close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిక్కిం... ప్రకృతి సౌందర్యానికి చిరునామా..!

పచ్చ కోక చుట్టుకున్నట్లున్న ఎత్తైన పర్వతాలూ స్వచ్ఛ జలాలతో మెరిసే నీలి సరోవరాలూ హరివిల్లు వర్ణాలద్దుకున్నట్లున్న పూలలోయలతో నిండిన ప్రకృతి సౌందర్యంలో పులకించాలంటే సిక్కింకు వెళ్లాల్సిందే  అంటున్నారు వైజాగ్‌కు చెందిన కూచిభొట్ల శిరీష.
సిక్కిం మనదేశంలో తక్కువ జనాభా ఉన్న అతి చిన్న రాష్ట్రం. 1975 వరకూ చోగ్యాల్‌ రాజుల పాలనలో ఉన్న స్వతంత్ర రాజ్యం. ఆ తరవాత ప్రజా తీర్పుని అనుసరించి భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైంది. ఉత్తరాన నేపాల్‌, తూర్పున టిబెట్‌, ఆగ్నేయాన భూటాన్‌ దేశాలూ దక్షిణాన పశ్చిమబెంగాల్‌ సరిహద్దులుగా ఉన్న సిక్కిం ప్రకృతి సౌందర్యానికి చిరునామా. అందుకే అది పర్యటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. మేం కూడా ఆ రాష్ట్రాన్ని చూడాలన్న కోరికతో పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాం. అక్కడ నుంచి ప్రైవేటు వాహనంలో సిలిగురికి వెళ్లి, సిక్కిం పర్యటనకు బయలుదేరాం. కొంత దూరం వెళ్లాక కొండ చరియలు విరిగిపడి, ట్రాఫిక్‌ ఆగిపోవడంతో మళ్లీ వెనక్కి సిలిగురికి వచ్చి ఆ రాత్రి అక్కడే ఉండిపోయి, ఉదయాన్నే బయలుదేరాం... తీస్తా నది వెంబడి సాగిన మా ప్రయాణంలో కొండలూ దట్టమైన చెట్లూ నదీపాయలూ జలపాతాలూ ఆద్యంతం కనువిందు చేశాయి.

వెచ్చని వెదురిల్లు!
తీస్తా, దాని ఉపనది రింగీట్‌ నదులు సిక్కిం ఆర్థికవ్యవస్థకు కీలకమైనవి. దక్షిణ భాగంలో జనావాస ప్రాంతాలు ఉంటే, తూర్పు పడమర ఉత్తర దిశల్లో బ్రహ్మాండమైన హిమాలయ పర్వతశ్రేణులు అర్ధచంద్రాకారంలో రాష్ట్రాన్ని చుట్టి ఉన్నాయి. చుట్టూ ఉన్న దేశాల్ని కలుపుతూ ఎనిమిది లోయ మార్గాలూ 22 పర్వత శిఖరాలూ 21 గ్లేసియర్లూ 5 ఉష్ణ జలఊటలూ వందకు పైగా నదులూ ఏరులతో నిండిన సిక్కిం రాష్ట్రం చూడముచ్చటగా అనిపిస్తుంది.
దక్షిణ సిక్కిం సమ ఉష్ణోగ్రతతో ఉన్నా ఉత్తర భాగంలో మాత్రం వాతావరణం 18 డిగ్రీలకు మించదు. చలికాలంలో మంచూ వర్షాకాలంలో వర్షాలూ చాలా ఎక్కువ. ఇక్కడ ఇళ్లన్నీ ఎక్కువగా వెదురుతోనే కట్టి ఉన్నాయి. పైన పేడతో అలకడంతో లోపల వెచ్చగా ఉంటుందట. రాష్ట్రంలో అత్యధిక భాగం అడవులు కావడంతో రకరకాల జంతువులూ వైవిధ్యభరితమైన మొక్కలూ కనిపిస్తాయి. పైన్‌, ఫిర్‌, ఓక్‌, బిర్చ్‌, మాగ్నోలియా, అత్తి, అరటి, సాల్‌, లారెల్‌, వెదురు... మొదలైన చెట్లు దారిపొడవునా కనువిందు చేశాయి. ఈ రాష్ట్రంలో వంతెనలకూ రహదారుల వెంబడి ఉన్న చెట్లకూ రంగురంగుల బౌద్ధమత జెండాలు వేలాడదీసి ఉంటాయి. దట్టమైన ఈ అరణ్యంలో ఆ జెండాలే ధైర్యాన్ని కలిగిస్తుంటాయి. భౌగోళిక కారణాల కారణంగా సిక్కింలో విమానాశ్రయాలూ రైలుమార్గాలూ లేవుగానీ బాగ్‌డోగ్రా నుంచి సిలిగురికి హెలీకాప్టర్‌ సర్వీసు ఉంది.

లాచుంగ్‌లో...
సిక్కింలోని గ్రామాలను దాటుకుంటూ ప్రకృతి అందాలను తిలకిస్తూ మధ్యమధ్యలో ఆగి టీ తాగుతూ డ్రైవరుతో సంభాషిస్తూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ 9,600 అడుగుల ఎత్తులో ఉన్న లాచుంగ్‌ అనే పట్టణానికి చేరుకున్నాం. సిక్కిం రాష్ట్రం మొత్తం కొండలమీదే ఉండటంతో కొండచరియలు విరిగిపడటం ఇక్కడ సర్వసాధారణం. దాంతో ట్రాఫిక్‌ స్తంభిస్తుంటుంది. అలాంటి సమయంలో ప్రయాణం కాస్త ప్రమాదకరంగా అనిపించిన మాట వాస్తవం. రోడ్లు కొన్ని చోట్ల చాలా సన్నగా ఉన్నాయి. పక్కకి చూస్తే పెద్ద లోయలు భయాందోళనలు కలిగించేవి. కానీ డ్రైవర్లు ఎంతో నైపుణ్యంతో గమ్యాన్ని చేరుస్తుంటారు.
చుట్టూ ఎత్తైన కొండలూ ఆ మధ్యలోని లోయలో చిన్న ఊరూ... అదే లాచుంగ్‌. ఉత్తర సిక్కిం విడిదిగా చెప్పే ఈ గ్రామం ఒక్కో సీజన్‌లో ఒక్కో రకమైన అందంతో కనిపిస్తుంది. లోయలో నిలబడి ఎటు చూసినా ఆకాశంలోకి చొచ్చుకుపోయినట్లున్న వెండికొండలే కనిపిస్తాయి. ఉదయకాంతిలో లేత పసుపు రంగులో సాయం సంధ్యలో ఎర్రని వర్ణంలో ప్రకాశించే ఆ పర్వత శిఖర సౌందర్యాన్ని వర్ణించడానికి మాటల్లేవు అనిపించింది.  ఆ రాత్రికి అక్కడే ఓ హోటల్లో బస చేశాం. భోజనంలో పుల్కాలూ, ఆలూ కూరా, అన్నం పప్పూ ఇచ్చారు. పెరుగు వాడకం తక్కువ. ఆ మర్నాడు మళ్లీ ప్రయాణం మొదలు... లాచుంగ్‌లో మిలిటరీ స్థావరం నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకుని, యుమ్‌థాంగ్‌ లోయలోని జీరో పాయింట్‌కు బయలుదేరాం. ఇది లాచుంగ్‌కి 25 కి.మీ. దూరంలో ఉంది. ఈ లోయలో ప్రయాణం ఓ అద్భత దృశ్యకావ్యంలా తోచింది. విశాలమైన లోయలో రంగురంగుల రోడోడెండ్రాన్‌లూ గులకరాళ్లూ వాటిమీద పరవళ్లు తొక్కుతున్న సెలయేళ్లూ తొలి సంధ్యలో మెరుస్తున్న ఎత్తైన మంచు పర్వతాలూ ఎటు చూసినా ప్రకృతి అందాలే. అలా కొండల్లో గంటన్నర ప్రయాణం తరవాత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే జీరోపాయింట్‌కు చేరుకున్నాం. అప్పటికే అక్కడ టూరిస్టు బస్సులు చాలానే ఉన్నాయి. జీరోపాయింట్‌ దగ్గర కొన్ని వందల మంది నిలబడేంత చోటు మాత్రమే ఉంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌. అక్కడ ఉన్న బడ్డీ కొట్టులో టీ, స్నాక్స్‌ దొరుకుతున్నాయి. మేం వేడి టీ తాగి, పచ్చని కొండల అందాల్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాం. మా సహ యాత్రికుల్లో కొందరు గుట్టలు ఎక్కి నృత్యాలూ చేశారు. సముద్ర మట్టానికి 15,300 అడుగుల ఎత్తుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని నాగరిక ప్రపంచానికి చివరి మజిలీగా చెబుతారు. మంచుతో నిండిన పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రదేశం భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఎలాంటి రోడ్లూ ఉండవు. అందుకే దీన్ని జీరో పాయింట్‌ అని పిలుస్తారు. ఇక్కడికి వెళ్లడానికి ఆర్మీ అనుమతి తప్పనిసరి.
జీరో పాయింట్‌ దగ్గర ఆక్సిజన్‌ తక్కువగా ఉండటం వల్ల తల తిరిగినట్లు అనిపించింది. అక్కడ ఓ గంట మాత్రమే గడిపి, తిరిగి లాచుంగ్‌ చేరుకున్నాం. రాత్రికి అక్కడి హోటల్లో బస చేశాం. ఇక్కడ ఎక్కువగా లెప్చా జాతివాళ్లూ టిబెట్‌ మూలాలు ఉన్న భాటియా జాతివాళ్లూ నివసిస్తారు. లాచుంగ్‌లో తీస్తా నదిమీద నీళ్లపైన అరకిలోమీటరు దూరం మేరకు తాడు మీదుగా జారుతూ ప్రయాణించాం. దీన్నే జిప్‌ వే అడ్వెంచర్‌ అంటారు. ఆ హోటల్లో వాటర్‌ గ్రాస్‌ సూప్‌, చపాతీ, కూర, కొద్దిగా అన్నం ఇచ్చారు. హోటల్‌ గది కిటికీలోంచి చూస్తే తీస్తా నదీతీరం వెంబడి ఉన్న క్యాబేజీ తోటలు ఎంతో మనోహరంగా అనిపించాయి.
మర్నాడు లాచుంగ్‌ నుంచి గ్యాంగ్‌టక్‌కు చేరుకున్నాం. ఇక్కడ ఎక్కువమంది నేపాలీ భాష మాట్లాడతారు. స్కూల్లో కూడా నేపాలీ నేర్పుతారట. నగరం ఎంతో సుందరంగా ఉంది. ఇక్కడ ఉదయం ఐదింటికే వెలుతురు వచ్చేస్తుంది. సాయంత్రం ఐదు గంటలకే చీకటిపడుతుంది. అందుకే వాళ్ల జీవనశైలి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. సిక్కింలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం. అక్కడ ఏ దుకాణంలోకి వెళ్లినా కాగితాల్లోనో ఫైబర్‌ సంచుల్లోనో మాత్రమే ప్యాక్‌ చేసి ఇవ్వడం చూస్తే ఎంతో ముచ్చటేసింది. షాపింగ్‌కి పేరొందిన మహాత్మాగాంధీ రోడ్డులోకి వెళితే అది రంగురంగుల విద్యుత్‌ దీపాలతో ఎంతో సందడిగా ఉంది. ఇక్కడ అనేక రకాల ఉన్ని దుస్తుల దుకాణాలు ఉన్నాయి. వీటితోబాటు చైనా, నేపాల్‌లకు చెందిన సంప్రదాయ కళాకృతులతో నిండిన షాపులు చూడ్డానికే ఎంతో బాగున్నాయి.

 

పెల్లింగ్‌లో..!
ఆ రాత్రికి అక్కడే ఉండి, మర్నాడు పశ్చిమ సిక్కింలోని పెల్లింగ్‌ అనే ఊరుకు చేరుకున్నాం. ఇది చారిత్రక ఆనవాళ్లు ఉన్న ప్రదేశం. దారిలో రవాంగ్లా పట్టణంలో గౌతమబుద్ధ పార్కుని చూశాం. అది రంగురంగుల పూలమొక్కలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అక్కడి నుంచి యుక్‌సామ్‌కు చేరుకున్నాం. ఇది సిక్కిం మొదటి రాజధాని. ప్రపంచంలోనే మూడో ఎత్తైన కాంచనజంగ శిఖరం సిక్కిం, నేపాల్‌లలో విస్తరించి ఉంది. యుక్‌సామ్‌లోని బుద్ధుని మొనాస్టరీ నుంచి కాంచనజంగ పర్వత పాదం వరకూ ట్రెక్కింగ్‌ చేస్తుంటారు. అందుకే అక్కడ వాళ్ల అవసరాలకు తగ్గ సామగ్రి ఉన్న షాపులు చాలానే ఉన్నాయి.
పెల్లింగ్‌లో హోటళ్లూ రిసార్టులూ చాలానే ఉన్నాయి. మేం తీసుకున్న 108 రిట్రీట్‌ అనే వుడెన్‌ కాటేజీ ఎంతో ప్రత్యేకంగా ప్రకృతికి దగ్గరగా ప్రశాంతంగా ఉంది. కాటేజీ కిటికీలోంచి కాంచనజంగ దివ్యంగా కనిపిస్తోంది. ఉదయకాంతిలో దట్టమైన మంచు కప్పుకుని వెండికొండలా మెరిసిపోతున్న కాంచనజంగని చూస్తూ మంత్రముగ్ధులమైపోయాం. తరవాత సైట్‌ సీయింగ్‌కి బయలుదేరి శాండ్‌రప్చె కొండమీద 135 అడుగుల ఎత్తున్న పద్మశాంభవ విగ్రహం చుట్టూ నడిచాం. దీనికే స్కై వాక్‌ అని పేరు. గురు రింపోచీనే పద్మశాంభవ అని పిలుస్తారు. దీని వాక్‌ వే నుంచి చూస్తే ప్రకృతిసౌందర్యం అద్భుతంగా అనిపించింది. అక్కడి నుంచి డార్జిలింగ్‌కు చేరుకుని మినీ రైల్లో అక్కడి ప్రదేశాలన్నీ చూసి తిరిగి బాగ్‌డోగ్రాకి చేరుకున్నాం.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.