close
ఫైనల్లో దిల్లీపై గెలిచిన బంగాల్‌

వారెవ్వారియర్స్‌

తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్‌ టైటిల్‌ సొంతం

బంగాల్‌ వారియర్స్‌ అదరగొట్టింది.. పటిష్ఠమైన దబంగ్‌ దిల్లీని చిత్తుచేసి.. ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆ జట్టు తొలిసారి పీకేఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. అదిరిపోయే ఆటతో మూణ్నెల్ల కబడ్డీ వినోదానికి సిసలైన ముగింపు పలికింది.

అహ్మదాబాద్‌

పీకేఎల్‌లో కొత్త ఛాంపియన్‌ అవతరించింది. ఆల్‌రౌండ్‌ ఆటతీరుతో సత్తాచాటిన బంగాల్‌ వారియర్స్‌ చివరి మెట్టుపై ప్రత్యర్థితో కలబడి.. నిలబడింది. కలిసికట్టుగా ఆడిన ఆ జట్టు శనివారం తుదిపోరులో 39-34 తేడాతో దబంగ్‌ దిల్లీపై విజయం సాధించింది. గాయం కారణంగా సెమీస్‌కు దూరమైన బంగాల్‌ కెప్టెన్‌ మణిందర్‌ సింగ్‌ ఫైనల్‌కూ అందుబాటులో లేకుండా పోయాడు. టోర్నీ సాంతం అదిరే ప్రదర్శనతో జట్టును ఫైనల్‌ చేర్చిన అతను లేకపోయినా కూడా బంగాల్‌ గొప్పగా ఆడింది. మహ్మద్‌ నబిబక్ష్ (10)కు తోడు కెప్టెన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన సుఖేశ్‌ హెగ్డే (8)తో పాటు రవీంద్ర రమేశ్‌ (6) ఆకట్టుకున్నారు. జీవ కుమార్‌ (4) ట్యాక్లింగ్‌లో మెరిశాడు. దిల్లీ జట్టులో నవీన్‌ కుమార్‌ (18) ఒంటరి పోరాటం వృథా అయింది. జట్టును గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నించిన అతనికి సహచరుల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో నిరాశతప్పలేదు.

మహ్మద్‌ మాయ: సూపర్‌ ఫామ్‌లో ఉన్న నవీన్‌కు తోడు ట్యాక్లింగ్‌లో అనిల్‌ చెలరేగడంతో ఆరంభం నుంచే దిల్లీ దూకుడు కొనసాగింది. చూస్తుండగానే 6-0తో ఆధిక్యం సంపాదించి ముందుకు సాగింది. ఆరు నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 11-3తో దూసుకెళ్లింది. ఆ జట్టు ఆధిపత్యం చూస్తుంటే బంగాల్‌ కనీసం పోటీ అయినా ఇస్తుందా అనిపించింది. కానీ మహమ్మద్‌ నబిబక్ష్ ఒక్కసారిగా చెలరేగాడు. వరుసగా పాయింట్లు సాధించి బంగాల్‌ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. దిల్లీని ఆలౌట్‌ చేసిన ఆ జట్టు 14-15తో ప్రత్యర్థిని సమీపించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి 17-17తో రెండు జట్లు సమానంగా నిలిచాయి. విరామం తర్వాత పోరు మరో స్థాయికి చేరింది. ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్ల వేటను ముమ్మరం చేశారు. దాంతో స్కోర్లు సమమవుతూ సాగాయి. మరోవైపు నిలకడగా పాయింట్లు రాబట్టిన నబిబక్ష్ మరోసారి దిల్లీ ఆలౌట్‌కు కారణమయ్యాడు. దాంతో బంగాల్‌ 25-21తో ఆధిక్యం సాధించింది. నవీన్‌ రాణించడంతో దిల్లీ పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సుఖేశ్‌ హెగ్డే ఆ జట్టు ప్రయత్నాలకు అడ్డుపడ్డాడు. అతను  రైడింగ్‌లో మెరవడంతో బంగాల్‌ ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 34-24తో   నిలిచింది. నవీన్‌ పోరాడినప్పటికీ ఆధిక్యాన్ని తగ్గించలేకపోయాడు.  మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 33-37తో దిల్లీ ప్రత్యర్థిని  అందుకునేలా కనిపించింది. కానీ వ్యూహాత్మకంగా ఆడిన బంగాల్‌   చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకొని మ్యాచ్‌ కైవసం చేసుకుంది.

పీకేఎల్‌-7 మెరుపులు
* అత్యధిక రైడ్‌ పాయింట్లు- పవన్‌ సెరావత్‌ (346- బెంగళూరు బుల్స్‌)
* ట్యాక్లింగ్‌ పాయింట్లు- ఫజల్‌ అత్రచలి (82- యు ముంబా)
* సూపర్‌ రైడ్లు- పర్దీప్‌ నర్వాల్‌ (15- పట్నా పైరేట్స్‌)
* సూపర్‌ 10- నవీన్‌ కుమార్‌ (22- దబంగ్‌ దిల్లీ)
* సూపర్‌ ట్యాకిళ్లు-  విశాల్‌ భరద్వాజ్‌ (9- తెలుగు టైటాన్స్‌)
* హై5- సుర్జీత్‌ సింగ్‌  (7- పుణెరి పల్టాన్‌)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.