close

ప్రధానాంశాలు

కొడితే.. సిరీస్‌ పడాలి

 భారత్‌-వెస్టిండీస్‌ రెండో టీ20 నేడు
 మరో విజయంపై కోహ్లీసేన కన్ను
రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

ఉప్పల్‌ ఊపేసింది. ఇక అందరి దృష్టీ తిరువనంతపురం మీదే. ఆదివారం భారత్‌, వెస్టిండీస్‌ రెండో టీ20కి వేదిక ఈ కేరళ నగరమే. ఇప్పటిదాకా రెండే రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన ఈ నగరం.. ఇప్పుడు సిరీస్‌లో కీలకమైన పోరుకు వేదిక అవుతోంది. పరుగుల వరద పారిస్తూ.. ఉత్కంఠ రేపుతూ చివరిదాకా ఆసక్తికరంగా సాగిన తొలి టీ20లో చక్కటి విజయం సాధించిన కోహ్లీసేన.. జోరు కొనసాగిస్తూ తిరువనంతపురంలోనే సిరీస్‌ చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. 200 పైచిలుకు స్కోరు చేసినా, ఎంతో పోరాడిన విజయం దక్కకపోవడంతో కసితో రగిలిపోతున్న కరీబియన్‌ జట్టు.. ఈ మ్యాచ్‌లో పుంజుకుని దెబ్బకు దెబ్బ తీయాలని, సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. తొలి టీ20లో తేలిపోయిన ఇరు జట్ల బౌలర్లూ తమ అస్త్రాలకు పదును పెట్టాలని చూస్తుంటే.. ఎంత స్కోరు చేసినా సురక్షితం కాదన్న ఉద్దేశంతో మరింతగా బంతిపై ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నారు. అభిమానులేమో.. తొలి టీ20 తరహాలోనే ఇదీ రసవత్తరంగా సాగుతుందన్న ఆశతో ఉన్నారు.

తిరువనంతపురం
ఇవి కొనసాగాలి

తొలి టీ20లో విరాట్‌ కోహ్లి చెలరేగిన తీరును అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. టీ20ల్లోనూ అతడికి మంచి రికార్డే ఉంది కానీ.. ఆ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ ద్వితీయార్ధంలో మాదిరి చెలరేగిపోవడం మాత్రం అరుదే. అతడి విన్యాసాలు అభిమానులు మామూలుగా అలరించలేదు. ఈ జోరును అతను తిరువనంతపురంలోనూ కొనసాగించాలని అందరూ ఆశిస్తున్నారు. మరోవైపు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ నిలకడను అందుకుంటుండటం మంచి పరిణామం. మ్యాచ్‌లో మిగతా బౌలర్లందరూ విఫలమైతే.. మణికట్టు స్పిన్నర్‌ చాహల్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియం పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో చాహల్‌పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి.


ఇవి మారాలి..

తొలి టీ20లో గెలిచినప్పటికీ భారత్‌ వైపు నుంచి చాలా సమస్యలే కనిపించాయి. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న మన బౌలర్లు విండీస్‌తో 208 పరుగులు చేయించడం ఆశ్చర్యమే. పిచ్‌, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా స్పిన్నర్‌ సుందర్‌తో బౌలింగ్‌ దాడిని ఆరంభించడం చేటు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో పరిస్థితులెలా ఉంటాయో.. బౌలింగ్‌ వ్యూహాల్లో కోహ్లి సమయోచితంగా వ్యవహరిస్తాడో లేదో చూడాలి. పేసర్లు భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌ తమ ప్రత్యేకతను చాటుకోవాల్సి ఉంది. చాహల్‌కు మిగతా స్పిన్నర్లు సహకారం అందించాలి. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. టీ20ల్లో చాలా ప్రమాదకరంగా ఆడే విండీస్‌ బ్యాట్స్‌మెన్‌కు.. ముఖ్యంగా హైదరాబాద్‌లో చెలరేగిపోయిన హెట్‌మయర్‌, పొలార్డ్‌, లూయిస్‌లకు భారత బౌలర్లు ఎలా కళ్లెం వేస్తారో చూడాలి. రోహిత్‌ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. కుర్రాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ తమ ప్రతిభకు న్యాయం చేయాల్సి ఉంది. తొలి టీ20లో అత్యంత ఆందోళన కలిగించిన అంశం.. ఫీల్డింగే. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం దగ్గర్లో సాగలేదు భారత ఫీల్డింగ్‌. ఏకంగా నాలుగు క్యాచ్‌లు చేజారాయి. బంతిని ఆపడంలోనూ తడబడ్డారు. తప్పులు దిద్దుకోకుంటే మూల్యం చెల్లించక తప్పదు.


పిచ్‌ సంగతేంటి?

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరిగిన ఏకైక వన్డేలో స్పిన్నర్లు విజృంభించి విండీస్‌ను 104 పరుగులకే కుప్పకూల్చారు. అప్పుడే కాదు.. ఇటీవల ఇక్కడ జరిగిన ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలోనూ స్పిన్నర్లదే ఆధిపత్యం. 20.85 సగటు, 6.35 ఎకానమీ నమోదు చేశారు. ఆదివారం మ్యాచ్‌లోనూ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా. బ్యాట్స్‌మెన్‌ బాగానే పరుగులు చేయగలరని.. అయితే ఉప్పల్‌లో మాదిరి పరుగుల వరద మాత్రం పారకపోవచ్చని తెలుస్తోంది.
* తిరువనంతపురంలో భారత్‌,  వెస్టిండీస్‌ ఒక్క వన్డే మాత్రమే ఆడాయి. గత ఏడాది జరిగిన ఆ మ్యాచ్‌లో విండీస్‌ను 104 పరుగులకే కుప్పకూల్చిన టీమ్‌ఇండియా.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక్కడ జరిగిన మరో టీ20లో భారత్‌.. కివీస్‌ను ఓడించింది.


1

యుజ్వేంద్ర చాహల్‌ మరో వికెట్‌ తీస్తే.. టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్ల (53) వీరుడవుతాడు.


1000

హైదరాబాద్‌ మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన రాహుల్‌.. టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌ అయ్యాడు.


కొన్ని సిరీస్‌ల తర్వాత నాకు మళ్లీ టాప్‌ఆర్డర్లో ఆడే అవకాశం దక్కింది. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. బంతిని చక్కగా మిడిల్‌ చేయగలుగుతున్నా. ఈ జోరును తర్వాతి మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నా. వచ్చే ఏడాది అక్టోబర్లో జరిగే ప్రపంచకప్‌ గురించి ఇప్పటినుంచే ఆలోచించదలుచుకోలేదు.

- కేఎల్‌ రాహుల్

 

తొలి టీ20లో భారత్‌ ఫీల్డింగ్‌ పేలవంగా సాగింది. యువ క్రికెటర్లు బంతి విషయంలో ఆలస్యంగా స్పందిస్తున్నారు. అతిగా క్రికెట్‌ ఆడటమే ఇందుక్కారణమా? ఆ వృథా పరుగుల్ని ఆపే ప్రయత్నం చేయండి.

- యువరాజ్‌ సింగ్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.