close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆత్మవిశ్వాసమే ఆయుధం

వైరస్‌ను జయించిన తెలంగాణ నేతల అనుభవాలు

వారు తెలంగాణలో ప్రజాప్రతినిధులు.. రాజకీయ నేతలు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేవారు. అందరిని పలకరించాలి.. కలిసి మెలిసి తిరగాలి. పర్యటనలు, సమీక్షలు, సమావేశాలు.. ఇతర ప్రజా సంబంధమైన కార్యక్రమాలకు హాజరు కావాలి. ఎప్పుడు ఎలా సోకిందో కూడా తెలీకుండా కరోనా బారిన పడ్డారు. తెలంగాణా హోంమంత్రి మహమూద్‌అలీ, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వీహెచ్‌, గూడూరు నారాయణరెడ్డి కొవిడ్‌ సోకినా చికిత్స పొంది కోలుకున్నారు. వారిని ‘ఈనాడు’ పలకరించినపుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసమే ఆలంబనగా కరోనాను జయించామని తెలిపారు. స్వీయ నియంత్రణతో అసలు ఈ వ్యాధి సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చునని వివరించారు.

- ఈనాడు, హైదరాబాద్‌

జాగ్రత్తగా ఉండాలి
- తెలంగాణ హోంమంత్రి మహమూద్‌అలీ

కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కోవడంలో నాకు ఇబ్బందేం రాలేదు. ఆసుపత్రిలో చేరి వైద్యుల సలహాలు, సూచనలు పాటించాను. వారు ఇచ్చిన మందులు, సి, డి విటమిన్‌ మాత్రలు వాడాను. చికిత్స సాఫీగా సాగింది. మందులు, గోలీలతో పాటు వేడినీళ్లు, తులసి నీళ్లు తాగడం వంటి వాటి వల్ల కోలుకుని ఇంటికి వచ్చాను. వారం రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రజలను కలుస్తాను. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందాలి. చల్లటి నీరు తాగవద్దు. ఇంటి భోజనం మాత్రమే చేయాలి. 


నమ్మకమే సగం నయం చేస్తుంది
- గూడూరు నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ నేత

మొదట్లో నేను వాసన కోల్పోయాను. తర్వాత శ్వాసపరమైన అనారోగ్యం కలగడంతో పరీక్ష చేయించుకోగా కరోనా అని తేలింది. వైద్యులు చక్కటి చికిత్స చేశారు. నమ్మకమే సగం నయం చేస్తుంది. రోజు ఉదయాన్నే 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. నిమ్మకాయలను ఎక్కువగా వాడాలి. రసం తాగొచ్చు. పులిహోర, పచ్చడి వంటివి చేసుకోవచ్చు. జింక్‌, మల్టీ విటమిన్‌ మాత్రలు వాడాలి. విటమిన్‌ సి మాత్రలు చప్పరించాలి. కరోనా సమయంలో కొత్త వాళ్లను ఇంటికి రానీయవద్దు. వేరేవాళ్ల ఇంటికి మనం వెళ్లవద్దు. 


మనల్ని మనమే కాపాడుకోవాలి
- మాజీ ఎంపీ వి.హన్మంతరావు

దుమ్ముగూడెం వద్ద ధర్నాకు పోయిన రోజు వర్షంలో తడిశాను. 19న రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా వస్త్రాలు పంచాను. ఆ తర్వాత కొంత అనారోగ్యంగా అనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్‌ రావడంతో ఆసుపత్రిలో చేరాను. 72 సంవత్సరాల వయసు కావడంతో అందరూ ఆందోళన చెందారు. నేను మాత్రం ఆత్మవిశ్వాసంతో దానిని ఎదుర్కొన్నాను. చికిత్సలో భాగంగా మందులు, యాంటీబయాటిక్స్‌, విటమిన్లు, పోషకాహారం ఇచ్చారు. యోగా చేశాను. కరోనా సమస్య తీవ్రంగా ఉంది. ఎవరికి వారే స్వీయ రక్షణ పాటించాలి. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలి. మాస్క్‌లు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.


నిర్లక్ష్యం చేయవద్దు
- నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

మొదటి నుంచి కరోనాపై అప్రమత్తంగా ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. మాస్క్‌లు వాడాను. చుట్టుపక్కల ఉండేవాళ్లకు మాస్క్‌లు, శానిటైజర్లు, కళ్లద్దాలు పంపిణీ చేశాను. అయినా ఊహించని విధంగా నాకు సోకింది. ఆ లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ చేరి చికిత్స పొందాను. వేడినీళ్లు, నిమ్మకాయ పిండుకొని తాగడం, పసుపు వేసుకొని ఆవిరి పట్టాను. జింక్‌, విటమిన్‌ సి మాత్రలు తీసుకున్నాను. విటమిన్‌ డీ చాలా ముఖ్యమైంది. చల్లటి వాతావరణానికి అలవాటు పడి ఎండకు దూరంగా ఉంటున్నాం. విటమిన్‌ డి ఆ లోటును తీరుస్తుంది. చివరకు కోలుకొని ఇంటికి వచ్చాను. కరోనాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితుడైనా, బంధువైనా 2 మీటర్ల దూరంలో ఉండాలి. ఉదయం ఎండలో ఉండాలి.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.