
తాజా వార్తలు
భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
ఇంటర్నెట్‌డెస్క్: భారత యువ క్రికెటర్లతో పోలిస్తే తమ దేశ యువ ఆటగాళ్లు ఇంకా పాఠశాల స్థాయిలోనే ఉన్నట్లుగా అనిపిస్తుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ అన్నాడు. ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా టీమిండియా టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించిన సంగతి తెలిసిందే. యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారు. మరోవైపు ఆసీస్ జట్టులో ఉన్న యువ ప్లేయర్లు విల్ పకోస్కీ, కామెరాన్ గ్రీన్ మాత్రం విఫలమయ్యారు. దీంతో ఛాపెల్ ఇరు దేశాల క్రికెట్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించాడు.
‘‘భారత పోటీదారులతో పోలిస్తే మా క్రికెటర్లు ఎంతో బలహీనంగా ఉన్నారు. వాళ్లు అండర్-16 స్థాయి నుంచి మ్యాచ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఇక టీమిండియాలో స్థానం దక్కించుకునే సమయానికి అత్యుత్తమ ఆటగాళ్లగా ఎదుగుతున్నారు. అందుకే భారత జట్టు విజయవంతమవుతుంది. భారత్‌తో ఆసీస్‌ను పోల్చాలంటే భయమేస్తోంది. విల్ పకోస్కీ, కామెరాన్ గ్రీన్ ఇంకా పాఠశాల స్థాయి అనుభవం ఉన్నట్లుగా అనిపిస్తుంది’’ అని ఛాపెల్ తెలిపాడు.
‘‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో 1960కు తగ్గట్లుగా క్రికెటర్లను తయారుచేయకూడదు. భవిష్యత్ క్రికెటర్ల కోసం భారత్ ఎన్నో మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. అదే ఆస్ట్రేలియా విషయానికొస్తే షీఫెల్డ్ షీల్డ్ కోసం 44 మిలియన్ల డాలర్లు మాత్రమే వెచ్చిస్తోంది. ఇరు దేశాల పెట్టుబడుల మధ్య హిందూ మహా సముద్రమంత వ్యత్యాసం ఉంది. ఇప్పటికైనా టెస్టు క్రికెట్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ వ్యూహాల్ని మార్చుకోకపోతే మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు.
‘‘యువ భారత జట్టు మా ఫస్ట్ క్లాస్ క్రికెటర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒత్తిడిని తట్టుకుంటూ గొప్ప ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ల ఆటలో పరిణతి కనిపిస్తోంది. భారత్‌లో 38 ఫస్ట్ క్లాస్ జట్లు ఉన్నాయి. దాన్ని బట్టే ఆ ఆటగాళ్లలో ఎంత ప్రతిభ ఉందో ఓ అంచనాకి రావొచ్చు. ప్రపంచ మేటి అయిదు జట్లను సిద్ధం చేసేంతలా భారత్‌కు సామర్థ్యం ఉంది’’ అని ఛాపెల్ అన్నాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌పైనే మరిన్ని రోజులు ఆధారపడకుండా యువ క్రికెటర్లను సిద్ధం చేయాలని సీఏకు ఛాపెల్ సూచించాడు. భారత్ చేతిలో ఆసీస్ సిరీస్ కోల్పోవడానికి బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడమే ప్రధాన కారణమని అన్నాడు. సారథి టిమ్‌పైన్‌కు మద్దతిచ్చాడు.
ఇవీ చదవండి
అరంగేట్రం ఆటగాళ్లకు కొత్త కార్లు
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్ చెప్పలేదు