close
అజేయులు @  11

టీమ్‌ఇండియా ఖాతాలో రికార్డు సిరీస్‌
మళ్లీ కుప్పకూలిన దక్షిణాఫ్రికా
ఇన్నింగ్స్‌ 137 పరుగులతో కోహ్లీసేన విజయం

అంచనాలు తప్పలేదు. అద్భుతాలు జరిగిపోలేదు. సొంతగడ్డపై టీమ్‌ఇండియా జైత్రయాత్రకు అడ్డే లేదు. సఫారీ జట్టును మరోమారు కుప్పకూల్చిన టీమ్‌ఇండియా వరుసగా రెండో టెస్టులోనూ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. క్రికెట్‌ చరిత్రలోనే మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా స్వదేశంలో వరుసగా 11 సిరీస్‌ విజయాలు సాధించిన భారత్‌.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 2013లో మొదలైన జైత్రయాత్ర నిరాటంకంగా సాగిపోతుండటం విశేషం.

పుణె

కెప్టెన్‌ కోహ్లి ధైర్యం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన బౌలర్లు 105 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి అలసిపోయినా.. వాళ్ల మీద నమ్మకం పెట్టాడు. రెండోసారి బ్యాటింగ్‌ చేయకుండా ఫాలోఆన్‌ ఇచ్చి సఫారీ జట్టుతోనే మళ్లీ బ్యాటింగ్‌ చేయించాడు. బౌలర్లు అతడి నమ్మకాన్ని నిలబెట్టారు. తొలి ఇన్నింగ్స్‌ను మించి రాణించారు. ప్రత్యర్థిని 67.2 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో రెండో టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్‌ 137 పరుగులతో భారీ విజయం సాధించిన టీమ్‌ఇండియా.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఉమేశ్‌ యాదవ్‌ (3/22), రవీంద్ర జడేజా (3/52), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2/45) ప్రత్యర్థి పతనంలో కీలక పాత్ర పోషించారు. 48 పరుగులు చేసిన ఓపెనర్‌ ఎల్గరే ఇన్నింగ్స్‌ టాప్‌స్కోరర్‌. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 601/5 వద్ద డిక్లేర్‌ చేయగా.. దక్షిణాఫ్రికా 275 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.  డబుల్‌ సెంచరీ వీరుడు విరాట్‌ కోహ్లి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు శనివారం రాంచిలో మొదలవుతుంది.
 

అదే జోరు.. అదే పతనం
తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు వెనుకబడిన దక్షిణాఫ్రికాకు కోహ్లి ఫాలోఆన్‌ ఇస్తాడా లేదా అన్న సందిగ్ధతకు ఉదయం తెరపడింది. అతను సఫారీ జట్టునే తిరిగి బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అతడి నిర్ణయం సరైందే అని రెండో బంతికే ఇషాంత్‌ రుజువు చేశాడు. మార్‌క్రమ్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అతను సమీక్ష కోరితే నాటౌట్‌గా మిగిలేవాడు. మార్‌క్రమ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటే అయ్యాడు. ఉమేశ్‌.. తొలి ఇన్నింగ్స్‌ జోరును కొనసాగిస్తూ డిబ్రుయిన్‌ (8) వికెట్‌ దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చిన డుప్లెసిస్‌ (5) పట్టుదలతో 54 బంతులు ఎదుర్కొన్నాడు. అతడి పోరాటానికి అశ్విన్‌ తెరదించాడు. మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ను కూడా అశ్వినే ఔట్‌ చేశాడు. డికాక్‌ (5) మరోసారి బౌల్డ్‌ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ను అర్థం చేసుకోలేక బోల్తా కొట్టిన అతను.. ఈసారి భారీ షాట్‌ ఆడబోయి జడేజా టర్నింగ్‌ డెలివరీకి బలయ్యాడు. 79కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సఫారీ జట్టు.

మళ్లీ ఆ ఇద్దరూ..: బవుమా (38), ముత్తుస్వామి (9) పట్టుదల ప్రదర్శించడంతో గంటకు పైగా వికెట్‌ పడలేదు. అయితే జడేజా.. బవుమాను ఔట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ వెంటనే ముత్తుస్వామి కూడా వెనుదిరిగాడు. 129/7తో దక్షిణాఫ్రికా పతనం అంచున నిలిచింది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో అసమాన పోరాటంతో ఆకట్టుకున్న ఫిలాండర్‌ (37), కేశవ్‌ మహరాజ్‌ (22) మరోసారి భారత బౌలర్లు అడ్డు నిలిచారు. 22 ఓవర్లకు పైగా వికెట్‌ ఇవ్వలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న వీళ్లిద్దరినీ చూస్తే మ్యాచ్‌ అయిదో రోజుకు వెళ్తుందా అన్న సందేహాలు కలిగాయి. అయితే ఉమేశ్‌.. ఫిలాండర్‌ను ఔట్‌ చేసి ఉపశమనాన్నిచ్చాడు. తర్వాత ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. రబాడ (4) వికెట్‌ కూడా ఉమేశ్‌కే దక్కింది. కేశవ్‌ను జడేజా ఎల్బీగా ఔట్‌ చేశాడు. అతను సమీక్ష కోరడంతో భారత్‌ సంబరాలు చేసుకోవడం కాస్త ఆలస్యమైంది.

ఆ రెండు వికెట్లు సాహావి

ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌, బౌలర్లే కాదు.. వికెట్‌ కీపర్‌ సాహా కూడా హీరోనే. రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌ వైఫల్యాల నేపథ్యంలో ఈ సిరీస్‌కు మళ్లీ తుది జట్టులోకి వచ్చిన సాహా.. తన ఎంపిక సరైందే అని చాటిచెప్పాడు. వికెట్ల వెనుక అతడి నైపుణ్యాన్ని ఎంత పొగిడినా తక్కువే. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అతను రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. ఉమేశ్‌ లెగ్‌ స్టంప్‌కు దూరంగా వేసిన బంతిని డిబ్రుయిన్‌ ఫైన్‌ లెగ్‌ వైపు ఆడే ప్రయత్నం చేశాడు. బంతి వేగంగా బౌండరీ వైపు దూసుకెళ్లేలా కనిపించింది. కానీ సాహా చురుగ్గా స్పందించి ఎడమ వైపు వైపు డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టేశాడు. తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌లో డుప్లెసిస్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకోగా.. క్యాచ్‌ పట్టే ప్రయత్నం చేశాడు. కానీ బంతి చిక్కలేదు. క్షణాల వ్యవధిలో మూణ్నాలుగు సార్లు చిక్కినట్లే చిక్కి చేజారిన బంతిని చివరగా ముందుకు దూకుతూ పట్టేశాడు సాహా. ఆపై ఫిలాండర్‌ క్యాచ్‌ను సైతం అతను చక్కగా అందుకున్నాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 601/5 డిక్లేర్డ్‌;
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 275

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ ఎల్బీ (బి) ఇషాంత్‌ 0; ఎల్గర్‌ (సి) ఉమేశ్‌ (బి) అశ్విన్‌ 48; డిబ్రుయిన్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ 8; డుప్లెసిస్‌ (సి) సాహా (బి) అశ్విన్‌ 5; బవుమా (సి) రహానె (బి) జడేజా 38; డికాక్‌ (బి) జడేజా 5; ముత్తుస్వామి (సి) రోహిత్‌ (బి) షమి 9; ఫిలాండర్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ 37; కేశవ్‌ మహరాజ్‌ ఎల్బీ (బి) జడేజా 22; రబాడ (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 4; నోర్జె నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (67.2 ఓవర్లలో ఆలౌట్‌) 189;
వికెట్ల పతనం: 1-0, 2-21, 3-70, 4-71, 5-79, 6-125, 7-129, 8-185, 9-189;
బౌలింగ్‌: ఇషాంత్‌ 5-2-17-1; ఉమేశ్‌ 8-3-22-3; షమి 9-2-34-1; అశ్విన్‌ 21-6-45-2; జడేజా 21.2-4-52-3; రోహిత్‌ 2-0-4-0; కోహ్లి 1-0-4-0

స్పిన్‌కు దీటుగా పేస్‌

భారత పిచ్‌లపై ఎప్పుడూ స్పిన్నర్లదే ఆధిపత్యం. దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే ఇది. అయితే కొన్నేళ్లుగా పిచ్‌లు ఎలా ఉన్నా సరే.. భారత పేసర్లు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఫాస్ట్‌బౌలింగ్‌ ప్రతిభకు పెట్టింది పేరైన జట్లు వచ్చి భారత గడ్డపై తేలిపోతుంటే.. మన పేసర్లు చెలరేగిపోతుండటం విశేషమే. ప్రస్తుత సిరీస్‌లో అదే జరిగింది. రబాడ (2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు) లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్‌బౌలర్‌, ఫిలాండర్‌ (2 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు) లాంటి అనుభవజ్ఞుడు రెండు టెస్టుల్లోనూ తేలిపోయారు. దక్షిణాఫ్రికా పేస్‌ దళం పూర్తిగా విఫలమైంది. వారి సగటు 75.84 కావడం గమనార్హం. మొత్తంగా పేసర్లు తీసిన వికెట్లు 6 మాత్రమే. కానీ ప్రత్యర్థి పేసర్లు ఘోరంగా విఫలమైన చోట.. మన ఫాస్ట్‌బౌలర్లు అదరగొట్టారు. రెండు టెస్టుల్లో 21.75 సగటుతో 16 వికెట్లు తీశారు. షమి 2 మ్యాచ్‌ల్లో 20 సగటుతో 8 వికెట్లు పడగొడితే.. ఉమేశ్‌ ఒక మ్యాచ్‌లో 9.83 సగటుతో 6 వికెట్లు తీశాడు. సిరీస్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం అయినప్పటికీ.. మన పేసర్లు ఇంతగా ప్రభావం చూడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. రెండు జట్ల పేసర్ల సగటులో అంతరం ఏకంగా 54.08 కావడం గమనార్హం.

సొంతగడ్డపై టెస్టుల్లో భారత్‌ జైత్రయాత్ర ఇలా..
ఏడాది ప్రత్యర్థి   ఫలితం

2013   ఆస్ట్రేలియా   4-0
2013   వెస్టిండీస్‌    2-0
2015   దక్షిణాఫ్రికా   3-0
2016   న్యూజిలాండ్‌  3-0
2016   ఇంగ్లాండ్‌    4-0
2017   బంగ్లాదేశ్‌    1-0
2017   ఆస్ట్రేలియా   2-1
2017   శ్రీలంక     1-0
2018   అఫ్గానిస్థాన్‌   1-0
2018   వెస్టిండీస్‌    2-0
2019   దక్షిణాఫ్రికా   2-0 
(మూడు టెస్టుల సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలుంది)

11

సొంతగడ్డపై భారత్‌ వరుసగా సాధించిన సిరీస్‌ విజయాలు. ఇది ప్రపంచ రికార్డు. 2013లో ఆస్ట్రేలియాపై 4-0 సిరీస్‌ విజయంతో మొదలుపెట్టి ప్రస్తుత సిరీస్‌ గెలుపు వరకు స్వదేశంలో టీమ్‌ఇండియా జైత్రయాత్ర నిరాటంకంగా సాగిపోయింది. 1994-2001, 2004-2008 మధ్య సొంతగడ్డపై రెండుసార్లు వరుసగా పదేసి సిరీస్‌ విజయాలతో ఆస్ట్రేలియా నెలకొల్పిన  రికార్డును భారత్‌ బద్దలు కొట్టింది.

1

దక్షిణాఫ్రికాను ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో ఓడించిన టీమ్‌ఇండియా.. టెస్టుల్లో ఆ జట్టుపై అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. 2010లో ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్‌ ఇన్నింగ్స్‌ 57 పరుగుల తేడాతో ఓడించింది. గత దశాబ్ద కాలంలో దక్షిణాఫ్రికాకు ఎదురైన రెండు ఇన్నింగ్స్‌ ఓటములూ భారత్‌ చేతిలోనే కావడం గమనార్హం.

30

కోహ్లి నాయకత్వంలో భారత్‌ సాధించిన టెస్టు విజయాలు. అతడికిది 50వ టెస్టు కావడం విశేషం. అతనిప్పటికే అత్యంత విజయవంతమైన భారత టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 50వ మ్యాచ్‌ సమయానికి స్టీవ్‌ వా (37), రికీ పాంటింగ్‌ (35) మాత్రమే విరాట్‌ కంటే ఎక్కువ విజయాలు అందుకున్నారు. కోహ్లి స్వదేశంలో నాయకత్వం వహించిన 23 టెస్టుల్లో 17 నెగ్గగా.. 27 విదేశీ టెస్టుల్లో 13 గెలిచాడు.

 

387

రెండు ఇన్నింగ్స్‌ల్లో కేశవ్‌ మహరాజ్‌, ఫిలాండర్‌ కలిసి ఆడుతూ ఎదుర్కొన్న బంతులు. తొలి ఇన్నింగ్స్‌లో 259 బంతులాడి 100 పరుగులు చేసిన ఈ జోడీ.. రెండో ఇన్నింగ్స్‌లో 128 బంతుల్లో 56 పరుగులు సాధించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.