T20 World Cup: టీమ్‌ఇండియా కప్‌ కొట్టాలంటే ఈ జట్లతోనే ప్రమాదం..!

తాజా వార్తలు

Published : 24/10/2021 01:27 IST

T20 World Cup: టీమ్‌ఇండియా కప్‌ కొట్టాలంటే ఈ జట్లతోనే ప్రమాదం..!

ముప్పు ఆ మూడింటితోనే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా బలంగా కనిపిస్తున్నా మనవాళ్లకు గట్టి పోటీనిచ్చే, కప్పు గెలిచే సామర్థ్యం ఉన్న జట్లు మూడున్నాయి. అవే ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌. అయితే, సూపర్‌-12లో భారత్‌, న్యూజిలాండ్‌ ఒకే గ్రూప్‌లో ఉండటంతో తొలి ప్రమాదం కివీస్‌ నుంచే పొంచి ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడినా భారత్‌ పాకిస్థాన్‌, అఫ్గాన్‌, స్కాట్లాండ్‌, నమీబియా జట్లపై గెలుపొంది సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లు మరో గ్రూప్‌లో ఉండటంతో టీమ్‌ఇండియాతో సెమీస్‌లో పోటీపడే అవకాశం ఉంది. దీంతో కోహ్లీసేనకు నాకౌట్‌లోనే అసలు ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఆ మూడు జట్లు ఎలా ఉన్నాయి.. ఆటగాళ్లు ఎలా ఉన్నారు.. ఇదివరకు వారి ప్రదర్శన ఎలా ఉంది..?

వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జోష్‌లో ఇంగ్లాండ్‌..

(Photo: England Cricket Twitter)

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంగ్లాండ్‌ జట్టు గురించే. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత ఈ జట్టు ఆటే మారిపోయింది. టెస్టు జట్టుగా ఉన్న ముద్రను పోగొట్టుకుంటూ దూకుడైన ఆటతో వన్డేలు, టీ20ల్లో మేటి జట్టుగా ఎదిగింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. బట్లర్‌, రాయ్‌, మలన్‌, బెయిర్‌స్టో లాంటి విధ్వంసకారులు..  మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, సామ్‌ కరన్‌ లాంటి ఆల్‌రౌండర్లతో ఆ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. అవసరమైతే జోర్డాన్‌, వోక్స్‌, విల్లీ లాంటి బౌలర్లూ బ్యాటుతో రాణించగలరు. సమతూకంతో, ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్‌ను భారత్‌ ఎదుర్కొంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

విండీస్‌ ప్రమాదకరమే..

(Photo: West Indies Cricket Twitter)

మరోవైపు టీ20ల్లో వెస్టిండీస్‌ ఎంత ప్రమాదకరమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలిచిన ఏకైక జట్టు అదే. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఎక్కువ మ్యాచ్‌లాడి ఈ ఫార్మాట్లో రాటుదేలిపోయారు విండీస్‌ వీరులు. లూయిస్‌, సిమన్స్‌, ఫ్లెచర్‌, పొలార్డ్‌, గేల్‌, రసెల్‌ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ ఆ జట్టు సొంతం. ఆల్‌రౌండర్లకూ కొదవలేదు. లోతైన బ్యాటింగ్‌ విండీస్‌కు మరో బలం. ఏ స్థితిలోనైనా ఫలితాలను మార్చేసే ఆటగాళ్లు కరీబియన్‌ జట్టులో మెండుగా ఉన్నారు.

కివీస్‌ తక్కువేమీ కాదు..

(Photo: Blackcaps Twitter)

ఇక కప్పు వేటలో అండర్‌ డాగ్‌గా బరిలో ఉన్నది న్యూజిలాండ్‌ జట్టు. వన్డే, టీ20 ప్రపంచకప్‌ రెండింట్లోనూ కివీస్‌ను ఎప్పుడూ ఫేవరెట్‌గా పరిగణించరు కానీ.. ఎంతో నిలకడగా ఆడే జట్టది. వార్మప్‌ మ్యాచ్‌లు రెండింట్లోనూ ఓడిపోయినా, ఇటీవలి ఫామ్‌ ఏమంత బాగా లేకున్నా కివీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కివీస్‌కు ఎప్పుడూ ఆల్‌రౌండర్ల అండ ఉంటుంది. ఈసారి నీషమ్‌, మిచెల్‌, శాంట్నర్‌, ఉన్నారు. వీరికి తోడు బ్యాటింగ్‌లో విలియమ్సన్‌, గప్తిల్‌, కాన్వాయ్‌, ఫిలిప్స్‌.. బౌలింగ్‌లో బౌల్ట్‌, సౌథీ, జేమీసన్‌, ఫెర్గూసన్‌, ఇష్‌ సోధి లాంటి నాణ్యమైన ఆటగాళ్లతో కివీస్‌ బలంగా కనిపిస్తోంది. సెమీస్‌కు భారత్‌తో పాటుగా పై మూడు జట్లే వచ్చే అవకాశముంది. వీటిని దాటితేనే భారత్‌కు కప్పు దక్కే ఛాన్సుంది. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జట్ల అవకాశాలనూ కొట్టిపారేయలేం కానీ.. వాటి నుంచి భారత్‌కు ముప్పు తక్కువే.

టీమ్‌ ఇండియాలో కీలక ఆటగాళ్లు : కోహ్లి, రోహిత్‌, రాహుల్‌, బుమ్రా, షమి, జడేజా.

భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, జడేజా, అశ్విన్‌, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చాహర్‌, షమి, బుమ్రా, భువనేశ్వర్‌, శార్దూల్‌ ఠాకూర్‌.

స్టాండ్‌బైలు: శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని