close
ఆధునిక సాగు పద్ధతులను ఆవిష్కరించాలి

శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి సూచన
స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ సేవలు నిస్వార్థమైనవి: గవర్నర్‌ తమిళిసై
ఘనంగా రైతునేస్తం- 2019 పురస్కారాల ప్రదానం

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నదాతలకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఆధునిక సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల బలోపేతంతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఆ దిశగా ఈ రంగాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో ముప్పవరపు ఫౌండేషన్‌, రైతు నేస్తం సంయుక్తాధ్వర్యంలో ‘రైతు నేస్తం-2019’ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రజలు పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు స్వస్తి పలికి స్వదేశీ ఆహార విధానాలను పాటించాలన్నారు. అన్నదాతలను చైతన్యపరుస్తున్న రైతు నేస్తం సంపాదకుడు డా.యడ్లపల్లి వెంకటేశ్వరరావు సేవలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతికి నిస్వార్థంగా సేవలందిస్తున్న ఘనత స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కే దక్కుతుందన్నారు. గతంలో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన వైద్య శిబిరంలో ఓ వైద్యురాలిగా పాల్గొన్నట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యవసాయ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందించాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి కోరారు. ఈ సందర్భంగా కొసరాజు చంద్రశేఖర్‌రావు, లక్ష్మప్ప రాసిన ‘ఔషధ వేదం’, ‘చేపలు-లాభాలు’ తదితర పుస్తకాలను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు.

పురస్కార గ్రహీతలు వీరే..
‘సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.జి.వి.రామాంజనేయులును జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. గిరిజన సహకార సంస్థ ఆంధ్రప్రదేశ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.టి.బాబురావు నాయుడుకు కృషిరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రతిభ చూపిన 11 మంది రైతులు, 12 మంది శాస్త్రవేత్తలు, 13 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏడుగురు జర్నలిస్టులను ‘రైతు నేస్తం’ పురస్కారాలతో సన్మానించారు. ట్రస్ట్‌ ఛైర్మన్‌ కామినేని శ్రీనివాస్‌, కిమ్స్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌రావు, ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ట్రస్ట్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు కృష్ణప్రసాద్‌, కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.