close
తొలకరికి సాయమందేనా? 

జూన్‌లోనే రైతుబంధు పంపిణీ 
ఎన్నికల నియమావళి వల్ల నగదు విడుదలలో జాప్యం 
రాయితీ విత్తనాల విక్రయాలూ ఆలస్యం 
రుణ ప్రణాళికను ప్రకటించని బ్యాంకర్ల సమితి 
పాత బాకీలు కట్టాలని సతాయిస్తున్న బ్యాంకులు 
వానాకాలం సీజన్‌ ఆరంభానికి ముందే కష్టాలు 
ఈనాడు - హైదరాబాద్‌

నైరుతి రుతుపవనాలు సకాలంలో జూన్‌ మొదటివారానికల్లా వస్తాయని వాతావరణశాఖ ప్రకటించినా వానాకాలం సీజన్‌ పంటల సాగుకు సాయమందించే సన్నాహక పనులేమీ ప్రారంభం కాలేదు. వార్షిక రుణ ప్రణాళికను ఇంతవరకు ‘రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి’(ఎస్‌ఎల్‌బీసీ) విడుదల చేయలేదు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందే సమితి రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటుచేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంటరుణాలెన్ని ఇస్తామనే వివరాలు ప్రకటించాలి. కానీ ఈ సదస్సు ఏర్పాటు గురించి ఇంతవరకు వ్యవసాయశాఖకే సమాచారం లేదు. వానాకాలం పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతులకు బ్యాంకులిచ్చే రుణాలే కీలకం. గతేడాది వానాకాలంలో రూ.25,496 కోట్ల రుణాలిస్తామని చెప్పినా అందులో రూ. 5 వేల కోట్లు ఇవ్వనేలేదు. సీజన్‌ ఆరంభానికి ముందే గతేడాది రైతుబంధు కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున చెక్కుల రూపంలో సాయం చేశారు. ఈసారి ఎకరానికి రూ.5 వేలు ఇస్తామని చెప్పినా ఇంతవరకు ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతాయనే స్పష్టత లేదు. ఈ నెలాఖరు వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున వచ్చే నెల ఆరంభంలో రైతుబంధు సాయం విడుదల కావచ్చని అధికార వర్గాల అంచనా. ఈ పథకం కోసం ఇప్పటికే 54 లక్షల మంది రైతుల వివరాలను సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది.
 

కొత్తగా రుణాలను తీసుకోవడంలేదు 
జగిత్యాల జిల్లాలో ఈ వానాకాలంలో 1.12 లక్షల మంది రైతులకు రూ. 932.77 కోట్ల పంటరుణాలను పంపిణీ చేయాలంటూ జిల్లా బ్యాంకర్ల సమితి సమావేశంలో జిల్లా రుణ ప్రణాళికను ఆమోదించి ప్రభుత్వానికి నివేదించారు. గత నెల నుంచే వానాకాలం పంటరుణాల పంపిణీ ప్రక్రియ మొదలై జూన్‌ మొదటిపక్షం వరకు ఊపందుకోవాలి. కానీ ఈ సారి ఇప్పటివరకు 5 శాతం మంది రైతులు కూడా కొత్త రుణాలను తీసుకోలేదని జిల్లా బ్యాంకుల అధికారులు చెప్పారు. గత డిసెంబరు 11వ తేదీలోపు రూ. లక్ష వరకు రుణం తీసుకున్నవారికి మాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో దాదాపు రూ. 400 కోట్ల వరకు పంట రుణాలు మాఫీ అవుతాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంతవరకు జిల్లావారీ వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేయలేదు. గతేడాది 5.60 లక్షల మంది రైతులకు 2.47లక్షల మంది పంటరుణాలు తీసుకున్నారు. వీరిలో రుణమాఫీ పథకం ద్వారా 1.80లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. వీరి రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసి బ్యాంకులకు నిధులు జమ చేసేవరకు కొత్తగా రుణాలిచ్చే అవకాశాలు లేవని బ్యాంకర్లే అనధికారికంగా చెపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు రుణాలను మంజూరు చేసే పక్రియ మొదలు పెట్టలేదు. దీంతో 90 శాతం మంది రైతులు దళారులపైనే ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రారంభం కాని రాయితీ విత్తన పంపిణీ 
వానాకాలంలో సాగుచేసే పంటలకు అవసరమైన విత్తనాలను రాయితీపై రైతులకు విక్రయించేందుకు 10 లక్షల క్వింటాళ్ల వరకు సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. వీటి విక్రయాలు ఇంతవరకు ప్రారంభం కాలేదు. మరో పక్షం రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం అవుతున్నా రుణాలు మంజూరు కాకపోవడం, రాయితీ విత్తనాల పంపిణీ మొదలు పెట్టకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

కొత్త పంట రుణాలు ఇప్పించాలి 

నాకు రెండెకరాల భూమి ఉంది. గతేడాది తీసుకున్న బాకీని మాఫీ చేస్తే మరింత పెంచి రుణాన్ని తీసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు నేను పాత బాకీ కడితేనే కొత్త రుణం ఇస్తామంటున్నారు. పాతబాకీ కట్టేస్తే నాకు రుణమాఫీ పైసలు రావనే ఉద్దేశంతో కొత్తగా రుణాన్ని తీసుకోవడంలేదు. వెంటనే రుణమాఫీ ప్రక్రియను చేపట్టి ప్రభుత్వం కొత్త పంటరుణాలు ఇప్పించాలి.

- గంగ చిన్నయ్య, రైతు, నాగునూరు గ్రామం, జగిత్యాల జిల్లా

వడ్డీ వ్యాపారులే దిక్కు 

గతేడాది సకాలంలో పట్టాదారు పాసుపుస్తకాలు అందక నాకు బ్యాంకు రుణం అందలేదు. తొలకరి వానలు కురిసేలోపు కొత్త రుణం ఇస్తేనే పంట పెట్టుబడులకు అక్కరకు వస్తుంది. ఆ తరవాత తీరిగ్గా ఎప్పుడో ఇస్తామంటే పంట సాగు పనులకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచే తెచ్చుకోవాలి. బ్యాంకులకు చెప్పి పంటరుణాలు ఇప్పిస్తేనే ప్రయోజనం.

- సైన్ల సత్తయ్య, రైతు, గుట్రాజ్‌పల్లె, జగిత్యాల జిల్లా

రైతుబంధు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం 

రైతుబంధు పథకం కింద అన్నదాతలకు సాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే నెలలో ఈ నిధుల విడుదలకు అవకాశాలున్నాయి. కొత్త పాసుపుస్తకం తీసుకున్న వారికి, పాసుపుస్తకం ఇవ్వడానికి తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం అయిన 54 లక్షల మంది రైతులకు ఈ సాయం అందుతుంది. ఎన్నికల నియమావళి వల్లే కొన్ని పనుల్లో జాప్యం జరుగుతోంది. రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

- పార్థసారథి, ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ

 

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.