close
మళ్లీ కొట్టేశాడు

మయాంక్‌ మరో శతకం
భారత్‌ 273/3
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌

మయాంక్‌ మళ్లీ మెరిశాడు. అదిరే ఫామ్‌ను కొనసాగిస్తూ.. టెస్ట్‌ ఓపెనర్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటూ మరో శతకం బాదేశాడు అలవోకగా. ఫలితంగా రెండో టెస్టును టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది. తొలి రోజు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మయాంక్‌కు తోడు కెప్టెన్‌ కోహ్లి, పుజారా రాణించడంతో భారత్‌ పుణేలో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. సిరీస్‌లో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టును నిలువరించడం దక్షిణాఫ్రికాకు ఇక పెను సవాలే.

పుణె

విశాఖలో విజయంతో ఉత్సాహంగా ఉన్న టీమ్‌ఇండియా అదే జోరు కొనసాగించింది. సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ రెండో టెస్టులో పటిష్ట స్థితిలో నిలిచింది. ముఖ్యంగా మయాంక్‌ అగర్వాల్‌ (108; 195 బంతుల్లో 16×4, 2×6) అదరగొట్టాడు. దేశవాళీ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ అతడు మరో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో తొలి రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. పుజారా (58; 112 బంతుల్లో 9×4, 1×6), కెప్టెన్‌ కోహ్లి (63 బ్యాటింగ్‌; 105 బంతుల్లో 10×4) విలువైన ఇన్నింగ్స్‌ ఆడారు. కోహ్లీకి తోడుగా రహానె (18) క్రీజులో ఉన్నాడు. విశాఖపట్నంలో ఓపెనర్‌గా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదిన రోహిత్‌ శర్మ (14) ఈసారి విఫలమయ్యాడు. రబాడ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ విహారిని తప్పించి పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. పీట్‌ స్థానంలో నోర్జె దక్షిణాఫ్రికా జట్టులోకి వచ్చాడు.

రోహిత్‌ త్వరగా నిష్క్రమించినా..: ఉదయం పూట పచ్చికతో కనిపించిన పిచ్‌పై టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. కొత్తబంతితో దక్షిణాఫ్రికా పేసర్లు బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాలని ప్రయత్నించారు. రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేయడంతో పాటు బౌన్సర్లతో పరీక్ష పెట్టారు. ప్రధానంగా రబాడ పదునైన బంతులతో చెలరేగాడు. ఓపెనర్లు రోహిత్‌, మయాంక్‌ ఆచితూచి ఆడారు. అయితే పదో ఓవర్లో భారత్‌కు రబాడ షాకిచ్చాడు. రోహిత్‌ను ఔట్‌ చేయడం ద్వారా వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. మిడిల్‌, ఆఫ్‌స్టంప్‌ మధ్యలో పడిన గుడ్‌లెంగ్త్‌ బంతిని డిఫెన్స్‌ ఆడేందుకు రోహిత్‌ ప్రయత్నించాడు. కానీ బంతి అతని బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లి వికెట్‌కీపర్‌ చేతుల్లో పడింది. కానీ తొలి టెస్ట్‌ డబుల్‌ సెంచరీ హీరో మయాంక్‌పై రోహిత్‌ నిష్క్రమణ ప్రభావం ఏమాత్రం పడలేదు. క్రీజులో అడుగుపెట్టిన పుజారాతో కలిసి అతడు ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యతను భుజాలెత్తుకున్నాడు. నోర్జె బౌలింగ్‌లో మూడు ఫోర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. కవర్‌డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. పుజారా పరుగుల ఖాతా తెరవడానికి 13 బంతులు తీసుకున్నాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. భారత్‌ తొలి సెషన్‌ను 77/1తో ముగించింది.

జోరు పెంచారు..: సమయం గడిచే కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై లంచ్‌ తర్వాత భారత్‌ బ్యాట్స్‌మెన్‌ జోరు పెంచారు. అప్పటికే పిచ్‌ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన మయాంక్‌, పుజారా స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ప్రధాన ఫాస్ట్‌బౌలర్లు ఫిలాండర్‌, రబాడ బౌలింగ్‌లో కాస్త జాగ్రత్తపడ్డ ఈ జోడీ.. అరంగేట్ర పేసర్‌ నోర్జెతో పాటు స్పిన్నర్లను ఏ మాత్రం ఖాతరు చేయలేదు. మయాంక్‌ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ధాటిగా ఆడుతూ బౌలర్ల లయను దెబ్బతీశాడు. మహారాజ్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో అర్ధసెంచరీ (112 బంతుల్లో) పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత గేర్‌ మార్చాడు. మరోవైపు పుజారా కూడా వీలు చిక్కినపుడల్లా బంతిని బౌండరీలు దాటిస్తూ స్కోరుబోర్డు వేగాన్ని పెంచాడు. ముత్తుస్వామి ఓవర్లో డీప్‌స్క్వేర్‌ దిశగా చూడముచ్చటైన సిక్సర్‌తో అలరించాడు. మహారాజ్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో అతడు తన అర్ధసెంచరీ (107 బంతుల్లో)ని అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో బంతి అందుకున్న రబాడ.. పుజారాను ఔట్‌ చేసి భారత్‌ను మళ్లీ దెబ్బకొట్టాడు. దాంతో 138 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి.. మయాంక్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా జట్టును 168/2తో టీ విరామానికి తీసుకెళ్లాడు.

అలరించిన కోహ్లి, మయాంక్‌: చివరి సెషన్‌లో కోహ్లి తనదైన క్లాస్‌ ఆటతీరుతో అలరించాడు. మరోవైపు మయాంక్‌ దూకుడు పెంచాడు. మహారాజ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో 99కి చేరుకున్నాడు. క్రీజు నుంచి ముందుకు వచ్చి బౌలర్‌ తలమీదుగా ఆడిన ఈ రెండు షాట్లు తొలి రోజు ఆటలోనే హైలైట్లు. ఫిలాండర్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో ఫోర్‌తో మయాంక్‌ శతకాన్ని (183 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. తొలి అర్ధశతకం చేయడానికి 112 బంతులు తీసుకున్న మయాంక్‌.. ఆ తర్వాత 50 పరుగులు 71 బంతుల్లోనే చేయడం విశేషం. అతను బౌండరీల రూపంలోనే 74 పరుగులు రాబట్టాడు. అయితే సెంచరీ పూర్తయిన కాసేపటికే రబాడ బౌలింగ్‌లో ఫస్ట్‌స్లిప్‌లో డుప్లెసిస్‌ పట్టిన క్యాచ్‌కు మయాంక్‌ వెనుదిరిగాడు. ఇక అక్కడి నుంచి కోహ్లి బ్యాటింగ్‌ విన్యాసాలు మొదలయ్యాయి. తొలి 47 బంతుల్లో 10 పరుగులే చేసిన కోహ్లి ఒక్కసారిగా టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. రహానెతో కలిసి పరుగులు వేటను ముమ్మరం చేశాడు. బౌండరీలతో చెలరేగిన అతడు చూస్తుండగానే అర్ధశతకానికి చేరువయ్యాడు. రెండో కొత్త బంతితో ఫిలాండర్‌ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాది అర్ధశతకం (91 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో రహానె క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అభేద్యమైన నాలుగో వికెట్‌కు కోహ్లి, రహానె జోడీ 75 పరుగులు జోడించింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) రబాడ 108; రోహిత్‌ శర్మ (సి) డికాక్‌ (బి) రబాడ 14; పుజారా (సి) డుప్లెసిస్‌ (బి) రబాడ 58; కోహ్లి బ్యాటింగ్‌ 63; రహానె బ్యాటింగ్‌ 18; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (85.1 ఓవర్లలో 3 వికెట్లకు) 273

వికెట్ల పతనం: 1-25, 2-163, 3-198

బౌలింగ్‌: వెర్నాన్‌ ఫిలాండర్‌ 17-5-37-0; కగిసో రబాడ 18.1-2-48-3; నోర్జె 13-3-60-0; కేశవ్‌ మహారాజ్‌ 29-8-89-0; ముత్తుస్వామి 6-1-22-0; డీన్‌ ఎల్గర్‌ 2-0-11-0

50

ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి అర్ధశతకం కొట్టాడు. దీంతో సౌరభ్‌ గంగూలీ (49 మ్యాచ్‌లు)ని అధిగమించి ఎక్కువ టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. మహేంద్ర సింగ్‌ ధోని (60 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.