close

ప్రధానాంశాలు

నిత్యావసరాలపై రాయితీల్లో కోత

దుకాణాలు, మాల్స్‌లో పరిస్థితి
కొన్నింటిపై డిస్కౌంట్‌ సగానికి తగ్గింపు
ఔషధ దుకాణాలదీ అదే తీరు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, మాల్స్‌లో విక్రయిస్తున్న నిత్యావసర వస్తువులు, ఔషధాలపై రాయితీలు తగ్గిపోయాయి. కొవిడ్‌కు ముందు గరిష్ఠ చిల్లర ధరలపై ఆకర్షణీయమైన రాయితీలు ఇవ్వగా, ఇప్పుడు అందులోనూ కోత విధించారు. మాల్స్‌, హోల్‌సేల్‌ మార్కెట్లో తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయన్న ఆశతో వెళ్లిన వారికి గత ధరలతో పోలిస్తే తేడా కనిపిస్తోంది. ఈ-వాణిజ్య సంస్థలు ఆన్‌లైన్లో పేర్కొన్న ధరలూ ఇలాగే ఉన్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్ల వ్యాపారులు రాయితీలు తీసివేసి వస్తువుల ధరలు స్వల్పంగా పెంచారు. హోల్‌సేల్‌ మార్కెట్లు, మాల్స్‌లో వస్తువుల గరిష్ఠ ధరపై  10శాతం వరకు డిస్కౌంట్లు ఇచ్చేవారు. ప్యాకేజీ ఆహారం, సబ్బులు, నూనె తదితరాలపై రాయితీ ఎక్కువ  ఉండేది. కొన్ని రకాల వినియోగ వస్తువులపై 40 శాతం లభించేది. సభ్యత్వకార్డులున్న వారికి అదనపు రాయితీలు ఇచ్చేవారు. కరోనా నేపథ్యంలో ఈ రాయితీల్లో కోతలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం రాయితీ 5 శాతానికి పరిమితమైంది. గతంలో 25 శాతం వరకు రాయితీ లభించే వస్తువులపై 15 శాతమే ఇస్తున్నారు. ‘‘వస్తుసరఫరా లేకపోవడంతో యాజమాన్యం 15 శాతం రాయితీగా నిర్ణయించాయి. సరఫరా మెరుగైతే మునుపటి రాయితీలు లభిస్తాయి’’అని నిత్యావసరాలు విక్రయించే కార్పొరేట్‌ ఉద్యోగి తెలిపారు. ‘‘మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కొరత లేదు. కొందరు తప్పుడు ప్రచారం చేయడంతో హోల్‌సేల్‌ మార్కెట్లలో స్వల్పంగా ధరలు పెరిగాయి’’అని చిల్లర దుకాణ యజమాని  ఒకరు పేర్కొన్నారు. అతిపెద్ద కార్పొరేట్‌ హోల్‌సేల్‌ సంస్థల్లో నిత్యావసరాలు మినహా మిగతా వస్తువుల విక్రయాలు నిలిపివేశారు. వంటసామగ్రి కొనుగోలుకు అనుమతించడం లేదు.

మందులపైనా...
గొలుసుకట్టు ఔషధ విక్రయ సంస్థల మినహా రిటైల్‌ దుకాణాల్లో రాయితీలు ఎత్తివేశారు. కొవిడ్‌కు ముందు ఔషధాలపై కనిష్ఠంగా 10శాతం వరకు రాయితీ కల్పించేవారు. ఇప్పుడు మందుల కొరత పేరిట ఒక్కరూపాయి కూడా తగ్గించడం లేదు. ‘‘డీలర్ల నుంచి మందులు సరఫరా మొదలు కాలేదు. కొన్ని ఔషధాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.’’ అని నగరంలోని మెడికల్‌ షాపు నిర్వాహకుడొకరు తెలిపారు. ఔషధాలు అందుబాటులో లేకుండా ఆర్డరు తీసుకుని రెండు రోజుల్లో తెప్పించి ఇస్తున్నారు. ‘‘ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెట్టినవారికి  మందుల సరఫరాలో ఆలస్యం అవుతోంది. ఒక్కోసారి నాలుగైదు రోజులు వేచి ఉండాల్సి వస్తోంది’’ అని మరో నిర్వాహకుడు చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.