close

ప్రధానాంశాలు

పీహెచ్‌సీ స్థాయిలోనూ కరోనాపై కన్ను

లాక్‌డౌన్‌ అనంతర వైద్యసేవలపై సర్కారుకు ఆరోగ్యశాఖ నివేదిక
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో లాక్‌డౌన్‌ అనంతర వైద్యసేవల్లో అనుసరించే కార్యాచరణపై ఆరోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ఆసుపత్రుల్లో సేవలు, జ్వరం, శ్వాసకోశవ్యాధులు, దగ్గు, జలుబు వంటి రోగలక్షణాలపై నిఘా, వలస కార్మికులు, పట్టణ ప్రాంతాలలో సమగ్ర పర్యవేక్షణ, వ్యాధి వ్యాప్తికి అవకాశమున్న వర్గాల సంరక్షణ తదితరాలను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా నెలాఖరుకల్లా పూర్తిగా దాన్ని ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా బాధితులను గుర్తిస్తూ వారికి సరైన చికిత్స అందిస్తూనే.. సాధారణ వైద్యసేవలకు ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టాలని, నిలిచిపోయిన ఓపీ, శస్త్రచికిత్సలను పునరుద్ధరించాలని సూచించింది. కరోనా ప్రబలకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) స్థాయిలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

దవాఖానాల్లో సన్నద్ధత
* అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ సాధారణ ఓపీ సేవలకు ఒకటి.. జలుబు, దగ్గు, జ్వరంతో కూడిన బాధితులకు మరో ఓపీ.. ఇలా విడివిడిగా కౌంటర్లను నిర్వహించాలి. వైద్యుల కోసం వేచిచూసేందుకు వేర్వేరుగా ప్రదేశాలను ఏర్పాటుచేయాలి.
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ తగినన్ని ఔషధాలు, చేతి తొడుగులు, మాస్కులు, శానిటైజర్లను తప్పక అందుబాటులో ఉంచుకోవాలి.
* ఆశాలు, ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి తదితర లక్షణాలున్న బాధితులను గుర్తించి, సమీప పీహెచ్‌సీకి తరలించాలి. అక్కడ కొవిడ్‌ అనుమాతులుగా భావిస్తే.. జిల్లా ఆసుపత్రికి తరలించి, క్వారంటైన్‌లో ఉంచాలి.
* కొవిడ్‌గా నిర్ధారణ అయితే చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించాలి.
* తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నవారినీ గుర్తించి, తప్పక కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి.
* ఆరోగ్యశ్రీ జాబితాలో లేకున్నా వెంటిలేటర్లు, ఐసీయూ సౌకర్యమున్న ప్రైవేటు ఆసుపత్రులు శ్వాసకోశ రోగులకు చికిత్సను అందించాలి. వారి వివరాలను ‘ఇ-బర్త్‌ అండ్‌ నోటిఫయబుల్‌ డిసీజెస్‌’ యాప్‌లో నమోదు చేయాలి. ఎలాంటి కేసులు లేకపోయినా దానిని పేర్కొనాలి.
* మధుమేహం, అధిక రక్తపోటు, క్షయ పీడితులు, వృద్ధులు.. వీరందరికీ ఉచితంగా రెండేసి మాస్కులను అందించాలి. ఇళ్ల వద్దకెళ్లి వీరికి వైద్యపరీక్షలు నిర్వహించి, ఔషధాలు        అందజేయాలి.
* రోగులు, వైద్యసిబ్బంది తప్పక మాస్కులు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. పరికరాలను ఒకసారి వినియోగించాక ఇన్‌ఫెక్షన్‌ను తొలగించే రసాయనంతో తప్పక శుభ్రపర్చాలి.
* ఆసుపత్రుల్లో నేల, ఇతర ఉపరితలాలను రోజుకు కనీసం రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపర్చాలి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.