
తాజా వార్తలు
ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
ఇంటర్నెట్‌డెస్క్: బుమ్రా గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో భారత పేస్ దళాన్ని హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపిస్తున్నాడు. ఆడేది మూడో టెస్టే అయినప్పటికీ సహచర ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ సమర్థవంతంగా పేస్ బాధ్యతల్ని మోస్తున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. రెండో రోజు ఆటలో బంతితో ప్రభావం చూపినప్పటికీ వికెట్లు సాధించలేకపోయాడు.
ఈ నేపథ్యంలో సిరాజ్ బౌలింగ్‌ను దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ విశ్లేషించాడు. పిచ్‌పై ఉన్న పగుళ్లతో సిరాజ్ స్వింగ్ రాబడుతున్నాడని వినిపిస్తున్న వాదనలను కొట్టిపారేశాడు. నైపుణ్యంతోనే స్వింగర్స్, కట్టర్స్‌ను అద్భుతంగా సంధిస్తున్నాడని తెలిపాడు. ట్విటర్ వేదికగా వీడియోతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
‘‘పిచ్‌పై ఉన్న పగుళ్ల సాయంతో మహ్మద్ సిరాజ్ బంతిని స్వింగ్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు. అయితే అతడి బౌలింగ్‌ను పరిశీలించాను. తెలివిగా, వైవిధ్యంగా బంతులు విసురుతున్నాడు. బంతిపై ఉన్న షైన్‌ను ఉపయోగించుకుని ఫస్ట్ స్లిప్, సెకండ్ స్లిప్ లక్ష్యంగా బంతులు సంధిస్తున్నాడు. రెండు వేళ్లతో బంతుల్ని వదులుతూ స్వింగ్ రాబడుతున్నాడు. అలాగే కట్టర్ వేయాలనుకున్నప్పుడు బంతి షైన్‌ను ఎడమవైపునకు ఉండేలా ఉంచి, లేదా కోణాన్ని కాస్త మార్చి బంతులు వేస్తున్నాడు. అప్పుడు బంతి గింగరాలు తిరుగుతూ దూసుకెళ్తోంది. అది పిచ్ సాయంతో వచ్చింది కాదు.. కచ్చితంగా సిరాజ్ సామర్థ్యమే’’ అని సచిన్ అన్నాడు.
ఇదీ చదవండి
యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్