ఉపాధ్యాయులు లేని ఎన్నికలివి!

ప్రధానాంశాలు

ఉపాధ్యాయులు లేని ఎన్నికలివి!

మిగతా ఎన్నికల్లోనూ అమలు చేయాలన్న సంఘాలు

ఈనాడు, హైదరాబాద్‌: పోలింగ్‌ కేంద్రాల్లో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తుండటం ఈసారి ప్రత్యేకత. డిసెంబరు 1న జరిగే జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ సందర్భంగా బోధన సిబ్బందిని వినియోగించుకోరాదని, బదులుగా ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అధిక శాతం మంది ఉపాధ్యాయులే ఉంటారు. అందుకే వారికి ఎన్నికల విధులను అప్పగిస్తుంటారు. ఒక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్నింటిలో వారు పాల్గొంటుంటారు. తొలిసారిగా ఇపుడు గ్రేటర్‌ ఎన్నికల్లో తద్భిన్న పరిణామం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులకు 15 జిల్లాల ఉపాధ్యాయులను పంపించాల్సి ఉంటుందని నాలుగు రోజుల క్రితమే పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గ్రేటర్‌లో సుమారు 38వేల మంది పోలింగ్‌ సిబ్బంది అవసరం. అందులో కనీసం 20వేల మంది ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనూహ్యంగా ఏ ఒక్క టీచరునూ విధుల్లోకి తీసుకోరాదని నిర్ణయించింది. పాఠశాలలు కూడా లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకీ నిర్ణయం తీసుకుందో తెలియదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంతర్యం స్పష్టం చేయాలి
గ్రేటర్‌ ఎన్నికలకు ఉపాధ్యాయులను దూరం పెట్టడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ)లు డిమాండ్‌ చేశాయి. రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుల ఉమ్మడి సమావేశం శనివారం జరిగింది. ఇకపై ఏ ఎన్నికల్లోనూ ఉపాధ్యాయులకు విధులు వేయకుండా ఉంటే సంతోషిస్తామని నేతలు తెలిపారు. ఈనెల 26న కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించే గ్రామీణ భారత్‌ బంద్‌కు తమ సంఘాలు మద్దతు ప్రకటించాయని నేతలు తెలిపారు. వెంటనే పాఠశాలలు ప్రారంభించాలని, సాధారణ, అంతర్‌ జిల్లాల బదిలీలు చేపట్టాలని సమావేశం డిమాండ్‌ చేసింది. సమావేశంలో సదానందంగౌడ్‌, జంగయ్య, కృష్ణుడు, రమణ, రాధాకృష్ణ, లింగారెడ్డి, విఠల్‌, విజయకుమార్‌, పర్వతరెడ్డి, చావ రవి, శ్రీనివాసులు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని