close

మేకప్‌ చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తోంది

పెళ్లిళ్లో, ఫంక్షన్లో, కిట్టీ పార్టీల వంటివో ఉన్నప్పుడు కొందరు ఆడవాళ్లు గంటలు గంటలు ముస్తాబవుతుంటారు. పదే పదే దుస్తులు సరిచేసుకుంటూ... నగలు సవరించుకుంటూ అద్దం ముందు నుంచి ఒకపట్టాన కదలరు. మహిళలకు అంత ఇష్టమైన మేకప్‌ గురించి బోలెడు మెలకువలు చెబుతూ... అచ్చం సినీతారల్లా తయారవుతోంది స్మితా దీపక్‌. ఓస్‌ అంతేనా అనుకునేరు... అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో ఉంచి, కోట్ల మందికి చేరువై నెలకు రెండులక్షలపైనే సంపాదిస్తోంది స్మిత.

క్కగా తయారవడం ఓ కళ. మేకప్‌ వేసుకున్నా... ఖరీదైన దుస్తులూ, నగలూ ధరించినా అది కొందరికే సాధ్యమవుతుంది. బెంగళూరు నుంచి వెళ్లి క్యాలిఫోర్నియాలో స్థిరపడిన స్మిత కూడా ఈ కోవకే చెందుతుంది. అందుకే ఆమెకున్న అభిరుచితో ఇంట్లోనే కూర్చుని లక్షల్లో సంపాదిస్తోంది. కంప్యూటర్‌ సైన్సులో ఉన్నత చదువులు చదువుకున్నా... తనకెంతో ఇష్టమైన దుస్తులూ, నగల డిజైనింగ్‌, మేకప్‌ వేయడం వంటివి నేర్చుకుంది. అలానే అక్కడ టీవీ షోలూ చేస్తూనే ఆర్గానిక్‌ దుస్తుల తయారీ పరిశ్రమనూ స్థాపించింది. అయితే స్మితకి ఎన్ని వ్యాపకాలున్నా సరే అందంగా తయారవడమంటే చాలా ఇష్టం. ఖాళీగా ఇంట్లో ఉన్నా మేకప్‌ వేసుకుని సరికొత్త హెయిర్‌ స్టైల్స్‌తో చక్కగా అలంకరించుకుంటుంది. 2016లో ఒకసారి మేకప్‌ వేసుకుంటున్నప్పుడు సరదాగా వీడియో తీసుకోవాలనుకుంది. అలా మేకప్‌ వేసుకోవడంతోపాటు దానికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్‌ కూడా చెబుతూ షూట్‌ చేసిన ఓ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది. దానికి ఒక్కరోజులోనే మంచి స్పందన రావడంతోపాటు మరికొన్ని మెలకువలూ చెప్పమని కామెంట్‌ బాక్సులో మెసేజులు కూడా పెట్టారు వీక్షకులు. దాంతో ఇదేదో బాగుందని స్మిత యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి మరీ ఆ విషయాలన్నీ పంచుకోవడం మొదలుపెట్టింది.

బ్రాండింగూనూ...
అలా మేకప్‌, బ్రైడల్‌ మేకప్‌, రకరకాల హెయిర్‌స్టైల్స్‌ గురించి ఎన్నో విషయాల్ని యూట్యూబ్‌ ఛానల్‌ వేదిగ్గా పంచుకోవడం ప్రారంభించింది. అయితే ఎప్పుడూ అవే చెప్పినా వీక్షకులకు బోర్‌, అని కొన్నాళ్లకి టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ హీరోయిన్లలా తయారైన వీడియోలు పోస్ట్‌ చేయడం మొదలుపెట్టింది. దీపిక పదుకొణె, అనుష్కశర్మల పెళ్లినాటి ఫొటోలను తీసుకుని తననీ అలా మేకప్‌తో రీక్రియేట్‌ చేసుకుంది. ‘బాహుబలి’లో దేవసేన గెటప్‌లోని అనుష్కా, ‘సైరా’లో సిద్ధమ్మగా నటించిన నయనతార, మణికర్ణికలో కంగనల గెటప్‌లతోపాటు కరీనా, కత్రినా కైఫ్‌, ప్రియాంకచోప్రా, అలియా భట్‌, సోనాక్షీ సిన్హా తదితర హీరోయిన్లలానూ రెడీ అవుతోంది. మేకప్‌తోపాటు అచ్చంగా వారు ధరించినలాంటి నగలూ, దుస్తులూ, హెయిర్‌స్టైల్స్‌నీ ప్రయత్నించడం స్మిత ప్రత్యేకత. పైగా ఇంట్లోనే ప్రత్యేకంగా ఓ డిజైనింగ్‌ స్టూడియోని కూడా ఏర్పాటు చేసుకుని ఆ దుస్తులూ నగల్ని తానే సొంతంగా డిజైన్‌ కూడాచేసుకుంటోంది. ఈ విధంగా తీసిన వీడియోలను స్మిత ప్రతి మంగళ, గురువారాల్లో పోస్ట్‌ చేస్తోంది. దాంతో స్మిత ఛానల్‌ దాదాపు 9.5లక్షల చందాదారులకు చేరువై... తొమ్మిది కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది. అలానే పలు సౌందర్యోత్పత్తుల బ్రాండ్లు స్మితని సంప్రదించి ఆమె వీడియోల ద్వారా బ్రాండింగ్‌ కూడా చేసుకుంటున్నాయి. ఈ విధంగానూ మరికొంత సంపాదిస్తోంది స్మిత. ఇతరులకి మేకప్‌ చేసి డబ్బులు సంపాదించుకునే వారిని చూశాం కానీ  తనకి తానే మేకప్‌ వేసుకుని లక్షల్లో సంపాదించుకోవడం... చిత్రంగా ఉంది కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.