాలని చిన్నప్పటినుంచీ అనుకునేవాడట అరుణ్‌. కొంతకాలం పరిశోధన చేశాక... బజాజ్‌ ఆర్‌ఈ మూడు చక్రాల ట్రాలీ ఆటోను ఇంటిగా మార్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. బెంగళూరులోని ఆర్కిటెక్చర్‌ స్టార్టప్‌ బిల్‌బోర్డ్స్‌ సాయంతో తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. మొదట ట్రాలీ పైభాగాన్ని తొలగించి, బస్సులోని భాగాలతో ట్రాలీకి ఇంటి రూపాన్ని తీసుకొచ్చాడు. దీనిలోపల వంటిల్లు, పడకగది ఉంటే... పై భాగాన టాయిలెట్‌తోపాటూ కూర్చునేందుకు వీలుగా గొడుగూ కుర్చీ ఏర్పాటు చేశాడు. వండుకునేందుకు అనువుగా స్టౌ, సింకు వంటసామగ్రి... వస్తువులు పెట్టుకునేందుకు ప్రత్యేక అరలు... ఇలా అన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇందులో వాటర్‌హీటర్‌తోపాటూ 250 లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్‌ట్యాంకు, 600 వాట్స్‌ సోలార్‌ప్యానెల్‌ కూడా ఉంటుంది. ఇవి మాత్రమే కాదండోయ్‌... ట్రాలీకి బయటవైపు దుస్తులు ఆరేసేందుకు వీలుగా హ్యాంగర్లూ ఉండటం విశేషం. అయిదు నెలల్లో లక్ష రూపాయల పెట్టుబడితో ఈ ఇంటిని సిద్ధం చేసుకున్నాడు అరుణ్‌.


ప్రసాదంగా పుస్తకాలు

గుళ్లల్లో ప్రసాదం అంటే...  పులిహోరా లడ్డూ పొంగలి.. ఇలా ఏదో ఒకటి పెడతారు. కానీ ఓ ఆలయంలో మాత్రం అవేవీ పెట్టరు. ఇంకా చెప్పాలంటే అసలు తినే పదార్థాన్నే ప్రసాదంగా ఇవ్వరు. మరేం చేస్తారో తెలియాలంటే... కేరళ త్రిశ్శూరులోని మహాదేవ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ గుళ్లోకి వెళ్లి, దర్శనం చేసుకున్నాక పుస్తకాలు చేతిలో పెడతారు. అవే ఇక్కడ ప్రసాదం మరి. అవి మాత్రమే కాదు... పుస్తకాలూ విషయ పరిజ్ఞానాన్ని పెంచే బ్రోచర్లూ సీడీలూ... వంటివి భక్తులకు ఇస్తారు. దీనికి కారణం ఉందంటారు ఆ ఆలయ నిర్వాహకులు. ప్రసాదానికి బదులు ఇలాంటివి ఇవ్వడం వల్ల విజ్ఞానాన్ని పంచొచ్చనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటుచేశా మంటున్నారు ఆలయ నిర్వాహకులు.


93 ఏళ్ల వయసులో...

బాధ్యతలన్నీ తీరిపోయి, ఓ వయసు వచ్చాక కృష్ణారామా అంటూ కాలం వెళ్లదీయడానికే చాలామంది ప్రాధాన్యం ఇస్తారు.  ఈయన మాత్రం తొంభైమూడేళ్ల వయసులో తనకన్నా చిన్నవాళ్లకు మల్లయుద్ధంలో మెలకువలు నేర్పిస్తున్నాడు. ఆయనే మదురైకి చెందిన వికె పళని. ఆరోగ్యకరమైన జీవనవిధానం, కుస్తీపై ఇష్టంతోనే ఈ వయసులోనూ చురుగ్గా ఉన్నానని చెబుతాడు. ఎదిగే వయసులో మల్లయుద్ధంలో మెలకువలు నేర్చుకున్న పళని.. కొన్నాళ్లకు ఇద్దరు స్నేహితులతో కలిసి మల్లయుద్ధం నేర్పించే శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాడు. ఓ వైపు మీనాక్షి మిల్స్‌లో పని చేస్తూనే ఈ కేంద్రాన్ని నిర్వహించేవాడు. ఇప్పుడు తన పూర్తి సమయాన్ని దీనికే కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పదిహేను నుంచి యాభై అయిదేళ్ల వయసు వారికి మల్లయుద్ధంలో శిక్షణ ఇస్తున్నాడు. ప్రతిరోజూ పొద్దున్నే శిక్షణకు అనుగుణంగా మట్టిని సిద్ధం చేస్తాడు పళని. దీన్ని ప్రారంభించిన కొత్తలో కేవలం పది రూపాయలు ఫీజుగా తీసుకున్న పళని.. ఇప్పుడు నూట యాభై రూపాయలకు పెంచాడు.


మెట్లే కానీ... పుస్తకాల పేర్లతో

కాలేజీలూ యూనివర్సిటీల్లో గ్రంథాలయాలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. లెబనాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బలామాండ్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు కానీ... ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ యూనివర్సిటీలోని కొన్ని మెట్లను చూస్తే... పుస్తకాలనే అక్కడ పేర్చారా అని అనిపిస్తుంది. ఆ మెట్లను పుస్తకాల్లా పెయింట్‌ చేయించారు. విద్యార్థులకు పుస్తకపఠనం పట్ల ఆసక్తి పెరుగుతుందన్న ఆలోచనతోనే మెట్లను ఇలా పెయింట్‌ చేశామని అంటోంది ఆ యూనివర్సిటీ యాజమాన్యం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.