close

కథనాలు

‘Iam Back’ భయమెరుగని బాక్సర్‌ ఘీంకారం!

మళ్లీ బాక్సింగ్‌ రింగులోకి ‘ఐరన్‌ మైక్‌’

అతడు నడిచొస్తుంటే ఆకలితో వేటాడే సింహంలా కనిపిస్తాడు. అతడు పిడిగుద్దులు కురిపిస్తుంటే ప్రత్యర్థి వెన్నులో వణుకు పుడుతుంది. అతడు రింగులో పొలికేకలు పెడుతూ తిరుగాడుతుంటే అభిమానుల్లో జోరు ఆకాశాన్నంటుతుంది. 

తొలి రౌండులోనే 91 సెకన్లలో ప్రత్యర్థిని నాకౌట్‌ చేసిన ఘనత అతడి సొంతం. 20 ఏళ్లకే హెవీవెయిట్‌ విజేతగా ఆవిర్భవించిన వీరుడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చేత ‘ఐరన్‌ మైక్‌’ అని పిలిపించుకున్న బాక్సర్‌. అతడే మైక్‌ టైసన్‌. ‘మళ్లీ వచ్చేశా..!’ అంటూ అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు.


భయమెరుగని బాక్సర్‌

‘జీవితం చాలా ఆసక్తికరం. తెలియకుండానే పుడతాము. ఎక్కడి నుంచి వచ్చామో తెలియకుండానే కన్నుమూస్తాము. కానీ, మన జీవితం మనల్ని చావుకు సిద్ధం చేస్తుంది. దాని గురించి మనకు తెలియకున్నా ఒక వయసు వచ్చాక చావంటే భయం ఉండదు’ చావుతో సమానమైన బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం భయమనిపించలేదా అని అడిగిన ప్రశ్నకు టైసన్‌ చెప్పిన సమాధానమిది. అతడు రింగులో ఎంత దూకుడుగా చెలరేగుతాడో చెప్పేందుకు ఉదాహరణ ఇది. అలుపెరగని, భయమెరుగని తన బాక్సింగ్‌తో మురిపించిన టైసన్‌ రిటైరైనప్పుడు అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. ఇప్పుడు పునరాగమనం చేస్తుండటం వారిని సంతోష పరిచింది.


ఐరన్‌ మైక్‌

58 పోరాటాలు.. 50 విజయాలు.. 44 నాకౌట్లు.. 6 ఓటములు.. ఇదీ మైక్‌టైసన్‌ బాక్సింగ్‌ చరిత్ర. 1985 నుంచి 2005 వరకు అభిమానులను ఊర్రూతలు ఊగించిన టైసన్‌ 20 ఏళ్లకే  ‘ప్రపంచ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌’గా అవతరించాడు. ఇలాంటి రికార్డు మరెవ్వరికీ లేదు. పాల్గొన్న తొలి 19 బౌట్లలో ప్రత్యర్థులను నాకౌట్‌ చేసేశాడు. అందులో 12 తొలి రౌండ్లోనే సాధించడం విశేషం. అంతులేని ధైర్యం, వజ్ర తుల్యమైన దేహదార్ఢ్యం, చిరుతపులిలోని చురుకుదనం అతడి సొంతం. అందుకే ఆ రోజుల్లో అభిమానుల అతడి ఫైట్‌ను చూసేందుకు పడిచచ్చేవాళ్లు. రెండో రౌండ్లోనే ట్రెవర్‌ బెర్బిక్‌ను చిత్తుచేసి 1986లో టైసన్‌ డబ్ల్యూబీసీ టైటిల్‌ సాధించాడు. 1987లో జేమ్స్‌ స్మిత్‌, టోనీ టక్కర్‌ను మట్టికరిపించి డబ్ల్యూబీఏ, ఐబీఎఫ్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఒకేసారి ఈ మూడు టైటిళ్లను అందుకున్న హెవీవెయిట్‌ బాక్సర్‌ టైసన్‌ ఒక్కడే. అందుకే అతడిని అభిమానులు ముద్దుగా ‘ఐరన్‌ మైక్’ అని పిలుస్తారు. అమెచ్యూర్‌ బాక్సర్‌గా 1981, 1982 జూనియర్‌ ఒలింపిక్‌ క్రీడల్లో అతడు స్వర్ణాలు ముద్దాడాడు.


38 సార్లు అరెస్టు

మైక్‌ టైసన్‌ బాల్యంలోనే అతడి తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత అతడి తల్లి మరొకరిని పెళ్లిచేసుకొని కొన్నాళ్ల తర్వాత విడిపోయింది. అందుకే టైసన్‌ బాల్యం అతడికి నచ్చేది కాదు. వీధుల్లో అల్లరిపిల్లాడిగా తిరిగేవాడు. గొడవలు పడేవాడు. 13 ఏళ్ల ప్రాయంలోనే 38 సార్లు అరెస్టయ్యాడు. జువైనల్‌ కేంద్రంలోని ఓ కౌన్సిలర్‌, మాజీ బాక్సర్‌ బాబీ స్టీవర్ట్‌ ఆ కుర్రాడిలోని బాక్సర్‌ను గుర్తించాడు. బాక్సింగ్‌లో ఓనమాలు దిద్దించి అతడి జీవితాన్ని మలుపు తిప్పాడు. ఆ తర్వాత ‘కస్‌ డిమాటో’కు అప్పగించాడు. ఆ తర్వాత కెవిన్‌ రూనీ అతడిని విజేతగా తీర్చిదిద్దాడు. అతడు హెవీవెయిట్‌ ఛాంపియన్‌గా అవతరించేందుకు పునాది నిర్మించాడు.


అలీ సరసన చేరిక

అత్యాచారం కేసులో టైసన్‌కు 1992లో ఆరేళ్ల శిక్ష పడింది. మూడేళ్ల తర్వాత అతడు పెరోల్‌పై విడుదలయ్యాడు. విపరీతంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అయినా 1995లో వరుస పోరాటాల్లో పాల్గొన్నాడు. 1996లో ఫ్రాంక్‌బర్నో, బ్రూస్‌ సెల్డన్‌ను ఓడించి డబ్ల్యూబీసీ, డబ్ల్యూబీఏ టైటిళ్లను తిరిగి సొంతం చేసుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత హెవీవెయిట్‌ ఛాంపియన్‌గా అవతరించి ఫ్లాయిడ్‌ ప్యాటర్‌సన్‌, మహ్మద్‌ అలీ, టిమ్‌ విథెర్‌స్పూన్‌, ఎవాండర్‌ హోలీఫీల్డ్‌, జార్జ్‌ ఫోర్‌మన్‌ సరసన నిలిచాడు. ఆ తర్వాత డబ్ల్యూబీసీ టైటిల్‌ను 11వ రౌండ్లో ఎవాండెర్‌ హోలీఫీల్డ్‌కు కోల్పోయాడు. 2002లో 35 ఏళ్ల వయసులో మరోసారి ప్రపంచ హెవీవెయిట్‌ టైటిల్‌ కోసం  లెనాక్స్‌ లూయిస్‌తో తలపడి నాకౌటయ్యాడు. 2006లో రిటైర్‌ అయ్యాడు.


మళ్లీ ఇన్నాళ్లకు, 2020లో ఛారిటీ మ్యాచుల్లో తలపడేందుకు అతడు సిద్ధమవుతుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది! ఆనందపరిచింది! ‘నువ్వు తెలివిగా ఆలోచిస్తే ఏదైనా సాధ్యమే. తెలివిగా శిక్షణ పొందు. తెలివిగా కోలుకో’ అని టైసన్‌ అంటున్నాడు. అతడు ఇన్‌స్ట్రామ్‌లో అతడు పెట్టిన వీడియో చూశాక టైసన్‌లో పస తగ్గలేదని అర్థమవుతోంది. పంచులతో అతడు ట్రైనర్‌పై విరుచుకుపడ్డాడు. చురుగ్గా కదిలాడు. విసిరిన పంచ్‌లకు తడిసి ముద్దైన టీషర్టును చూస్తే అతడి అభిమానులకు పండగే!!

-ఇంటర్నెట్‌డెస్క్‌

 

 

 


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.