close
తృణమైనా ధర లేకపాయె!

కొర్ర, సామ, ఊదలు, అండుకొర్రలకు పడిపోయిన డిమాండ్‌
తృణధాన్యాల ధరల పతనంతో నష్టాలు
పంట సాగు సమయంలో కిలో రూ.వందకు పైనే
ఇప్పుడు రైతు అమ్మాలంటే కిలో రూ.30
చిల్లర మార్కెట్‌లో తగ్గని అమ్మకాలు
రైతుల పంటలకు కొనుగోలుదారులు కరవు
మద్దతు ధరల జాబితాలో చేర్చని కేంద్రం
ఈనాడు, హైదరాబాద్‌

తృణధాన్యాలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువ ఉందనే ఆశతో వాటిని పండించిన రైతులు ధర లేక ఆందోళన చెందుతున్నారు. కొర్రలు, అండుకొర్రలు, సామలు, రాగులు, ఊదలు, మొక్కజొన్న తదితర తృణధాన్యాలకు డిమాండ్‌ పడిపోయింది. వీటిలో రాగులు, మొక్కజొన్నలకే కేంద్రం మద్దతుధర ప్రకటిస్తోంది. పోషక విలువలు అధికంగా ఉన్నాయని ఈ పంటలను నిత్యాహారంగా తీసుకునేందుకు ప్రజలు ఆసక్తిచూపడంతో గతేడాది వీటికి డిమాండ్‌ పెరిగింది. చిల్లర మార్కెట్లలో జూన్‌లో వీటిని కిలోకు రూ.వంద వరకు విక్రయించారు. అండుకొర్రల విత్తనాలను వ్యవసాయశాఖ రాయితీపై విక్రయించే ధరనే కిలోకు రూ.200గా నిర్ణయించింది. నగరాల నుంచి వ్యాపారులు ఈ పంటలను కొనటానికి ముందుకొస్తున్నారని రైతులు పలుచోట్ల సాగుచేశారు. ఖరీఫ్‌లో వీటి సాగు సాధారణంకన్నా 346శాతం అధికంగా పెరిగి 9.88 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయశాఖ సెప్టెంబరు చివరిలో నివేదిక ఇచ్చింది. తీరా ఇప్పుడు పంటలు మార్కెట్‌కు తెస్తే ధర లేదని రైతులు వాపోతున్నారు.

ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అండుకొర్రలు, కొర్రలు, రాగులు, జొన్నలు సాగు చేయించింది. పత్తి, వరి పంటలతో పోలిస్తే వీటికి పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉందని సాగు సమయంలో రైతులు సంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పుడేమో పంటలు కోస్తే కొనే నాథుడే లేరు. వ్యవసాయ మార్కెట్లలో వీటిని కొనేందుకు ఏర్పాట్లు లేవు. ఇతర పంటలు కొనే వ్యాపారులు వీటిపట్ల ఆసక్తి చూపడంలేదు. కొర్రలు, అండుకొర్రల పొట్టును ఒలిచి వండుకునేందుకు అనువుగా ధాన్యంగా మార్చే మిల్లులు గ్రామాల్లో లేవు. వీటిని శుద్ధి చేయడమే సమస్యగా మారిందని, వ్యాపారులు కొనడానికి ముందుకురావడం లేదని మార్కెటింగ్‌శాఖ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. కర్ణాటకలో వీటిని నిత్యావసర దుకాణాల్లో విక్రయించేందుకు ఆ ప్రభుత్వం కొంటోంది. కేంద్రం వీటిని కొనేందుకు నిధులివ్వడం లేదని తెలంగాణ మార్కెటింగ్‌శాఖ తెలిపింది.

ఇంట్లో నిల్వ పెట్టాను
భాస్కర్‌, రైతు, మరిగడి గ్రామం,   నర్మెట్ట మండలం, జనగామ జిల్లా
జూన్‌లో విత్తనాలు తెచ్చి కొర్రలు రెండెకరాల్లో వేశాను. వర్షాలకు పంట దెబ్బతిని 5 క్వింటాళ్లే వచ్చింది. క్వింటాకు రూ.3వేలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ఎవరికి అమ్మాలో తెలియక ఇంట్లో నిల్వ పెట్టి ఎదురుచూస్తున్నా.
తమిళనాడు, కర్ణాటకలో సాగు పెరిగింది
- వై.వెంకటేశ్వరరావు, రైతునేస్తం ఫౌండేషన్‌, గుంటూరు
అండుకొర్రలకు జూన్‌లో క్వింటాకు రూ.10వేలకు పైగా ధర ఉండటంతో తమిళనాడు, కర్ణాటకలో సాగు పెరిగింది. రాయలసీమ, తెలంగాణలో పలువురు రైతులు కొత్తగా ఈ పంటలు వేయడంతో ధర సగానికిపైగా తగ్గింది. జులైలో రూ.10 వేలకు కొన్నాను. ఇప్పుడు రూ.5 వేలకైనా అడిగేవారు లేరు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.