close
నేటి నుంచే పాఠశాలలు.. వెన్నాడుతున్న సమస్యలు

ఈనాడు - హైదరాబాద్‌

కొత్త విద్యా సంవత్సరం బుధవారం మొదలవుతున్నా..ప్రభుత్వ బడులను ఇంకా పాత సమస్యలే వెంటాడుతున్నాయి. తరగతుల పునఃప్రారంభంనాటికి ఏకరూప దుస్తులు మొదలు ఎన్నో సవాళ్లు ఎదురు కానున్నాయి. ఉపాధ్యాయులు కూడా పాలకులకు సమస్యలను ఏకరువు పెడుతూ పరిష్కారాలను కోరుతున్నారు. టీఆర్‌టీ ద్వారా టీచర్ల నియామకాలు జరగాల్సి ఉంది. ఇటువంటి స్థితిగతుల్లో పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ స్థాయి ఏపాటిదో ఇట్టే ఊహించుకోవచ్చు. నాణ్యమైన విద్య, కనీస కార్యాచరణ ప్రణాళిక వంటివి ఇప్పటికీ గాడిన పడలేదు. ఎందరు ఎన్ని ఆందోళనలు నిర్వహించినా, ప్రబÅత్వ జీవోలకూ కొరత లేకున్నా, పరిష్కారమైన సమస్యలు ఎన్ని అంటే, వేళ్లమీద లెక్కించాల్సిందే. అందుకే పలు ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. పాఠశాల విద్యావ్యవస్థ గాడిన పడేది ఎప్పుడని విద్యార్థుల తల్లిదండ్రులూ ప్రశ్నిస్తున్నారు.

ఆరని తీరని వేదన
* టీఆర్‌టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ప్రకటన జారీచేసి రెండేళ్లయింది. ఎంపిక చేసినా ఎవరికీ పోస్టింగ్‌ ఇవ్వలేదు. గత అయిదేళ్ల మాదిరిగానే, మళ్లీ ఇప్పుడూ విద్యావాలంటీర్లను కొనసాగించాల్సి వస్తోంది. వారి నియామక ప్రక్రియపైనా ఇప్పటిదాకా సర్కారు ఉత్తర్వులు వెలువడలేదు.
* ప్రభుత్వ బడుల్లో చదివే సుమారు 24 లక్షలమందికి ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు అందించాల్సి ఉంది. అనేక జిల్లాలకు అవి అందనే లేదు. తెలంగాణ చేనేత సహకార సంస్థ(టెస్కో)కు విద్యాశాఖ నిధులు ఇవ్వకపోవడంతో, వస్త్రం సరఫరాలో ఇలా జాప్యం నెలకొంది.
* పాఠశాలల పర్యవేక్షణలో కీలకమైన ఎంఈవో పోస్టుల భర్తీ దాదాపు శూన్యమనే చెప్పాలి. మొత్తం 539 మందికిగాను కేవలం 35మందే శాశ్వత ప్రాతిపదికన ఉన్నారు.ఉన్నత బడులను పర్యవేక్షించే ఉప విద్యాశాఖ అధికారుల ఖాళీలనూ ఇంకా పూర్తిగా భర్తీచేయలేదు. జిల్లాలు 33కు చేరుకున్నా, ఇప్పటివరకు ఉన్నవి 10 డీఈవో పోస్టులే! 23 ఖాళీలను ఇంకా భర్తీ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఉప విద్యాశాఖ అధికారులు, సహాయ సంచాలకులు ఇన్‌ఛార్జులుగా ఇప్పటికీ పనిచేస్తున్నారు. .
* పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించిన విద్యాశాఖ గత విద్యా సంవత్సరం అక్టోబరు వరకే వేతనాలు మంజూరుచేసింది. ఈసారి నియామకంపై ఉత్తర్వులింకా విడుదల కాలేదు. ఉన్నతాధికారులతో మంగళవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాత్రం.. ఆ కార్మికులను నియమించుకోవాలన్న మౌఖిక ఆదేశాలైతే జారీ అయ్యాయి.
* శిథిల గదుల్లోనే కొనసాగుతున్న బడులు నేటికీ వందల సంఖ్యలో ఉన్నాయి. భవన నిర్మాణాలకే రూ.2 వేల కోట్లు అవసరమని అంచనా. ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌ నిధులు చాలామటుకు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయి.
* ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 మేలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి పరిష్కారాలకు హామీ ఇచ్చినా ఉపయోగం లేకుండాపోయిందని టీఆర్‌టీఎఫ్‌ పేర్కొంది. అలాగే భాషా పండితులు, పీఈటీల ఉన్నతీకరణ అంశమూ ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే మగ్గుతోంది.

ఎంతో భారంగా..
గత అయిదు సంవత్సరాలుగా ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడంతో, తల్లిదండ్రులు ప్రైవేట్‌ బడులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ఆ యాజమాన్యాలు 20-30 శాతంపైగా ఫీజులు పెంచేస్తున్నాయి. రుసుముల నియంత్రణపై ప్రభుత్వం నేటికీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అంటే తల్లిదండ్రులకు ఈసారి కూడా ఫీజుల భారం తప్పదన్న మాటే!

- నాగటి నారాయణ, తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.