Sehwag on Dhoni: ధోనీ బౌలర్ల కెప్టెన్‌.. కోహ్లీ ఒక్కసారైనా కప్పు గెలవాలి..!

తాజా వార్తలు

Updated : 18/09/2021 15:06 IST

Sehwag on Dhoni: ధోనీ బౌలర్ల కెప్టెన్‌.. కోహ్లీ ఒక్కసారైనా కప్పు గెలవాలి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి మెంటార్‌గా నియమించడం మంచి నిర్ణయమని, అది బౌలింగ్‌ బృందానికి ఎంతో ఉపయోగపడుతుందని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా పీటీఐతో మాట్లాడిన వీరూ అనేక విషయాలపై స్పందించాడు.

మహీ మళ్లీ రావాలని ఉంది..

‘టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్ మెంటార్‌గా ఉండాలనే ప్రతిపాదనను మహీ అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అతడు మళ్లీ భారత క్రికెట్‌లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే జట్టు మెంటార్‌గా ఎంపికవ్వడం గొప్ప విషయం. ఒక సారథిగా ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్‌పై అతడికి అత్యద్భుత అవగాహన ఉంది. దీంతో రాబోయే ప్రపంచకప్‌లో బౌలర్లకు కలిసివస్తుంది. ప్రత్యర్థులపై సరైన ప్రణాళికలు రూపొందించడానికి ధోనీ సలహాలు, సూచనలు ఉపయోగించుకోవచ్చు’ అని వీరూ వివరించాడు.

అలాగే ప్రతి అంతర్జాతీయ జట్టులోనూ పలువురు మొహమాట పడే ఆటగాళ్లు ఉంటారని, అలాంటి వాళ్లు కెప్టెన్ల దగ్గరకు వెళ్లి నేరుగా ఏ విషయాలు మాట్లాడలేరని వీరూ పేర్కొన్నాడు. అయితే, ధోనీతో ఎవరైనా మాట్లాడగలరని, యువకులకు తగిన సలహాలు, సూచనలు చేస్తాడని చెప్పాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ ఇప్పటికే 15 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిందని, అయితే.. అక్టోబర్‌ 10 వరకు జట్టు కూర్పులో మార్పులు చేసుకునే వీలుందన్నాడు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఎవరైనా ఆకట్టుకుంటే జట్టులో చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అలా ఎవరైనా టీమ్‌ఇండియాకు ఎంపికైనా తాను ఆశ్చర్యపోనని అన్నాడు.

కోహ్లీ ఒక్కసారైనా ఐపీఎల్‌ గెలవాలి..

‘ఐపీఎల్‌ అనేది ప్రతిసారథికి ముఖ్యమైనదే. అది కోహ్లీకి మరింత ముఖ్యమైందని నేను భావిస్తాను. ఎందుకంటే అతడికి విపరీతమైన అభిమాన గణం ఉంది. ప్రతిఒక్కరూ అతడు ఆర్సీబీకి ట్రోఫీ అందించాలని అనుకుంటారు. కనీసం ఒక్కసారైనా అది సాధించాలని ఆశిస్తారు. ఈ ఏడాది బెంగళూరు విజేతగా నిలిచే అవకాశం కూడా లేకపోలేదు’ అని మాజీ ఓపెనర్‌ తన అభిప్రాయం వెల్లడించాడు.

ఇక ఐపీఎల్‌లో మిగిలిన సీజన్‌ యూఏఈలో జరుగుతున్న నేపథ్యంలో గతేడాది లాగే ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయని చెప్పాడు. మరోవైపు అక్కడి స్లో పిచ్‌లు చెన్నై, బెంగళూరుకు ఇబ్బందిగా మారొచ్చని సందేహం వెలిబుచ్చాడు. భారత్‌లో చెన్నై సగటు స్కోర్‌ 201 పరుగులుగా నమోదైందని, అదే యూఏఈలో అయితే వాళ్లు అంతగా రాణించలేరని వీరూ చెప్పుకొచ్చాడు. ఈసారి కప్పు సాధించేది డిఫెండింగ్‌ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్సేనని తన అభిప్రాయం తెలిపాడు. ఇక చివరగా రాబోయే ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, కేఎల్ రాహుల్‌, సంజూ శాంసన్‌ల బ్యాటింగ్‌ చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఒకవేళ దేవ్‌దత్‌ బాగా ఆడితే తర్వాత టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని