close
నిఖత్‌ ఎవరు?

దిల్లీ: తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌తో తలపడడానికి తాను భయపడడం లేదని బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ ప్రకటించింది. అసలు నిఖత్‌ ఎవరో తనకు తెలియదన్న మేరీ.. ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ కోసం ఒకవేళ సెలక్షన్స్‌ ట్రయల్స్‌లో ఆమెతో పోటీపడాల్సి వస్తే అది కేవలం నామమాత్రమైన పోరుగానే మిగిలిపోతుందని తెలిపింది. వచ్చే ఏడాది చైనాలో నిర్వహించే ఒలింపిక్స్‌ క్వాలిఫయర్‌ బాక్సింగ్‌ టోర్నీకి ఎలాంటి సెలక్షన్స్‌ ట్రయల్స్‌ నిర్వహించడకుండా నేరుగా మేరీకోమ్‌ను పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానివల్ల అదే విభాగం (51 కేజీలు)లో పోటీపడే తనకు అన్యాయం జరుగుతోందని కేంద్ర క్రీడల మంత్రి కిరెన్‌ రిజుజుకు నిఖత్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై మేరీ స్పందిస్తూ.. ‘‘క్రీడాకారుల ఎంపిక విషయంలో భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) నిర్ణయం తీసుకుంటుంది. నిబంధనలను మార్చే అధికారం నాకు లేదు. ఏ టోర్నీ అయినా ఉత్తమ ప్రదర్శన చేయడమే నా పని. బీఎఫ్‌ఐ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. అసలు నిఖత్‌ ఎవరు? ఆమెతో తలపడడానికి నాకేం భయం లేదు. ట్రయల్స్‌కు నేను సిద్ధమే. శాఫ్‌ క్రీడల నుంచి మొదలు ఆమెను చాలా సార్లు ఓడించా. అయినా సవాలు విసురుతూనే ఉందంటే అర్థమేంటి? గెలుపు నాదే కాబట్టి ట్రయల్స్‌ కేవలం నామమాత్రమే. ఒలింపిక్స్‌లో పతకం సాధించే సామర్థ్యం ఎవరికి ఉందో బీఎఫ్‌ఐకి తెలుసు. నాపై కొంతమంది అసూయతో ఉన్నారు. గతంలో కూడా ఇలా జరిగింది. ఆమెపై నాకెలాంటి వ్యతిరేకత లేదు. భవిష్యత్‌లో ఆమె గొప్పగా రాణించొచ్చు. అనుభవం గడించి, ఉత్తమ స్థాయికి చేరే దిశగా ఆమెను దృష్టి పెట్టనివ్వండి’’ అని మేరీ చెప్పింది.
బింద్రాకు ఏం సంబంధం?: నిఖత్‌కు మద్దతుగా నిలిచిన ఒలింపిక్స్‌ షూటింగ్‌ స్వర్ణ విజేత అభినవ్‌ బింద్రాపైనా మేరీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘బింద్రా ఒలింపిక్స్‌ పసిడి విజేత కావొచ్చు. కానీ నేను కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలిచా. బాక్సింగ్‌కు సంబంధించిన విషయాల్లో అతను జోక్యం చేసుకోవడం తగదు. అది అతనికి సంబంధం లేనిది. నేనెప్పుడూ షూటింగ్‌ గురించి మాట్లాడలేదు. కాబట్టి అతను కూడా బాక్సింగ్‌ గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది. బాక్సింగ్‌ గురించి కానీ వాటి నిబంధనల గురించి కానీ   అతనికి ఏమీ తెలీదు’’ అని మేరీ వెల్లడించింది. మరోవైపు నిఖత్‌ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బీఎఫ్‌ఐ వచ్చే వారం సెలక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించి ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.