close
‘డిజైన్‌ ఐ’ సంస్థకు జరిమానా 

ఇంటీరియర్‌ డిజైన్‌ సేవల్లో లోపంపై ఫోరం తీర్పు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఒప్పందం ప్రకారం ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేయడంలో జాప్యం చేసినందుకు హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం-2.. ‘డిజైన్‌ ఐ’ అనే సంస్థకు రూ.75,000 జరిమానా విధించింది. మానసిక వేదన చెందిన ఫిర్యాదుదారుకు ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు ఫిర్యాదుదారు చెల్లించిన మొత్తం, కట్టిన అద్దె రూ.53,200 ఇతర ఖర్చుల కింద రూ.10,000 కూడా చెల్లించాలని ప్రతివాదికి సూచించింది. జి.రమేశ్‌ రుణం ద్వారా కోకాపేటలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోసం ‘డిజైన్‌ ఐ’ సంస్థ ప్రతినిధి సాయికృష్ణారెడ్డిని సంప్రదించారు. రూ.1,50,000లకు పనులు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇందు కోసం రమేశ్‌ రూ.25,000 చెక్కు ద్వారా బయానా చెల్లించారు. ప్రతివాది అభ్యర్థన మేరకు మరో దఫా రూ.50,000 చెక్కు పంపారు. డబ్బు సమకూరిందని చెప్పిన తర్వాతే చెక్కును డ్రా చేయాలని సాయికృష్ణారెడ్డిని అభ్యర్థించారు. ఈ విషయాన్ని పట్టించుకోని ప్రతివాది నగదు డ్రా చేయడానికి అడ్వాన్స్‌ చెక్‌ను వినియోగించడంతో చెక్‌ బౌన్స్‌ అయింది. విషయం తెలిసి ఫిర్యాదుదారు వెంటనే రూ.50,000 నగదును ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నా పనులు జాప్యం అవడం పట్ల ప్రశ్నించగా.. ప్రతివాది సమాధానం ఇవ్వకపోగా మిగతా డబ్బు ఇస్తేనే పనులు చేస్తానని, లేదంటే చెక్‌బౌన్స్‌ కేసు వేస్తానంటూ బెదిరించాడని రమేశ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగిలిపోయిన పనులకు రూ.2,00,000 వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రతివాదికి చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించడంతోపాటు తగిన పరిహారం అందేలా చూడాలని రమేశ్‌ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. తగిన ఆధారాలను ఫోరానికి సమర్పించారు. ఇందుకు సంబంధించి ప్రతివాది తన వివరణకు ఫోరానికి సమర్పించలేదు. దీంతో ఫిర్యాదుదారు వాదనతో ఏకీభవిస్తూ ఫోరం తీర్పు ఇచ్చింది.

పరిహారం చెల్లించాల్సిందే..! 
‘కంట్రీవెకేషన్స్‌’ను ఆదేశించిన ఫోరం

ప్పుడు హామీలతో జనం నుంచి డబ్బులు వసూలు చేయడం పట్ల వినియోగదారుల ఫోరం-2 తీవ్రంగా స్పందించింది. సభ్యత్వం కోసం బాధితుడు కట్టిన రూ.1,71,000 తిరిగి ఇచ్చేయాలని సదరు సంస్థకు తెలిపింది. బ్యాంకు వసూలు చేసిన వడ్డీ రూ.13,004తోపాటు పరిహారంగా రూ.10,000, ఇతర ఖర్చులకు రూ.10,000 ఇవ్వాలని తీర్పు వెలువరించింది. ఆ వివరాలను ఫిర్యాదుదారుడు ప్రభాకర్‌గుప్తా వెల్లడించారు. ‘లక్కీడిప్‌లో మీ ఫోన్‌ నంబరుకు మంచి బహుమతి లభించిందన్న సందేశం రావడంతో బేగంపేటలోని కంట్రీవెకేషన్స్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లాను. సభ్యత్వం తీసుకుంటే సంవత్సరంలో వారంపాటు టూర్‌, బంగారు కాయిన్‌, బహుమతిగా రిజిస్ట్రేషన్‌ రుసుము లేని భూమి తదితర హామీలు ఇచ్చారు. నేను, నా భార్య, కుమార్తె పేర్ల మీద సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇందుకోసం క్రెడిట్‌ కార్డు ద్వారా 12 నెలల వాయిదాల రూపంలో రూ.1,65,000, బంగారు కాయిన్‌ కోసం మరో రూ.6,000 చెల్లించాను. దీనిపై కంట్రీవెకేషన్స్‌ ప్రతినిధుల్ని ప్రశ్నిద్దామని వెళ్తే స్పందించలేదు. అందుకే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాను’ అని ప్రభాకర్‌గుప్తా తెలిపారు. ఫిర్యాదుదారు అందించిన వివరాల్లో వాస్తవాలు లేవంటూ కంట్రీవెకేషన్స్‌ సంస్థ ఫోరానికి రాతపూర్వక వివరణ అందించింది. ఇరువురి వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన ఫోరం.. వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.