
తాజా వార్తలు
2008 తర్వాత తొలిసారి శతకం లేకుండా కోహ్లీ
2020లో వన్డేల్లో ఒక్క సెంచరీ బాదని విరాట్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి శతకాలు చేయడం ఒక సరదా! వేదిక ఏదైనా.. జట్టు ఏదైనా అతడు క్రీజులో నిలిచాడంటే బ్యాటు నుంచి పరుగుల వరద గ్యారెంటీగా పారుతుంది. మూడంకెల స్కోరు ఖాతాలో పడుతుంది. అందుకే అతడిని ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే ఆటగాడిగా భావిస్తారు. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్ సహా అనేక మంది సమకాలీన ఆటగాళ్లూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అలాంటిది ఈ పరుగుల రారాజు కెరీర్లో రెండోసారి ఒక ఏడాదిని శతకం లేకుండా ముగిస్తున్నాడు.
అండర్-19 ప్రపంచకప్ సాధించిన విరాట్ కోహ్లీ 2008లో నేరుగా టీమ్ఇండియాలోకి ప్రవేశించాడు. దంబుల్లాలో శ్రీలంకపై అరంగేట్రం చేసి 12 పరుగులు సాధించాడు. ఆ ఏడాది ఐదు మ్యాచులు ఆడినప్పటికీ శతకాలేమీ సాధించలేదు. ఒక అర్ధశతకంతో ఆ ఏడాదిని ముగించాడు. ఆ తర్వాత నుంచి అతడి బ్యాటు నుంచి శతకాలు జాలువారాయి. 2009లో 1, 2010లో 3, 2011లో 4, 2012లో 5, 2013లో 4, 2014లో 4, 2015లో 2, 2016లో 3, 2017లో 6, 2018లో 6, 2019లో 5 మొత్తంగా 43 శతకాలు బాదేశాడు.
2020లో మాత్రం 9 మ్యాచులాడినా విరాట్ ఒక్క శతకమూ చేయలేదు. అయితే 5 అర్ధశతకాలు చేయడం విశేషం. అందులో రెండుసార్లు 89 స్కోర్లు సాధించాడు. కాగా కోహ్లీ సెంచరీలు బాదేసిన ఏడాదిలో కనిష్ఠంగా 10, గరిష్ఠంగా 34 వన్డేలు ఆడటం గమనార్హం. ఇక ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరి వన్డేలో కోహ్లీ మరో రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా 12వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 242 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. సచిన్ (300), రికీ పాంటింగ్ (314) అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక సచిన్ 49 శతకాల రికార్డుకూ కోహ్లీ కేవలం 6 సెంచరీల దూరంలో ఉన్న సంగతి తెలిసిందే.